Telugu Global
Arts & Literature

దివ్యదర్శనం (కథ)

దివ్యదర్శనం (కథ)
X

“ఏమైనా చెప్పు వదినా ! మనవైపు చేసినట్టు,వాళ్ళు ముక్కోటి చెయ్యరు.అదే ఇక్కడ చూడు ఉత్తరద్వార దర్శనం ఆ కోలాహలం అదీను” .

“అవును నేను చూసానుగా నిజమే వాళ్ళకు తెలియదు,అయితే వాళ్ళు గోకులాష్టమి చేసినట్లు మనవాళ్ళు ఇక్కడ చెయ్యరు."

“అదే మరి,రాముడు,కృష్ణుడు తేడామనకేగానీ,ఆ దేవుళ్ళకి ఉంటుందా ఏమిటి”అంటూ గబగబా గోదావరి లో నాలుగు మునకలేసారు ఆ వదినామరదళ్ళు .

“అంతేలే,నేను అదే అనుకున్నాను.”

ఉత్తరద్వార దర్శనం కోసం జనం తెల్లవారుఝాము నుంచి క్యూ లో నిలబడ్డారు. “అయ్యబాబోయ్ !ఈ జనమేమిటి ఇంత పోటెత్తారు” అని క్యూ లైన్ లోంచి ఓ భక్తుడు అశ్ర్చర్యం ప్రకటించాడు .

అలా గోదారి లోంచి ములకలేసి ఆ తడి బట్టలతోనే లైన్ లో కొచ్చి నిలబడుతున్నారు. మార్గశిరపు చలి వణికిస్తోంది. పైగా నదీ స్నానలు చేసి రావటం తో వాళ్ళ చలికి వణకడమే కాదు వాళ్ళ వంటి మీద తడి వల్ల పక్కనున్న వాళ్ళకి కూడా చలి వేస్తోంది.

”ఉత్తరద్వార దర్శనం మాట అటుంచి కైలాసానికి పోతానేమో,పొద్దున్న నుంచి ఒక్క చుక్క కాఫీ ఇవ్వలేదంటూ భార్యమీద చిరాకు పడ్డారు ఓ భర్త గారు.

“ఇదిగో చూడండి జన్మానికో శివరాత్రి ఏంతో ఈ ముక్కోటి కూడా అంతే అంచేత రాముల వారి దర్శనం అయి వచ్చేవరకు తిండి ఆలోచనలు మానేసి శుభ్రంగా ఆ రాముడి మీద మనసు లగ్నం చేయండి,అయిన చిన్న పిల్లాడిలా చేస్తారేమిటి మీరు” అంటూ సన్నగా చీవాట్లు వేసింది ఆ ఇల్లాలు .

“పదండి పదండి”

“అబ్బ మీరెవరండి ,అలా తోసేయకండి”

“అది కాదండీ,ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం” ..అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న దానికి జవాబుగా “మేము అందుకోసమే నండి.”అంటూ ఘాటుగా చెప్పాడు.మరో భక్తుడు.

ఆరోజునకొబ్బరికాయలు,పూలు ,తులసిదళాల గిరాకి బాగా ఉండటం తో,అదే అదనుగా ధరలు పెంచేసారు ఆయా వర్తకులు. అవును మరి ఎవరి స్వార్ధం వాళ్ళది.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం

కృష్ణవేణి గారు,మాలతి గారు ఇద్దరూ కూడా ఉత్తరద్వార దర్శనం కోసము గబగబా నడచుకుంటూ వస్తున్నారు.ఇంతలో వాళ్ళని ఎవరో తోసేసారు. తూలి ఎదుట వాళ్ళ మీద పడ బోయి నిల దోక్కుకున్నారు. అది చూసి ముందు అన్న ఒకతను లైన్ లోంచి బయటు వచ్చి

“జాగ్రత్త అమ్మా !"అని, "ఎవరండీ అలా తోసేసుకుంటున్నారు. అవతల ఆడవాళ్లున్నారు కళ్ళు కనిపించటం లేదా”

“ఆ ఆ ,సర్లే చెప్పచ్చావు మా పక్కన ఉన్నారు ఆడోళ్ళు”

అలా అక్కడ మాటల యుద్ధం జరుగుతోంది.

ఇంతలో అక్కడకి ఒక వృద్ధ జంట వచ్చారు. బహుశా ఇద్దరికీ ఎనభై లు దాటి ఉంటాయి. వాళ్ళు అందరిని దాటుకుంటూ ముందుకు పోతున్నారు.

అది చూసి కొంత మంది కోపం తో ఊగి పోయారు.”తెల్లవారఝామునుంచి కాసుకుని ఉన్నాము.మీరు వచ్చేసి లైన్ లో దూరి పొతే ఎలా ?” దెబ్బలాడారు.

