Telugu Global
Arts & Literature

మీరజాలగలడా ...( కథ)

మీరజాలగలడా ...( కథ)
X

శ్రుతీ! కాఫీ పెట్టడం కాలేదా? మీ మామ గారికి ఉదయం ఆరు గంటలకు కాఫీ ఇవ్వాలమ్మా! రేపటినుండి ఇంకా త్వరగా లేవాలమ్మా! అంది అత్త మీనాక్షి.

అలాగేనమ్మా! అంటూ అందరికీ కాఫీ అందించాను .అత్త మామలకు భర్తకు అందరికి అణకువగా ఉంటూ పనులు చేస్తున్నాను .అయినా అందరూ నాతో ముభావంగానే ఉంటున్నారు.

ఒకరోజు ఆడబిడ్డ మాధవి ఊరినుండి వచ్చింది. నేను ఏం చేసినా అన్నింటికీ వంకలు పెడుతూ "మీ అమ్మ నాన్న ఇద్దరూ గవర్నమెంట్ స్కూలు ఉపాధ్యాయులుగా పని చేస్తూ మా తమ్ముడికి కట్నం కానుకలు ఏమీ ఇవ్వలేదు. "కరోనా" వల్ల ఎక్కువ మందిని పెళ్లికి పిలువకూడదని సింపుల్ గా చేశారు. నీకు మీ అమ్మ ఏ పనీ సవ్యంగా చేయడం నేర్పలేదు "అంది.

నేను సమాధానం ఇవ్వకుండా అందరి ముఖాలు పరిశీలనగా చూసాను .అందరూ మాధవిని సమర్ధిస్తున్నట్లుగా అనిపించింది.

ఏం మాట్లాడకుండా నా గదిలోకి వెళ్లి ఆలోచనలో పడ్డాను .ఈ పరిస్థితికి తన తెలివితక్కువ తనమే కారణం.

అమ్మ శ్రీదేవి, నాన్న శ్రీధర్ , తనను ఎంతో గారాబంగా,పనిచేస్తే కందిపోతుందేమోనన్నట్లుగా అపురూపంగా పెంచారు. తాను కోరినది నిముషాలమీద కొని తెచ్చేవారు.తనను ఇంజినీరింగు చదివించసాగారు.

తాను ఇంజినీరింగు రెండవసంవత్సరంచదువుతున్నప్పుడు, కవితలు వ్రాసి చదివి ఫేస్ బుక్ లో పెట్టేది.

ఎందరో అవి విని బాగున్నాయి అనేవారు. సూరజ్ తన కవితల్ని మెచ్చుకునేవాడు.సూరజ్ లలిత గీతాల్ని పాడి తనకు పంపించేవాడు. అలా తామిద్దరూ స్నేహితులయ్యారు.

సూరజ్ తాను ఇంజినీరింగు చదివానని, ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు.తన తండ్రి కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాడు.

మా కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడు.నాకు ఒక అన్నయ్య శ్రీకాంత్ ఉన్నాడని, అన్నయ్య నేను ఇంజినీరింగు చదువుతున్నామన్నాను.

సూరజ్ ఒక రోజున..". శ్రుతీ! నీవంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందా"మన్నాడు.

"మా నాన్న ఇప్పుడు నాకు పెళ్లి చేయరు. నేను ఇంజినీరింగు పూర్తి చేసాక, అమెరికాలో ఉన్న మా మేన మామ దగ్గరకు పంపించి, నన్ను ఎం.ఎస్. చదివించాలనుకుంటున్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకోలే"నన్నాను.

"నీవు లేనిదే నేను బ్రతకలేను

శ్రుతీ! నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో,ఆరాధిస్తున్నానో చెప్పలేను,"అంటూ పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు.

సూరజ్ చాలా అందంగా ఉంటాడు. నేను అతని అందం పట్ల ఆకర్షితురాలినయ్యాను.

"మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోక పోతే , నీవు మా ఊరు వస్తే, మా నాన్న మన పెళ్లి జరిపిస్తారు. నీవు మా ఊరు రా "అని

తొందరపెడుతుంటే నేను సరేఅన్నాను.ఫలితంగా ,అమ్మ నాన్నకు చెప్పకుండా, ఒక రోజు కాలేజీకి వెళ్లి సూరజ్ తెచ్చిన కారులో వాళ్ళ ఊరు వెళ్ళాను.

