Telugu Global
Arts & Literature

జననీ జన్మభూమిశ్చ (కథ)

జననీ జన్మభూమిశ్చ (కథ)
X

“నేను దేశానికి నా కొడుకును అంకితమిచ్చాను. ఒక దేశభక్తుడిని కన్నానని గర్విస్తున్నాను.” సైనిక లాంఛనాలతో పూలతేరులో వచ్చిన కొడుకుకు సెల్యూట్ చేస్తోంది ఒక వీరమాత.

భర్త ముఖంలో ఆరని పౌరుషాన్ని చూస్తూ కళ్ళను తుడుచుకుంటూ నుదురు ముద్దు పెట్టుకుంటోంది ఓ వీరపత్ని.

తండ్రి నిద్రపోతున్నాడన్న ఊహలోనే ఉన్న ముక్కు పచ్చలారని బిడ్డలు ‘లే నాన్నా…లే నాన్నా…’ అంటూ పిలుస్తున్నారు.

వీధుల్లో బారులు తీరి పూలవాన కురిపించడం కోసమై , గుండె నిండిన దుఃఖాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆరేడుగంటల పాటు ఎదురుచూసిన జనం ‘ కిశోర్ అమర్ రహే…అమర్ రహే….’ అంటూ నినాదాలు చేస్తూన్నారు. .

ఏ అభివృద్ధికీ నోచుకోకుండా, చదువు సంధ్యలకీ , కనీస వైద్య సేవలకీ కూడా నోచుకోని తమ దేశపు వెనుకబడిన గ్రామాలకి భారత ప్రభుత్వం రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడం పొరుగు దేశానికి గిట్టటం లేదు. వారి దొంగచాటు చొరబాటుకు మన దేశం నిర్మించిన రోడ్డు నిర్మాణం అవాంతరంగా మారింది. సరిహద్దులను కాపాడడం కోసం పంచేంద్రియాలను ఏకీకృతం చేసి భారత సైన్యం అడ్డగిస్తూ ఉండడంతో డ్రాగన్ సైన్యం సరిహద్దుల్లోని చెక్ పోస్టు వైపు ఒక పథకం ప్రకారం దొంగచాటుగా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని రూఢీగా తెలిసిపోతూనే ఉంది కనుక కల్నల్ కిశోర్ బోర్డర్ దగ్గరి చెక్ పోస్టు దగ్గరికి చేరుకొని , అవతలి వైపు కమాండర్ తో హద్దులు దాటవద్దని హెచ్చరించాడు.

ఇరుదేశాల ఒడంబడికను గుర్తు చేశాడు. ఆ తర్వాత వైర్ లెస్ లో విషయాన్ని అధికారులకి పంపి, సామరస్య ధోరణిలో, పరిస్థితిని చక్కబరచాలని భావించాడు. కొద్దిసేపు నచ్చ చెప్పాక మెత్తబడినట్లు కనిపించిన శత్రు మూక మళ్ళీ తెగబడదని నమ్మకమేమీ లేదు కనుక, తన వాళ్ళని అప్రమత్తం చేశాడు.

ప్రాణాలు తృణ ప్రాయమనీ, మాతృభూమి కోసం ఏ త్యాగానికయినా సిద్దమనీ చెప్పిన సైనికులకి మనః పూర్వకంగా తనూ సెల్యూట్ చేశాడు కిశోర్. కొద్ది గంటలయినా గడవక ముందే మళ్ళీ జొరబడింది శత్రు మూక. మరో సారి అవకాశమిద్దామన్న కల్నల్ కిశోర్ మాటలు తమకు రుచించకపోయినా, అధికారికి ఎదురు తిరిగే సంప్రదాయం లేని నిబద్ధత వాళ్లది. మళ్ళీ చేరువగా వెళ్లి దురాగతం మానుకోమని ఆఖరుసారిగా చెప్పాడు. అతని వెనుకనే ట్రూప్.,

