Telugu Global
Arts & Literature

ఏరిన ముత్యాలు: పేరడీ సూరీడే కాదు అసాధారణ పాండిత్య ప్రతిభామూర్తి - జరుక్ శాస్త్రి

ఏరిన ముత్యాలు: పేరడీ సూరీడే కాదు అసాధారణ పాండిత్య ప్రతిభామూర్తి - జరుక్ శాస్త్రి
X

పేరడీ సూరీడు - జలసూత్రం గురించి ఆ తరం రచయితలకూ, సాహితీవేత్తలకూ బాగానే తెలుసు. సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో చక్కని పాండిత్యం ఉంది. చదవని గ్రంథం లేదు. తెలియని లోకజ్ఞత లేదు. రణపెంకిగా అనిపించినా కట్టె విరిచినట్లు మాట్లాడినా, ఎరాటిక్ గా కనిపించినా - ఈ బోళాతనం , ఆత్మీయతా - ఆ తరహాయే వేరుగా ఉండేది. దిగ్ధంతులతో కుస్తీ పట్టినా ఎప్పుడూ ‘‘ఫౌల్ గేమ్స్’’ ఆడలేదు. తనకు తెలియనిది తెలియదు అనేవాడు. తెలిసిన దాన్ని చెప్పడం కుండబద్దలుకొట్టడమే! అయినా సహచరుల్ని నవ్వించటం, తాను నవ్వడం అనే కళ తెలిసిన సాహితీ వైద్యుడు. ఆయనదొక ప్రత్యేక జీవనశైలి.

బారలు మూరలుగా ఏమీ రచనలు చేయలేదు రుక్మిణీనాథ శాస్త్రి. ఆయన మేధాశక్తిలో ఒక సన్నని వెలుగువాక మాత్రమే అక్షరబద్ధమైంది. కవితలూ, కథలూ విశ్లేషించి పేరడీలు వ్రాశారు.

రుక్మిణీనాథ శాస్త్రిగారు రాసిన 20 కథల్ని కె.వి.రమణారెడ్డిగారి ద్వారా సేకరించుకొని ‘శరత్ పూర్ణిమ’ పేరిట సంపుటంగా తెచ్చారు నవోదయవారు. తెలుగు సాహితీ ప్రియులు వారికి నిజంగా రుణపడి ఉండాలి.

కథకుడుగా జలసూత్రం - చతుర్ముఖ బ్రహ్మ. ఇతివృత్త సృష్టి. శిల్పసృష్టి, శైలి సృష్టికాక తన కథల్లో నేటివిటీని సృష్టించిన ప్రయోశీలి ఆయన.

ఈ నాల్గవ అంశమే నిజానికి జలసూత్రం కథల్లోని అంతస్సూత్రం.

సూర్యనారాయణుని ‘సూర్నాణ’ అనగలడు ఆయన. కోస్తావారు ఆ పేరుతో ఉన్న తమ మిత్రుల్ని అలాగే పిలుస్తారు. ప్రతిదీ అని విడమర్చి పలకరు. ‘ప్రద్దీ’ అనే అంటారు. జలసూత్రమూ అందుకనే అలాగే రాస్తారు. బళ్లదారి ఎండి, గాడిపడి , నల్లరేగడి మట్టిపెళ్ళలు పెళ్లలుగా, గడ్డలు గడ్డలుగా అవుతుంది - వేసవిలో. గతుకులు గతుకులుగా ఉంటుంది. వాటిని కత్తిర గడ్డలు అంటారు. ఆ పదాన్ని అలాగే రాస్తాడు. తాషామరఫా , రాంఢోళ్లు - పెళ్లి హడావిడిలో కాళ్లు విరగతొక్కుకోవడం - ఇవన్నీ ఆయన కథల్లో సజావుగా ఒదిగిపోతాయి. వాటిలో జనసమ్మర్థం ఉంటుంది.

శాస్త్రిగారి కథలన్నీ దేనికదే ఒక ప్రత్యేకత కలిగింది. ‘వివాహ మంగళం’ - శరత్ పూర్ణిమ వంటి అద్భుతమైన కథలు ఉన్నాయి. అయితే ‘హోమగుండం’ కథ ఒక్కటీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ కథకి శీర్షిక కిందనే వరాహమహిరుడి సూక్తి ఉంది.

స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా ఉందా? నిజం చెప్పండి. ‘భార్య చితాగ్ని నుంచే వీడు రెండో పెళ్ళి హోమానికి నిప్పు తీసుకొచ్చాడన్న నిందను హనుమంతరావు నిబ్బరంగా భరించాడు’ అని మొదలవుతుంది కథ. రెండో భార్య నరసమ్మ కథ.

