Telugu Global
Arts & Literature

చరమాంకంలో చింత

చరమాంకంలో చింత
X

భార్గవ్ తనదైన 'నందనవనం' లో ఉదయభానుని లేలేత కిరణాల దోబూచులాటలో కాఫీ సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటే - అక్కడకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నఅర్ధాంగితో --

"ఏమిటి ముద్దూ సరిగ్గా నిద్ర పట్టినట్టులేదు, కళ్ళు కూడా ఎరుపెక్కి ఉన్నాయి, ఏదేనా దీర్ఘంగా ఆలోచిస్తున్నావా"

(భార్గవ్ కి అర్ధాంగిని ఏకాంతంలో అలాగే పిలవడం అలవాటు. అలాగని, వాళ్ళేమీ సంసారం తొలి రోజుల్లో ఉన్నారనుకోకండి).

"మీరేమో రెండు నెలల్లో రిటైర్ అవుతున్నారు, అబ్బాయేమో వాళ్ళదగ్గరకి వచ్చేయమంటున్నాడు, మీరేమీ తేల్చడం లేదు. అసలు మీఆలోచన ఏమిటి"

"నేనూ అదే ఆలోచిస్తున్నాను. రెండు రోజుల్లో నిర్ణయిద్దాం. మన స్నేహితులు - సోమశేఖరం, జయరాం, బుద్ధదేవ్, గురుమూర్తి, వెంకటేష్ - కూడా ఇదే సమస్యతో సతమవుతున్నారు. నువ్వేమీ పెద్దగా ఆలోచించకు. నేను పార్క్ లో నడచి వస్తాను"

ఈ ఆరుగురు పక్క పక్కనే ఉంటున్న మూడు అపార్టుమెంట్లలో ఉంటున్నారు. అటూ ఇటుగా ఒకే వయసులో ఉన్న వారు ఒకే సారి రిటైర్ అవుతున్నారు. ఆరుగురికి తలా ఒక కొడుకు కూతురు. అందరి పిల్లలు స్థిరపడ్డారు. అందరివీ స్వంత కొంపలు. ఆరుగురూ వారి వారి భార్యలతో సహా స్నేహంగా ఉంటున్నారు. కొంపలు వేరైనా ఒకే కుటుంబమా అన్నట్లు ఉంటారు. ఆరుగురిలో, భార్గవ్ మంచి ఆలోచనాపరుడు. మిగతా ఐదుగురికి భార్గవ్ అన్నా అతని మాటన్నా గురి. అలాగని భార్గవ్ తన ఆలోచనలని వాళ్ళమీద రుద్దడు. వాళ్ళ అందర్నీ కలుపుకొని తన ఆలోచనలోకి వాళ్ళంతట వాళ్ళే వచ్చినట్లుగా మాట్లాడడంలో అరిదేరినవాడు. గంట తరువాత వచ్చిన భార్గవ్ "ముద్దూ, ఆదివారం మన స్నేహితులని వారి వారి సగం మేనులతో సహా మధ్యాహ్నం భోజనంకి రమ్మని పిలిచాను. నువ్వేమీ శ్రమ పడక్కరలేదు. భోజనాలు తెప్పిస్తున్నాను. అందరం కలిసి తినడమే"

"నాకు తెలియని విశేషం ఏమిటి, అసలు ఎప్పుడు ఇలా ఆలోచించారు. నాకు ఒక్క మాటకూడా ముందుగా చెప్పలేదే"

“మన సమస్య, వాళ్ళ సమస్య ఒక్కటే కదా. అందుకే, అందరం కలిసి ఆలోచిస్తే ఒక పరిష్కారానికి రావచ్చు. ఇప్పుడే పార్క్ లో పిలిచాను. నా మాట నువ్వెప్పుడూ కాదనవుకదా, అందుకే నీతో చెప్పకుండా వాళ్ళని పిలిచాను. సరేనా"

“భోజనాలు ఎక్కడినుంచి తెప్పిస్తారు"

"అది, వాళ్ళకే కాదు, నీకు కూడా సస్పెన్స్"

ఆదివారం మధ్యాహ్నం మిగతా ఐదుగురు దంపతులు భార్గవ్ ఇంటికి చేరుకున్నారు.