చేసుకున్న ఆన మీద నిలబడి, వెనక్కి తగ్గడానికి వాళ్లది భారతదేశం కాదు. ధర్మం కోసం ప్రాణం వదలడానికి వాళ్ళేమీ భారతీయులూ కారు. నమ్మకద్రోహం చేయడంలో వాళ్లకి వాళ్ళే సాటి అనిపించుకున్న ఆషాఢభూతులు. మారణాయుధాలు చెల్లవనీ, సరిహద్దుల్లోని విద్వేషాలు తుపాకులతో కాక సామరస్య చర్చలతోనే సద్దుమణగాలన్న అంతర్హాతీయ నిబంధనకి తూట్లు పొడిచి నిశి రాత్రి వేళ క్రికెట్ బ్యాట్లకు ఇనుప ముళ్ళ తీగలు , మేకులు చుట్టి దాడి చేశారు. రాళ్లు విసిరేశారు. కర్రలతో చావమోదారు. ఈ సారి వాళ్ళ వెనుక పదుల సంఖ్యలో సైనికులు. కొద్దిసేపటిలోనే త్రోపులాట, కుమ్ములాట. తోడేళ్ళ గుంపును సింహాల్లా పారద్రోలిన భారతీయ సైనికులకి ప్రాణనష్టం అవతలివారి కన్నా తక్కువే అయినా, కల్నల్ కిశోర్ తో పాటు మరి కొందరు కొదమ సింహాల్ని పొట్టన పెట్టుకుంది కీచక మూక. తూటాలతో కాక ఆటవికుల్లాగా చేతి కర్రలు, ఇనుప ముళ్ళు, రాళ్ల తో ఎగబడ్డ ద్రోహులు మన వీర సైనికులను తీవ్రంగానే గాయపరచారు. చీరుకుపోయిన శరీరాలతో రక్తమోడుస్తూనే అవతలి వారిని యాభైమందికి పైగా మట్టుబెట్టి నేలకొరిగారు భారతీయ వీర పుత్రులు. ఉగ్గుపాలలో పౌరుషాన్ని , ఆటపాటల్లో దేశభక్తిని నింపుకున్న ముద్దుబిడ్డలను ఆర్తిగా అక్కున చేర్చుకుంది భూమాత.

“అమర వీరులకు జోహార్లు. మనమందరం మృత వీరులకు జోహార్లు అర్పించుదాం. వారి వీర మరణం మనందరి కోసం. వారికి కృతజ్ఞతా పూర్వకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటిద్దాం. వారి ఆత్మ శాంతికోసం భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆ తర్వాత అందరం కలిసి క్రొవ్వొత్తులతో శాంతి యాత్ర చేద్దాం.”

కేవీఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ప్రశాంతి ఎస్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీ లో సభ జరుగుతోంది. అపార్ట్మెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతున్నాడు.

“అవునండీ… అది మన బాధ్యత. తప్పకుండా చేద్దాం. మృత వీరులకు ఆత్మ శాంతి కలగాలి. మన కార్పొరేటర్ గారికి కూడా తెలియజేద్దాం. వారు కూడా కలిస్తే, ఎఫెక్టివ్ గా ఉంటుంది. “ సెక్రెటరీ రాంరెడ్డి చెప్పాడు.

“మనమందరం చాలా రోజులనుంచీ, కృష్ణా నీటి సరఫరా విషయంలో సమస్యలు ఎదుర్కుంటున్నాం. ఎన్ని సార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదాయన. ఇప్పుడు మీడియా కవరేజ్ చేయించి, ఆ విషయం లేవనెత్తితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందని నా అభిప్రాయం “ మరోసభ్యుడు ఇంతియాజ్ అలీ అన్నాడు.

“వెరీ గుడ్ ఐడియా, ఐ ఎప్రీషియేట్ ఇట్.” సి బ్లాక్ ప్రతినిధి జార్జ్ అన్నాడు.

నూటా యాభై మంది దాకా హాజరయిన సభలో వీరమరణం పొందిన కల్నల్ కిషోర్ కుమార్ కి ఆయన సహచరులకి సంతాపం ప్రకటించి, తీర్మానం ఆమోదించిన ప్రశాంతి ఎస్టేట్స్ నివాసితులందరూ టీ, బిస్కట్లు సేవించి తలా రెండు మూడు క్రొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందుకుని ఇళ్ళకి బయల్దేరారు.

