Telugu Global
Arts & Literature

ఉగాది వినోది

ఉగాది వినోది
X

ఇదిగో! ఇదిగో! ఉగాది!

మధురాశల తొలి పునాది!

ఇదిగో! ఇదిగో! ఉగాది!

హృదయ నటీ నాట్యవేది!

తెనుగు వాని బీరము వలె

తేజరిల్లె చురుకుటెండ!

తెలుగు కవుల భావన వలె

అలరించెను మల్లె దండ!

చైత్ర శుక్ల ప్రతిపత్ తిథి

శ్రీ వసంత ప్రణయాకృతి!

ఎక్కడ కనరాదు వికృతి

సృష్టి యెల్ల నవ దీధితి!

క్రొంజివురులు, క్రొమ్మెరుగులు,

కొన కొమ్మల

భాసించెను!

పంచమస్వరమ్ము లోన

వనప్రియము భాషించెను!

తెలుగు సిడము నింగి క్రాల

తెలుగు జిలుగు నేల నేల

తెలుగు పలుకు పూల మాల

తెలుగు పాట నరుల జోల!

'తెలుగు వాడ నేనే!' అని

నలు దిక్కుల చాటించుము!

తెలుగు పారిజాతము దశ

దిశల లోన నాటించుము!!

- ఎన్.ఆర్ తపస్వి

(గోవాడ దివ్యగ్రామం తెనాలి)

First Published:  22 March 2023 2:48 AM GMT
Next Story