Telugu Global
Arts & Literature

ఒక్కటైతే మీరిలా (కథ)

ఒక్కటైతే మీరిలా (కథ)
X

న్యూ అవెన్యూ కాఫీ షాప్.

పలుచగా ఉన్న జనాలతో సందడి లేకుండా ఉంది. మంద్రస్థాయిలో వినిపిస్తున్న సంగీతం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తోంది. ఒక మూలగా టేబుల్ వద్ద ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు సాగర్, ఉత్పల.

వాళ్లు చాలాసేపటినుంచి అక్కడ ఉన్నారడానికి చిహ్నంగా త్రాగి పక్కన పెట్టిన రెండు కాఫీ కప్స్, తినగా మిగిలిన బిస్కెట్లతో పింగాణీ ప్లేట్స్ కనిపిస్తున్నాయి.

"చెప్పు సాగర్.. ఏదో మాట్లాడాలి అని రమ్మన్నావు కదా..? వచ్చి కూడా చాలా సేపు అవుతుంది, చెరో రెండు కాఫీలు కూడా తాగేసాం ఇంకా అలా మాట్లాడకుండా ఉంటావేంటి?" పిలిచి ఇలా మౌనంగా ఉంటే ఎలా? అంది ఉత్పల !.

"అదే ఉత్పల..! నీతో ఆ విషయం చెప్పాకా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని..?"కాస్త సందేహంగా అన్నాడు.

"ఆ సందిగ్ధం ఎందుకు నీకు? ఒక గుడ్ ఫ్రెండ్ గా ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడే చనువు ఉంది కదా నీకు నా దగ్గర ! ఈ రోజేంటి కొత్తగా.." నవ్వుతూ అంది ఉత్పల.

"అంటే అదీ.."

"హా అది.? పర్లేదు చెప్పు.."

"నేను నీకు ఒక ప్రపోజల్ పెట్టాలి అనుకుంటున్నాను.."

"ప్రపోజలా? ఏ విషయంలో.." ఆశ్చర్యంగా అడిగింది ఉత్పల.

"అదే మ్యారేజ్ విషయంలో.."

"వాట్.." తడబడుతూ లేచి నిలబడింది ఉత్పల..

"అరే అంత షాక్ అవుతావ్ ఏంటి ? అంత కంగారు పడాల్సిందేమీ లేదు, కాస్త స్థిమితంగా కూర్చొని నేను చెప్పేది విను.." తను కూడా లేస్తూ రిక్వెస్ట్ గా అన్నాడు సాగర్.

ఒక్కసారి సాగర్ వైపు చూసి ఏమనుకుందో ఏమో నిశ్శబ్దంగా కూర్చుంది ఉత్పల.

తను కూడా కూర్చొని "అదే ఉత్పల మనం పరిచయమై దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ పరిచయకాలంలో మన రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. అందరమూ బాగా కలిసిపోయాం కూడా అందుకనీ.."

"హా అందుకనీ.." చురుగ్గా చూసింది ఉత్పల.

"నాకు ఒక ఆలోచన వచ్చింది.."

"ఏమిటది...?" కాస్త ముందుకు వంగి ఉత్సుకతగా అడిగింది.

"మా అమ్మగారికి మీ నాన్నగారికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావ్..?"

"ఏమంటున్నావ్ నువ్వు? మతి పోయిందా నీకు? మీ అమ్మగారికి, మా నాన్నగారికి ఈ వయసులో పెళ్ళా..?

"అవును అంతలా ఆశ్చర్యపోతావేంటి? మనిద్దరం మన వృత్తుల్లో చాలా బిజీగా ఉంటాము. నా భార్యకి మా అమ్మగారిని నాతోపాటు ఉంచుకోవడం నచ్చదు. మీ అత్తవారింట్లో నీకూ అదే పరిస్థితి. సో.. వాళ్ళిద్దరినీ అలా వృద్ధాశ్రమంలో వదిలేసే బదులు వాళ్ళకి పెళ్లి చేస్తే జీవిత చివరిదశలోనైనా కలిసి సంతోషంగా ఉంటారు అని నా ఉద్దేశం" అన్నాడు సాగర్.