మరునాడు ఆదివారం నాడు తొమ్మిది గంటలకి ర్యాలీ మొదలవుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చాడు కార్యదర్శి రాం రెడ్డి.

“అయ్యా…ఒక్క నిమిషం ఆగండి.”

ఎవరా అని తలెత్తి చూసిన వాళ్లకి, వేదిక మీద ‘ఎ’ బ్లాక్ లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తిలక్ వాళ్ళ నాన్న క్రిష్ణయ్యగారు కనిపించారు. అపార్ట్మెంట్స్ లో ఉండే పిల్లలకి ఆటలు, యోగా నేర్పటం, నీతిపద్యాలు, కథలు చెప్పటం ఆయన హాబీ. నాలుగేళ్ల క్రితం రిటైరయిన క్రిష్ణయ్యగారు, ఆయన భార్య నీలిమ గత ఏడాదే కొడుకు దగ్గరకి వచ్చారు.

“చెప్పండి సార్! ఏమైనా సలహానా…?” అడిగాడు ప్రెసిడెంట్ కిరణ్.

“కాదు. ప్రశ్న. చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద జీతాలు అందుకుంటున్న మీ అందరికీ నమస్కారం. ఒక్క ప్రశ్నకి జవాబివ్వండి. మన సంతాప సందేశాలు, ర్యాలీ లూ, దేశం కోసం ప్రాణాలొడ్డిన వీరసైనికులకి ఆత్మశాంతి కలుగుతుందని మీరు నమ్ముతున్నారా?”

“మరింకేం చేయగలం అంకుల్? కత్తులూ తుపాకులు పట్టుకుని మనం వెళ్లగలమా యుద్ధానికి?” వెటకారంగా వచ్చింది ప్రశ్న.

ఎవరా అని చూసారందరూ. ఎప్పుడూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరిగే సతీష్. ప్రముఖ కంపనీ హెచ్ ఆర్ ప్రొఫెషనల్ అతడు.

“పూజలూ, ప్రార్థనలూ కూడా చేసాం క్రిష్ణయ్యగారూ. మీరే చెప్పండి అన్నదానం లాంటివి ఏమయినా చేద్దామంటారా…” పెద్దావిడ అన్నపూర్ణమ్మగారు అడిగింది.

“బీ ఫాస్ట్ ప్లీజ్. వీ హావ్ అదర్ ఎంగేజ్మెంట్ టు అటెండ్.” టైం చూసుకుంటూ చెప్పాడు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బెనర్జీ.

“చూడండీ….పూజలూ ప్రార్థనలూ ఫలిస్తాయో లేదో చెప్పేంత విజ్ఞానిని కాను. కత్తులూ కొడవళ్ళతో మనం వెళ్లి కొట్లాడగలం అని చెప్పేంత అజ్ఞానినీ కాను. మన కోసం మైనస్ డిగ్రీల వాతావరణం లో తిండీ నిద్రా లేకుండా శ్రమిస్తున్న మన వీర జవాన్లకి మేమందరం మీతో ఉన్నాం అని నమ్మకం కలిగిద్దాం. నిజం చెప్పాలంటే మనం కంటి నిండా నిద్ర పోగలుగుతున్నాం అంటే అది మన సైనికుల నిబద్దత వల్లనే.”

“ఏం చేద్దాం అంకుల్? నిజానికి నా రక్తం ఉడికిపోతోంది. సరిహద్దుల్లోకి వెళ్లి, నాకు చేతనమయిన సాయం కనీసం నా సైనిక సోదరులకి వంటయినా చేసిపెట్టాలి అనిపిస్తోంది. వాళ్ళ కోసం చలి కోట్లు అల్లి ఇవ్వాలనిపిస్తోంది. కానీ, అది అసాధ్యమని తెలుసు.” గద్గదమయిన కంఠం తో చెప్పింది ఇంజినీరింగ్ చదువుతున్న వైష్ణవి.

