Telugu Global
Arts & Literature

బహుముఖీన ప్రతిభామూర్తి అవిస్మరణీయ కథకుడు కీ.శే.పిశుపాటి ఉమామహేశ్వరమ్

బహుముఖీన ప్రతిభామూర్తి అవిస్మరణీయ కథకుడు కీ.శే.పిశుపాటి ఉమామహేశ్వరమ్
X

దాదాపు ముప్ఫయి ఏళ్ళు రేడియో , రంగస్థల, నాటక రచయితగా బాగా సుప్రసిద్ధులు. ఎంతోమంది సాహితీవేత్తలకు సన్నిహితులు. ఎంత పెద్ద కథనైనా లేదా ఒక గంట రేడియో నాటకం అయినా మూడు నాలుగు గంటల్లో అలవోకగా రాసిచ్చేసేవారు. మేధలో ఆలోచన ఎప్పుడు తట్టిందో, అది ఎప్పుడు రూపు దిద్దుకుందో, చేయి అన్ని పేజీలు ఎలా రాసిందో అని అందరూ ముక్కున వేలు వేసుకునేవారు. ఆ త్వర చూసి విజయవాడలో అయనను “ఎమర్జెన్సీ స్క్రిప్ట్ రైటర్” గా పిలిచేవారు. సాహితీ రంగంలో వున్న అన్ని ప్రక్రియలలోను సాహిత్యాన్ని అందించిన ఘనులు. బహుముఖ ప్రజ్ఞాశాలి ,జ్ఞానాన్వేషి . చదవని పుస్తకమూ, గ్రంథమూ లేదు, తెలుసుకోని విషయమూ లేదు.

రంగస్థల, రేడియో నాటికలతో పాటుగా దూరదర్శన్ లో కూడా నాటికలు, సీరియల్స్, ఫీచర్స్ వ్రాశారు. జీవితానికి దర్పణం పట్టే ఎన్నో కథలూ, కథానికలూ, పాటలూ, కవితలూ, పేరడీలూ, వ్రాశారు. బహుభాషా కోవిదులు సంస్కృతాంధ్రాలతోపాటు, హిందీ, తమిళ, ఇంగ్లీషు భాషలలో కూడా వ్యాసాంగం నడిపారు. సంగీత జ్ఞానం మెండు. వివిధ భాషలలో అయన వ్రాసిన పాటలు ఆయనే స్వరపరుచుకున్నారు. ఈలపాటలు పాడడంలో దిట్ట. స్టేజీల పైన వందలకొద్దీ ప్రసంగాలూ, ఈలపాటల, పేరడీ పాటల ప్రదర్శనలూ చేశారు. హార్మోనియం, తబలా, మౌతార్గన్, కీబోర్డ్ వాయించడంలో దిట్ట. 1940 ల నుండీ 80 ల వరకూ వచ్చిన తెలుగు, తమిళ, హిందీ చిత్రాల గురించి అన్ని వివరాలు చెప్పే ఎన్సైక్లోపిడియా.

జీవిత విశేషాలు:

శ్రీ పిశుపాటి ఉమామహేశ్వరమ్ గారు దిగువ మధ్యతరగతి కుటుంబంలో అక్టోబర్ 23, 1946 న మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుండీ వీధి నాటకాలు, పౌరాణిక నాటకాల మీద ఆసక్తి. అలాగే పుస్తక పఠనం మీద మక్కువ ఎక్కువ. ఎప్పుడు చూసినా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడమే ఇష్టంగా చిన్నతనమంతా గడిపారు. చదువు మీద ఆసక్తి కాస్త తక్కువే అయినా తండ్రి తరువాత తండ్రిగా భావించే పెద్దన్నగారి మాట కాదనలేక B.Sc. B.Ed చేశారు. 1969-74 వరకూ రైల్వే టీచరుగా పనిచేశారు. అటుపై 1974 నుండి 2001 దాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో పనిచేశారు. కానీ ఆయన జీవితమంతా వృత్తికన్నా సాహిత్య రంగానికే ఎక్కువగా పరిమితమయ్యారు. ఆశా, ధ్యాసా అంతా దాని మీదే !

