Telugu Global
Arts & Literature

అజేయుడు (కవిత)

అజేయుడు (కవిత)
X

ఎదుగుతున్న కొద్దీ అణచివేసే

రాలుగాయి సమాజo

విసురుతున్న రాళ్లతోనే

వైభవోపేతమైన

భవనం నిర్మించుకో!

దుర్విమర్శల విచ్చుకత్తులు

శరపరంపరంగా వచ్చి

పడుతుంటే పుష్పగుచ్చాలుగా మలుచుకో

నీ ముందస్తు విజయపరంపరకు!

అపనిందలు, అవమానాలు

మదిని చిన్నాభిన్నం చేస్తుoటే మెరికల్లాంటి ఆలోచనలతో మేధోమధనం చేయి!

విప్పలేని చిక్కు ముడులు పద్మవ్యూహంలా అలుముకొని

పరిహాసం చేస్తుంటే

అంతర్లీనమైన శక్తులను

వెలికి తీసి అలుపెరుగని

వీరుడిలా పోరాడు

అజేయుడుగా అలరారు!

విలంబమైన కాలాన్ని

విచక్షణతో స్వాధీనం చేసుకో!

మకిలిపట్టిన మాయాజగత్తు

మర్మాన్ని ఛేదించు!

నుసి అంటని

వజ్రంలా ప్రకాశించు!

పులు కడిగిన ముత్యంలా ప్రభవించు!

- మామిడాల శైలజ

First Published:  19 Nov 2023 1:22 PM GMT
Next Story