“మీ వెంటే మేమున్నాం అని మన పి యం ఓ సైట్ కి అందరం మెయిల్స్ పంపిద్దాం.” ఒక కుర్రవాడు చెప్పాడు.

“మంచి షార్ట్ ఫిలిం చేస్తాను. దాని వల్ల మన వాళ్ళ శౌర్యం గురించి అందరికీ తెలుస్తుంది” సినిమాటోగ్రఫి నేర్చుకుంటున్న మరో విద్యార్ధి చెప్పాడు.

గొంతు సవరించుకున్నారు క్రిష్ణయ్యగారు.

“మీరన్నవేవీ నేను విభేదించడం లేదు. కానీ, వీటన్నింటికన్నా ముఖ్యం మనందరం పూనుకుని కలిసి కట్టుగా చేయవలసిన పని ఒకటుంది. కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.”

“చెప్పండి అంకుల్ ఏం చేయాలి?” అడిగింది వైష్ణవి.

“శత్రు దేశపు ఉత్పత్తుల్ని బహిష్కరించాలి. కొనకూడదు. ఆ దేశపు అప్లికేషన్స్ ను వాడకూడదు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన వస్తువులు, మన వాళ్ళ సేవలు, మన రైతుల వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కొనాలి. అప్పుడు మాత్రమే పొరుగు దేశపు దుష్ట యుద్దవ్యూహాన్ని ఆపగలం. ”

“ఇట్స్ అబ్సర్డ్. ఇంపాసిబుల్. మార్కెట్లో దొరికేవే ఆ దేశానివి. మన వాళ్ళ ప్రాడక్ట్స్ తయారీ గానీ, ధర కానీ ఆ దేశపు ఉత్పత్తులతో పోలికే లేనివి. “ఖచ్చితంగా అనేశాడు జార్జ్.

“ దట్ జాబ్ ఈజ్ నాట్ అవర్స్. ఇంపోర్ట్ కానీయకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం. దేశంలోకే రానీయకుండా చూసుకోమనండి. అప్పుడు తప్పనిసరి గా మన దేశం వస్తువులే కొంటాం అందరం. ఐ సపోజ్ అయాం రైట్.

” మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతి చెప్పింది.

“ మనం కొనడం మానేస్తే ఆ దేశం నష్టపోతుందా….ఏవిటో….చాదస్తం…చూస్తూ చూస్తూ పది రూపాయలకి వచ్చే వస్తువుకి యాభై రూపాయలు పెడతామా ఏమిటి?” డి బ్లాక్ లో ఉండే గజెటెడ్ ఆఫీసర్ జగన్నాధం అన్నాడు.

అంతా తలా ఓ మాటా అంటూ, సెల్ ఫోన్స్ లో టైం చూసుకోసాగారు.

“సారీ క్రిష్ణయ్య గారూ…మనం సమావేశమయిన విషయానికి మీరు చెప్పేదానికి సంబంధం లేదు. అందరం బిజీ మనుషులం. వెళ్లిపోవాలి. ప్లీజ్ ప్యాక్ అప్.” లేచేశాడు కార్యదర్శి రెడ్డి.

“ఎస్. రేపటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. పదండి బయల్దేరుదాం.” పెద్దాయన మాటలని చాదస్తంగా భావిస్తూ, అదే అభిప్రాయాన్ని ముఖ కవళికల ద్వారా వ్యక్తీకరిస్తూ లేచాడు అధ్యక్షుడు కిరణ్.

కానీ అక్కడున్న విద్యార్థులు ఊరుకోలేదు. దాదాపు నాలుగు వందల కుటుంబాలున్న గేటెడ్ కమ్యునిటీలో అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు.

“మన దేశం కోసం, మన సైనికుల కోసం మేమేం చేయాలో చెప్పడానికి వచ్చిన పెద్దాయన మాటలు వినకుండా అవమానించడం విజ్ఞత కాదు. చెప్పండి అంకుల్…తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా దేశం కోసం పోరాడిన వీరుల త్యాగానికి మేమేం చేయాలి?” వైష్ణవి అడిగింది ఆవేశంగా. ఆ అమ్మాయి ప్రక్కనే చాలామంది యువతీ యువకులు పిల్లలూ ఉన్నారు. వాళ్లందరికీ క్రిష్ణయ్యగారి పట్ల గురుభావం.