భార్గవ్ : "భోజనాలు ఆరంభించేలోగా మన అందరి సమస్య గురించి చర్చించుకుని పరిష్కారానికి ప్రయత్నిద్దాము"

జయరాం : "మీవంటింట్లోంచి ఘుమఘుమలేమి రావడం లేదు, పైగా చెల్లెమ్మ చెమట కూడా పట్టనట్లు ముస్తాబై కూర్చొని ఉంది.మరి భోజనాలకి ఎక్కడేనా ఆర్డర్ ఇచ్చారా, ముందు ఈ సమస్య తేల్చండి"

ఫక్కుమని నవ్విన అందరితో

భార్గవ్ : "ముందుగా భోజనాల విషయం చెప్పకపోతే, ‘ఇప్పుడు వండమంటామేమో’ అనే టెన్షన్ ఆడవాళ్ళ మొహాలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. ఆ భయం అవసరంలేదు. మా ఆఫీసులో ఎటెండర్ భీమారావు మనందరికీ భోజనాలు తెస్తున్నాడు. మా ఆఫీసులో ఏదేనా అవసరం పడితే, ఉన్న నలభైమందికి, ఒకే ఒక హెల్పర్ తో వండి పెడుతుంటాడు. వంట వాడి పేరుకు తగ్గట్టు ‘భీమ పాకమే’. వాడు తెచ్చిన భోజనం తిన్న తరువాత మీరు నాతో ఏకీభవిస్తారు. వాడిచేతే ఎందుకు మనందరికీ భోజనాలు తెప్పిస్తున్నాను అన్నది తరువాత చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆడవాళ్లందరు ఎంత రిలీఫ్ గా కనిపిస్తున్నారో"

అందరు ఒక్కసారి నవ్వుల్లో మునిగిపోయారు.

భార్గవ్, కొనసాగిస్తూ –

“ఇప్పుడు మన సమస్య విషయంలోకి వద్దాము. మనం రిటైర్ అయిపోతున్నాము. అందరినీ వారి వారి అబ్బాయిలు వారి దగ్గరికి వచ్చేయమంటున్నారు కాబట్టి ఏమిటి చేయడం - వెళ్లిపోవడమా వద్దా అన్నది ఇప్పుడు మనందరి ఆలోచన. మనందరి సమస్యని నాబుద్ధికి తోచినట్లు విడమరచి మీముందు ఉంచుతున్నాను. మన అబ్బాయిలు మనలని అలా రమ్మనడం వారి సంస్కారం, పెద్ద మనసు. కానీ మనం గుర్తుంచుకోవలసింది - వారి ఆలోచనలకి, అలవాట్లకు, అభిరుచులకు – మనకు, ఒక తరం అంతరం ఉంది. మనం వాళ్ళకి భారం కాకూడదు. మనం వాళ్లతో – ‘ తామరాకు మీద నీటి బొట్టులా ’ -- ఉండగలుస్తేనే వెళ్ళాలి. లేదంటే, మనం ఇక్కడ, వాళ్ళు అక్కడ ఉంటేనే మనకి వారికి మధ్యన బంధాలు బాంధవ్యాలు సజీవంగా ఉంటాయి”

గురుమూర్తి : “మనం పిల్లల దగ్గరకి వెళ్లొద్దు, వాళ్ళు మన దగ్గరకి రావద్దు అంటే చాలా ఘోరం కాదండీ ?”