సూరజ్ ఆతని తల్లిదండ్రులు, నన్ను తీసుకుని పోలీస్ స్టేషనుకు వెళ్లి, మా నాన్నతో చెప్పి , మా పెళ్లి జరిపించమని కోరారు.

వెంటనే మాఅమ్మ ,నాన్న, మామయ్య, మా అన్నయ్య వచ్చారు.

అందరి మాటలు విని, మా నాన్న ఆ ఊరిలోనే నాకు, సూరజ్ కు

వివాహంజరిపించారు.మా బంధువులు, స్నేహితులు ఎవ్వరినీ పిలువలేదు.'కరోనా' వల్ల ఎక్కువ మందిని పిలువకూడదని ఆంక్షలు ఉన్నాయి.

నాకు కావలసిన చీరలు,నగలు కొని ఇచ్చి, నన్ను మా అత్త గారి ఇంట్లో దింపి, మా వాళ్ళు వెళ్లిపోయారు.

నాచదువు ఆగిపోయింది.కని, పెంచి, విద్యాబుద్ధులుచెప్పించినతల్లిదండ్రులకు చెప్పకుండా, ఫేస్ బుక్ లో పరిచయమైన వాడి తీపి మాటలు నమ్మి వచ్చిన నాలాంటిదానికి,ఇలాంటి శాస్తి కావలసిందే అనుకున్నాను.

భర్త ఏం చెప్పినా,ఎవరు ఏం చెప్పినా, వాళ్ళు చెప్పినట్లు చేయడమే కానీ ఎదురు చెప్పేదాన్ని కాదు. అందువల్ల మా అత్త మామలు నా పట్ల ప్రేమగానే ఉండేవారు. మా ఆడబిడ్డ నాలుగు రోజులు ఉండి వెళ్లి పోయింది.

సూరజ్ నేను ఆనందంగానే ఉండేవాళ్ళం. నేను గర్భవతినయ్యాను. మనుమడు పుట్టబోతున్నాడని, మా అత్త మామలు సంబరపడిపోయారు.

ఏడవ నెలరాగానే , మా అమ్మ నాన్న వచ్చి, సీమంతం చేసి నన్ను తమ ఊరికి తీసుకు వెళ్ళారు.మా అత్తగారింట్లో నా జీవన విధానాన్ని, అమ్మ అడిగితే చెప్పాను.నాన్నపక్కన కూర్చుని విన్నారు.

సూరజ్ ఇంజినీరింగు చదవలేదని, డిప్లోమా చదివాడని, ఉద్యోగం ఏమీ లేదని, ఇద్దరు పనివాళ్లను పెట్టుకుని, ఏ.సి లు టి.వీ.లు రిపేరు చేసే షాపుపెట్టుకున్నాడని చెప్పాను.

నీవు చదువు పూర్తి చేసి ఉంటే ఎంతో మంచి సంబంధం తెచ్చే వాళ్ళమని అమ్మ నాన్న బాధ పడ్డారు. ఆడపిల్లకు తల్లిదండ్రులకన్న వేరే దైవం లేదు.ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను.

నాకు ఆడపిల్ల పుట్టింది. బారసాలకు అత్తగారింటివాళ్ళు వచ్చి, వెళ్లారు.నా భర్త సూరజ్ అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళేవాడు.సూరజ్ కు ఫోన్ వస్తే మా తోటలో దూరంగా వెళ్లి మాట్లాడేవాడు. ఇది నాన్నకూడా గమనించారు.

ఒక రోజున నాన్న నాతో , నీవు ఇంట్లో ఉంటే సూరజ్ తోటలోకి వెళ్లి అర గంటసేపు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అల్లుడి ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. అతను స్నానం చేసేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు ఫోన్ తీసి ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించు అన్నారు.

సూరజ్ స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసి చూస్తే, ఎందరో ఆడపిల్లల మెసేజ్ లుఉన్నాయి.కొంప మునిగిందనుకుని నాన్నకు చెప్పాను. అవన్నీ ఫోటోలు తీయమని, సూరజ్ ను వేయి కళ్ళతోకనిపెట్టమని నాన్న చెప్పారు.

సూరజ్ స్నానానికి వెళ్ళినప్పుడు ఒక రోజు ఫోన్ వస్తే,తీసాను. ఎవరో ఆడపిల్ల .. ఎప్పుడు వస్తావు సూరజ్? నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాము? అంటోంది.ఆ మాటలన్నీ నా ఫోన్ లో రికార్డ్ చేసాను.

