Telugu Global
Arts & Literature

ఆశాజ్యోతి (కవిత)

ఆశాజ్యోతి (కవిత)
X

రాజకీయ చరిత్రలో ఘనాపాటి

ప్రపంచ మేధావి వర్గంలో

నీకు నీవే సాటి

అభినవ నవజీవన భావాలకు

రాజకీయ కార్యదర్శివి

అతి పీడిత తాడిత జనులకు

రాజ్యాంగ మార్గదర్శివి

బడుగు జీవితాన అడుగడుగునా

ఎన్నో ఒడిదుడుకులను నేర్చిన

దళిత బ్రతుకుల అలజడిలో

ఎన్నో అవమానాలనోర్చిన

బహుజనుల

ఆత్మబంధువు నీవే

భారత రాజ్యాంగ

జ్ఞాన సింధువు నీవే

ఓ ఘన అంబేద్కర్ మహాశయా

మా రాజ్యాంగ నిర్మాణ మహోదయా

బహుజనుల ఆశాజ్యోతివి

బలహీనుల ఆత్మవిశ్వాసానివి

కష్టాల కడలిని

ధైర్యంగా ఈదిన గజ ఈతగాడివి

అరిష్టమన్న జాతిని

జాగృతి జేసిన గొప్ప రాత గాడివి

ఎన్నో గొప్ప చదువులునేర్చిన

ఘన చరిత్ర తీర్పరి

ఎన్నో గొప్ప ఆలోచనలు

కూర్చిన ప్రపంచ నేర్పరి

ఆధునిక రాజకీయ వేత్తలలో

సవ్యసాచి

ప్రపంచ మేధావి వర్గంలో

నీవొక కా ణాచి

మన ఘన రాజ్యాంగాన్ని వ్రాసిన

మహోపాధ్యాయుడా

బహుజన జీవితాలు మార్చిన

మరో బుద్ధ భగవానుడా

అందరికీ ఓటు హక్కును కల్పించిన

సమ సమాజ వాదివి

అన్ని వర్గాల రాజకీయ వాదాలు

చెప్పిన మానవతావాదివి

నీ ఆలోచనలను

నీ ఆవేదనలను

గౌరవించక

ఆచరించక

ఎన్ని విగ్రహాలు పెట్టినా

ఎన్ని మాలలు కట్టినా

ఏమిటి ప్రయోజనం!

అంతా రాజకీయం!

నీ రుణం తీర్చలేము

నీ జయంతి వర్ధంతుల నినాదాలతో

నీ తేజం కూర్చలేము

ఈ అవినీతి రాజకీయ కుతంత్రాలతో

ఓ భారత రాజ్యాంగ శూరుడా

నీకివే అరుణారుణ

మందారమాలలు

ఓ మహనీయా నీకు ఇవే

భారతజాతి హృదయపూర్వక నీరాజనాలు

జై అంబేద్కర్

జై జై అంబేద్కర్

- కేదారి రాఘవ

First Published:  14 April 2023 4:55 AM GMT
Next Story