Telugu Global
Arts & Literature

మరోకోణం

మరోకోణం
X

"హాయ్! అత్తా! ఎప్పుడొచ్చావు? అంతా కులాసాయే కదా?" అంటూ వచ్చిన మేనకోడలు ప్రతిమ వైపు చూసింది సుధ. అధునాతనం అనే ముసుగులో పూర్తిగా మునిగినట్లు అడ్డదిడ్డంగా ఉన్న ఒక డ్రెస్లో, అరంగుళందాకా మేకప్ తో, లిప్ స్టిక్ తో, షేప్ చేసిన కనుమబొమలతో, చక్కటి పెద్ద తలకట్టుని సగందాకా కత్తిరించుకుని, మిగిలినదానిని గాలికి అప్పజెప్పి, శాంపూ, కండిషనర్, ఇతర సెంట్ల పరిమళాలతో వచ్చిన ప్రతిమ తన చేతిలో పెరిగిన పదహారణాల ఆడపిల్లేనా అని ఆశ్చర్యపడింది సుధ. సహజ సౌందర్యంతో అమెరికాకి వెళ్ళి, ఇలా కృత్రిమంగా తిరిగి వచ్చిన ప్రతిమ తన చేతికిచ్చిన కాగితాన్ని చూసి ఏంటి అన్నట్లు చూసిన సుధతో, " ఇది నా జీవన సహచరుడికి ఉండవలసిన అర్హతల చెక్ లిస్ట్ అత్తా!" అంటూ నవ్వింది. ఆ లిస్ట్ ని చూసిన సుధ "మరి ఆ అబ్బాయికి నీవు నచ్చాలిగా?" అనడిగింది. " అసలు అమ్మాయిల చూపు తమవైపు యెప్పుడు పడుతుందా అని అల్లాడిపోతున్న అబ్బాయిలకి ఇన్ని అర్హతలున్న నేను ఓకే చేస్తే అంతకన్నా అతగాడికి కావాలిసిందేముందత్తా. నేను కాస్త షాపింగ్ కి వెళ్ళె పనుంది. తర్వాత వచ్చి మాట్లాడతాను "నిర్లక్ష్యంగా అన్న ప్రతిమ మాటలకి నోటమాటరాక మౌనంగా ఉండిపోయింది సుధ.

ప్రతిమ బి.టెక్. చేశాక, ఎమ్.ఎస్. అమెరికాలో చేసింది. అక్కడే ఉద్యోగం చేస్తూ, బాగానే గడిస్తోంది. ప్రస్తుతం ప్రతిమ నెలరోజుల శెలవుపెట్టి, పెళ్ళితంతు ముగించుకుని వెళదామని చెన్నైకి వచ్చింది.

· కనీసం ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్

· అమెరికా/ కెనడా/ ఆస్ట్రేలియా సిటిజెన్, ఆడంబరమైన జీవితాన్ని గడిపేవిధంగా సంవత్సర ఆదాయం కనీసం 15 లక్షలు

· 2 – 3 యేళ్ళ వ్యత్యాసంతో, మేనిరంగు తెలుపు, ఎత్తు 5.7 దాటని, అందమైన, చురుకైన వాడు

· చెడు అలవాట్లు, దుష్ట సహవాసాలుండరాదు

· బట్టతల ఉండరాదు. కళ్ళజోడు అసలే ఉండకూడదు.

· అబ్బాయి పూర్తిగా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడన్న డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి.

· అబ్బాయి ఇంటివారి చరిత్రలో యెవరికైనా బీ.పీ, మధుమేహం, ఫిట్స్, హార్ట్ అటాక్, పిచ్చి లాంటివి ఉన్నాయేమో ముందుగానే తెలపాలి.

· కూడా పుట్టినవారుండాలి కానీ వీరితో కలిసి ఉండకూడదు

· అతని పేరిట సొంత ఇల్లు, కారు ఉండాలి, కానీ అప్పులు అతనే కట్టుకోవాలి.

· తలిదండ్రులుండాలి కానీ వారి బాధ్యత ఉండరాదు. వాళ్ళు తమ ఇంటికి దగ్గరలోనే వేరే ఇంట్లో ఉండాలి. తమ అవసరాలకి వారి సహాయ, సహకారాలుండాలి. తమ వైవాహిక జీవితంలో ఇతరుల ముఖ్యంగా అబ్బాయి ఇంటివారి జోక్యం ఉండరాదు.

· భార్య జీతంపై ఆధారపడకూడదు. అది పూర్తిగా ఆమె ఇష్టం. అతని జీతంతోనే ఇల్లు గడవాలి. సెలవులలో భార్యకి మందుపార్టీలలో పాల్గొనడానికి పూర్తి స్వేచ్ఛ నివ్వాలి.

· కట్నాలు, కానుకలు, లాంఛనాలు వగైరాలు అడగరాదు. పెళ్ళి నిరాడంబరంగానే జరపబడుతుంది. ఆడంబరంగా చేయాలంటే, పెళ్ళిఖర్చును ఇరువైపులవాళ్ళు సమానంగా పంచుకోవాలి.

· పెళ్ళి చూపులప్పుడు వరుడు, వధువు విడిగా, స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. కొన్ని రోజులు తమ అభిరుచులు, భవిష్యత్తు గురించి సంభాషించుకున్నాక, ఇద్దరి అంగీకారంతోనే పెళ్ళి జరుగుతుంది.

