Telugu Global
Arts & Literature

సాంగత్యం (కథ)

సాంగత్యం (కథ)
X

ఒక్క క్షణం నేనెక్కడున్నానో అర్ధం కాలేదు.

కానీ కాసేపటికి అస్పత్రి వాసన గుర్తుపట్టాను.తలలో నరాలు లాగేస్తుంటే గట్టిగా మూలిగాను.

కునికిపాట్లు పడుతున్న నర్సు ఉలిక్కిపడి లేచి ఇంజక్షన్‌ చేసి దుప్పటి కప్పి వెళ్లిపోబోతుంటే అడిగాను.

‘నేనిక్కడకు వచ్చి ఎన్నాళ్లయింది?’

‘నెలరోజులు. మీ తలకు సర్జరీ అయింది.ఉండండి. డాక్టర్‌ను పిలుస్తాను.’

నాకు మతిపోయింది. ‘నెలరోజులా?’

అంటే చచ్చి బ్రతికానన్నమాట.

నేను ఉద్యోగంలో చేరినరోజు....

‘లక్ష్యాన్ని’ సాధనను ఏకం చెయ్యండి. మీరు ఏ పని చేసినా ఆపని తప్ప మరేదీ యోచించకండి. ఆ పనిని ఉన్నతమైన ఆరాధనగా మీ జీవితం యావత్తూ దానికి అంకితం చేసి చేయండి.’ అన్నదెవరో తెలుసుగా సాహసా?’

‘తెలుసు సార్‌ వివేకానందుడు.’

‘మరణం అనేది ఎవరికయినా ఒక్కసారే వస్తుంది. పిరికిగా క్షణక్షణం చస్తూ బ్రతకడం కంటే సమాజాని కుపయోగపడే నిజాన్ని వెలువరించే కర్తవ్య దీక్షలో అది మనల్ని వరిస్తే విచారించాల్సిందేముంది?’

ఇవన్నీ నాకు మా ఎడిటర్‌ సదాశివంగారి సూక్తులు.

నేను పనిచేసేది చిన్న పత్రికే అయినా సదాశివంగారు ఎంతో ఉన్నతమయిన వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఆయనకి కష్టపడి నిజాయితీగా వ్యవహరించేవాళ్లు కావాలి.

నాపట్లఆయనకెందుకోనమ్మకం,అభిమానం.ఆయన నాకప్పగించిన కేసులన్నీ సాధించి చక్కని రిపోర్టులిస్తుంటే ఆయన వాటికి మెరుగులు దిద్దేవారు.

ఆయనకి భాషమీద మంచి పట్టుండేది. నేను ఏమైనా చిన్న పొరపాట్లు చేసినా మృదువుగానే వాటిని చక్కదిద్దేవారు.

నాకోసం అర్జంటుగా రమ్మని కబురుపెట్టిన ఆయన ముఖం ఆరోజు చాలా సీరియస్‌గా ఉంది.

‘అంటే మీరు నాకొక క్లిష్టమైన కేసు అప్పజెపుతున్నారన్నమాట’ అంటూ నవ్వేసాను. ఆయన నవ్వలేదు.

‘ఇది చిత్రమైన కేసు... శ్రీవాణి అనే అమ్మాయికి పెళ్లయి రెండేళ్లయింది. ఆమె ఓసారి పుట్టింటికి వెళ్లి, తిరిగి అత్తింట్లోకి అడుగు పెడుతూంటే....‘నీకీ ఇంట్లో స్ధానం లేదు. నీకెప్పుడో విడాకు లిచ్చేసాను. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావో వాళ్లతోనే ఉండిపో.’ అని భర్త, అతనికి వత్తాసు పలికి అత్త, మామ ఆమెను గెంటేసారు.

శ్రీవాణి కోర్టునాశ్రయించింది. ఆశ్చర్యం!కోర్టులోఆమెకువిడాకులుమంజూరయినట్టుగా ఉంది. అదీ ఆమె ఇష్టంతోనే... ఆమే స్వయంగా తనకి వేరేవ్యక్తితో అక్రమసంబంధం ఉన్నట్టు అంగీకరించినట్టు ఆమె సంతకం కూడా ఉంది.