కాసేపు ఆలోచనల్లో మునిగిపోయింది ఉత్పల.

"అదెలా సాధ్యమవుతుంది సాగర్! ఈ వయసులో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నలుగురూ ఏమనుకుంటారు? పైగా మా అత్తగారి ఫ్యామిలీకి సొసైటీలో చాలా మంచి పేరుంది.

ఈ విషయం వాళ్లకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని !."

"అంటే పెళ్లి చేయడం పరువు తక్కువ పని అనా నీ ఉద్దేశం? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పెళ్లికి వయసుకు సంబంధమేమిటి? అలా వాళ్లను ఒంటరిగా వదిలేసే బదులు ఒక బంధంతో ఒకటి చేస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు కదా?"

ఉత్పల మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అన్నాడు సాగర్.

ఉత్పల ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే "పోనీ అలా వద్దంటే వాళ్ళని వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకోగలమా? అందుకు మన పరిమితులు మనకున్నవాయే.. అలాంటప్పుడు వాళ్లను అనాధల్లా ఇంటికి దూరంగా వదిలేశామన్న బాధ లేకుండా కొత్త జీవితాన్ని ఇవ్వడం మంచిది కదా! ఆలోచించు ఒకసారి.."

కాసేపటికి మౌనముద్రవీడిన ఉత్పల "ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది బాగానే ఉందనిపిస్తోంది. వాళ్లని జీవితాంతం వృద్ధాశ్రమoలో వదిలేయడం కంటే వివాహబంధంతో ఒక్కటి చేస్తే ఒకరికొకరు తోడుగా, ఆనందంగా ఉంటారనిపిస్తుంది.."

"కదా ఇప్పుడు దారికి వచ్చావు. మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం మనకు ముఖ్యం. అంతేకానీ దానివల్ల ఎదురయ్యే సాధక బాధకాలు మనకు అనవసరం. ఏమంటావ్?"

"నువ్వు చెప్పింది నిజమే సాగర్ నలుగురి గురించి ఆలోచిస్తే ముందుకు సాగడం కష్టం మనకు కావాల్సింది మన పేరెంట్స్ ఆనందం. ఓకే డన్. నీ ప్రపోజల్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను."తేలికపడ్డ మనసుతో అంది ఉత్పల.

"దట్స్ గుడ్.. ఇంత త్వరగా దారికి వస్తావనుకోలేదు. అయినా సమాజానికి భయపడడానికి మనం చేస్తున్నది తప్పు కాదు కదా. చెప్పాలంటే మనం ఇంతకుముందు చేసిందే తప్పు ! మనల్ని కనీ, పెంచి వృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రులని అనాధల్లా ఆశ్రమంలో వదిలేయడం. ఇప్పుడు మనం ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నాం మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన సమయం ఇది..!" నవ్వుతూ అన్నాడు సాగర్..

"ఎస్ యు ఆర్ కరెక్ట్ సాగర్.. ఇది కనుక సక్సెస్ అయితే మనం త్వరలోనే బంధువులను కూడా కాబోతున్నామన్నమాట.. నైస్ కదా!" ఆనందంగా అంది ఉత్పల.

"అవును నాకు కూడా హ్యాపీనే..కాకపోతే మన ముందున్న సమస్యను కూడా మనం జాగ్రత్తగా డీల్ చేయాలి కదా..!"

"సమస్యా మళ్లీ అదేంటి?"

"మన పేరెంట్స్ ని పెళ్లికి ఒప్పించడం అంత ఈజీ కాదు కదా!"

"ఈజీ కాదు కాకపోతే ఇంపాజిబుల్ కూడా కాదు. మనము రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది.."

"గుడ్.. నీ నమ్మకం వమ్ము కాదని ఆశిద్దాం! మరి వాళ్లతో ఎప్పుడు మాట్లాడదాం..?"

