Telugu Global
Arts & Literature

బెంగ

బెంగ
X

కొమ్మల్లోని పక్షులు

నీటిరాశిలోని కప్పలు

కనిపెంచిన పిల్లలు

ఒక్కచోటే ఉండరని

ఆడపిల్ల కొంగుముడితో పుట్టిల్లు వదిలినట్టు

విడిచి వెళ్తారని నాన్న అంటుండేవాడు

ఏళ్ళు గడిచాక

నేను నాన్నగా మారాక

పిల్లలు వాళ్ళ కుతూహలాల కుప్పలతో

ఈ నలుపు తెలుపు ప్రపంచాన్ని వెతుకుతూ వెళ్తున్నప్పుడు

ఏ అస్తమయ ఉదయాల జల్లు వెనకో

రంగురెక్కలై మూగినప్పుడు

నా జలుబు గొంతు ఆవిరైన నాన్న మాటలే

కొత్తగా బుక్కుతుంది

పిల్లలెప్పుడూ గుత్తులు గుత్తులుగా

ఖరీదైన కలలే కంటారని

నావంటి తండ్రులు వాళ్ళ అపురూప లోకాలకు

ఎరువులై ఉంటారని

హృదయం ప్రాచీన శిల్పంలా కుదురుకుంటుంది

తృప్తిగా కొన్ని సంతోషాల రవ్వల్ని రాల్చుతుంది

వెనక్కి తిరిగి వెతికాక

గెలుపు నెపంతో

రంగు దారాలుగా అల్లుకొని జీవితం -

మనం గీసుకున్న గీతల వెనకే రాట్నంలా రావటం

దూరంగా పోవటం

ఆ వెనక -

రోజులు బెంగబెంగగా

గింజల్లా జారటం చక్రాలై తిరగటం..

నేల ఏదైనా ఇదే తళుకు నాటకం

తెలిసింది -

పిల్లల్ని వాళ్ళ ఋతువుల్ని ఆపటం

మబ్బు పట్టిన చీకటిలో వసంతాన్ని వెతకటం అని..

- రఘు

First Published:  16 July 2023 5:55 PM GMT
Next Story