Telugu Global
Arts & Literature

పారిపోకు

పారిపోకు
X

అడుగు వెనక్కి

పడినప్పుడల్లా

ఒక్కసారి ఆకాశంలోకి

చూడు...

రాహుకేతువులు

మింగేస్తున్నా

మౌనంగా యుద్ధం

చేస్తూ ఒక రోజు

పూర్తి అందమైన దేహంతో

మెరిసిపోతుంది

చందమామ..

గుండె బరువెక్కినప్పుడల్లా

సంద్రాన్ని తలచుకో..

సముద్రం ఎప్పుడూ

ఎందుకు

వెనక్కిపోతుందో

ఆలోచించావా

గెలుపు ముందు

ఓటమితో

ముక్కలైన దేహాన్ని

మళ్ళీ నిర్మించుకోవడానికి..

నీతిని, న్యాయాన్ని మలినం

చేసే మనుషులెదురైనప్పుడు

ఒక్కసారి ఆ సూర్యుడిని

ఆవాహన చేసుకో..

కుళ్ళు, కుత్రంతానికి

అసలు అమ్మానాన్నలే

లేరని మనసారా నవ్వుకో...

ఎన్ని భాగాలో కదా

ఈ శరీరంలో

అన్నిటిని సమర్ధించుకోవడం

ఏమొచ్చినా భరించడం

ఎన్నిటినుంచో కాపాడుకోవడం

ఏ చేతులు తాకకుండా

ముళ్లకంచె తొడుక్కోవడం

తెలిసిన నీకు...

ఈ మనుషులు కేవలం

సూత్రధారులు,

పాత్రధారులు

ఉత్తరకుమార

కుట్రదారులని

తెలియకపోతే ...

అందమైన నీ ఉనికికే

నువ్వు ఎరగా మారతావు..

ఎవరి కన్నీటికో నువ్వో

కారణమవుతావు..

తొమ్మిదో నెల గర్భంతో సైతం

నిటారుగా నిలబడే

అమ్మలం కదా మనం..

మన వెన్నెముకే

మనకున్న బలం...

పాత పేజీలను చించేసి

నిన్ను నువ్వు నమ్ముకో..

నీ భుజాలకు వీరత్వ

లేపనమద్దు...

నీ కలం, నీ కల

ఆకాశంలో మూడు రంగుల

జెండాగా ఎగురుతుంది..

అదే రేపటి అజెండాగా

మారుతుంది..

-అమూల్యచందు

First Published:  27 Nov 2022 7:33 AM GMT
Next Story