Telugu Global
Arts & Literature

పూజలు సేయ…

పూజలు సేయ…
X

పూజలు సేయ…

'ఇవాళ ఎలాగైనా కనిపెట్టాలి' ఆ రోజు అలారం మోగడానికి ముందే లేచి కూచుంది ప్రశాంతి. అసలు ఇంట్లో అందరికంటే ముందు ఐదు గంటలకే లేచే అలవాటు. మరి పనులు తెమలొద్దూ.

వంట చేసి,అందరికీ బాక్స్ లు సర్ది, పెద్ద వాళ్లిద్దరికీ డైనింగ్ టేబుల్ మీద అమర్చి, ఎనిమిదిన్నర కల్లా బయట పడాలి. తను పనిచేస్తున్న స్కూల్ అక్కడికి ఓ పదిహేను నిముషాలు స్కూటీ లో వెడితే.

ఈ యేడు ధనుర్మాసం చలి ఎక్కువ గానే ఉంది. పైగా ఏమీ కనపడకుండా పొగ మంచు. ఓ అరగంట అటూ, ఇటూ అవుతోంది ఈ మధ్య.

అసలు సంగతి...

తను గేటు తాళం తీసి, పాల పాకెట్లు లోపలకి తీసుకు వెళ్లి, పాలుకాచి, కాఫీ డికాక్షన్ తీసి, ఓ కప్పు కాఫీ తో గుమ్మంలోకి వచ్చేసరికే, లోపల మందార చెట్టు పూలన్నీ మాయం. ఇంచుమించు నాలుగు రోజులుగా జరుగుతోంది. నెలగంటు పట్టిన దగ్గరనుండి పనిమనిషి స్వరూప ను తొందరగా రమ్మంటోంది. పెందరాళే వాకిట్లో ముగ్గు పెట్టడం కోసం.

'సలి పెడతందమ్మా' అని నసుగుతూ వస్తోంది కొంచెం ఆలస్యంగా.

ఈ రోజు ఆ పూల దొంగని పట్టాలి. పాలపాకెట్ కత్తిరిస్తూ మరోసారి అనుకుంది. స్టౌ 'సిమ్' లో పెట్టి బయటకు రాబోతుండగా గేటు చప్పుడు వినిపించింది.

" ఎవరదీ...?" పరుగులాటి నడకతో గుమ్మం లోకి వచ్చింది. గేటు దాటబోతున్న అతను ఆగి వెనక్కు తిరిగాడు. సన్నగా పొడుగ్గా వున్నాడు. చలికి స్వెట్టర్, మఫ్లర్, చేతిలో చిన్న కర్ర తో.

" మందార పూల కోసం.. దేముడికి..... " తడబాటు దాచుకుని చిన్న నవ్వు నవ్వాడు. పెద్దమనిషి లాగే వున్నాడు.

ప్రశాంతి కనుబొమలు ముడిచే వున్నాయి అయినా.

...ఆమె చూపులు తీక్షణతను తప్పిచుకొంటూ చెప్పాడు.

" ఈ వెనక బాంక్ కాలనీ లో వుంటాం. వాకింగ్ కు వస్తూ రోజూ చూస్తాను. చక్కని తోట మీది.. మీ అభిరుచి కూడా..."

' చూడబోతే పెద్దవాడిలా ఉన్నాడు. మరీ పూల దొంగతనం ఏమిటో.' పైకి ఒక్క మాట కూడా రాలేదు ఎంచేతో!

ఈ మాటు స్థిమితంగా ప్రశాంతి ముఖం లోకి చూస్తూ చెప్పాడు.

"నా పేరు రాఘవరావు. నా రిటైర్మెంట్ తర్వాత ఇటువేపు ఇల్లు కొనుక్కుని వచ్చాము. కాని మా పిల్లలిద్దరికీ.. -నాకిద్దరూ కొడుకులే- పెళ్లిళ్లయ్యాయి. వాళ్లందరికి హైటెక్ సిటిలో వుద్యోగాలు. ఇక్కడ నేనొక్కడినే. నా భార్యా... గతించి నాలుగేళ్లయిందీ."

అలా నానాస్తూ.. మాటలు కలుపుతుంటే విసుగొస్తోంది

ప్రశాంతి కి. 'ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎవరడిగారనో...?' మనసులోనే గింజుకుంది.

"... రోజూ వాకింగ్ లో బయటనుండి కనిపించీ కనిపించకుండా - మీ తోట నాకు ఓ ఆకర్షణ. నాకూ చక్కని తోట పెంచు కోవాలని ఎప్పటి నుంచో కోరిక. పూల మొక్కలన్నీ తెచ్చి వేసాను. ఓ రోజు ఉదయం ఇలా వాకింగ్ కి వస్తూ, మీ పూలతోట చూద్దామనిపించి లోపలకి అడుగు పెట్టా... తెలుసు అనుమతి లేకుండా రాకూడదని... కాని, అంత పొద్దున్నే ఎవ్వరూ లేరిక్కడ.. చూద్దునా... విరబూసిన ఈ ఎర్ర మందారాలు నన్ను కట్టిపడేసాయి.

అటు చూస్తే హేమంత చామంతి మడి... కనకాంబరాల సంబరాలు.... వెన్నముద్దల్లా... నందివర్దనం.‌

రాలిన పారిజాతాలు.. ఆడుకుంటూ అలసిపోయి నుంచున్నట్టు నడుము మీద చేయి వేసుకుని నించున్న చిన్నికృష్ణుడి బొమ్మ వాటి మధ్యలో!

మొత్తానికి బృందావనం సృష్టించారమ్మా!!"

ఆయన ప్రశంస కు నెమ్మదించినా, ప్రశాంతి మనసులో ప్రశ్న అలాగే వుంది. అప్పటికి వెలుగు వస్తూవుంది.

"మీరేమను కుంటున్నారో అర్థం అయింది. ఇలా పూలు కోసుకు పోవడం తప్పే... మన్నించండి.

ఇంతకు ముందు అపార్ట్మెంట్స్ లో వుండే వాళ్లం. పొద్దున్నే వాకింగ్ కి వెడుతూ బయటకు కనిపించే పూలమొక్కల పూలు పూజకు కోసుకు వెళ్లడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా ఇంట్లోనూ పూజకు సరిపడా పూలు పూస్తున్నాయి... ఊఁ...

ఏమిటో ఈ పాడు అలవాటు... "

అంతవరకూ అణిచిపెట్టుకున్న అవమాన భారం.. పెల్లుబికింది... ముఖం ఎర్రబడింది .. అప్పటికే కోసిన మందారపూల సంచి చేతికి ఇవ్వబోయాడాయన. చప్పున మేల్కొంది ప్రశాంతి.

"ఫర్వాలేదండీ... పూలన్నీ పూజకే కదా.. వుంచండి."

ఏ జన్మ సంస్కారం అడ్డమొచ్చిందో... రెండు చేతులూ జోడించింది.

-సునీత పొత్తూరి

First Published:  22 Nov 2022 6:58 AM GMT
Next Story