సాహసా!ఇది స్త్రీజాతికే సవాలయిన కేసు. ఇది తేలేవరకూ నువ్వు ఆఫీసుకి కూడా రానక్కర్లేదు.’ మొత్తానికి పెద్ద సంచలనాన్నే లేవనెత్తింది ఆయన నాకప్పగించిన ఆ కేసు. కేసు వెనుక నిజాలను తెలుసుకునేందుకు ఎంతమందిని కలిసానో లెక్క లేదు. ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రేమించి పెళ్లాడిన భర్త... మళ్లీ పెళ్లితో ఎక్కువ కట్నం దొరుకుతుందనే ఆశతో ఆమెను నమ్మించి సంతకంపెట్టించిన కాగితాల సాయంతో లంచాలుపెట్టి, కొన్ని డాక్యుమెంట్లు మార్పిడి చేసి, వేరొక మనిషిని తనభార్యగా చూపించి ఆమెతో విడాకులు కావాలని చెప్పించి విడాకులు పొందాడు.ఆతర్వాత ఇంటికొచ్చిన భార్యను బయటకి గెంటేసాడు.

ఆమె తల్లిదండ్రులు కాళ్లావేళ్లాపడి బ్రతిమాలినా, శ్రీవాణికి ఎవరితోనో అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు. కానీ లోక్‌ అదాలత్‌ద్వారా తాను ఆమెనుండి విడాకులు పొందినట్టు చెప్పడమేగాక మళ్లీ డబ్బున్న తన బంధువును పెళ్లి చేసేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలియడంతో శ్రీవాణిలో తెగింపు వచ్చింది.మహిళా సంఘాలు శ్రీవాణికి అండగా నిలిచాయి .

చివరకు ఆమె భర్త చేసిన మోసం వెల్లడయి విడాకులు రద్దవడమే కాక ఆ కుటుంబం జైలుపాలయింది.

ఒకానొకస్ధితిలో ..శ్రీవాణి మామగారు ఈ కేసును పేపర్లో రాకుండా నీరు కార్చేస్తే నాకు లక్షలిస్తానన్నాడు. మానుకోకపోతే నాప్రాణం తీస్తానని బెదిరించాడు కూడా.కానీ ఒక నిజాన్ని వెలికి తీయడంవల్ల అమాయకురాలయిన ఒక మహిళకు న్యాయం లభిస్తుందన్నదొకటే నాకు తృప్తి.

శ్రీవాణి విజయం స్త్రీజాతి విజయం. స్త్రీ తను నమ్మినవాడికోసం ప్రాణాలయినా ఇస్తుంది కానీ అమాయకత్వంతో, అన్యాయాన్ని మాత్రం సహించదు అని నిరూపించింది ఆ కేసు.

తర్వాత మా ఎడిటర్‌గారికి నామీద అభిమానం, నమ్మకం రెట్టింపయ్యాయి. దాంతో నేను ఎన్నో వరకట్నచావుల కేసులు ఆరా తీసి నిజాలు బయటపెట్టాను.

అత్తింటివాళ్లు....కేవలం డబ్బుకోసం కోడళ్ల నిండు ప్రాణాలు తీసి వాటిని ఆత్మహత్యలుగా నిరూపించేందుకు ప్రయత్నించడం, ఆమె బిడ్డల్ని అనాధల్ని చేయడం నాకు హృదయ విదారకంగా అనిపించేది.ఆడపిల్లల తల్లిదండ్రులు పేదరికంతోనో, కూతురే పోయాక ఇంకెవరికోసం పోరాడాలి అన్న నిర్వేదంతోనో, బలవంతాన దు:ఖాన్ని భరిస్తూంటే, ఆ బిడ్డలకైనా న్యాయం జరగాలన్న పట్టుదలతో నేను ఎంతో కష్టపడి నిజాలు రాబట్టేదానిని.

అన్నిటికన్నా నన్ను బాధించిన విషయం....కేవలం నిరక్షరాస్యులేకాదు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న స్త్రీలు కూడా పరువు కోసమని, కుటుంబ హింసను భరించడం, చివరకు సమస్యలకు పరిష్కారం చావే అనుకోవడం నన్నెంతగానో కదిలించేవి.