భార్గవ్ : “మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, వాళ్ళు మన దగ్గరికి రాకూడదని నేనడంలేదు. వాళ్ళు ఇక్కడకి వస్తే ఎలా కొద్ధిరోజులు ఉండి వెళ్లి పోతున్నారో, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్ధి రోజులు ఉండి వచ్చేస్తేనే ఇరువురికి మంచిది.అబ్బాయి ఇంటికి వెళ్తే, ముఖ్యంగా కోడలికి నచ్చేది, అవసరమైనది తప్పకుండా తీసుకు వెళ్ళాలి. అబ్బాయికి, మనవళ్ళకి ఏమిటి ఇచ్చారు అన్నది రెండో సంగతి. అలాగే - అమ్మాయి ఇంటికి వెళ్తే, ముఖ్యంగా అల్లుడికి నచ్చేది,

అవసరమైనది తప్పకుండా తీసుకు వెళ్ళాలి. అమ్మాయికి, మనవళ్ళకి ఏమిటి ఇచ్చారు అన్నది రెండో సంగతి. వాళ్ళు

మన దగ్గరికి వస్తేకూడా అలాగే వ్యవహరించాలి. వాళ్ళు మన దగ్గర ఉన్న నాలుగు రోజులు వాళ్లకి ఎక్కువ స్వాతంత్రంఇవ్వాలి. వాళ్లకి, వాళ్ళ పిల్లలకి - వాళ్ళ ఇంట్లోకంటే ఇక్కడే బాగుంది అనిపించేటట్లు మన వ్యవహారం ఉండాలి. అలాటప్పుడే వాళ్ళు మరలా మరలా వస్తూంటారు. ఇకమీదట మనం మన పుట్టినరోజు పెళ్లిరోజు మరచిపోయినా సరే మన పిల్లలవి పొరపాటునకూడా మరచిపోకూడదు. ఆ రోజులకి వారికి ఏదో బహుమతో లేక కొంత డబ్బో విధిగా పంపించాలి . అలా చేయడంలో, ఆరోజుకి కానీ ఒక రోజు ముందు కానీ వారికి అందేటట్లుగా పంపించాలి. ఆ రోజు దాటినా,

తరువాత అందుకున్నా దాని విలువ ఉండదు. అలా పంపించడంలో కూడా, కోడలి కోసం అల్లుడి కోసం పంపేటప్పుడు కాస్త ఎక్కువ పంపించాలి. నేను నాశ్రీమతి మా పెద్దవాళ్ళ దగ్గరనుంచి అలా అందుకున్నవి ఇప్పటి వరకు అపురూపంగాదాచుకున్నాం”

సోమశేఖరం : “అక్కడికి వెళ్ళి ఉంటే ఏమిటి సమస్య, మన అబ్బాయి మంచివాడు కదా”

భార్గవ్ : “సోమశేఖరం గారూ, కాకిపిల్ల కాకికి ముద్దే. కానీ ఇప్పటి అవసరం ఏమిటంటే – కాకిపిల్లకి కాకి ముద్దు అనిపించాలి.

వెళ్లిన కొద్దీ రోజులవరకు బాగానే ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ మన మగవారం కానీ మన ఆడవాళ్లు కానీ జీతం భత్యం లేని, ఇవ్వక్కరలేని, పనివాళ్లుగా మారి పోవలసి వస్తే ఆశ్చర్య పడకూడదు. బాధపడకూడదు. ఎంత మన పిల్లల ఇల్లైనా స్వతంత్రంగా ఉండలేము, తిరగలేము, కావలసినది చేసుకోలేము, చేసుకొని / చేయించుకొని తినలేము. వాళ్ళు A.C.గదిలో, మనం మాములు పంఖా గదిలో ఉండవలసి వస్తే ఆశ్చర్య పడకూడదు.

భవిషత్తులో మనకి సమస్యకాకుండా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే

- కత్తిమీద సాము చేయడం వచ్చి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పొతే, ఎన్నో ఎన్నెన్నో. అన్నింటికీ సర్దుకు పోగలమనుకుంటేనే వెళ్ళాలి”

వేంకటేష్ : “అయితే, మనం ఇప్పుడు ఏమి చేద్దామంటారు, సూటిగా చెప్పండి భార్గవ్ గారూ.”

