Telugu Global
Arts & Literature

మనిషెక్కడో లేడు..!(కథ)

మనిషెక్కడో లేడు..!(కథ)
X

దిగ్గున లేచేడు శ్రీనివాసరావు మడతమంచం మీదనుంచి టైమ్ చూసుకున్నాడు. 4.55 ని॥ మరో 5 నిమిషాలు మాత్రమే ఉంది ట్రైన్ బయలుదేరడానికి, హడావిడిగా బ్యాగ్ సర్దుకుని లాడ్జి కౌంటర్లో తనకు రావలసిన మిగిలిన 50 రూపాయలు తీసుకుని స్పీడ్ గా మెట్టుదిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు రోడ్డుమీదకు షేర్ ఆటోకోసం వెదుకుతున్నాడు.

ట్రాఫిక్ పుల్ గా ఉంది. ఎవ్వరూ ఆపటంలేదు ఆటో, "కాస్త ముందుకెళ్ళి నిలబడు... ట్రాఫిక్ లో ఎలా ఆపుతారు" ఎవరో అరుస్తున్నారు. పరుగెత్తాడు. కాస్త ముందుకు. ఆపాడొక ఆటో, వెనుక ఫుల్ గా వున్నారు. "ఎక్కడికి" అడిగాడు ఆటో డ్రైవర్... "రైల్వే స్టేషన్" అంటూ డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. త్వరగా వెళ్ళాలన్న ఆదూర్దా కనిపిస్తోంది అతని ముఖంలో,

"కాస్త త్వరగా పోనీ బాబు ట్రైనికి టైమ్ అయ్యింది” రిక్వస్ట్ చేస్తున్నాడు డ్రైవర్ని. అంత ట్రాఫిక్ అయినా కూడా కాస్త స్పీడ్ గానే వెళుతోంది ఆటో, పాడు నిద్ర... తనకు ట్రైన్ని దూరం చేస్తుందేమో. రాత్రంతా సరిగా నిద్రలేదు. అందుకే రెస్ట్ తీసుకున్నాడు. మెళకువ రాలేదు. 'నేను లేపుతాలే ' అన్న లాడ్జి బాయ్ లేపలేదు. ఇప్పుడు ఇంత ట్రాఫిక్...

"అన్నా కాస్త దిగు" అన్నాడు ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు వైపు చూడకుండానే. దూరంగా చూస్తున్నాడతను. ట్రాఫిక్ ఎస్.ఐ., కానిస్టేబుల్స్ బండ్లను ఆపుతున్నారు. పక్కగా ఆపి, "అన్నా కాస్త దూరం నడచిరా.... అక్కడ పట్టుకుంటున్నారు. డ్రైవర్ ప్రక్కన కూర్చోకూడదు. త్వరగా నడు.. అని సమాధానం కోసం ఎదురుచూడకుండా లాగించేసేడు ఆటోను. ఒక్క క్షణం ఆగాడు శ్రీనివాసరావు. ఆలోచనలు తనను తరుముకోక ముందే తనే పరిగెత్తుతున్నాడు. ట్రాఫిక్ ఎస్.ఐ.ని దాటి కొంత దూరం పోయిన తరువాత ఆపాడు ఆటో. రొప్పుతూ అతని పక్కన కూర్చున్నాడు. ఆయాసం ఎగతన్నుతుంది.

స్పీడుగానే పోతోంది ఆటో: టైమ్ గం॥ 5.10 ని. ట్రైన్ వెళ్ళిపోయుంటుందేమో...!. ఏమో.. కాస్త ఆలస్యంగా బయలుదేరుతుందేమో.... భగవంతుడా.. ప్రార్థించుకుంటున్నాడు మనసులో. రైల్వో స్టేషన్ బయట ఆపాడు ఆటో. ముందుగానే జేబులోంచి తీసి ఉంచుకున్న రూ.20/- ని డ్రైవర్ చేతులో పెట్టి పరిగెత్తాడు స్టేషన్లోకి.

కిటకిట లాడుతోంది రైల్వే స్టేషన్, పోర్టర్ ని అడిగాడు మొదటి ప్లాట్ ఫారమ్ లోకి అడుగు పెడుతూ 'గోదావరి వెళ్ళిపోయిందా' అని, 'ఇప్పుడే... అదోగో' అంటూ చూపించాడు దూరంగా వెళుతున్న ట్రైన్ వైపు, గార్డుబోగి లైటు తనను వెక్కిరిస్తూ కనిపిస్తోంది.