“ఎదురుగా ఉత్తరద్వారం కనిపిస్తోంది.కానీ ఈ జన్మకు ఒక్క సారయిన అందులోంచి వెళ్ళే యోగం ఉందొ లేదో తెలియదు”

అనుకుంటూ చేసేదేమిలేక ఆ జంట వెను దిరిగారు.

అది చూస్తున్న మాలతి గారు,”పాపం ఆ ఇద్దరూ పెద్ద వాళ్ళను చూస్తే జాలి వేస్తోంది”

“అవును అయినా ఈ వయసులో వాళ్ళు ఇలా రావటం నిజంగా గ్రేట్,పోనీ మన place ఇచ్చేసి వెనక్కి వెళ్లి నిలుచుందాము మాలతీ”

“అలాగే”

“చాల thanks అండీ” ఆ పెద్దాయన.మాలతి,కృష్ణవేణిలతో అన్నారు.

బదులుగా ఇద్దరూ నవ్వుతూ దండం పెట్టారు.

ఇంతలో ఓ యువతి,ఒక వృద్ధుడిని వీపుకి బెల్టుల తో కట్టుకుని తీసుకుని వచ్చింది.అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు వాళ్ళని.

ఆమె తిన్నగా వచ్చి మాలతి గారి వెనకాలే నిలబడింది. అతను ఏదో అడుగుతున్నారు. యువతి ఏదో చెబుతోంది. ఇద్దరూ హిందీ లో మాట్లాడుకుంటున్నారు . ఎక్కడో దూరం నుంచి వచ్చారు . స్నానం చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

అప్పుడు కృష్ణ వేణి గారు ఆ అమ్మాయి తో హిందీలో అడిగారు

“స్నానం ఎక్కడ చేసారు”

“గోదావరి లో స్నానం చేసి ఇలా వచ్చాము

“మరి ఎందుకు మోస్తున్నావు భుజాల మీద”

“ఆయన కాళ్ళలో బలం లేదు ,ఎక్కువ సేపు నించువడానికి శక్తి చాలదు. అందుకు ఇలా మోసుకుంటూ”

“ఇంత దూరం ఎలా తెచ్చావు,”

“రైలు,లో వచ్చాము అక్కడ నుంచి నది వరకు రిక్షా ,నది నుంచి గుడికి ఇలా” అని నవ్వింది.

పుస్తకాలు మోసే విద్యార్ధిలా ఆయనను వీపు కి వేసుకుంది

అందరూ లైన్ లో నిలబడి “ రామా.శ్రీరామా!భద్రాద్రి రామా ,కోదండరామా! అంటూ భక్తి తో ఊగిపోతున్నారు. అక్కడున్న వారందరి లో ఆ రామదాసు పూనడా అన్నట్లు అందరూ రామనామ స్మరణచేస్తున్నారు.

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో రాములోరి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న జగదభిరాముడు.. భక్తలోకాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నాడు. ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సమయం దగ్గర పడుతుండటంతో.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

“సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమామైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి అని అంటారు.ఇదే రోజున హాలాహలం, అమృతం రెండూ ఆవిర్భవించాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది” ఆయన ముక్కోటి ప్రాముఖ్యతను ఆ అమ్మాయికి చెబుతున్నారు

“అవునూ కృష్ణ వేణి !

ఆ పిల్ల హిందీ అమ్మాయిలా ఉంది గానీ ,ఆ పెద్ద ఆయన అలా అనిపించటం లేదు” .

“మరే నాకు అలానే అనిపించింది మాలతీ,.అయినా ఈ గొడవ మనకెందుకు పద పద లైన్ కదులుతోంది . “రామా ! శ్రీరామా ! కోదండ రామా” అనుకుంటూ ముందుకు వెళుతున్నారు.

“దాదాజీ ఇది గో మనము హనుమంతుడి దగ్గరకు వచ్చాము”.

“అయితే ఇంకా కొద్ది సేపే,పర్వాలేదు.”

“అది గో ఆపక్కన,రామదాసు మ్యూజియం, గర్భ గుడి వెనకాల భద్రుడి రూపం కొండ రూపం లో ఉంటుంది. ఈ పక్కన కళ్యాణ మంటపం ఉంటాయి అన్నీ చక్కగా చూడు” అంటూ అంటూ ఆపెద్దాయన ఆ అమ్మాయి తో చెబుతున్నాడు.