"ఎప్పుడో ఎందుకు ?నెక్స్ట్ సండే నే.. ఆ రోజు నేను ఈవినింగ్ టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి నీ సంగతో..?"

"నాక్కూడా ఓకే.. ఆ రోజు ఏమి ఇంపార్టెంట్ పనులు పెట్టుకోను.."

"ఓకే ఇక వెళ్దామా..!" లేచి నిలబడుతూ అన్నాడు సాగర్.

"బాయ్ సాగర్..హ్యాండ్ బ్యాగ్ రైట్ షోల్డర్ కి తగిలించుకుంటూ లేచి నిలబడుతూ అంది ఉత్పల.

వెళ్లబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి "సాగర్.. ఒక చిన్నమాట.!" అంది ఉత్పల.

ఏమిటన్నట్లు కళ్ళెగరేస్తూ చూశాడు సాగర్.

"అదే మరి కట్న కానుకలు, ఇచ్చి పుచ్చుకోవడాల గురించి మాట్లాడుకోనే లేదు మనం.."

ఒక్కసారి సాగర్ వదనంలో రంగులు మారాయి. అంతలోనే సంభాలించుకొని

"ఒసోస్.. కట్న కానుకల గురించి మళ్ళీ మాట్లాడుదాం !"

"మరి మీ అమ్మగారిని, మా నాన్నగారికి ఇస్తున్నప్పుడు మగపెళ్లి వారుగా నేను కట్న కానుకల గురించి అడగడం సహజమే కదా..! బాయ్ సీ యు ఆన్ సండే.." అంటూ బయటికి నడిచింది ఉత్పల.

వెళ్తున్న ఉత్పల వైపే చూస్తూ "భారం నెత్తిన పెట్టి తాపీగా వెళ్ళిపోయిందిగా ! ఈ కట్న కానుకల గొడవేంటి అస్సలు.. ఇంకా విషయమే వాళ్ళ చెవిన వెయ్యలేదు అప్పుడే ఇచ్చి పుచ్చుకోవడాలు కూడానా !" మనసులో అనుకుంటూ ఇంకో కాఫీ ఆర్డర్ చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు సాగర్.

విషయం ఇద్దరికీ ఎలా చెప్పాలి ? ఎలా ఒప్పించాలి? అని చాలా సేపు మదనపడి ఓ నిర్ణయానికి వచ్చినవాడిలా తల పంకించి లేచి నిలబడ్డాడు వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ..

నాలుగు రోజుల తర్వాత ఉత్పలకి కాల్ చేసి "ఈ రోజు మన అమ్మానాన్నలకి మన నిర్ణయాన్ని చెప్పే రోజు. రెడీగా ఉంటే పిక్ అప్ చేసుకుంటాను" అన్నాడు.

అరగంటలో ఇద్దరూ ఆశ్రమం వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు.

"ఏంటర్రా.. ఈ రోజు ఇద్దరూ కలిసి వచ్చారు ? సంతోషంగా అన్నారు సీతారాం, వసుంధరలు.

చాలాసేపు మౌనంగా కూర్చుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ నువ్వు చెప్పు.. నువ్వు చెప్పు..అనుకుంటున్నట్లు ముఖాలు చూసుకుంటున్న ఇద్దరినీ చూస్తూ

"అదేంటర్రా.. ఏదో మాట్లాడాలి అని చెప్పి ఇద్దరూ మౌనంగా ఉంటే ఎలా? అదేంటో చెప్పండి మా దగ్గర ఎందుకు మీకు మొహమాటం?" అన్నారు సీతారాం గారు

కొడుకును, ఉత్పలను వింతగా చూస్తూ

"అవును ఏదో చెప్తానన్నారు కదా !" అన్నారు వసుంధర గారు.

చివరకు ఉత్పల పెదవి విప్పింది. మేమిద్దరం ఒకటి అనుకున్నాం ఆంటీ.."

