Telugu Global
Arts & Literature

ఉన్నత సంస్కారమే జీవముద్రగా గల కథా పథదర్శి మధురాంతకం రాజారాం

ఉన్నత సంస్కారమే జీవముద్రగా గల కథా పథదర్శి మధురాంతకం రాజారాం
X

ఐదు దశాబ్దాల పాటు తెలుగు కథతో నడిచి, తెలుగు కథను నడిపించిన విశిష్ట కథా రచయిత మధురాంతకం రాజారాంగారు. సమాజాన్ని తరచి చూసి, మానవ సంబంధాల్లోని వైరుధ్యాల్ని చదివి ఆకళింపు చేసికొని, సమాజ కళ్యాణమే సాహిత్య ప్రయోజనమనే ధ్యేయంతో కథని నడిపిన జాతి కథకుడు వారు.

అభివృద్ధికి ఆమడదూరంలో వున్న రాయలసీమలోని చిత్తూరు జిల్లా రమణయ్యగారిపల్లె రాజారాం గారి జన్మస్థలం. వారి భాషణలో చిత్తూరు బాస, తమిళ మిశ్రమంగల తెలుగు యాస - మధురంగా, విలక్షణంగా జాలువారేది. టీచర్ గా, మొదటి ఉద్యోగం దామల్ చెరువు గ్రామంలో... పాకాల నుంచీ నడక. 1962 లో నేను వారిని చూడటానికి ఆ వూరు వెళ్ళి, వారి ఆతిథ్యం పొందాను. ఆ తర్వాత వారు మొగరాల, కొటాల, పాకాలలో కూడా ఉద్యోగం చేశారు. కొటాల కూడా వెళ్లేవాడిని నేను.

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవనశైలి మీద వారికి ఎనలేని అభిమానం, ప్రేమ, ఆరాధన. అలాగే జీవితవిలువలు, నైతిక ప్రవర్తన, మానవీయమైన సాత్విక లక్షణాలు వారికి వ్యక్తిత్వంలో, సాహిత్య వ్యక్తిత్వంలో ఔన్నత్యాన్ని గడించి పెట్టాయి. తొలిరోజుల్లో వారు ‘ధూమేశ్వరీస్తవం’ వంటి పేరడీ పద్యాలు రాశారు. ‘సుమాంజలి’ అని గేయసంపుటం ఉంది. 1947లో వారు కథా రచన చేపట్టారు. ‘1947-52 మధ్య కాలంలో వెయ్యి కథలనైనా చదివి వుంటాను’ అనే వారు. ‘మంచి పాఠకుడు కాకుండా మంచి రచయిత కాలేడు’ అనేది ఆనాడే వారు ఔత్సాహిక రచయితలకు చెప్పిన సూక్తి. నా వంటి వారిని ప్రభావితుల్ని చేసింది- వారి రచనలూ, అలాంటి సూక్తులే! ‘తాను వెలిగించిన దీపాలు’ - ఉపాధ్యాయుడు కేంద్రంగా సాగిన గొప్ప కథ. దాన్ని చదివే నేను వారిని తొలిసారి చూడటానికి దామల్ చెరువు వెళ్లింది. ఆ కథ ఎందరో పెద్దల్నీ, విమర్శకుల్నీ, కథకుల్నీ - ఒక ‘ఊపు’ ఊపింది. గోదా గ్రంథమాల శ్రీమాన్ కెటిఎల్ నరసింహాచార్యులుగారు ఆ కథ పేరుతోనే వారి కథా సంపుటిని ప్రచురించారు. దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి అవార్డు లభించింది. ఒక విలక్షణమైన కథా సంవిధానానికీ, శిల్పానికీ, శైలికీ - ఆ కథ ఒక నమూనా.