ఉత్తరద్వారం తీయగానే భక్తులందరూ స్వామి వారిని దర్శించుకున్నారు. వచ్చేవాళ్ళు స్వామి దర్శనం కొస ఆత్రుత తో వస్తుంటే దర్శనం అయిన వాళ్ళు సంతృప్తి తో తిరిగి వెళుతున్నారు. తృప్తి చెందని వాళ్ళు మళ్ళి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడుతున్నారు.

“అబ్బ దర్శనం అద్భుతంగా జరిగింది. మాలతీ”

“నిజమే బాగా జరిగింది. చూసావా ఈ భద్రాచలం దేవాలయంలో ఉండే రాముని విగ్రహం కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి అపసవ్యంగా ఉన్నాయి”.

"అవును మాలతీ !భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనం మివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు. అనుకుంటూ ముందుకు వెళుతూ ,అరె అటు చూడు ఆ పిల్ల ,ఆ పెద్ద ఆయన భద్రుని దర్శనం కోసం వెళుతున్నారు.”

అతన్నినెమ్మదిగా నడిపిస్తోంది. మాలతి కృష్ణ వేణి కూడా అక్కడున్న చీడీల మీద కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తున్నారు.

క్యూ లైన్ లో ఉన్నప్పుడు తెలిసింది. ఆ ఇద్దరి గురుంచి మాలతి, కృష్ణ వేణి లకి.

వాళ్ళ మధ్య బంధుత్వం ఏమి లేదు.ఆయనకి పెద్దగా బంధువులు లేరు,ఉన్న ఇద్దరుపిల్లలు విదేశాలలో ఉన్నారు.ఒంటరి మనిషి. ఈ అమ్మాయి కేర్ టేకర్ గ మూడేళ్ళ నుంచి పని చేస్తోంది. మేఘాలయ నుంచి వచ్చింది. హైదరబాద్ లో ఒక ఏజెన్సీ లో పని చేస్తోంది. ఉద్యోగం లో బాగంగా ఆమె కి ఈ పెద్దాయన్ని చూసుకునే బాధ్యత ఇచ్చారు.సమస్తం ఆమె చూసుకుంటుంది. అని తెలిసింది.

ఆ ఇద్దరూ కూడా గుడి ప్రాంగణం లో ఉన్న వన్నీ చూసోచ్చి ఒక చోట కూర్చున్నారు. ఆమె బాగ్ లోంచి మంచి నీళ్ళు తీసి ఆయన చేతికి ఇచ్చింది. ఆయన దాన్ని తడుముతూ జాగ్రత్తగా పట్టుకుని తాగాడు. తరువాత ఆ పిల్లని పట్టుకుని చేతులు తడుముతూ కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి,అంతవరకు అతని మీద జాలి చూపించిన మాలతి కి చర్రున కోపం వచ్చేసింది.

“అదేంటి కృష్ణా !చూడు ముసలాడు ఏం చేస్తున్నాడో” అంటూ,తిరిగిన వాళ్ళ కంటికి కనిపించిన దృశ్యం చూసి ఆ ఇద్దరూ స్థాణువుల్లా నిలబడ్డారు.

ఇంతకీ వాళ్ళిద్దరినీ అంత ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఆ యన ఆ అమ్మాయి పాదాలమీద తలపెట్టి పాదాభివందనం చేసి, చేతులతో భక్తి గా కళ్ళకి అద్దుకుంటున్నాడు. పారవశ్యం పొందుతున్నాడు.చూస్తున్న వీళ్ళిద్దరికి కూడా నోట మాట రాలేదు.కన్నర్పాలేదు

మనిషికి మనిషికి మధ్య ఇంతటి

అనుబంధమా !ఆయన ఆనంద పారవశ్యం లో కళ్ళు మూసుకునే ఉన్నాడు.

ఈ అనుకోని చర్యకు ఆ అమ్మాయి కళ్ళనిండా నీళ్ళు. అయోమయంగా చూస్తుండిపోయింది. అప్పుడు ఆయన అన్న మాటలు... "చూపు లేని నాకు కళ్ళకి వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి ఆ భద్రునికి ముక్కోటి పర్వదిననా ఉత్తర ద్వారదర్శనం ఎలా ఇచ్చారో నాకు ఇవాళ అంతటి మహత్తర దివ్య దర్శనం చేయించావు తల్లీ !

నిజంగా నీకు కోటి దండాలు "అంటున్న ఆ మొహం లో కృతజ్ఞతా భావం గోచరిస్తోంది.

అది చూస్తున్న కృష్ణ వేణి మాలతి గార్లకి ఆశ్చర్యం ఆనందం ఒకే సారి కలిగాయి. గుండెల నిండా ఓ అపురూప అనుభూతి నింపుకున్న వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలసాగాయి.

- మణి వడ్లమాని

First Published:  30 March 2023 6:05 AM GMT
Next Story