Telugu Global
Arts & Literature

కనుమరుగైన కథాభారతి బంగారు మురుగు... మిథునం శ్రీ రమణ అస్తమయం

కనుమరుగైన కథాభారతి బంగారు మురుగు... మిథునం శ్రీ రమణ అస్తమయం
X

ప్రముఖ రచయిత , సంపాదకులు , 'మిథునం' కథతో సుప్రసిద్ధులు శ్రీరమణ ( శ్రీ కామరాజు రామారావు ) ఈ ఉదయం అయిదుగంటలకుపరమపదించారు.21 సెప్టెంబర్ 1952 లో వరాహ పురం అగ్రహారంలో జన్మించారు .అసలుపేరు వంకమామిడి రాధాకృష్ణ .దత్తత కు వెళ్లారు .

శ్రీరమణ పుట్టినప్పుడు... వంకమామిడి రాధాకృష్ణ దత్తతకు వెళ్లినప్పుడు... కామరాజు రామారావు రచయితగా రూపాంతరం చెందినప్పుడు... శ్రీరమణ

శ్రీరమణ ప్రముఖ కథకులు .వ్యంగ్య వ్యాస రచయిత.పేరడీ రచనలతో ప్రసిద్ధులు .బంగారు మురుగు వంటి కథలు రాసి పాఠక హృదయాలకు చేరువయ్యారు సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయితగా సుప్రఖ్యాతులు .ఆ కథను ఆసాంతం బాపు తన చేతి వ్రాతతో రాసి బొమ్మలు వేసి ఆనందపడ్డారు .శ్రీ తనికెళ్ళ భరణి దర్శకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ,లక్ష్మి పాత్రధారులుగా చలనచిత్రం గా రూపొందించారు ,మిథునం కథను పుస్తకరూపంలో వాహిని ప్రచురణల రచన శాయి వెలువరించగా ఎందరో తమ షష్టిపూర్తి వేడుకలలో బంధుమిత్రులకు పంచుకున్నవారున్నారు .ఆ ఒక్క కథే శ్రీరమణ కు అంత ఖ్యాతి తెచ్చింది.

వారు గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం గ్రామానికి చెందినవారు. ఇది వేమూరు మండలం తెనాలికి చాలా సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు అనసూయ, సుబ్బారావులు. వారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ప్రాథమిక విద్యను స్థానికంగా ఉన్న శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసారు. ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే జరిగే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్, వేమూరులో ఫస్ట్‌ఫారమ్‌లో చేరారు. ఆ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. స్కూలు రోజుల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్ళు ప్రథముడిగా నిలిచారు. పన్నెండేళ్ళ వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది. బాపట్ల వారి మాతామహుల ఊరు. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సిలో చేరారు. వారి తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సిలో వుండగా ఆయనను దత్తత చేసుకున్నారు. వారి జన్మనామం "వంకమామిడి రాథాకృష్ణ". దత్తతకు వెళ్ళిన తరువాత నామం "కామరాజు రామారావు"గా మారినది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు — ఈ తికమక నుంచి బయటపడాలని ఆయన తన పేరును "శ్రీరమణ"గా మార్చుకున్నారు.

తెలుగులో పేరడీ రచయితగా శ్రీరమణ సుప్రసిద్ధులు. అనేకమంది ప్రసిద్ధ రచయితల శైలిని అనుకరిస్తూ పేరడీలు రాసి స్వయంగా ఆయా రచయితల అభినందనలనూ పొందారు. వీరి పుస్తకాలను వసుధేంద్ర, అజయ్ వర్మ అల్లూరి గార్లు కన్నడలోకి,గౌరి కృపానందన్ గారు తమిళంలోకి అనువదించారు.



శ్రీ రమణ గారి ముద్రిత పుస్తకాలు

శ్రీరమణ పేరడీలు

ప్రేమ పల్లకి (నవల)

రంగుల రాట్నం (కాలమ్)

శ్రీఛానెల్

హాస్య జ్యోతి

నవ్య మొదటి పేజి

గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు

శ్రీకాలమ్

మిథునం (కథా సంపుటి)

శ్రీరామాయణం

మహాభారతం (విరాట వుద్యోగ పర్వాలు)

మొదటి పేజి (II)

మానవ సంబంధాలు

సరసమ్.కామ్ (5 సంపుటాలు)

శ్రీరమణీయం

సింహాచలం సంపెంగ (కథా సంపుటి)

బొమ్మ – బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామిషు)

నడిపిన శీర్షికలు (కాలమ్స్):

-----------------------

రంగుల రాట్నం

జేబులో బొమ్మ

టీ కప్పులో సూర్యుడు

శ్రీఛానెల్

శ్రీకాలమ్

పూలు – పడగలు

వెంకట సత్య స్టాలిన్


పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన "పత్రిక" అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆంధ్రప్రభ, నవ్య వారపత్రికలలో పనిచేసారు .బాపు రమణ లకు అత్యంత సన్నిహితులు .చాలామంది ముళ్ళపూడి వెంకటరమణ ,శ్రీ రమణ ఒకటే అనుకునేవారు .ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.



రచన రజతోత్సవ విహంగ వీక్షణ సంపుటి" కోసం ప్రత్యేకంగా శ్రీరమణ వ్రాసిన కథ"నాలుగో ఎకరం " బహుశా వారి చివరి కథ అదే కావచ్చు.

కొంతకాలంగా అస్వస్థులుగా వున్న శ్రీ రమణ ఇవాళ 2023 జూలై 19 బుధవారం ఉదయం 5 గంటలకు శాశ్వతంగా 'పెన్ను' మూసారు .

వారికి అశ్రు నివాళులు

First Published:  19 July 2023 3:46 AM GMT
Next Story