ప్రపంచ కథా సాహిత్యంలో తెలుగు బావుటాన్ని ఎగరవేసిన పాలగుమ్మి పద్మరాజు గారి మాటల్లో ఈ ప్రశంస ఇలా సాగింది. ‘ఇన్నాళ్లకు కేవలం మధ్యతరగతి జీవనాన్ని బహుముఖాలుగా కథలలో రూపొందించగల ప్రతిభావంతుడు తెలుగునాట అవతరించాడు. ఎప్పుడో అవతరించాడు. అయితే ఇన్నాళ్లకు తన ప్రతిభా ముద్ర తెలుగు కథా సాహిత్యం మీద వేయడానికి దారుఢ్యం సంపాదించాడు. ఆయన పేరే రాజారాం. మాటలు నేర్చిన మధ్యతరగతికి ప్రతినిధి’ ఈ వింగడింపు వలన రాజారాం గారి ‘కథాత్మ’ తేటతెల్లమవుతోంది.

నాలుగు వందలకుపైగా రాజారాం గారు రాసిన కథల్లో ఎన్నెన్నో కథా ముత్యాలూ, పగడాలూ, రత్నాలూ, వజ్రాలూ ఉన్నాయి. ఆనాటి తాను వెలిగించిన దీపాలు నుండి సర్కస్ డేరా, కమ్మతెమ్మెర, పొద్దు చాలని మనిషి, వగ్గపేటికి చల్ల చిందినన్, అంబపలుకు జగదంబా పలుకు, శబ్దసందేశం, రాతిలో తేమ వరకూ - చాలా కథలు మధ్యతరగతి జన జీవనంలోని విభిన్న పార్వ్శాల్ని చూపాయి. మనుషుల మనస్తత్వ వైరుధ్యాల్ని చిత్రించాయి. కొన్ని కథలు రాయలసీమ గ్రామ సౌభాగ్యాన్నీ, దుస్థితినీ అక్కడి మనుషుల విలక్షణాన్నీ, వారి పలుకుబడినీ అద్భుతంగా ఆవిష్కరించాయి. ‘చెడు ఓడిపోతుంది, మంచి గెలుస్తుంది’ అనే ఆశాభావం, విశ్వాసం వారి కథాత్మగా, నిబద్ధతగా కనిపించే సూత్రాలు.

రాజారాంగారికి చాలా పురస్కారాలూ, సత్కారాలూ అందేయి. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు 1993లో వచ్చింది. ఆ తర్వాత ఒకసారి రాజారాంగారు హైదరాబాద్ వచ్చారు. వారి మకాం మా ఇంట్లోనే. మేమిద్దరం కలిసి కొంతమంది మిత్రుల్ని చూశాం. వారిలో అతిముఖ్యులు మునిపల్లె రాజుగారు. రాజుగారంటే వీరికీ, వీరంటే వారికీ - ఎనలేని గౌరవం, అభిమానం. ఆనాటి సంభాషణలో రాజారాంగారు ‘మీలాంటి వారికి రాకుండా నాకు అవార్డేమిటి సార్’ అన్నారు ఎంతో నమ్రతతో! ఆ తర్వాత పదమూడేళ్ళకు (2006) రాజుగారికి వచ్చింది!

ఈ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుల విషయంగా మరో ముఖ్య విషయం చెప్పాలి. అది రాజుగారి కథా సంపుటికి ‘ఒకరిద్దరు కథారుషులలో ఒకరు’ అని నేను ముందుమాట రాశాను. ‘మీ అంతటి స్ఫూర్తి ప్రదాతల పుస్తకానికి నేను ముందుమాట రాయటమేమిటి’అని ఎంత చెప్పినా, కాదని రాజుగారు దాన్ని నా చేతరాయించారు. ఆ తర్వాత ఆ పుస్తకానికి అవార్డ్ వచ్చినప్పుడు - ‘మీ ముందుమాట వల్లనే ఓ అవార్డ్ దక్కింది’ అని రాజుగారు పలుమార్లు సభల్లో కూడా అన్నప్పుడు నేను వారి సౌజన్యానికి , పెద్దమనసుకు పాదాభివందనం చేశాను. అన్నట్టు ‘మరో విశేషం- తెలుగు సాహిత్యంలో తండ్రీ కొడుకులకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించటం - కేవలం రాజారాంగారూ వారి కుమారుడు నరేంద్రలకు మాత్రమే దక్కిన అపూర్వ గౌరవం. (నరేంద్ర - 2022 నవల మనో ధర్మ పరాగం).