పత్రికా ప్రపంచం:

సాహిత్య ప్రపంచంలోకి 1962 లో మినీ కథలతో అడుగుపెట్టి అటు తర్వాత కథలూ, కథానికలూ, హాస్యభరిత వ్యంగ్య పూరిత వ్యాసాలు, ఫీచర్లు, పాటలూ, కవితలూ, నాలుగు లైన్ల వ్యంగ్య మినీ కవితలూ, పీరియాడికల్ కాలమ్స్ లాంటివి ఎన్నో 1962 నుండి 1985 వరకు వ్రాసారు. అటు తరువాత మళ్ళీ 1990 నుండి 2009 వరకూ ప్రచురితమయ్యాయి. వివిధ ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు, వార్త, విశాలాంధ్ర లాంటి దినపత్రికలూ, వార్తాపత్రికలలోనూ, మాస పత్రికలయిన జ్యోతి, స్వాతి, విపుల, చతుర, జయశ్రీ, యువ అటుపై 90లలో కొన్ని ఆధ్యాత్మిక పత్రికల్లో స్వామీ సమాజానంద పేరుతోనూ ఎన్నో కథలు ప్రచురించబడ్డాయి. ఈ పత్రికలన్నీ నిర్వహించిన సాహిత్య, కథల, నవలల పోటీలలో ఎన్నో సార్లు ప్రథమ బహుమతులు పొందారు.

* 1980 లో మొదటి నవల “వెలుగు తోటలో చీకటి ముళ్ళు” అటు పై “స్వయంవరం” అని ఇంకో నవలా వెలువడ్డాయి. మొదటి నవలకు ఆ యేడు నవలా పోటీల్లో ప్రధమ బహుమతి రావడం గమనార్హం

* 1982 నుండి 84 వరకు “కబుర్ల కార్నర్” ప్రతివారం వివిధ అంశాల మీద కథనాలతో పాఠకులను

మంత్రముగ్ధులను చేసింది

* 2004 లో ఆంధ్రభూమిలో ఎన్నికల సమయంలో దాదాపు మూడు నెలలపాటు హాస్య స్ఫూరకంగా

ఎన్నో అంశాలతో ఓక “కాలమ్” నిర్వహించారు

* ఈనాడు, ఆంధ్రప్రభల్లో ఎన్నో వ్యాసాలూ, సమీక్షలూ వెలువడ్డాయి

* హిందీ వార్తా పత్రిక “వార్త” లోనూ మరియూ మాసపత్రికలు “సరిత”, “ముక్తా”, “నవనీత్” లలో కూడా

చాలా కథలు ప్రచురితమయ్యాయి

* స్టేట్ బ్యాంక్ నిర్వహించే SBI పత్రికలో కూడా హిందీ, ఇంగ్లీషులలో ఎన్నో కథలూ, కవితలూ ప్రచురితమయ్యాయి. ఎన్నింటికో బహుమతులు కూడా వచ్చాయి

రేడియో ప్రపంచం:

1975 లో మొట్టమొదటి సారిగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అడుగుపెట్టి ,పదేళ్ల తరువాత 1984 నుండీ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిరంతరంగా పాతికేళ్ళు వివిధ నాటికలూ, పాటలు, ముఖాముఖి కార్యక్రమాలూ, కవితా పఠనాలూ, డాక్యుమెంటరీలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు రచించి, రూపుదిద్ది, నిర్వహించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఘంటసాల గాత్రంలోని వైవిధ్యాన్ని, గాత్రంలోని ఎన్నో అంశాలను స్పృశిస్తూ వ్రాసి, నిర్వహించిన “ఘంటసాల గానమాధురి”, “ఘంటసాల స్వరమాధురి” అనే కార్యక్రమాలు చాలా మంచి పేరును తెచ్చిపెట్టాయి.

* ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రెండు ప్రతిష్ఠాత్మకమైన “జనరంజని”, “మనోరంజని” అనే కార్యక్రమాల రూపకల్పనలో కూడా ముఖ్య పాత్రను పోషించారు

* హాస్య నాటికలకు చిరునామాగా మారి “స్వయంవరం”, “ఇంతలేటువయసులో”, “ఇల్లొదిలిన ఈగ”, “కిరణం ఒకటి రంగులు ఏడు” వంటివి దాదాపు వందకు పైగా నాటకాలు వ్రాసి ఆకాశవాణికి అందించారు

రంగస్థల నాటక ప్రపంచం:

