Telugu Global
Arts & Literature

అనాదిగా... (కవిత)

అనాదిగా... (కవిత)
X

అనాదిగా అక్కడంతా అంతే..

ముళ్ళపొదలు గాయాలు గేయాలు

గాయాలతో గీసుకుపోయిన నిర్వేదాలు

అప్పుడప్పుడు

ఆనందం వొలికించి వెళ్లిన

కొన్ని కన్నీళ్లు

కోసుకుపోయే మమతలు

వదలిపోయిన కాసిన్ని

అనుభూతుల నిట్టూర్పులు నిశ్శబ్దాలు

నిర్లిప్తంగా..

అదే గుండెగది

భగవంతుడు అత్యంత శ్రద్ధగా

మనకోసం నిర్మించిన

గుండె గది

నిత్యం మరుగుతూ

సెగలుగా పొగులుతూ

కానివి చేర్చుకుంటూ పేర్చుకుంటూ

నలిగిన క్షణాలను

గుండె మడతల్లో

పదిలంగా దాచుకుంటూ

నిప్పుల కుంపటిలా రగులుతూ

ఎప్పటికీ ఏమీ నేర్చుకోకుండా

నేర్చుకుంటున్నాననే

భ్రమలలో తేలుతూ

అలాంటప్పుడే

నిశ్శబ్దాన్ని వింటూ

మౌనంలో నిద్రిస్తుంటుంది

చాపల్యాల చాపపై

నియంత్రణల కతీతంగా

యాంత్రికంగా..

అనాదిగా అక్కడంతా అంతే..

- మొదలి పద్మ

Next Story