రాజారాంగారు ‘కథాయాత్ర’ అని ఒక గొప్ప ఆకర గ్రంథాన్ని తెలుగు సాహితీలోకానికి వరప్రసాదంగా అందించి వెళ్లారు. దాన్ని ‘చదివిన’ కథా ప్రియులకు ‘చదివినంత లబ్ధి’. ఆ పుస్తకంలో వారు - తమకు కథా రచనలో దారిదీపాలుగా నిలిచి 18 కథల సారాంశాన్నీ, వాటి ఔన్నత్యాన్నీ విశ్లేషించారు. ఇవిగో - ఇవీ - ఆ కథలు.

1. నరబలి: శ్రీమతి నర్గీస్ దలాల్- ప్రపంచ కథానికల రెండవ పోటీలో భారత దేశస్థాయిలో ప్రథమ బహుమతి. మూలం ఇంగ్లీష్, 2. పులిసిద్ధప్ప భార్య: కె.ఎస్.రావు- మూడవ బహుమతి పొందినది. మూలం కన్నడం, 3. సర్వమంగళ : మల్లాది రామకృష్ణ శాస్త్రి, 4. బాలింతరాలు : సి. ఆంజనేయశాస్త్రి, 5. గాలివాన : పాలగుమ్మి పద్మరాజు, 6. బిచ్చగాళ్ల జెండా : మునిపల్లె రాజు, 7. పాతాళ గంగ : కె.సభా, 8. మిథునలగ్నం : కె.సభా, 9. అలరాసపుట్టిళ్లు : కల్యాణ సుందరీ జగన్నాథ్ 10. అరకులోయలో కూలిన శిఖరం : బుచ్చిబాబు, 11. ఎవరు, ఏమిటి, ఎందుకు?: అనిసెట్టి అప్పారావు, 12. చరణదాసులు : పురాణం సూర్యప్రకాశరావు, 13. వెలుగు : రా.వి.శాస్త్రి, 14. మంగుళూరు మెయిల్ : ఎన్.ఆర్. చందూర్, 15. బిళ్లల మొలతాడు : కరుణ కుమార, 16. ఓడించాను: డా. కొమ్మూరి వేణుగోపాలరావు, 17. నిజానిజాలు : హితశ్రీ, 18. చెరువ దగ్గర : శ్రీమతి ఆర్. వసుంధరాదేవి

కథాప్రియులకు రాజారాం గారి కథలూ, వారికి దారి దీపాలుగా నిలిచిన కథలూ కూడా ఉన్నత జీవన గమనానికి తోడుదీపాలుగానే నిలుస్తాయి. చదివి ఆనందించండి.

రాజారాంగారు నాతో మాట్లాడిన చాలా సందర్భాలలో ‘‘ ‘ఎకడమిక్ లైన్’ లో ఉన్నవారు కాకుండా, వేరే మీవంటి మేనేజర్లు తెలుగు సాహిత్యంలో రచయితలుగా మంచి పేరు గడించడం చాలా ఆనందం సార్. ఆ విధంగా కూడా మీరు నాకు గౌరవనీయులు’’ అనేవారు. అలాగే ‘‘మీరు కథ, కవిత అనే రెండు పడవలమీద కాలుపెట్టారు. కథలమీదకి మాత్రమే రండి’’ అని తరచుగా సలహా ఇస్తూవుండేవారు. అయితే, చిత్రంగా - ఈ రెంటినీ కలగలిపి మెచ్చుకుంటూ వారు నా కథాసంపుటికి ‘విహారి కథా గీతాలు’ అనే శీర్షికతో ఎంతో విలువైన ముందుమాటని అందించారు.

రాజారాంగారు అనారోగ్యంతో తిరుపతి రూయా హాస్పిటల్ లో ఉన్నారని తెలిసి, నేను ముంబై నుంచి వచ్చి వారిని చూసి వెళ్లాను.

రాజారాంగారు ఒక తరం తెలుగువారి సామాజిక, సాంస్కృతిక స్థితిగతులను చిత్రించిన ప్రాతినిథ్య కథకుడుగా పేరుగడించారు. వారి కీర్తి సాహితీలోకంలో అజరామరం!



‌- విహారి

First Published:  5 Oct 2023 6:15 PM GMT
Next Story