భార్గవ్ : “నా ఉద్దేశంలో – ఆర్ధిక ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధించకపోతే - పిల్లల దగ్గరే మిగతా జీవితమంతా ఉండిపోవడానికై,

వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఇక్కడ స్వంత ఇళ్లలో ఉంటున్నాము. ఒకరికి ఒకరం చేదోడు వాదోడుగా ఒక ఇంటి వారిలాగ ఉంటున్న మనలో ఒకరికి ఏదేనా అవసరం, సమస్య వస్తే మిగతా వాళ్ళు లేరా. వంద మీటర్ల దూరంలోపలే మన ఆరు కుటుంబాలు ఉంటున్నాయి. పాతిక అడుగులు వేస్తె పార్క్, దేవాలయం ఉన్నాయి. మరో ఏభై అడుగులు వేస్తె హాస్పిటల్ ఉంది. ఆ దేవదేవుడు ఇవన్నీ మనకి అమర్చినప్పుడు మనం ఎందుకు ఒకరి మీద -- వారు మన పిల్లలైనా - ఆధారపడాలి”

బుద్ధదేవ్ : “ఇంతేనా లేక ఇంకా మనం ఆలోచించుకోవలసింది ఏమేనా ఉందంటారా ?”

భార్గవ్ : “ నా మాట విని మనం అందరం ఇక్కడే ఉంటామనుకుంటే -- వచ్చే రోజుల్లో మన ‘జీవన విధానం’ లో కూడా మార్పు

ఉండాలని నా అభిప్రాయం. “

గురుమూర్తి : “అది కూడా ఏమిటో చెప్పండి మరి. నాకు ఆకలి దంచేస్తోంది.”

భార్గవ్ : “భీముడు మన భోజనాలు తెచ్చేసాడు. భోజనాలైన తరవాత ఆ సంగతి చెప్తానులెండి.”

---భోజనాలైన తరువాత ---

భార్గవ్ : “మీరందరు ‘భీముడి వంట’ విషయంలో నాతో ఏకీభవించినట్టేకదా”

అందరూ ముక్త కంఠంతో -- "భీముడికి, భీముడి వంటకాలకు, అవి ఏర్పాటుచేసిన మీకు జై"

భార్గవ్ : “ఓకే ఓకే. చాలా సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా మనసుపెట్టి వినండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా

ఎవరి విల్లు వారు వ్రాయాలి. విల్లులో ఆడ పిల్లలని మరచిపోకూడదు. అలా వ్రాసిన విల్లుని జాగ్రత్తగా భద్రపరచాలి.రిజిస్టర్ చేస్తే మరీ మంచిది. మన ఇన్సురెన్స్, ఆర్ధిక వ్యవహారాల వివరాలు - అన్నీ జీవిత భాగస్వామికి పూర్తిగా అర్ధం అయేటట్లుగా చెప్పాలి. వాటికి సంబంధిన కాగితాలు వివరాలు అన్నీ బోధపరచి, భద్రపరచాలి. బ్యాంకు అకౌంట్లుకి శ్రీమతి పేరు కూడా జత చేయాలి - అవి ఇద్దరిలో ఎవరేనా నడుపుకునే సదుపాయం కల్పించాలి. అవి అన్నీ సక్రమంగా నడపడానికి కావలసిన కంప్యూటర్, మొబైల్ పరిజ్ఞానం శ్రీమతికి లేకపోతే, నేర్పించాలి.”

జయరాం : “ఈ వయసులో వీళ్ళు ఎలా నేర్చుకోగలరండి”

భార్గవ్ : “జయరాం గారూ !ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముదమారా నేర్పింపగన్ ' అన్నారు ఆర్యులు. ఆడవారిని, అందునా శ్రీమతిని, ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. 'కరణేషు మంత్రి' అన్నారు కదా శ్రీమతిని. ఇప్పటివరకు మన జీవితం ఒక ఎత్తు, ఇక మీదట ఒక ఎత్తు. శరీరాన్ని కష్టపెట్టక పోయినా మరీ సుఖ పెట్టకూడదు. కావలసిన నడక, వ్యాయామం, ప్రాణాయామం ఇవన్నీ సమకూరుస్తేనే మనతో మన శరీరం సహకరిస్తుంది. రిటైర్ అయిపోయామని ఇవన్నీ మానేస్తే, లేని పోని రోగాలకు పుట్టిల్లుగా మారుతుంది.