కొన్ని చోట్ల సంతానం కలగకపోవడానికి తన కొడుకే కారణమయినా, ఆలోపాన్ని కోడలికి అంటగట్టి, ఆమెను చంపి మరో అమాయకురాలి గొంతుకోయడానికి సిద్ధపడిన ఎన్నో కేసుల రహస్యాలను బట్టబయలు చేసాను.

ఒకరోజు...సదాశివంగారు అర్జెంటుగా కలవమని కబురు పెట్టారు.

‘చూడమ్మా! ఇంతవరకు నువ్వు చేసినవన్నీ ఒక ఎత్తు, ఇపుడు నీకివ్వబోయే అసైన్‌మెంట్‌ కాస్త ప్రమాదంతో కూడుకున్నదే అయినా నీకంటే సమర్ధులు నాకు ఎవరూ కనిపించడం లేదు.ఓ సంఘ సంస్కర్తగా మంచి పేరుతోబాటు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తికీ ,ఈమధ్య జరుగుతున్న ఆడపిల్లల కిడ్నాప్‌లకీ సంబంధం ఉండవచ్చునని నాఅనుమానం. తిరుగులేని ఆధారాలు సంపాదించాలి.ఇది సాధిస్తే నీకెంత పేరు వస్తుందో...నువ్వు పరిశోధిస్తున్నట్టు బయటికి పొక్కితే ప్రాణాలకు అంత ప్రమాదమూ వస్తుంది. ఈ రాకెట్‌ను బయటపెట్టగలిగితే ఎందరో పసిమొగ్గల జీవితాలు వ్యభిచార చట్రంలో ఇరుక్కోకుండాకాపాడినవాళ్లమవుతాం.అర్ధమయిందిగా ఇందులో ఎంత రిస్కుందో?’

రిస్కులేనిదెందులో ? నా సాహసంతో ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి అంటే...నేను రెడీ. రిస్కులేని వందేళ్ల జీవితం కన్నా రిస్కుతో కూడిన లైఫ్‌తో పదిమందికి మేలు జరిగితే నేను అల్పాయుష్కురాలినయితే పోయేదేముంది?’నా ఆలోచన ఒక్క క్షణమే.

'ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? భయంగా ఉందా ?’

సదాశివంగారి మాటలకి అప్పుడు నేను నవ్విన నవ్వులో ఆయనకి నా దమ్ము కనిపించివుండాలి.

‘వెరీ గుడ్‌. ప్రోసీడ్‌. ఈ విషయం మీ యింట్లో కూడా తెలియకూడదు.’

రెండేళ్లుగా ఆయన సాంగత్యం నాలో ఎంతో ధైర్యాన్ని నింపిందనే చెప్పాలి.

చిన్నప్పుడు నాన్న అనేవారు. సాంగత్యం అనేది మనిషిని ఎంతో ప్రభావితం చేస్తుందని...సజ్జనుల సాంగత్యంలో మనపై సద్భావనల ప్రసారం ఉంటుందిట. అదే దుర్జనుల సమక్షంలో మన మనసులోనూ వారి దుష్పభావం పడుతుందిట. మనుషులేకాదు... పరిసరాలు, ప్రదేశాల ప్రభావం ఎంత తీవ్రమైనదో చెప్పేందుకు ఆయన రామాయణంలోని ఒక ఘట్టం వివరించేవారు.

దండకారణ్యంలో కాబోలు సంచరిస్తున్నప్పుడు ఒక ప్రదేశాని కొచ్చేసరికి, లక్ష్మణుడికి అనిపించిందిట.‘ఛ. నేను ఈ రాముడికి సేవలు చేస్తూ మూటలు మోస్తూ...ఈ అడవిలో ఎందుకింత కష్టపడాలి?నాకేం అవసరం...అరణ్యవాసం చేయాల్సింది రాముడుగాని నేను కాదుకదా!’ అని...కొంతదూరం పోయాక తన ఆలోచనలకు తనకే పశ్చాత్తాపం కలిగి అలా ఆలోచించినందుకే ఎంతో బాథపడుతూ అన్నగారిని ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడుట.