భారంగా నిట్టూరుస్తూ నిలుచుండి పోయాడు కాసేపు. నెమ్మదిగా కదిలి బుక్ స్టాల్ ప్రక్కనున్న బెంచిమీద కూర్చున్నాడు.

తను హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాడు 'పరిషత్ నాటిక పోటీలకు' తన టీం నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చింది. వైజాగ్ మద్దిలపాలం 'కళామందిర్ లో నిన్నటిరోజు తమ ప్రదర్శన 'చిగురించని వసంతం'. శ్రీనివాసరావు తీరిక సమయంలో తమ టీమ్ తో కలిసి పోటీనాటికల్లో పాల్గొంటుంటాడు. రెండు సంవత్సరాలైంది శ్రీనివాసరావు బ్రతుకుతెరువు కోసం తనకుటుంబంతో హైదరాబాద్ వచ్చి.

పాపకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది మంచి కాలేజీలో, భార్య వసంత ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. శ్రీనివాసరావు బట్టల దుకాణంలో గుమాస్తా. అడపాదడపా నెల్లూరులో ఉన్న తమటీమ్ నాటకపోటీలలో పాల్గొంటూ శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి రమ్మని టికెట్ బుక్ చేస్తారు. శ్రీనివాసరావు టీమ్ లో ఉంటే వాళ్ళకు ఎక్కడలేని ధైర్యం. రిహార్సిల్స్ అవసరం లేదు. డైరెక్ట్ గా స్టేజ్ మీద నటించడంలో దిట్ట. మంచి అనుబంధం ఆ టీమ్ తో శ్రీనివాసరావుకి.

నిన్నటి రోజు జరిగిన పోటీలలో తమ టీంకు 'ఉత్తమ ప్రదర్శన' మరియు శ్రీనివాస రావుకు ఉత్తమ సహాయనటుడు బహుమతులు లభించాయి. ప్రదర్శనానంతరం వారు తిరిగి నెల్లూరుకి బయలుదేరారు. శ్రీనివాస రావుకు హైదరాబాద్ కు రిజర్వేషన్ దొరకక పోవడంతో ప్రక్కరోజు 'గోదావరి'కి చేశారు. వెళుతూవెళుతూ ఖర్చులకు శ్రీనివాసరావుకు కొంత డబ్బు ఇచ్చారు. వారిని రాత్రి 2.00 గం||లకు నెల్లూరు సాగనంపి, మద్దెలపాళెంలో ఓ చిన్న లాడ్జిలో మడతమంచం అద్దెకు తీసుకుని పడుకున్నాడు.

ఒంటరిగా ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టదు శ్రీనివాసరావుకి. గతం వెంటాడుతూ ఉంటుంది.

మగత నిద్రపట్టింది. ప్రక్క మంచంలో ఉన్న వ్యక్తి ఫోనులో పెద్దగా మాట్లాడుతున్నాడు. వారించలేడు తను. టైము చూసుకున్నాడు 5.30 అయింది. లేచి బ్రష్ చేసుకుని క్రిందకెళ్ళి 'టీ' త్రాగుతు వసంతకు ఫోన్ చేసాడు. నిన్న తనకు రిజర్వేషన్ దొరకలేదని... ఈరోజు 'గోదావరి'కి చేసారని, సాయంత్రం బయలుదేరుతానని చెప్పాడు. భర్తకు జాగ్రత్తలు చెప్పింది వసంత. తనకు తెలుసు భర్త గురించి. ఒంటరిగా ఉండలేడు తను.

"సార్.. కాస్త జరగండి" అన్న పిలుపుతో ఆలోచనల నుంచి బయటకొస్తూ ప్రక్కకు జరిగి కూర్చున్నాడు. మాటలు కలుపుతూ 'తరువాత ట్రైన్ ఎన్నిగంటలకు హైదరాబాద్ కి' అని అడిగాడు. '7.00గం||లకండి' సమాధానమిచ్చాడతడు. ఇంకా గంట టైముంది. తనకు రిజర్వేషన్ లేదు. జనరల్ లో వెళ్ళాలి. మెల్లగా లేచి టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి టిక్కెట్ తీసుకున్నాడు. టికెట్ కొనగాపోను కేవలం 10/- మాత్రమే ఉన్నాయి అతని దగ్గర.

