Telugu Global
Arts & Literature

ఒక్కసారైనా

ఒక్కసారైనా
X

ఒక్కసారైనా

దుఃఖాన్ని పదాలలోకి

ఎలా తర్జుమా చేయను

ఆనందాన్ని వాక్యాలలోకి

ఎలా అనువదించను

మిత్రమా

“నో కాల్స్ ఓన్లీ వాట్సాప్” అంటూ

ఒక కఠిననిషేధం విధించావు

నీకూ నాకూ నడుమ

ఒక పల్చని తెర కట్టావు

హడావిడిని కప్పుకుని

ఏదో ఆకాశాన్ని గెలవడానికో

ఏవో పనులను

ఎదిరించడానికో

వడివడిగా నడిచిపోతావు

పూలు పూస్తున్న దృశ్యం

రాలిపోతున్న సవ్వడి

వాన ఇంద్రధనుస్సై

నింగిని అలంకరించడం

ఏదీ నిన్ను కదిలించదు

చూపులు తెలియని తీరానికి

గురిపెట్టి

కాలాన్ని నీ పాదాలకు

తగిలించుకుని

అంతూదరీ లేని

ప్రయాణంలో తలమునకలయ్యావు

నా పిలుపును

గాలి నీ చెవులకు చేర్చట్లేదు

నాలోని తడిని

అక్షరం నీ దాకా తేవట్లేదు

మిత్రమా

మాటల్లేని నిశ్శబ్దప్రపంచంలో

మౌనాన్ని ఏకఛత్రాధిపత్యంగా

ఏలుతున్న బ్రతుకులో

ఒక స్వరాన్ని వినడానికి

గుండెలోంచి గొంతులోకి

దయగా జారే మార్దవాన్ని

ఒడిసి పట్టుకుని

ఖాళీ అయిపోతున్న

నన్ను నేను నింపుకుంటూ

నీదైన పలుకుని ఆనందభాష్పాన్నై

ఒంపుకుంటూ నిలబడడానికి

మనసుజోలెను

పట్టుకుని అర్ధిస్తున్నాను

ఒక్కసారైనా

చిలుకలా పలుకుతావా

కోయిలై పాడుతావా

చీకట్లను తరిమేసి

జీవితాన్ని రంగులదీపాలతో

వెలిగించుకుంటాను

- పద్మావతి రాంభక్త (విశాఖ )

First Published:  31 May 2023 7:25 AM GMT
Next Story