"ఏంటి ?" ఇద్దరూ ఒకేసారిగా అనడంతో కాస్త తడబడి సాగర్ వైపు చూసింది ఉత్పల చెప్పమన్నట్లుగా.

ఇక తప్పలేదు సాగర్ కి. "అదే అంకుల్ మేము.. మేము.."

"ఆ మీరు? చెప్పండి .." రెట్టించారు సీతారాం గారు.

"మేము మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాము" ఇద్దరూ ఒకేసారి అన్నారు.

అంతే అక్కడ కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా చూశారు ఆ పెద్ద వాళ్ళిద్దరూ తమ ముందు కూర్చున్న పిల్లల్ని.

"మాకు ఈ వయసులో పెళ్లేంటర్రా? వినడానికే అదోలా ఉంది. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది?" ముందుగా తేరుకున్న సీతారాం గారు అన్నారు.

"ఆంటీ ప్లీజ్ అర్థం చేసుకోండి. జీవితంలో బాధ్యతలన్నీ నెరవేర్చుకొని మనుమలు, మనవరాళ్లతో హాయిగా గడిపే సమయంలో మాకు ఉన్న ఇబ్బందుల వల్ల మేము మీకు ఆ ఆనందాలను దూరం చేశాము. ఈ వయసులో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాము. మా నిస్సహాయతను అర్థం చేసుకొని మా తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని ఇలాగైనా మాకు ఇవ్వండి ప్లీజ్.." ఆర్థింపుగా అంది ఉత్పల.

"అయ్యో అంత మాట అనొద్దమ్మా! మీరు చేసింది తప్పేం కాదు. మీ పరిస్థితులను అర్థం చేసుకోలేనంత చిన్న వాళ్ళం కాదు మేము. రాలిపోయే పువ్వుల్లాంటి మా కోసం మీ నిండు నూరేళ్ల జీవితంలో కలతలు రేకెత్తించడం సబబు కాదు కదా..."

"అవునమ్మా.. అయినా మాకు ఇక్కడ ఏమి లోటు ఉందని? మేము ఇక్కడ బాగానే ఉన్నాము కదా? ఎందుకు మీరింతగా మా గురించి ఆలోచిస్తున్నారు?" అప్పటివరకు మౌనంగా ఉన్న వసుంధర గారు అన్నారు.

సీతారాం గారు సాగర్ భుజంపై చేయి వేస్తూ "సాగర్ నీ మనసు నాకు తెలియదా? మీరు అందరిలాంటి పిల్లలు కాదు. మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు మీ కళ్ళల్లో కనిపిస్తున్న అపరాధ భావనను, ఆవేదనను మేము అర్థం చేసుకోగలం. అందుకని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాలేదు. మీరు తరచుగా మమ్మల్ని కలుస్తున్నారు. ఇంటికి దూరంగా ఉన్నామన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు.. మేము ఇక్కడ బాగానే ఉన్నాం బాబు.."

"అవును నాన్న ! ఇక్కడ మాకు ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. మా తోటి వాళ్లతో చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. మంచి కాలక్షేపం అవుతుంది. మంచి మంచి బుక్స్ చదువుతున్నాము. కేవలం మీరు మా దగ్గర లేరన్న ఆ ఒక్క లోటు తప్పితే.."

వసుంధర గారి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ "అవునమ్మా మీకు ఆ లోటు కూడా లేకుండా చేయాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరు ఒకరికొకరు తోడుగా, సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడుపుతుంటే మేము తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ నుంచి కాస్తైనా బయటపడగలం దయచేసి ఒప్పుకోమ్మా!" ఆర్థింపుగా అన్నాడు సాగర్.

"అవును నాన్నగారు! మీరు, ఆంటీ ఈ పెళ్లికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాము. మా కోసం మీరు జీవితాంతం అవిశ్రాంతంగా పాటుపడ్డారు. అలాంటి మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేయడం వల్ల మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో తెలుసా? ప్లీజ్ ఒప్పుకోండి డాడీ!" తండ్రి భుజాల చుట్టూ చెయ్యి వేసి గోముగా అంది ఉత్పల.