* 1980వ దశకం నుండి ఎంతో విరివిగా స్టేజీ నాటకాలు వ్రాయటం మొదలు పెట్టారు. 1975 నుండీ రంగస్థల నాటకాలు వ్రాస్తున్నా, నాటక రచయితగా మంచి పేరూ, గుర్తింపూ వచ్చింది 1983 లో వ్రాసిన “అనగనగా ఓ గాడిద” అనే నాటకంతో. ఇది ఆ సంవత్సరం “తెలుగు నాటక అకాడమీ అవార్డు” తెచ్చిపెట్టింది

* ఆ ప్రోత్సాహంతో స్టేజీ నాటికలపై మక్కువ పెరిగి అటుపై వ్రాసిన ఎన్నో నాటక పరిషత్తుల్లో ప్రథమ బహుమతులతో పాటు ఉత్తమ రచయితగా కూడా అవార్డులు వరించాయి

* తల్లావజ్ఝల సుందరం, తనికెళ్ళ భరణి, శ్రీ శనగల కబీర్ దాస్, శ్రీ ఎం.సి. దాస్, గుండూ హనుమంత రావు, శ్రీ రఘునాథ రెడ్డి, పిళ్ళా ప్రసాద్, ఏ.వీ.యస్, రత్నాసాగర్, విద్యాసాగర్ లాంటి ఎంతో మందితో కలసి పనిచేశారు. వీరి కలయికలో పిశుపాటి వారి రచనలకు ఉత్తమ నాటికలూ, ఉత్తమ నటీనటుల బహుమతులూ, ఉత్తమ కథారచయితగా వచ్చిన అవార్డులు ఎన్నెన్నో …

* హిందీ లో బాగా పేరు మోసిన నాటకాలు కూడా తెలుగు అభిమానుల, పత్రికల కోరిక మేరకు కొన్ని తెలుగు లోకి అనువదించి “నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా” నుంచి కూడా అభినందనలు ప్రశంసలూ అందుకున్నారు

టీవీ/సినీ ప్రపంచం:

1970 నుండీ 1990 వరకూ దూరదర్శన్ లో శ్రీ పిశుపాటి ఉమామహేశ్వరమ్ గారు వ్రాసిన ఎన్నో నాటకాలూ, డాక్యుమెంటరీలూ, వివిధ కార్యక్రమాలూ ప్రసారం చేయబడ్డాయి.

* “హిమబిందు”, “మరో వసంతం” అనే సీరియళ్లూ, హాస్య నాటికలైన “బాబోయ్ పాము”, ఏప్రియల్ ఫూల్” ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టాయి

* 1976 లో దూరదర్శన్ లో, “మన ఘంటసాల” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు

* విజయవాడలో సిటీ కేబుల్, మాస్టర్ ఛానెల్ వారికీ ఎన్నో డాక్యుమెంటరీలు చేశారు

* “కిష్కింధలో కృష్ణమూర్తి” అనే టెలీఫిలిమ్, “పద్మాలయా టెలీఫిలిమ్స్” వారికి చిన్నపిల్లల 3D యానిమేషన్ షోకి కూడా రచనా సహకారం అందించారు

* జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి “ఆవిడే మా ఆవిడ”, ఉషాకిరణ్ మూవీస్ వారి “శుభవేళ” సినిమాలకి (ghost writer) రచయితగా మాటలందించారు

* ఢిల్లీ దూరదర్శన్ కి “పీనా యా జీనా”, “బసంతీ” అనే టెలీఫిలింలకు కథా, మాటలూ అందించారు

పురస్కారాలు:

* ఆకాశవాణి విజయవాడ వారు “శత వసంత సాహితీ మంజీరాలు” అన్న పేరుతో గత వంద సంవత్సరాలలో వచ్చిన సాహిత్యకారుల్లో 75 మందిని ఉత్తమ రచయితలుగా ఎన్నుకొని సత్కరించారు. శ్రీ పిశుపాటి ఉమామహేశ్వరమ్ గారు కూడా ఆ సందర్భంలో ఉత్తమ రచయితగా సత్కరింపబడ్డారు

* 1996 లో “జై భవానీ దీక్షా పీఠం” వారు పిశుపాటి వారి ఈలపాటను మెచ్చి “వాయు గాన గంధర్వ” అనే బిరుదుతో సత్కరించారు