జనరల్ బోగి కిటకిట లాడుతోంది. హాడావిడిగా తోసుకుంటూ ఎక్కుతున్నారు ప్రయాణీకులు. ఎలాగోలా ఎక్కాసాడు శ్రీనివాసరావు, సీట్లు ఎక్కడా లేవు, నిల్చొని పోవాలసిందే. 'వరంగల్ వరకు ఖాళీ అవ్వదు' ఎవరో అంటున్నారు. ఉసూరుమంది శ్రీనివాసరావు ప్రాణం. వరంగల్ చేరేసరికే తెల్లవారుతుంది. తగిలించుకున్న బ్యాగ్ ను ఓ సీటుక్రింద సర్దాడు. డోరు దగ్గర నిలుచున్నాడు. పరిగెడుతోంది ట్రైన్ అతని ఆలోచనలతో పోటీపడి.

ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం శ్రీనివాసరావుది. చదువుకునే రోజుల్లో ఓపూట తిని పస్తులున్న రోజులెన్నో... పడని కష్టం లేదు. చూడని జీవితం లేదు. ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 'ఎంత ఎత్తుకు ఎదిగినా పాదాలు నేలమీద ఉండాలి' అనుకునే

మనస్తత్వం అతనిది. అందరిని నమ్మేవాడు. మోసపోయినా నవ్వుకునేవాడు. 'మోసం చేసే గుణం భగవంతుడు నీకిచ్చాడు... మెనపోయినా బ్రతికే ధైర్యాన్ని భగవంతుడు నాకిచ్చాడు' అనుకునేవాడు.

తననుంచి సాయం పొందిన వాళ్ళు వెనకచేరి అవహేళన చేస్తూన్నా పట్టించుకునే వాడు కాదు. తను ఎదిగే క్రమంలో వేసే ప్రతి అడుగులో ధైర్యం వుండేది. వెనుక్కు లాగే వాళ్ళున్నా, సున్నితంగా విదిలించుకుని అడుగు ముందుకేసేవాడు. ఎదిగిన తరువాత విమర్శలు పొగడ్తలయ్యేవి... పడిపోతే విమర్శలయ్యేవి. తనపై విసురుతున్న రాళ్ళదెబ్బలను మౌనంగా భరించేవాడు. ఎదిగినప్పుడున్న 'మనుషులు' ఇప్పుడు లేరు. తను పడ్డాడు. చిటికినవేలు ఆందించిన వారు లేరు.

'మాస్టారూ... గాలి ఎక్కువగా ఉంది. డోర్ క్లోజ్ చెయ్యండి' అని వెనుక ఉన్న వ్యక్తి అన్నాడు కాస్త గట్టిగా .ఉలిక్కిపడి బయటపడ్డాడు ఆలోచనల్లో నుంచి.

ఆకలి దంచేస్తోంది. వెండర్స్ పెరుగన్నం, పులిహోర అమ్ముతున్నారు. తన దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. పొద్దున ట్రైన్ దిగి మల్కాజిగిరి వెళ్ళాలి. చార్జి 10 రూపాయలు. బాటిల్లో ఉన్న నీళ్ళు కాస్త తాగి, డోర్ దగ్గర కూర్చున్నాడు. 'తిన్నారా సార్' అడిగాడు ఓ వ్యక్తి పులిహోర పొట్లం విప్పుతూ. 'తినేసి ''ట్రైన్ ఎక్కానండి' నవ్వుతూ సమాధానమిచ్చాడు శ్రీనివాసరావు. అభిమానం అబద్ధం చెప్పిస్తుంది.. నవ్వుకున్నాడు.

ఆకలిని ఓదారుస్తూ నిద్రాదేవి ఆవహించింది అతన్ని. 'ఏమండీ... టిక్కెట్' భుజంతట్టి లేపాడు. టి.సి, ఉలిక్కిపడి లేచి టికెట్ తీసి చూపించాడు. 'డోర్ దగ్గర కూర్చోకండి సార్.. దిగేవాళ్ళకు ఇబ్బంది' కాస్త గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. టి.సి.

కాసేపు లేచి నిల్చున్నాడు. టైం రాత్రి 12 కావస్తోంది. నిలబడే ఓపికలేక మళ్ళీ డోర్ దగ్గరే కూర్చున్నాడు. ప్రతి స్టేషన్లో దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు విసుక్కుంటూనే ఉన్నారు.