“ఆ దేశపు వస్తువులు వాడడం మానేస్తే , సైనికుల ప్రాణాలు తిరిగొస్తాయా? కయ్యానికి కాలు దువ్వే మూకలు ఖామోష్ అయితరా?” సతీష్ వెటకారంగా అడిగాడు మళ్ళీ.

“వినేందుకు సిద్ధమయితే చెప్పగలను. కేవలం ఖండించడానికి, విమర్శించడానికి ప్రశ్నిస్తున్నట్లయితే….మీరు వెళ్ళిపోవచ్చు.” అన్న కృష్ణయ్యగారి మాటలకి అందరూ మళ్ళీ కూర్చున్నారు.

“పిన్నా పెద్దలందరికీ నా విన్నపం. నేను ఇందాక చెప్పినట్లు, కేవలం అక్కడి వస్తువులను మనం కొనడం, వాడడం మానేస్తే చాలు, వందలాది ప్రాణాలను కాపాడగలం. రాబోయే యుద్ధాన్ని ఆపగలం. అదెలాగో చెప్తాను వినండి. ఆలోచించండి. మీ పొరుగువాడు మీకు నిరంతరం అశాంతిని సృష్టిస్తూ, మీ ఇంట్లో ప్రశాంతి అనేది లేకుండా చేస్తున్నా కూడా మీరు అతగాడి చేష్టలని సహించి పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. మీ ఓర్పును చేతగానితనంగా భావించి అతడు మరింత రెచ్చిపోయి ఒకానొక రోజు మీ ఇంట్లోకి జొరబడే ప్రయత్నాలు చేస్తుంటే ఊరుకోగలరా? ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించి ముందు జాగ్రత్తగా ఆయుధాలు సిద్ధం చేసుకోవడం, మీకు మీరే సన్నద్ధం అయి ఉండి, రక్షణకోసం పోలీసుల్ని ముందే ఆశ్రయించడం చేస్తారా చేయరా? కలిసి కట్టుగా వాడికి ఎదురుతిరుగుతారా, లేక పాపం ఈ పొరుగింటివాడు మనకి పాలూ పెరుగూ, సరుకూ సరంజామా చవకగా అమ్ముతున్నాడు కదా పోనీలే ఇక్కడే ఉండనీ అని మీరే తప్పుకుంటారా?”

“అలా ఎలా ఊరుకుంటాం అంకుల్? వాడు మన డబ్బుతో బ్రతుకుతున్న వ్యాపారి. హద్దు మీరితే మళ్ళీ మరోసారి ఇటు చూడకుండా బుద్ది చెప్పి తీరుతాం” చెప్పాడు ఒక విద్యార్థి.

“ఇప్పుడు జరుగుతున్నది అలాంటిదే. మన వేలితో మన కన్నే పొడుచుకునేలా చేస్తున్న బేహారి ఈ శత్రు దేశం. మన దేశానికి అణు బాంబు ఉండరాదనీ, అంతర్జాతీయ భద్రతా మండలిలో స్థానం కూడా ఉండడానికి ఒప్పుకోననీ చెప్పే ఆ దేశం మనకి ప్రక్కలో బల్లెంలా మారి, అరాచాకాలకి తెగబడమని, ప్రక్కలో బల్లెం లాంటి మరో పొరుగుదేశానికి ఆయుధాలు సప్లై చేస్తుంది. ఒక ప్రక్క విధ్వంసం, మరో ప్రక్క వ్యాపారం. రెండు వైపులా పదునున్న కత్తి ఆ దేశం. కలం,కాగితం, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్,ప్లాస్టిక్, బొమ్మలు, ఆట వస్తువులు, మందులు, అలంకరణ వస్తువులు, బట్టలు, ప్రాసెస్ అయిన ఆహార పదార్థాలు, ధాన్యాలు, పరిశ్రమల విడి భాగాలు ఒకటీ రెండూ కాదు, భారతీయ మార్కెట్లో అమ్మే నూటికి అరవై శాతం వస్తువులు ఆ దేశానివే! మనం కొంటున్నాం కనుకనే కదా, వాళ్ళు అమ్ముతున్నారు.”