నియమిత కాలానికి చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి, వేసుకోవలసిన మందులు సమయానికి వేసుకుంటూఉండాలి. ఈ విషయంలో ఆడ మగ అన్న బేధం ఉండకూడదు. మరొక అతి ముఖ్య విషయం. మనం రిటైర్ అయిపోయి, శ్రీమతి అలా పని చేస్తూ ఉండాలి అనుకోవడంతో నేను ఏకీభవించలేను. మనలాగే ఆడవారికి కూడా కొంత వయసు వచ్చిన తరువాత విశ్రాంతి తప్పక ఇవ్వాలి”

గురుమూర్తి గారి భార్య కలగచేసుకొని, భార్గవ్ తో : "అన్నయ్యగారు మీరు చెప్పినది చాలా బాగుంది, మేము కోరుకునేది కూడా అదే. కానీ, వంటపని మాకు తప్పదుకదా"

భార్గవ్ : “అక్కడికే వస్తున్నానమ్మా. మీ అందరికి భీముడు చేతి వంట నచ్చింది కాబట్టి, నా ఆలోచన ఏంటంటే---భీముడు మనందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు తెచ్చిపెడతాడు. ఓ నాలుగు ఆవులు ఉంచుకున్నాడు. ప్యాకెట్ పాలు మానేస్తాం అంటే, వాడే మనకి చిక్కటి ఆవు పాలు పోస్తాడు. వాడి పెరట్లోనే కూరగాయలు పండిస్తున్నాడు. మనకి కావలసిన కూరలు వాడి పెరట్లోని తాజాకూరగాయలతో, మనకి కావలసిన విధంగా అంటే నూనె, మసాలాలు బాగా తగ్గించి రుచిగా చేసి పెడతాడు. ఇప్పటివరకు మనం ఎన్నో రకాలు తిన్నాము. సుమారుగా అన్ని రుచులు రుచి చూసేం. ఇకమీదట, రుచికి బదులు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. తినే పరిమాణం కూడా తగ్గించాలి. అందుకే, రోజువారీ తినే మధ్యాహ్నం భోజనంలో -- అన్నం, ఏదో ఆకుకూరతో పప్పు, ఒక కూర, పచ్చడి, పులుసు లేక సాంబారు, అరటిపండు, ఆవకాయ, అప్పడం, పెరుగు చాలవూ. అలాగే రాత్రికి రెండో మూడో చపాతీలు ఒక కూర చాలవూ. వీటన్నిటికీ బజార్లో హోటల్ కి వెళ్లడం బదులుగా భీముడు ఇవన్నీ మన ఇళ్ళకి తెచ్చి వేడివేడిగా సమయానికి ఇస్తాడు. హాయిగా తిందాం. అందుకు సరిపోయిన డబ్బు వాడికి ఇస్తే - ఆరోగ్యకరమైన భోజనం శ్రమలేకుండా మన దగ్గరకి వస్తుంది. ఉదయం అల్పాహారం కూడా ఏమి కావాలనుకుంటామో మనం ముందు రోజు చెప్తే, తెచ్చి వేడి వేడిగా ఇస్తాడు. ముందుగా మనం తలా వేసుకొని వాడికి కొంత డబ్బు సమకూరుస్తే, మనం అనుకున్నవన్నీ సమకూర్చడానికి వాడికి సులువుగా ఉంటుంది”

జయరాం : “అయితే, ఈ భీముడు రోజూ మన ఇళ్ళకి మనకి కావలసిన ఫలహారం, భోజనాలు తెస్తే మనం హాయిగా తింటూ కూర్చోవచ్చు అంటారు. భేషుగ్గా ఉంది మీ ఆలోచన”

భార్గవ్ : “ఆ విషయంలో కూడా మనం ఒక మార్పు చేసుకుంటే ఇంకా పరమానందంగా మన రోజులు గడుపుకోవచ్చు.”

