Telugu Global
Arts & Literature

లోకం తీరు (కథ)

లోకం తీరు (కథ)
X

అనగనగా ఓ సాధువు.

ఆయనకో రోజు కలొచ్చింది.

ఆ కలలో ఆయన స్వర్గానికి వెళ్ళారు.

అక్కడ భారీ ఎత్తున ఓ ఉత్సవం జరుగుతోంది.

ఎటు చూసినా అలంకరణలు. తోరణాలు.

అంతా వర్ణమయం. పూల పరిమళాలతో గుబాళిస్తోంది. అన్ని భవనాలూ కళకళలాడుతున్నాయి. ఇంతకూ ఆ ఉత్సవమేమిటో సాధువుకు బోధపడలేదు.

అక్కడ ఎదురుగా వస్తున్న ఒకరిని ఆపి "ఇక్కడేం జరుగుతోందీ?"అని అడిగారు.

"మీకు తెలీదా? ఈరోజు దేవుడి పుట్టింరోజు. ఈ సందర్భంగా అందరూ కలిసి వేడుకలు జరుపుకుంటున్నాం. వివిధ వర్గాలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ఊరేగింపులో దేవుడూ పాల్గొనబోతున్నాడు" అన్నాడా వ్యక్తి.

వెంటనే ఆ సాధువు ఓ చెట్టు నీడన నిల్చున్నారు. ఊరేగింపు వస్తోంది. మొదట ఓ గుర్రం వస్తోంది. దాని మీద ఒఖడు కూర్చున్నాడు. అతని వెనుక చాలా మంది వస్తున్నారు. అప్పుడా సాధువు గుర్రం వస్తున్నది ఎవరూ అని అడిగారు.

ఓ మతం పేరు చెప్పి ఆయన ఆ మతపెద్ద అన్నాడొకడు. ఈ గుంపు వెళ్ళాక మరొక గుంపు వస్తోంది. ఆ గుంపు ముందరా ఒకడు గుర్రం మీద వస్తున్నాడు. అతనెవరూ అని సాధువు అడగ్గా ఆ మనిషి ఇంకొక మతానికి నేత అన్నాడొకడు.

ఇలా ఒక్కొక్క గుర్రమూ రావడం, ఆ గుర్రం వెనుక ఓ పెద్ద గుంపు.

ఇలా రెండు మూడు గంటలు సాగాక ఓ వయస్సు మళ్ళిన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నారు. ఆ మనిషి వెనుక ఒక్కరూ లేరు. ఆ మనిషి వాలకం చూస్తుంటే ముందెళ్ళిన ఊరేగింపులతో ఎలింటి సంబంధమూ లేదేమో అన్నట్టు అనిపించింది.

ఇప్పుడీ వృద్ధుడెవరూ ఆని సాధువు అడిగారు.

"అదేంటీ అలా అడుగుతున్నారు? ఆయనే భగవంతుడు. ఆయనకే పుట్టింరోజు.ముందెళ్ళిన వారందరూ ఆయన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు" అన్నాడొకడు.

ఆ మాట విన్న సాధువు కంగుతిన్నారు.

ఇక్కడిదాకా కల కన్న సాధువు లేచి కూర్చున్నారు. అనంతరం ఆలోచించారు.

నిజమే. భక్తులందరూ భక్తి మార్గంలో పోతున్నట్టే అనుకుంటూ దారి తప్పిపోతున్నారు. దేవుడ్ని అనుసరిస్తున్నామనుకుని ఎటో పోతున్నారు తప్ప దేవుడి వెనుక ఎవరూ పోవడం లేదు.

దీని గురించి ఆలోచీస్తూ కూర్చుంటే తానూ దారి తప్పిపోతానేమో అనుకుని చైతన్యవంతులై సన్మార్గంలో నడిచేందుకు కంకణం కట్టుకున్నారు.

- యామిజాల జగదీశ్

First Published:  15 Dec 2022 10:14 AM GMT
Next Story