“ఓహ్…సర్…మీరేం చెప్పదల్చుకున్నారండీ? చవకగా దొరికే వస్తువుని కాక అదే వస్తువుని ఎక్కువ పెట్టి ఎవరయినా ఎందుకు కొంటారండీ? డబ్బులేమయినా చెట్లకి కాస్తున్నాయా?” అడిగాడొక సభ్యుడు.

“మన తెలివి అక్కడే ఉట్టెక్కి పోతోంది. తయారీలో మన్నిక తక్కువని తెలిసినా శత్రువు వద్దే కొంటున్నాం మనం. మన ఎకానమీకి మనమే తూట్లు పొడుచుకుంటున్నాం. నాసి రకం వస్తువులకి నగిషీలు తొడిగి, నాణ్యత లేని సామాగ్రిని తమ దేశం లోని అన్ని రకాల కార్మిక నిబంధనల్నీ తుంగలో తొక్కి, తమ వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించి మన దేశ చిరు వ్యాపారస్తుల్నీ, వ్యవసాయదారుల్నీ దెబ్బ తీయడం మాత్రమే కాదు. రసీదులూ, బిల్లులూ లేకుండా వ్యాపారం చేస్తూ ప్రభుత్వాదాయానికీ గండి కొడుతున్నాడు. మన దేశాన్ని తన కాలనీగా మలుచుకోవడం కోసం ఆ సొమ్మును మన మీదే ప్రయోగిస్తున్నాడు. తన సైన్యాన్ని పోషించుకుంటున్నాడు. ఆయుధాలు తయారు చేస్తున్నాడు. మన మీద ప్రయోగిస్తున్నాడు. శత్రువు చాలా తెలివయిన వాడు, కంట్లో కారం కొట్టి, నోట్లో వెన్నలాంటి మన్ను కుక్కుతున్నా, మనం గ్రహించలేకపోతున్నాం. మన సొమ్ముతో తన సైన్యాన్ని పోషించుకుంటూ, మన దేశంలో జొరబడి, ఎదిరించిన మన వీరకిశోరాల్ని అన్యాయంగా చంపుతూ ఉంటే….., చెప్పండిప్పుడు , క్రొవ్వొత్తుల ర్యాలీలూ, మౌన ప్రదర్శనలూ చేసి చేతులు దులుపుకుందామా?” ఒక్క క్షణం ఆగారు క్రిష్ణయ్య గారు.

“ ఇది ఆలోచించాల్సిన పాయింటే! మన సోదరులు ఎవరినయితే ప్రాణాలొడ్డి మరీ ఎదిరిస్తున్నారో, ఆ శత్రుదేశాన్ని మనం బలోపేతం చేయడమంటే, మనని మనం మోసం చేసుకున్నట్లే, మన సైన్యానికి మనం అన్యాయం చేస్తున్నట్లే,! కానీ సర్, మన నిత్యావసరాలు తీరేదెలా? నూటా ముప్పయ్ కోట్ల మంది ప్రజలకి కావాల్సినన్ని ఉత్పత్తులు మన దేశంలోనే దొరుకుతాయా? సరిపోతాయా? కొనగలమా? అంత సామర్ధ్యం మనకుందా?” ఒక గృహిణి ప్రశ్నించింది.