"మీకోసం కాకపోయినా కనీసం మా ఆనందం కోసమైనా ఒప్పుకోండి. ప్లీజ్ అమ్మా" తల్లి చెంతకు వచ్చి మోకాళ్ళ మీద ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు సాగర్.

ఏమీ మాట్లాడ లేనట్లుగా ఉండిపోయి ఒకరి వైపు ఒకరు ఇబ్బందిగా చూసుకుంటున్న వాళ్లని చూసి ఉత్పల సాగర్ లు కళ్ళ ద్వారా సైగలు చేసుకొని మాట్లాడుకోవడానికి స్పేస్ ఇవ్వాలన్నట్లుగా అక్కడి నుంచి బయటకు నడిచారు.

అరగంట తర్వాత లోపలికి వెళ్లిన సాగర్, ఉత్పలలకు చిన్నగా నవ్వుతూ తమ అంగీకారాన్ని సూచించారు ఆ ఇద్దరూ!

అంతే ఉత్పల, సాగర్ ల ఆనందానికి అవధులు లేవు.

"థాంక్యూ సో మచ్ ఆంటీ. మంచి డెసిషన్ తీసుకున్నారు." అంటూ వసుంధర గారిని అల్లుకుపోయింది ఉత్పల.

సాగర్ కూడా "కంగ్రాట్యులేషన్స్ అంకుల్" అంటూ ఆత్మీయంగా హత్తుకున్నారు సీతారాం గారిని.

"ఇంకా అంకుల్ ఏమిటి నాన్నగారు అను మనం ఇప్పుడు బంధువులమైపోయాం కదా!" నవ్వుతూ అంది ఉత్పల.

"అవునవును నువ్వు కూడా అమ్మా అని పిలవాలి అయితే "

పిల్లలిద్దరినీ చెమ్మగిల్లిన కళ్ళతో సంతృప్తిగా చూసుకున్నారు వసుంధర, సీతారాం గారు.

పెళ్లి తంతు కన్నుల పండుగగా జరిగిన ముగిసిoది. ఉత్పల చేతిలో సాగర్ ఒక చెక్ ను చేతిలో పెడుతూ అమ్మాయి తరపు వాళ్ళుగా మా వరకట్నం "అన్నాడు.

"నేనేదో సరదాగా అన్నాను సీరియస్ గా తీసుకోవద్దు."అంది ఉత్పల.

"నువ్వు సరదాగా అన్నా నేను బాగా ఆలోచించే ఇలా చేస్తున్నాను . ఎందుకంటే వాళ్లకు కూడా సొంతంగా ఒక ఇల్లు,ఖర్చులు ఉంటాయి కదా!"

సీతారాంగారు జోక్యం చేసుకొని "నాకు వచ్చే కొద్దిపాటి దాంట్లోనే సంతోషంగా ఉండగలం మాకు అవి ఏమీ వద్దు" అన్నారు.

"అవునమ్మా మాకు ఏ ఆస్తి అంతస్తులు వద్దు. మీ నాన్నగారిని నాకు కానుకగా ఇచ్చావు అంతకంటే వేరే ఏమీ వద్దు మాకు" అన్నారు వసుంధర గారు.

"ఇదే నాకు కావాల్సిన అసలైన కట్న కానుక సాగర్ !. ఆత్మీయత, అభిమానం, ప్రేమ ముందు ఇచ్చే ఏ కట్నం కూడా సరిపోదు నా దృష్టిలో !!. థాంక్స్ టు యూ సాగర్ "

చెక్ ను తిరిగి అతని చేతిలో పెడుతూ తల్లిదండ్రులిద్దరినీ దగ్గరకు తీసుకుందిఉత్పల

- మామిడాల శైలజ

First Published:  25 Nov 2023 3:00 PM GMT
Next Story