అప్పుడు రాముడు నవ్వి, ‘లక్ష్మణా! అది నీ తప్పుకాదు. మనం రాక్షస నివాస ప్రాంతంగుండా వచ్చాం. అందుకే అక్కడ నీలో అటువంటి ఆలోచనలు కలిగాయి. ఇప్పుడు ఋషులు సంచరిస్తున్న ప్రాంతంలోకి వచ్చాం గనుక నీ ఆలోచనలు మారిపోయాయి.’ అన్నాడుట.

సదాశివం గారి తండ్రి స్వాతంత్య్ర పోరాట సమయంలో పెట్టిన పత్రిక అది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఎన్నో నిజాలను నిర్భయంగా వెలికితీసేందుకే తన సర్వస్వాన్నీ వెచ్చించారుట.

చివరకు చనిపోతూ కూడా ఆయన ఒక పసిబిడ్డనప్పగించినట్టే ఆ పత్రికను కొడుక్కి అప్పగించారట.నిజాలు నిర్భయంగా బయటపెట్టే సందర్భాలలో ఏవో బెదిరింపులు...

ఓసారి కొందరు కక్షతో పత్రిక కాపీలన్నీ ధ్వంసం చేస్తే, పనివాళ్లతో బాటు ఆయనా స్వయంగా కంపోజ్‌ చేసి రెండు గంటలు ఆలస్యంగా పత్రికను వెలువరించారట. ప్రెస్‌లో పనిచేసే పాతవాళ్లు ఓసారి ఈ విషయాలన్నీ నాతో చెప్పారు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నపుడు ఆయన సాహసం, ధైర్యం నాలోనూ ప్రవేశించాల్సిందేగా...

పైకి సాధారణంగా కనిపించే సదాశివంగారు ఆవ్యక్తికి సంబంధించి చాలా వివరాలే సేకరించారు.

ఆ వ్యక్తి సాధువు అంటే నేను నమ్మలేకపోయాను.

అతి కష్టంమీద అతని ఆశ్రమంలో భక్తురాలిగా చేరి వారం రోజులకోసారి ఎంతో కష్టంమీద ఎవరికీ అనుమానం రాకుండాఎడిటర్‌కితెలియజేసేదానిని.ఎందుకంటే పైకి అది ఆశ్రమంలా ఉన్నా అందరిమీదా శిష్యుల నిఘా ఉండేది.ఇక చివరి అంకంలో అనంతబాబాయే స్వయంగా ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ల తల్లిదండ్రులకప్పగించే పని నాకప్పగించారు.

‘చిట్టితల్లీ! ఈ బిడ్డలిద్దరికీ స్వస్ధత కలిగించమని వీరిని ఆరునెలల క్రితం తల్లిదండ్రులు మన ఆశ్రమంలో వదిలి వెళ్లారు. వీరికిప్పుడు పూర్తిగా నయమయింది.కాబట్టి తిరిగి వీరిని తల్లిదండ్రులకి మన ఉజ్జయిని ఆశ్రమంలో నువ్వు అప్పగించి మా సన్నిధికి రా.’

మా ఎడిటరుగారి అనుమానం నిజమైతే వీళ్లను ఎక్కడ్నుంచో ఎత్తుకు వచ్చి మరెక్కడో అమ్మే ప్రయత్నమన్నమాట.

ఆ పిల్లలు ఉత్తరాది పిల్లల్లా లేరు. ఏదో మత్తుమందు తిన్న వాళ్లలా జోగుతూ రైలు ప్రయాణంలో నిద్ర పోతూనే ఉన్నారు.

పదేళ్ల అభం శుభం తెలీని పిల్లలు, వాళ్లని ఏ మాయజేసి ఎత్తుకొచ్చారో....ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకోసం అమాయకంగా ఎక్కడెక్కడ వెదుకుతున్నారో?

నేను రైలునుంచే వీళ్లను తప్పించేస్తే ?కానీ మొత్తం రాకెట్‌ తప్పించు కుంటుందని ఇంకెందరో పిల్లల్ని ఎక్కడెక్కడ దాచారో తెలుసుకునే అవకాశం తప్పిపోతుందని ఊరుకున్నాను. అదీగాక ఈ పిల్లల తల్లిదండ్రులు అని చెప్పబడుతున్న వాళ్లద్వారా ఏమయినా విషయాలు తెలుస్తాయని కూడా ఆలోచించాను.