ఇలా సాగిన జాబితాను చూస్తూ, సాలోచనగా కాస్సేపు ఉండిపోయింది సుధ. సాయంత్రం ముఖం కడుక్కుని, అల్పాహారం తీసుకుంటున్న సమయంలో షాపింగ్ కి వెళ్ళిన ప్రతిమ తిరిగి వచ్చింది. అత్త పక్కనే కూర్చుని, ఆమె ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుంటూ, "అత్తా! నీవు, మామయ్య వచ్చి, నాతో కొన్నాళ్ళు ఉండరాదూ అమెరికాలో? అక్కడ ఉన్న వసతులు, శుచి, శుభ్రతలు, వెడల్పాటి రహదారులు, ప్రశాంతమైన, అందమైన పరిసరాలు నీకు చాలా నచ్చుతాయి. అసలు ఒకసారి అక్కడి సుఖాలని అనుభవిస్తే, మళ్ళీ తిరిగి రాబుద్ధి కాదు. తెలుసా?" అంటూ నవ్వింది. "మరి నీకు ఇక్కడ పనిచేసే అబ్బాయే భర్త ఐతే, నీవిక్కడే ఉండాలికదా?" అన్న సుధతో ప్రతిమ "అత్తా!అందుకేగా నా చెక్లిస్ట్ లో అన్ని నిబంధనలని పెట్టాను… అతడు నేనున్న ఊర్లోనే ఉండేట్లయితే, పెళ్ళి అక్కడే సింపుల్ గా చేసుకుంటాం. అక్కడే ఉండేటట్లయితే మిగిలిన నిబంధనలన్నీ హుష్ కాకి ఐపోతాయి.. ఐనా నేనొకరిని యెంపిక చేసుకున్నాను. ఇదుగో అతడి వివరాలు " అంటూ గలగలమని హాయిగా నవ్వుతూ తన మొబైల్ లోని వివరాలను చూపించి, అందులో ఉన్న మొబైల్ సంఖ్యకి ఫోన్ చేసి, అత్తని మాట్లాడమంటూ "నేను రావడానికి ఆలస్యమవుతుంది. నా స్నేహితురాలికి వచ్చేవారం పెళ్ళి కనుక మాకందరికీ మందు పార్టీ ..అంటే బాచిలర్స్ పార్టీలాంటిదనమాట ఇస్తోంది. కనుక రాత్రి నీవు డిన్నర్ తినేసెయ్ అత్తా! మనం రాత్రో, రేప్రొద్దునో తీరికగా మాట్లాడుదాం. బై, అమ్మా! బై" అంటూ స్టైల్ గా ముఖం పై పడుతున్న జుట్టుని వెనక్కి సుతారంగా తోసుకుంటూ , హైహీల్స్ ని టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయిన ప్రతిమ వంకే చూడసాగింది సుధ.

సుధ అలాగే అతనితో మాట్లాడటం చేసింది. గబ గబా పక్కనే ఉన్న కాగితంపై యేదో రాసుకుంది. పదినిమిషాల తరువాత ఫోన్ ఆపుచేసి, ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాక మౌనంగా ఆ కాగితాన్ని ప్రతిమకి అందించింది సుధ. అందులోని విషయాన్ని చదివిన ప్రతిమ అవాక్కైంది. విషయం అర్థంకాని రమ కూతురి చేతిలోంచి జారిపడిన కాగితాన్ని చదివి 'ఇప్పుడేమంటావ్? 'అన్నట్లు ప్రతిమవైపు చూసింది. ఇంతకీ అందులోఉన్నదేమిటంటే అమెరికాలో ఆరేళ్ళు బాగా సంపాదించిన ఆ అబ్బాయి ఆర్జించింది చాలనుకుని, ఇక్కడికి వచ్చేసి స్వగ్రామంలో కొత్తగా ఒక కంపెనీ పెట్టి, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధినీయాలనుకుంటున్నాడు. కలిసి ఉంటే కలదు సుఖమనే భావనతో ఉమ్మడికుటుంబంలో సర్దుకుపోయే, ఆరోగ్యమైన, తనకు అన్నివిధాల సహాయసహకారాలందించే, డిగ్రీ చదువుకున్న, కాస్మెటిక్ వాడని, చెడు అలవాట్లు లేని, చిరునవ్వు, ఓపిక, సర్దుకుపోయే గుణాలున్న, మన సంప్రదాయాలపై అవగాహన, మనదేశంపై భక్తి, పెద్దలయందు గౌరవం ఉన్న అమ్మాయిని నిరాడంబరంగా వివాహం చేసుకుంటాడట."

అంతదాకా నిబంధనలని తను మాత్రమే వేయవచ్చు అనుకున్న ప్రతిమకి ఎదుటివారు కూడా నిబంధనలు వేస్తారని అర్థమై, యేమి చేయాలా అన్న ఆలోచనలో పడింది, ఆ అబ్బాయి చెక్ లిస్ట్ పెట్టిన 'చెక్' తో.

డా. తిరుమల ఆముక్తమాల్యద, (చెన్నై)

First Published:  9 Dec 2022 7:01 AM GMT
Next Story