ఏమంత కష్టం? లగ్జరీలను వదిలి సింపుల్ గా బ్రతకడం మొదలెడితే, మనకి అవసరమయిన వస్తువులని, స్వదేశీ ఉత్పత్తుల్ని ధర ఎక్కువయినా కొనగలం. మనవాళ్ళని బ్రతికించుకోగలం. కొద్ది కాలం ఓర్పు వహించి, వాళ్లకి సమయం, సదుపాయం కలిగిస్తే, మన రైతన్న, నేతన్న, కూలన్న ఆత్మహత్యలకు పాల్ల్పడరు కదా! ఒక్కసారి ఆలోచించండి. కేవలం చిన్న సౌలభ్యాల్ని వదులుకోవడానికి మనం ఆలోచిస్తే, గడ్డ కట్టే చలిలో, సరయిన తిండి, నిద్ర కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేని మంచు కొండల్లో మన సైన్యం చావుకి వెరవకుండా మనకి బ్రతుకునిస్తోంది. మనం టీవీల్లో రియాలిటీ షోలూ, సెల్ ఫోన్లలో చాటింగ్ లూ చేసుకుంటూ మధ్య మధ్య సరదాగా అప్పుడప్పుడూ వార్తలు తెలుసుకుంటూ, తెలుసుకున్నాక గాధంగా నిట్టూర్చి, పెళ్ళాం పిల్లలతో పంచుకుని , ఆ తర్వాత ఫోన్ లిస్టు లో ఉన్న అందరికీ సమాచార పంపిణీ చేసి చేతులు దులుపుకుంటుంటే, మనం న్యాయం చేసినట్లా? ‘మీ సౌకర్యాల కోసం మా ప్రాణాల్ని మేమెందుకు పణం పెట్టాలి, మా కుటుంబాలకి ఎందుకు అన్యాయం చేయాలి’ అని సైనికులూ అనుకుని ఉదాశీనులయితే, మనిళ్ళల్లో మనమిలా సుఖంగా ఉండగలమా?”

అందరి నోళ్ళూ మూతపడ్డాయి. ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి. కొంత కదలిక వచ్చింది. మళ్ళీ గొంతు సవరించుకున్నారు క్రిష్ణయ్యగారు.

“ చూడండీ….వెయ్యి మైళ్ళ దూరమయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది! నిర్ణయం తీసుకోవాలి. శపథం చేసుకోవాలి. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం మనది. క్రమశిక్షణ, నేర్పరితనం, సృజనాత్మకత దండిగా ఉన్న మనవాళ్లకి శిక్షణ ఇస్తే, అద్భుతాలను చేయగలరు. ఏమ్మా వైష్ణవీ, బాబూ సతీష్ …నేను చెప్పింది నిజం కాదా?” అడిగారు క్రిష్ణయ్యగారు.

ఇయర్ ఫోన్లని తీసి సాలోచనగా తల ఊపాడు సతీష్. ఉద్వేగంగా చెయ్యి ఎత్తి ‘ఎస్’ అంది వైష్ణవి.

“యుద్ధం అంటే తేలికయిన పని కాదు. మనుషుల్ని పోగొట్టుకుంటాం, ఆర్ధిక, సామాజిక సమస్యలనూ, ఇబ్బందుల్నిఎదుర్కుంటాం. కోట్ల రూపాయల ఖర్చవుతుంది. మనకే కాదు యుద్ధం ఎవరికయినా నష్టమే! ఏ దేశ పౌరుడూ యుద్ధాన్ని కోరడు. ఏ సైనికుడూ యుద్ధాన్ని స్వాగతించడు. కానీ మాతృభూమి కోసం ప్రాణాలు తీయడానికీ, పోగొట్టుకోవడానికీ వెనుకాడడు. బోర్డర్ సెక్యూరిటీ డ్యూటీలో కాలు పోగొట్టుకున్న నా మాదిరే, శత్రువు గుండెల్లో తూటాలను దింపుతాడు.” ఆవేశంగా అన్న క్రిష్ణయ్యగారు ఇక నిల్చోలేక కూర్చుండిపోయారు. వేసుకున్న ప్యాంటుని పైకి జరిపి ఆయన చెక్క కాలును సవరించుకోసాగారు.

అందరిలో ఆశ్చర్యం.

‘క్రిష్ణయ్యగారు మాజీ సైనికులా…మాకు తెలియదే…పిల్లలంటే ఇష్టం కాబట్టి కాలక్షేపం కోసం శిక్షణ ఇచ్చే పెద్దాయన లే అనుకున్నాం’ ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. చిన్న పిల్లలతో సహా అందరూ దగ్గరగా వచ్చారు.