“కాఫీ, టీ” అరుచుకుంటూ, జనాల్ని నెట్టుకుంటు వస్తున్నాడు వెండర్. టైమ్ 5.00 దాటింది. మరో గంటలో స్టేషన్కి చేరుకుంటుంది ట్రైన్. జేబు తడుముకున్నాడు. 10/- రూపాయలుంది. 'టీ' తాగితే 10/- అయిపోతుంది. తన మల్కాజిగిరి ఎలా వెళ్ళాలి. తనను దాటిపోతున్న వెండర్ వైపు చూస్తున్నాడు. 'టీ త్రాగండి' మాస్టారు' అన్నాడు ఓ వ్యక్తి తనకు టీ అందిస్తూ. "అయ్యో... వద్దండి.. అలవాటు లేదు....థ్యాంక్స్" సున్నితంగా తిరస్కరించాడు... మరో అబద్దం. లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి ముఖం కడుకున్నాడు. రాత్రి భోజనం లేదు... ఆకలి దంచేస్తోంది... జేబులో డబ్బులు లేవు... మరో గంటలో స్టేషన్కు చేరుకుంటాడు తను. అక్కడ నుంచి మరో అరగంట ఇంటికి ఓర్చుకోగలడు.

"సర్.. అక్కడ ఖాళీ ఉంది కూర్చోండి" సీట్ చూపించాడు మరో వ్యక్తి. మరో

సీట్ క్రింద ఉన్న తన బ్యాగ్ తీసుకుని అతను చూపించిన సీట్లో కూర్చున్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు.

అతనో విషయం నేర్చుకున్నాడు. 'నిన్నటి గురించిన ఆలోచనలు నెమరువేసుకో కూడదు. రేపు మంచే జరుగుతుంది. కష్టాన్ని ఎదుర్కోవచ్చు.... కాలాన్ని ఎదిరించలేము'. చుట్టుముట్టబోతున్న ఆలోచనలను పక్కకు నెడుతూ ఎదురుగా చూసాడు. ఎదురు సీట్లో తల్లి ఓడిలో ఓ ఆరు నెలల పాప నిద్రపోతోంది. అప్పుడప్పుడు నవ్వుతోంది. తల్లి బిడ్డను చూస్తూ మురిసిపోతోంది. అద్భుతంగా ఉందా దృశ్యం.

కీచుమని చప్పుడు చేస్తూ ఆగింది ట్రైన్. 'ఔటర్లో ఆపినట్టున్నాడు. సిగ్నెల్ లేదు' అంటున్నారు. ఎవరో ట్రైన్ దిగుతూ, కాసేపటికి కలకలం మొదలైంది. పరిగెడుతున్నారు కొందరు ఇంజన్ వైపు... కంగారుగా ట్రైన్ దిగూతు అడిగాడు శ్రీనివాసరావు "ఏమైంది" అని. దూరంనుంచి వినిపిస్తున్నాయి. అరుపులు ..."అయ్యో... అయ్యో.." అని. 'ఎవరో పెద్దాయన ట్రైన్ క్రింద పడ్డాడు... వికలమయింది శ్రీనివాసరావుమనసు .వెళుతున్నవాడల్లా ఆగాడు... చూడలేడు తను. వెనక్కు తిరిగి తనబోగిలో ఎక్కి కూర్చున్నాడు.

'ఎవ్వరి మానసిక స్థితిని మనం అంచనా వెయ్యలేము... ఎంత కష్టమొచ్చిందో'. ఈ మధ్య తను విన్నపాట గుర్తొచ్చింది. 'నేనెళ్లి పోతున్నా నాలోకమూ.... యముడొచ్చాడమ్మా నాకోసము."

రెండు గంటలు ఆలస్యంగా చేరుకుంది ట్రైన్ సికింద్రాబాద్ కి, ట్రైన్ దిగాడు శ్రీనివాసరావు. ఆకలి దంచేస్తోంది. ఓపిక లేదు. నీరసంగా నడుచుకుంటూ వచ్చాడు స్టేషన్ బయటకు, మల్కాజ్ గిరి బస్ స్టాప్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం 'టీ 'తాగితే కాస్త ఓపిక వస్తుంది. కానీ 'టీ' తాగితే 10/- అయిపోతుంది. బస్సు ఛార్జీకి డబ్బులుండవు. పోనీ నడుచుకుంటూ వెళితే...! అమ్మో అంతదూరం. సంఘర్షణ మొదలైంది. చివరికి నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ఆకలిని జయించలేక పోయాడు. నేరుగా టీకొట్టు దగ్గరకెళ్ళి

