Telugu Global
Arts & Literature

ఇదే ఆఖరి పేజీ నాన్నా.!

ఇదే ఆఖరి పేజీ నాన్నా.!
X

తోపుడు బండిపై నన్ను రాజకుమారుడిలా కూర్చోబెట్టి

నా బంగారు భవిష్యత్తుకై

అనుక్షణం నీ బతుకు చక్రాలను

నాలుగు రోడ్ల కూడలిలో పరుగులు పెట్టించే నాన్నా!

నాకిక ఈ కార్పొరేట్ చదువులొద్దు..!

నా నిగనిగలాడే బూట్ల కొరకై

నీ కాయలు గట్టిన పాదాల

రబ్బరు చెప్పులకు

తుప్పువట్టిన పిన్నీసులు గుచ్చుకున్నాయి!

నా మడత నలగని

ఇస్త్రీ బట్టల కొరకై

నీ డొక్కలెండిన దేహం

కన్నీటి ఉప్పుచారికలతో తడిసిన

చొక్కా, లాగును తొడుక్కుంది

నా స్టీలు డబ్బాల ఆవురావురనే ఉడుకన్నం కొరకు

నీ సత్తు గిన్నెలో అంబలి

అర్థాకలి పేగులతో దోస్తీ చేసింది

నా ఖరీదైన నోటుబుక్కుల కొరకై

నిన్ను నీవు తనఖా పెట్టుకుంటే

రాలిన చెమటచుక్కల పచ్చనోట్లకు

ఇక్కడ రెక్కలు మొలుస్తాయి

ఈ బ్లాక్ షీప్ ల

మాయాజాలానికి తలొగ్గి

నా బాల్యాన్ని

కార్పొరేట్ కొండచిలువకు

ఎర వేసినాక

నీవెంతగా తల్లడం మల్లడమవుతూ

తోపుడు బండిని పరుగులు పెట్టించినా

గమ్యం చేర్చలేవు నన్ను

అందుకే నాన్నా!

విస్తరిస్తున్న ఆల్ఫా బెట్ ల ఎడారిలో

అమ్మ-ఆవుల నోరునొక్కి

ఆండ్రాయిడ్ ల మీటనొక్కే

ఈ టెక్నోడిజీల హైటెక్ చదువులు నాకొద్దు

ఆఖరి పేజీ సారాంశంగా..

మనూరి గూనకప్పుపై

పచ్చగా విచ్చుకుంటున్న

నూనూగు బీరపాదులాంటి

తెలుగు మాధ్యమం

రేపటి జీవిక నాదేనంటూ

ఆశగా ఎదురుచూస్తోంది

అవ్వకిచ్చిన మాటకోసం

ఆయుధం జారవిడిచిన

కళింగ అశోకుడినై

పల్లెకు తిరిగెళ్తా..!

పొల్లుపోని ఖంగు కంఠంతో

సుమతీ శతక జ్ఞాన సూరీడినై వెలుగొందుతా..!!

- కళా గోపాల్

First Published:  14 Nov 2023 5:41 PM GMT
Next Story