Telugu Global
Arts & Literature

అరుగును నేను

అరుగును నేను
X

వీధిఅరుగునునేను

పరుగులలోకంలో

కరిగికరిగి

మరుగునపడిపోయాను

కనుమరుగైపోయాను

అంతస్తుల మోజులో

అడుగునపడిపోయాను

అసలునేనూ..

ఊరుమ్మడిచుట్టాన్ని

ఊరుమంచి కోరేదాన్ని

ఊరడింపునిచ్చేదాన్ని

ఊసులాలకించేదాన్ని

ఊ..కొట్టేదాన్ని

ఊళ్ళోకొచ్చినదెవరైనా

కూర్చోమంటూనే

కుశలమడిగేదాన్ని

పొరుగింటిముచ్చట్లైనా...

ఇరుగింటి అగచాట్లయినా

ఇంటింటి రామాయణాన్ని

ఇట్టే కనిపెట్టేదాన్ని

నేర్పుగ,ఓర్పుగ

తగవులుతీర్చేదాన్ని

తగినతీర్పులూ..ఇచ్చేదాన్ని

ఎవరిబాధలెన్నైనా..

ఏ వేదనలున్నా

ఓర్పుగా ..ఆలకించి

ఓదార్పునందించేదాన్ని

నేనెరుగని కధలేదు

నన్నెరుగని గడపలేదు

నాతోగడపనిదెవరూ..

నాతోపనిపడనిదెవరికని?

అందరినీ..అక్కునచేర్చుకు

లాలించేదాన్ని

పాలించేదాన్ని

ఆత్మీయతపంచేదాన్ని

అందరినీ ఆదరించి

చేరదీసి,సేదదీర్చేదాన్ని

అసలునేనూ..

అచ్ఛం అమ్మలాంటిదాన్ని

అసలుసిసలు

మానవసంబంధాలకు

పట్టుగొమ్మలాంటిదాన్ని

ఎవరూ..పదిలంచేయని

పాతబంగారాన్ని

రాతినేగాని,

ఆపాతమధురాన్ని

నావిలువను,

గుర్తించలేనిమీకై..

నిన్నటి మీ జ్ఞాపకంగా

మిగిలిపోతున్నా...

ఉరుకులపరుగులతో

ఉక్కిరిబిక్కిరవుతున్న

నా బిడ్డల

జీవనగమనం చూసి

బీటలువారి పగిలిపోతున్నా...

సాలిపల్లి మంగామణి

(శ్రీమణి) (విశాఖపట్నం)

Next Story