Telugu Global
Arts & Literature

నేను నేనే

నేను నేనే
X

నా తల్లిదండ్రులెవరో తెలీదు. డేట్ అఫ్ బర్త్ అసలే చెప్పలేను బహుశా ఏ పక్షియో నా జాతి పండుని నోట కరుచుకుని ఇక్కడ పడేసి ఉంటుంది. ఆ విత్తనమే మొక్కై మహావృక్షమై తరతరాలుగా ఇలా లాల్ బహదూర్ నగర్ లో ఊడలు దిగి శతాధిక వృద్ధుడు లా శతవసంతాల అనుభవాలతో రోడ్డు పక్కన ప్రతి రోజు మిమ్మల్ని పలకరిస్తున్నాను.

నన్ను పుట్టించిన బ్రహ్మ ఎవరో తెలియదు గాని పక్కనే ఉన్న వినాయకుడి గుళ్లో బ్రహ్మగారు రోజు నా ఆకుల్ని త్రినాధస్వామి వారికి సమర్పించి నన్ను పలకరిస్తుంటారు. నా జన్మ సార్థకత ఇదేమో. నాకు అన్నపానీయాలు అక్కర్లేదు. మందులు రసాయనిక ఎరువులు ఎవరూ ప్రత్యేకంగా వేయరు. నన్ను ప్రత్యేకంగాపెంచే రైతే లేడు. ఎండన పడి వచ్చిన రైతుని నీడనిచ్చి ఆదరిస్తాను. తట్టలో క్యారేజీలు పెట్టుకొని ఆ తట్ట నెత్తిన పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ళకి క్యారేజీ సప్లై చేసే అప్పారావుక్యారేజి లో మిగిలిన అన్నం నా ఆకులలోనే తిని కాసేపు నా నీడ లోనే కూర్చుని అలసట తీర్చుకోవడంనాకు ఎంతో ఆనందం.

తాళాలు బాగు చేసే నూకరాజు తరతరాలుగా తన కేరాఫ్ అడ్రస్ నాదే చెప్తుంటాడు. నా నీడ లోనే అతని షాప్. ఇద్దరు అన్నదమ్ములు లాగ కలిసి మెలిసి పెరిగాము.

లాల్ బహదూర్ సాయిబుగారు తన బేగంకి తెలియకుండా గడ్డం సవరించుకుంటూ కరీం బీడీ కాల్చుకుంటూ గుప్పు మని పొగ వదలుతు మానసిక ఆనందం పొందేవారు నా నీడ లోనే. ఆయన చేసిన త్యాగానికి నేనే సాక్ష్యం. అందుకే ఈ నగర్ లాల్ బహదూర్ నగర్. నా తో పాటే ఈ నగర్ పెరిగింది.

నా ఆకులు ఏ పశువులు ముట్టుకోవు. నాకు ఏ కంచే అక్కరలేదు. నా మానాన నేను పెరుగుతాను.

ఈ నగర్ లోమునిసిపాలిటి వారు ఎన్ని సార్లు రోడ్లు విస్తరణ చేసిన నన్ను మాత్రం ముట్టుకోలేదు. బహుశా కాకినాడ లో ఉన్న ఏకైక మర్రి చెట్టు ను నేనే, అందుకేనేమో.

నా ప్రక్కనే ఉన్న హోటల్ వారు తన హోటల్ లో వాడిన నీరంతా మురికి కాలువలో పారబోసినప్పుడు నేను ఆశగాచూసేవాడిని. నా కు బిర్యానీ వాసన తప్ప ఏమి లేదు. హోటల్ కి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ నేనే.

దారిన పోయే దానయ్యలు లాల్ బహదూర్ నగర్ లో పనిచేసే పనిమనుషులు లోకాభిరామాయణం మాట్లాడుకునేది నా నీడ లోనే నా కొమ్మల మీద వేలాది పక్షులు కాపురం ఉంటూ తీయగా ఉన్న నా పండ్ల నీ తింటూ నన్ను ఆశీర్వదించు తున్నాయి. పండ్ల లోంచి పడ్డ గింజలు, చుట్టు చీమ లు, పండిపోయి కింద పడ్డ నా ఆకులు రోజు శుభ్రం చేస్తూ నా వాని క్లీన్ గా ఉంచుతున్న municipality వారి ఋణం ఎలా తీర్చుకోగలను ఎందుచేతనంటే నేను రోడ్డు మీద కాపురం ఉన్నాను.

నా ప్రక్కనే ఉన్న పిడత కందిపప్పు బండి వాడు బేరాలు జోరుగా ఉన్నప్పుడు కాగితం ముక్క అయిపోయినప్పుడు నా పెద్ద ఆకులు పుటక్కున తెంపి వాటిలో ముర్రి మిక్చర్ అమ్మిన సందర్భాలు లేకపోలేదు.

నేను ఇలా రోడ్డు మీద ఉన్నాను కాబట్టి నా చుట్టూ ఎవరు అరుగు కట్ట డానికి సాహసించ లేదు. అదే పల్లెటూరి లో ఉంటే నా చుట్టూ అరుగు కట్టి రచ్చబండ గా ఉపయోగించేవారు. నేను జాతీయ వృక్షాన్ని నాకు వటవృక్షం అని బిరుదు. నా ఊడలని దెయ్యాలు గా పోల్చి పిల్లలని భయపెడుతున్నారు. కానీ అవి దెయ్యాలు కాదు అవి ఊయలలే. రోడ్డు వర్కు చేసే కూలీల పిల్లలు అనేక మంది నా ఊడలకి చీరలు కట్టి పిల్లలని పడుకోపెట్టి ఊయల ఊపుతున్న దృశ్యం నాకు ఆనందం.

నా మీద పొడుపు కథలుతో ఆనాటి పిల్లలు కాలక్షేపం చేసేవారు. ప్రతీ వృక్షం నాలాంటిదే. చెట్టు తను బ్రతుకుతూ సమాజాన్ని బ్రతికిస్తుంది. ఆక్సిజన్ ఇస్తుంది. పూర్వ కాలం లో ఎవరింట్లోను ఫ్యాన్లు కూడా ఉండేవి కావు చెట్ల గాలే.. ప్రభుత్వం వారు పట్టుపట్టి చెట్లు కొట్టి వేసినా మళ్లీ నాటినా ప్రాణ వాయువుసరిపోవడం లేదు. గాలి సిలిండర్ లను కొనుకొంటున్నారు ప్రకృతి నుండి వీచే గాలి ఎంత హాయి. ఆరోగ్యం. మరొక పక్క పచ్చదనం కంటికి మంచిది. పర్యావరణ సమతుల్యత కాపాడడం మా బాధ్యత. ఆయుర్వేద వైద్యానికి మాకు అవినాభావ సంబంధం ఉంది.వనాలను పెంచండి. మానవాళి మనుగడకు తోడ్పడండి.

-మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.

(సామర్లకోట)

First Published:  2 Jan 2023 7:43 AM GMT
Next Story