ఉజ్జయినిలో దిగగానే ఆశ్రమానికి తీసుకెళ్లడానికి ఓ కారు వచ్చింది. ఆశ్రమంలోని వాళ్లకి ఆ పిల్లల్ని అప్పగించాక ఆ మర్నాడు వాళ్ల తల్లిదండ్రులు వస్తారని ఎదురుచూసాను గాని ఎవరూ రాలేదు. పిల్లలగురించి అడిగితే అక్కడి శిష్యులు నాకేసి తీవ్రంగా చూసారు.

ఆ రాత్రి పదిగంటలకు నేను అక్కడి ఆశ్రమంలో సంచరిస్తూంటే...వెనకనుండి నవ్వు వినబడిo ది.

ఏమిటి శోధిస్తున్నావు తల్లీ ! గురువుగారికి నీమీద అనుమానం కలిగే నిన్ను మా దగ్గరకు పంపించారు నిన్ను అమ్మి సొమ్ము చేసుకోమని ...ఆ పసిమొగ్గలకంటే నీలాంటి అరముగ్గిన జాంపండే రుచి కదా...’

నాలుగు వైపుల నుండీ కాషాయ బట్టలు కట్టుకున్నవ్యక్తులుచుట్టుముడుతుంటే ...

మెరుపు వేగంతో ప్రహారీ వైపుకు పరిగెత్తాను.కానీ అక్కడా మనుషులున్నారు.ఆలోచనకు వ్యవధి లేదు. తెగించి అవతలివైపుకు దూకేసాను.

ఎందరో పసివారి జీవితాలను కాలరాస్తున్న వీళ్ల గుట్టును రట్టుచేసే ఫిల్ములు ఎలాగూ సదాశివంగారికి పంపించేసాను.ఈలోగా వాళ్లు తప్పించుకుంటే...ఈ అన్యాయంఇలాగేకొనసాగుతుంది. నాలాంటివారు ఎందరో సమిధలుకాక తప్పదు.

నేను ప్రహారీ దూకేలోగానే వెనుకనుండి తలపై బలమయిన దెబ్బ పడిరది. రెప్పలుమూసుకుపోయేంతలో...వెనుదిరిగి చూస్తే...ఆశ్రమం తగలబడిపోతోంది. ఆక్రందనలు నా చెవి సోకుతున్నాయి. ఇంతలో నన్ను ఎవరో భుజాన వేసుకున్నారు.

అంతే....ఆ తర్వాత ఇపుడే కళ్లు తెరిచాను.

ప్రసన్న వదనంతో గదిలోకి వస్తున్నారు సదాశివంగారు.

‘సాహసా!నీ తెగింపు వల్ల పసివాళ్లకు జీవనదానంజరిగిందమ్మా.అదృష్టవశాత్తూ నీకు సాయంగా నేను పంపిన గోడకవతల కాపు కాసిన మనవాళ్ల చేతుల్లో పడ్డావు. నువ్వు పంపిన ఫిల్ముల సమాచారంతో అనంతబాబాను అరెస్టు చేసారు.వృత్తిని దైవంగా భావించినవారు నిర్భయంగా, ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో విజయాలు సాధిస్తారని ఋజువు చేసావు.ప్రభుత్వం నీకు సాహస అవార్డు ప్రకటించింది.’

నా మనసులో మాత్రం మా ఎడిటర్‌ తొలినాడు చెప్పిన మాటలే సుడులు తిరుగుతున్నాయి.

‘మరణం అనేది ఎవరికయినా ఒక్కసారే వస్తుంది. పిరికిగా క్షణక్షణం చస్తూ బ్రతకడం కంటే సమాజాని కుపయోగపడే నిజాన్ని వెలువరించే కర్తవ్య దీక్షలో అది మనల్ని వరిస్తే విచారించాల్సిందేముంది?’

- పి.వి.శేషారత్నం

First Published:  15 May 2023 11:08 AM GMT
Next Story