బహుమతులు:

* “గెటౌట్” అనే నాటకానికి ఐదు పరిషత్తులలో ఉత్తమ నాటికగా, ఉత్తమ కథా రచయితగా 1989 లో బహుమతులు అందుకొన్నారు

* “అందరూ అందరే” అనే నాటకం పాల్వంచ నాటక పరిషత్తు హాస్య నాటక పోటీలో 1992 లో ఉత్తమ నాటికగా నిలచింది

* “గుప్పెడు గాలి” “ఆల్ ఇండియా AIR డ్రామా కంపెటిషన్” లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 1996 లో బహుమతి గెలుచుకుంది

* “ముగింపులెన్నో” నాటకం జాషువా కళాపీఠం రాజమండ్రిలో 1998 లో రెండవ బహుమతి సాధించింది

* “పాత పారిజాతం” అనే కథ 2004 లో ఈ దశాబ్దపు ఉత్తమ ఐదు శృంగార మినీ కథలలో ఒకటిగా స్వాతీ వార పత్రిక చేత ఎన్నుకోబడింది

* “తెగిన పేగు” కథకు దాదాపు పదికి పైగా బహుమతులూ, అంతకు మించి ప్రశంసలు వచ్చాయి. ఇంకా వస్తూనే వున్నాయి. ఈ మధ్య వాట్సాప్ లో కూడా బాగా చక్కర్లు కొడుతోంది. ఏనాడో వ్రాసిన

కథ ఈనాటికీ అలరిస్తోంది అంటే ఆశ్చర్యం కదూ!

వీటన్నింటినీ మించి శ్రీ పిశుపాటి ఉమామహేశ్వరమ్ మంచి మనిషి, నవ్వుతూ నవ్విస్తుంటాడు అని భరాగో, బాపూ రమణలు మొదలుగొని ఆయనతో పరిచయమున్న వారు ప్రతివొక్కరూ అనుకునే మాటే. హాస్యం, వ్యంగ్యం సమపాళ్లలో మిళితం చేస్తూ, మాట్లాడే ప్రతీ మాటలోనూ మెరుపూ, విరుపూ అందంగా తొణికిసలాడించడం ఆయన ప్రత్యేకత. ఆలా మాట్లాడకపోతే అది ఉమామహేశ్వరమ్ మాటే కాదూ, అని అనిపించుకునే స్థాయికి ఎదిగారు. పుస్తకాలకన్నా జీవితాన్ని ఎక్కువగా కాచి వడబోశారు. అందుకే ఆయన వ్రాసిన పాటలూ, కవితల్లో జీవితపు లోతులు గంభీరంగా కనిపిస్తాయి. పైకి మాత్రం తేలిక భావాలతో చురుకుగా, చలాకీగా పదిమందినీ పలకరిస్తూ మాట్లాడ్డం ఆయనకే చెల్లింది. సాహితీ మిత్రులూ, నాటకరంగ ప్రముఖులూ, ఆకాశవాణి దిగ్గజాలూ, ఇలా సరదాగా తిరిగే ఉమామహేశ్వరమ్ హఠాత్తుగా గుండెపోటుతో జూలై 11, 2009 న స్వర్గస్థులైనారంటే నమ్మలేకపోయారు.

దాదాపు 150 కథలూ, 50 నాటకాలు, 126 కవితలూ, 50 కి పైగా పాటలూ, 2 నవలలూ, ఇలా ఎన్నో వ్రాసిన ఆయనకి తృప్తి ఇచ్చిన అయన రచన “ఉమఋక్కులు”. ఋషి తుల్యుడిగా జీవితంలోని గంభీరమైన, లోతైన విషయాలనూ, జీవిత సత్యాలను హాస్య స్ఫూరకంగా పద విరుపులతో 1995-96 సంవత్సరాల్లో అయన మినీ కవితా సంపుటిని అందించారు. అవి ఇంకా అచ్చు అవకపోయినా, ఎంతోమంది సాహిత్యకారులు స్వయంగా వినీ, చదివీ, అది పుస్తకంగా రావాలని ఆకాంక్షించారు. అవి ఆయన మనకి మిగిల్చిన ఆణిముత్యాలు.

శ్రీ పిశుపాటి ఉమామహేశ్వరమ్

First Published:  11 July 2023 11:30 AM GMT
Next Story