Telugu Global
Arts & Literature

విలువ

ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటాకు ఓ మిత్రుడు ఉండేవారు. ఆయన తన పెన్ను ఎక్కడ పెట్టేవారో మరచిపోయి ప్రతిసారీ వెతుక్కునేవారు. అందువల్ల ఆయన ధర తక్కువగా ఉన్న పెన్నులనే కొనేవారు. పోగొట్టుకునే వారు.

JRD Tata
X

ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటా

ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటాకు ఓ మిత్రుడు ఉండేవారు. ఆయన తన పెన్ను ఎక్కడ పెట్టేవారో మరచిపోయి ప్రతిసారీ వెతుక్కునేవారు. అందువల్ల ఆయన ధర తక్కువగా ఉన్న పెన్నులనే కొనేవారు. పోగొట్టుకునే వారు. ఆయన తన మతిమరుపుకు బాధపడేవారు.

ఈ విషయం తెలిసిన టాటా మిత్రుడికో సూచన చేశారు. ధర ఎక్కువగా ఉన్న పెన్ను కొనమని! ఆయన చెప్పినట్టే మిత్రుడు 22 క్యారట్ల బంగారంతో తయారు చేసిన పెన్ను కొన్నారు.

ఓ ఆరు నెలల తర్వాత టాటా తన మిత్రుడ్ని కలిశారు. పెన్ను సంగతి అడిగారు.

ఆ ఖరీదైన పెన్నుని తాను ఎంతో జాగర్తగా చూసుకుంటున్నానని, పూర్వం కన్నా తను చేసే పనులలోనూ ఎంతో పురోగతి ఉన్నట్లు చెప్పారా మిత్రుడు.

మన జీవితంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. మనం విలువైనదని అనుకునే వాటిని ఎంతో జాగర్తగా చూసుకుంటాం.

దేహానికి విలువిచ్చుకుంటే భుజించే విషయంలో జాగర్తగా ఉంటాం.

మిత్రులను విలువైనవారిగా గుర్తిస్తే మర్యాదతో ప్రవర్తిస్తాం.

డబ్బుని విలువైనదిగా భావిస్తే అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తాం.

బంధాలను విలువైనదిగా గుర్తిస్తే వాటిని తెంచుకోము.

వ్యాపారాన్ని విలువైనదిగా భావిస్తే అంకితభావంతో పని చేస్తాం.

జీవితాన్ని విలువైనదిగా భావిస్తే ఉన్నత ఆశయాలతో ఆచరణతో బతుకుతాం.

విలువివ్వకుండా చేసే ఏ ఒక్క పనీ విజయం సాధించదు.

- జగదీశ్ యామిజాల

First Published:  28 Dec 2022 10:01 AM GMT
Next Story