గురుమూర్తి : “ఇంకో ఐడియా కూడా ఉందన్నమాట మీ బుర్రలో, భలే, అది కూడా సెలవీయండి.”

భార్గవ్ : “మనం ఒక నియమం పాటిద్దాం ---

మన పేర్లు సరిపోయేటట్టు - సోమశేఖరంగారింట్లో సోమవారం,జయరాంగారింట్లో మంగళవారం, బుద్ధదేవ్ గారింట్లో బుధవారం, గురుమూర్తిగారింట్లో గురువారం, మాఇంట్లో శుక్రవారం, వెంకటేష్ గారింట్లో శనివారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చేద్దాం. ఆ విధంగా అందరంకలసి సరదాగా తింటుంటే ఉల్లాసంగా ఉంటుంది. ఉదయం అల్పాహారం ఎవరింట్లో వారు చేస్తారు. భీముడు అందరి ఇళ్ళకి ఉదయం తొమ్మిది గంటలకి అల్పాహారం హాట్ ప్యాక్ లో తెచ్చి ఇస్తాడు. మనం చెప్పినట్లుగా, రోజుకి ఒకరింట్లో మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపల భోజనం, అలాగే రాత్రి ఎనిమిదికి రొట్టెలు కూర తెచ్చిస్తాడు. రాత్రి భోజనంకి ఒకగంట ముందర మనం అందరం కలసి దేముడి మీద భజనలు పాడు కుందాం. అందుకై మనం ఏమీ గాన గంధర్వులు, గాన కోకిలలు అవక్కరలేదు. మనకి వచ్చినట్లుగా నచ్చినట్లుగా పాడుకుంటే, మనసుకి కూడా హాయిగా ఉంటుంది. అలా అందరం కలసి తినడానికి - ఇంకొక షరతు లేదా సూచన ఏమిటంటే -- ఏ రోజు ఎవరింట్లో తింటామో వారు ఉప్పు, రెండు పచ్చిమిరపకాయలు, నిమ్మచెక్క, నూనె, నెయ్యి, ఆవకాయ ఇవ్వాలి. భీముడు అరటిఆకులు తెస్తాడు. ఇక, ఆదివారాలు ఎవరింట్లో వారు భార్యభర్త కలసి వండుకుని తింటారో ఏదేనా హోటల్ కి వెళతారో ఎవరిష్టం వారిది. ఎండాకాలంలో చల్లటి ప్రదేశాలకి, చలికాలంలో చలిలేని ప్రదేశాలకి అప్పుడప్పుడు యాత్రలు చేద్దాం. వర్షాకాలం ఎక్కడకి వెళ్లకుండా ఇక్కడే హాయిగా ఉందాం. మధ్యలో అబ్బాయి ఇంటికో అమ్మాయి ఇంటికో ఎవరికి ఎప్పుడు వీలయితే అప్పుడు వెళ్లి కొన్ని రోజులు గడిపి వెనక్కి వస్తూందాం. మన అందరి దగ్గర అందరి పిల్లల పేర్లు, చిరునామా, మొబైల్ నెంబర్లు ఉంచుకోవాలి. నాకు తోచిన ఆలోచన మీ అందరికి చెప్పాను. ఎవరేనా ఏమేనా సవరణ చేద్దామంటే చెప్పండి.”

అందరూ ముక్త కంఠంతో -- "చాలా బాగా వివరంగా చెప్పారు భార్గవ్ గారు. ఏ సవరణలు అవసరంలేదు. ఇక మీ ఆలోచన తు.చ. తప్పకుండా పాటించడమే" అని అంటూ -- చింతలు తీరిన మనసుల ఆనందంతో ఎవరింటికి వారు బయలుదేరేరు.

మద్దూరి నరసింహ మూర్తి

First Published:  8 Nov 2023 7:49 AM GMT
Next Story