అమ్మ, నాన్న, నేను... ఆలోచించాము. భార్య నీవు ఉండగా ఇంకో ఆడపిల్లతో, పెళ్లి వరకు వచ్చాడంటే... అతన్ని మనం నమ్మలేము. నేను లాయరుతోమాట్లాడతాను. విడాకులు ఇవ్వడమే మంచిదిఅన్నారునాన్న.

అమ్మకు, అదే మంచిదనిపించింది.నేనే ఎటూ తేల్చుకోలేక పోయాను

నాన్న చొరవతో సూరజ్ కు విడాకులు కోరుతూ లాయర్ నోటీసులు వెళ్లాయి. అతను, అతని తల్లిదండ్రులు వచ్చారు.

సూరజ్ తల్లిదండ్రులకు నాన్న పరిస్థితి వివరించారు. "ఒక ఆడపిల్ల తండ్రిగా, మా శ్రుతి మీ సూరజ్ ను ఇష్ట పడిందని,సూరజ్ కి ఇచ్చి పెళ్లి చేశాము.మా అమ్మాయి చదువు మానేసింది. బిడ్డ పుట్టాక డాక్టర్ల సలహా మేరకు, భార్యా భర్తలు కొంత కాలం ఎడంగా ఉండాలంటే, మీ సూరజ్ వేరే స్త్రీలతో స్నేహాలు చేస్తున్నాడు .మా దగ్గర సూరజ్ చేసిన పనికి , సాక్ష్యాలు ఉన్నాయి. శ్రుతి, సూరజ్ కు విడాకులు ఇస్తుంది. కోర్టులో చూసుకుందా"

మన్నారు నాన్న.

మా ఆత్త, మామలు, మా నాన్నను, నన్నూ విడాకులు ఇవ్వవద్దని బ్రతిమాలారు.

మా నాన్న ఒప్పుకోలేదు.

నేను... "మా అమ్మ నాన్నలకు చెప్పకుండా, సూరజ్ తో వచ్చి ఎంతో పొరపాటు చేశాను. అయినా మా అమ్మ నాన్న పెద్ద మనసుతో నన్ను క్షమించి చేరదీశారు. ఇప్పుడు మా తల్లిదండ్రుల మాట జవదాటను. నేను మరల కాలేజ్ లో చేరి ఇంజినీరింగ్ చదువుతాను .సూరజ్ ను నమ్మలేను "అన్నాను.

కోర్టులోకేసు వచ్చింది వకీలును పెట్టకుండా మా నాన్నే వాదిస్తానన్నారు

మా మామ గారు మా ముందే సూరజ్ ను తప్పుడు పని చేసినందులకు మందలించారు. "భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేయకుండా సూరజ్ ను, తాను కంట్రోల్ చేస్తాననీ విడాకులు ఇవ్వ వద్దని"నాన్నను బ్రతిమాలారు.

సూరజ్ కూడా నాన్న చేతులు పట్టుకుని, అలాంటి స్నేహాలు ఇక మీదట చేయనని, తనని క్షమించి తమ కాపురం నిలబెట్టమని బ్రతిమాలాడు.

జడ్జి గారు కూడా విడాకులు తీసుకోవడం మంచిది కాదనీ ,రాజీ పడమని నాన్న గారికి సలహా చెప్పారు.

నాన్న జడ్జీ గారితో,

సూరజ్ కు మా ఊరిలో మెకానిక్ షాపు పెట్టిస్తానని, దానిని చూసుకుంటూ సూరజ్ సవ్యంగా ఉండాలని, మా శ్రుతి చదువుకు ఆటంకం కలిగించకుండా ఉంటే రాజీకి ఒప్పుకుంటామని చెప్పారు.

అలా కాగితం వ్రాసి, సంతకం చేసి, సూరజ్ జడ్జీ గారికి అందించాడు.

జడ్జీ గారు ఆ కాగితాన్ని , నాన్నకు అందించి, "ఇక మీదట మీ అల్లుడు మీ కళ్లెదుటే ఉంటాడు "అని చెప్పి , మా విడాకుల కేసు కొట్టేశారు.

"ఇక మీరజాలగలడా నా ఆనతి ..."ఆంటూ నా మనసు తృప్తిగా ఆనందంతో నాట్యం చేసింది

-లింగంనేని సుజాత

First Published:  24 March 2023 5:09 AM GMT
Next Story