“నాన్నా..కాస్త ఆగండి. ప్రోస్తెటిక్ కాలిని సర్దుతాను.” తండ్రి కాలిని సర్దుతున్నాడు తిలక్. చుట్టూ మూగి ఆరాధనతో చూస్తున్నారు యువకులు, పిల్లలు.

“తాతా…ఎలా జరిగిందిది?” కన్నీరు దొర్లుతూంటే అడిగింది ఓ చిన్నారి.

“ ఎప్పుడో మీ అమ్మా నాన్నలయినా పుట్టారో లేదో చిట్టితల్లీ….. 1971 లో జరిగిన సంఘటన అది. పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినా, బంగ్లాదేశ్ కోసం మనం పాకిస్తాన్ తో చేసిన పోరాటం బెంగాలి మేధావుల నరమేధం ఆపడం కోసం. తూర్పు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమంలో లక్షలాది జనం మాన ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. పోయిన వాళ్ళు పోగా, బ్రతుకు జీవుడా అని పారిపోతున్న వాళ్ళని కూడా ఊచకోత కోసింది పాక్ సైన్యం. ఒక ప్రక్క పాక్ తో యుద్ధం, మరో ప్రక్క శరణార్థుల సంరక్షణ. భారతీయ మిలిటరీలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు లతో కలిసి చేసిన బంగ్లా విముక్తి పోరాటం సామాన్యమైనది కాదు.. మంచు గడ్డకట్టే డిసెంబర్ చలికి కాళ్ళు వెళ్ళు కొంకర్లు పోయేవి. గంటల తరబడి మంచులో నిల్చున్నానేమో, పై నుంచీ బాంబుల వాన కురుస్తున్నా, కాళ్ళు కదలలేనంతగా తిమ్మిర్లెక్కిపోయాయి. భీకర యుద్ధం. పదమూడు రోజులు దాడి. తోక ముడిచింది పాకిస్తాన్. బహిరంగంగా పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది. మనం విజయం సాధించాం. పాక్ వైమానికదాడిలో పోగొట్టుకున్న ఈ కాలి కన్నా ఎందరో మిత్రుల్ని పోగొట్టుకున్నానన్న బాధే నాకెక్కువ.” క్రిష్ణయ్యగారికి గతం కళ్ళముందు మెదిలింది.

కన్నీళ్లు చిప్పిల్లాయి అందరికీ.

“అందుకే చెప్తున్నా….స్వాభిమానం తో బ్రతకండి, దేశం కోసం బ్రతకండి.. సినిమాల్లో ఉత్తుత్తి ఫైటింగ్స్ చేసే పెయిడ్ ఆర్టిస్టులు కాదు హీరోలు, మీ కోసం ప్రాణాల్ని పెడుతున్న వీర జవాన్లు హీరోలు. ఆలోచించండి. మన డబ్బులతో తమ సైన్యాన్ని పోషించి, మనమీదకే ఉసిగొల్పుతున్న దేశానికి మనం సాయం చేద్దామా? నిన్నల్లో కలిసిపోయే మాకు, మీరే కదా ‘రేపు’ అనే అశాదీపాలు.” కృష్ణయ్యగారు పలికిన మేల్కొలుపు తప్ప మరేదీ వినిపించనంత నిశ్శబ్దం.

“శత్రుదేశపు వస్తువులు ఇక పైన కొనం. కొననివ్వం. వందే మాతరం. జై జవాన్. జై కిసాన్. కల్నల్ కిశోర్ కుమార్ అమర్ రహే…మేరా భారత్ మహాన్.” వైష్ణవి ముందుండగా, కుడి చేతులు ముందుకు చాచి శపథం చేస్తూ , అంతా ఒక్కటై, ఒక్కటే గొంతుకతో చెప్పారు.

“ ఈ సైనికుడికి ఇది చాలు. మీ చేతుల్లో నా దేశం భద్రంగా ఉంటుంది.

వందేమాతరం.” కొడుకు తిలక్ చేతి ఆసరాతో నిలబడ్డ క్రిష్ణయ్యగారు సెల్యూట్ చేశారు..

-పద్మాలతా జయరాం

First Published:  25 March 2023 1:55 PM GMT
Next Story