సంశయిస్తూ, జేబు తడుముకుంటూ 'టీ' ఆర్డర్ చేసాడు. టీ తాగుతున్నాడు. ఎక్కడలేని శక్తి వచ్చినట్లనిపించిందతనికి, తృప్తిగా తాగి గ్లాస్ టేబుల్ పై పెట్టి జేబులోంచి 10/ తీసి టీకొట్టతనికి ఇవ్వబోయాడు. అప్పుడు పడిందతని బుజంమీద ఓ చెయ్యి ."నేనిస్తాను మాస్టారు" వారిస్తూ డబ్బులివ్వ బోయాడు ఆ కుర్రాడు. ఆశ్చర్యంగా చూసాడు శ్రీనివాసరావు, ఆ కుర్రాడిది తనకు ఊరు,పేరు కూడా తెలియదు కానీ పోల్చుకున్నాడు. "వద్దు బాబు నేనిచ్చేస్తాను" అంటున్నా వినకుండా అభిమానంతో శ్రీనివాసరావు చెయ్యి పట్టుకొని. తను డబ్బులిచ్చాడు టీకొట్టతనికి. ఆశ్చర్యంగా చూస్తున్నాడతన్ని

"మేడం గారు బాగున్నారా... పిల్లలెలా ఉన్నారు.." ప్రశ్నల వర్షం కురుపిస్తున్నాడా. కుర్రాడు. అందరూ బావున్నారన్నట్లు తలూపాడు శ్రీనివాసరావు, "మీకంతా మంచే జరుగుతుంది. మాస్టారు. వెళతాను అర్జంటుగా నెల్లూరు వెళ్ళాలి.... ట్రైన్ కి టైమ్ అయ్యింది" అంటూ నాలుగు అడుగులు ముందుకు వేసి టక్కున ఆగి శ్రీనివాసరావు దగ్గరకొచ్చి కాస్త స్పీడుగా తనజేబులోంచి కొంత డబ్బు తీసి శ్రీనివాసరావు జేబులో ఉంచి "టైమ్ అయ్యింది మాస్టారు. వెళ్ళాస్తాను" అంటూ పరిగెత్తాడు.

నిశ్చేష్టుడై, పరిగెడుతున్న కుర్రాడి

వంక చూస్తూ నిలబడిపోయాడు శ్రీనివాసరావు, ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అడుగులేసాడు బస్టాప్ వైపు.

బస్సులో కూర్చుని ఆ కుర్రోడి వివరాలు గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ వీధి కుర్రాడు కాదు. బహుశా ప్రక్కవీధి కుర్రాడయి ఉండొచ్చు. ఎప్పుడో యూనిఫాంలో చూసాడతన్ని కాలేజీకి వెళుతున్నప్పుడు. పద్దతిగా ఉండేవాడు. తన గురించి బాగా తెలిసుండొచ్చు. "వెళ్ళొస్తాను. మాస్టారు.... ట్రైన్ కి టైమ్ అయ్యింది... నెల్లూరు వెళ్ళాలి" అతని మాటలు, అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది.

ఈ ట్రైన్లో నెల్లూరికి ట్రైన్స్ లేవే అనుకుంటూ అప్రయత్నంగా జేబులో చెయ్యి పెట్టి డబ్బుని బయటకు తీసాడు. తన 10/-లతో పాటు ఐదు 2 వేల రూపాయల నోట్లు.....

స్థాణువయ్యాడు. టపటప కన్నీటి బొట్లు నోట్లపై పడ్డాయి. ఆ కుర్రాడు పరిగెత్తింది ట్రైన్ కోసం కాదు, అభిమానంతో తనెక్కడ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడేమో అని....

అలోచిస్తున్నాడు.... తనేమన్నా అతనికి ఎప్పుడైనా ఉపయోగపడ్డాడా... వారి కుటుంబానికేమైనా ఉపయోగపడ్డాడా... స్ఫురించింది శ్రీనివాసరావుకి. కుర్రాడి నాన్న ఎప్పుడో కుర్రాడి పదోతరగతి ఎగ్జామ్ ఫీజు కోసం ఓ ఐదువందల రూపాయలు తన దగ్గర తీసుకున్న గుర్తు. చిన్న సాయం..... అంతకు మించి తనేం చేసినట్లు గుర్తులేదు..

'టికెట్ ప్లీజ్' అన్న కండెక్టర్ పిలుపుతో 'మల్కాజ్ గిరి' అంటూ 10/- ఇచ్చాడు. "పై నెల ఫీజు కట్టాలి నాన్నా" అన్న కూతురుమాటలు గుర్తుకొచ్చి 10 వేల రూపాయలను వెనక జేబులో భద్రంగా దాచుకుంటూ అనుకున్నాడు. శ్రీనివాసరావు..... '"మనిషెక్కడో లేడు... మన మధ్యలో ఉన్నాడు. మన లోనే ఉన్నాడు."

-కృష్ణమూర్తి వంజారి

First Published:  22 Jan 2023 11:24 AM GMT
Next Story