నరసమ్మకి భర్తపోయాడు. మరిది లాలించి దగ్గరికి తీశాడు. గర్భవతి అయింది. అత్తా ఆడబిడ్డా, ఆ మరిదీ కలసి, ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. శరణాలయం చేరింది. అష్టకష్టాలు పడింది. ఇవన్నీ తెలిసి తెలిసి, విని, కావాలని చేసుకున్నాడు హనుమంతరావు. అతనికో కొడకు, ఆ తర్వాత అతని మనసుకు తెగులు పుట్టింది. ‘‘నీవు అన్నిందాలా చెడిన ముండవు. వాళ్ళెవరో అన్నట్లు ఏదో ఇంత గూట దీపం పెడతావని చేసుకున్నాను గానీ, నాకు పెళ్లేమిటి? నీకు పెళ్లేమిటి’ అంటాడు. ఏడుపు నవ్వు నవ్వింది నరసమ్మ. ‘సరేలెండి’ అంది. గుండెల్లో పలుగు పెట్టి పొడిచినట్లయింది. బందిలి దొడ్లో పడ్డ ఆవులా అయింది.

‘దేవుడి పటాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చనిపోయిందిట- అనుకున్నారు!’ అంటూ హోమగుండం కథ ముగుస్తుంది!

ఈ కథ మార్చి 1945 రూపవాణిలో వచ్చింది. ఆనాటి సామాజిక వాస్తవికతని కళాత్మకంగా, సరళగంభీర శైలిలో గ్రంథస్థం కావించిన కథకుని ప్రతిభా వ్యుత్పత్తులకి తప్పకుండా ‘జయహో’ అంటాము!

ఈ పేరడీ సూరీడు ప్రతిభ గురించి ఒక్క ఉదాహరణగా చెప్పాలంటే - కొ.కు. ఈయన్ని విశ్వనాథ ధోరణి ఏమిటని అడిగితే, మొహం గంభీరంగా పెట్టి ‘ధర్మారావు వచ్చెను’ అన్నాట్ట! అలాగే, ‘ఒకసారి అతను రైల్లో మద్రాసు వస్తూ

పై బెంచీమీద పడుకున్నార్ట. కింది బెంచీమీద కూర్చున్న వాళ్ళెవరో ఏదో పత్రిక చదువుతున్నారుట. రెండు మూడు వాక్యాలు చెవినపడగానే అతను కిందికి తొంగి చూసి ‘‘అది రాసింది కుటుంబరావు’’ అన్నాట్ట! నిజమేట్ట’!! అదీ జరుక్ శాస్త్రి సారస్వతజ్ఞానంలోని నిగ్గు!!

వ్యక్తిగానే కాదు, రచయితగా కూడా తనకు ఎలాంటి మనస్సంకోచాలు (inhibitions) వున్నట్టనిపించదు. ఆరుద్ర ప్రయోగం ‘సిజరెట్’ పొగనే ధూపంచేసి స్త్రీ విద్యోపాసన చెయ్యగల యీ ఆహితాగ్నికి ఆంక్షలూ ఆజ్ఞలూ వర్తిస్తాయా అని అనుమానం. తాను సాంప్రదాయికులలో నవ్వుతూ నవ్వులతో చివరనైనా సాంప్రదాయికుడు, రుక్కులు రాయించుకున్నాడు. రుక్కాయి అనిపించుకున్నాడు, జలాలుద్దీన్ రూమీ అనిపించుకున్నాడు. కాని తాను తానుగా లోపల్లోపల అంటీ అంటనంత ‘తనీ’గా వుండిపోయాడు.’ అన్నారు కె.వి.రమణారెడ్డి.

జరుక్ శాస్త్రి గారిని వారి వార్థక్యంలో- బందర్లో చూశాను నేను. రేడియో ఆర్టిస్టుగా కూడా రచనలు చేయటం లేదు అప్పుడు. వారి కొడుకు శివప్రసాద్ ఆకాశవాణి కడప ఉద్యోగి. మా కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగినవాడు. జనవరి ఒకటివస్తే చాలినన్ని డైరీలు తీసుకువెళ్లేవాడు. తండ్రి లాగానే భోళామనిషి. ‘విదూషకుడి ప్రవర్తనా?’ అనేట్టు ఉండేవాడు. అదేంకాదు నిష్కల్మషమైన మనస్సు.

జరుక్ శాస్త్రి గారి ‘తనలో తాను’ చదివిన ఏ సాహితీపరుడైనా వారి పాండిత్య గరిమకూ, ఉపజ్ఞకూ ‘దాసోహం’ అనకమానడు. ఆ వ్యాసాల్లోని

పాఠ్యఫణితి, శైలిలో ఉన్నది ఆ శక్తి.

నిజానికి ఈనాటి సాహిత్య విద్యార్థులు ఆ వ్యాస భాగాల్ని నిశితంగా విశ్లేషించుకొని కంఠస్థం చేసుకొంటే సంస్కారవంతమైన భాషపై తిరుగులేని పట్టుని సాధించవచ్చు! నేను అలా దాన్ని ఏ వందసార్లో చదివి ఆనందించిన వాడిని. ఇప్పటికీ అది నా రాతబల్లపై ఎడమవైపు అంచునే వుంటుంది! చదివిచూడండి.అది కొత్త సాహిత్య గవాక్షాల్ని తెరచి మరో ప్రపంచంలో సంచరింపజేస్తుంది!

- విహారి

First Published:  10 Sep 2023 1:16 PM GMT
Next Story