Telugu Global
Arts & Literature

ఈతరం రచయితల ఊహకు అందనంత మహామేధావి - గోపీచంద్

ఈతరం రచయితల ఊహకు అందనంత మహామేధావి - గోపీచంద్
X

సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త, హేతువాది, సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కుమారుడు - గోపీచంద్ బహుముఖ ప్రజ్ఞావంతుడైన సాహితీవేత్త.

‘ఎందుకు?’ అనే ప్రశ్న తనకు తానే వేసుకుని - మనల్ని నిలవేసిన జిజ్ఞాసి, సత్యాన్వేషి, మేధావి, - గోపీచంద్.

చిన్నా, పెద్దా భేదం లేకుండా విస్తృతంగా అనేక పత్రికల్లో అడిగిన వారికల్లా రచనలు అందించారు. తెలుగు నవలా సాహిత్యానికి మణికిరీటాలుగా - ‘అసమర్థుని జీవయాత్ర’ ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ ‘చీకటి గదులు’ ‘యమపాశం’ ‘మెరుపుల మరకలు’ వంటి నవలల్ని ఇచ్చారు.

ధర్మవడ్డీ, మమకారం, కార్యశూరుడు, కూపస్థ మండూకం, తండ్రీకొడుకులు, గోడమీద మూడోవాడు, పిరికివాడు వంటి గొప్ప కథలు రాశారు. అయితే ‘పతివ్రత అంతరంగికం’ ఒక విలక్షణమైన కథ. పవిత్రంగా పరిగణింపబడిన స్త్రీ-భర్త మరణవార్త విని స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడామె అధోచేతనలో సాగిన భావపరంపర, ఆ ప్రవృత్తీ - పదచిత్రాల రూపంలో దర్శనమిస్తాయి. ఈ కథలో కథనమంతా చైతన్యస్రవంతి విధానంలో సాగింది. చాతుర్యం రంగరించుకుని అద్భుతమైన మెరుపుతో వెలువడిన కథ ఇది. శైలీ శిల్పాల దృష్ట్యా, అనన్య సామాన్యమైన కథ అది. తెలుగులో అలా ఇంకొకటి రాలేదు.

కాల్పనిక సాహిత్య సృజనకారుడుగా ఎంత ప్రసిద్ధుడో, కాల్పనికేతర సాహిత్య స్రష్టగా అంతకంత సుపరిచితుడు గోపీచంద్. రెంటిలోనూ ఆయన అసాధారణ దార్శనికుడు.

సామాజిక శాస్త్రవేత్తగా గోపీచంద్ విశ్వరూపాన్ని ‘పోస్ట్ చెయ్యని ఉత్తరాలు ‘ఉభయకుశలోపరి’, ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ వంటి రచనలు ‘మీనియేచర్’ లో దర్శింపజేస్తాయి.

మన పల్లెటూళ్ల పరిస్థితి 1941లో ఎలా వుందో చూపి, రైతు జీవన దుస్థితి, గ్రామీణుల బతుకు విషాదం గురించి చెప్పిన ఈ వాక్యాల్ని చదవండి.

*‘‘అప్పులబాధ భరించలేక పొలం తక్కువ ధరకే అమ్మేశాను. మనం అమ్ముతామంటే కొనే వాడెవ్వడు?’’

*‘‘మన వూరికి వారానికొకసారి టపావస్తుంది. ఇక మేం బతుకుతున్నట్టా చచ్చిపోయినట్టా?’’

*‘‘ఏరువాక పూర్వంలాగా జరుగుతుందనేనా నీ ఉద్దేశ్యం? ఇప్పుడా నాగలి పూజల్లేవు. పాలేర్లకి కొత్తబట్టల్లేవు. బీదలకి ధాన్యం దానం చెయ్యటం లేదు. అసలు ఆ మాటకొస్తే రైతులిప్పుడు పొలంపనే మానుకుంటున్నారు’’.

* ‘‘పదెకరాల వ్యవసాయానికి గాను రైతుకు మిగిలేది ఎనభై నాలుగు రూపాయల నాలుగణాలు ఇదీ దుస్థితి’’

ఆ పరిస్థితిలో ఈనాటికీ పెద్దమార్పేమీ రాలేదనే అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. రైతు హృదయం, మానవ మనస్తత్వం కూలంకషంగా తెలుసుకున్న మేధావి గోపీచంద్.

మానవ సంబంధాల్లో మార్పు, ప్రత్యేకించి వ్యక్తి మానసిక స్థితిలో మార్పు - వీటి గురించి ఆయనకి స్పష్టమైన ఆలోచన, నిబద్ధత వున్నాయి. change is not a miracle అనేది గోపీచంద్ పరిపూర్ణమేధ ఆవిష్కరించే సత్యం.

ఆ ‘ఆఫ్రాసెస్’ని ఎలాంటి శషభిషలూ లేకుండా, సాచివేతలూ, నంగితనమూ, నీళ్ళు నమలటాలూ లేకుండా - నిర్భయంగా చెప్పేశారు.

సత్యాన్వేషణ దృష్టీ, నమ్మింది చెప్పేసే నిజాయితీ గోపీచంద్ వ్యక్తిత్వ నిరూపణకి నిలువెత్తు సాక్ష్యాలు. ‘మనిషి మారటమంటే మానసిక మార్పు. నిజానికి మానసిక మార్పే ప్రగతి. ప్రతీది మారుతుందని చెప్పాను.’ అని తనలో వచ్చిన మార్పునీ ఇంకా ఇంకా వివరించేసి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం అన్నట్టు కుండబద్దలుకొట్టేశారు .గోపీచంద్ భావపరిణామ వికాసాల్ని అంచనా వేయటానికి నిజానికి ‘మేధ’ మాత్రమే చాలదు, ‘హ‌ృదయం’ ముఖ్యం!

తత్వవేత్తలు’ చదివితే, గోపీచంద్ ‘జీవించినన్నాళ్లూ నిశిత జిజ్ఞాసతో సత్యాన్ని వెతుకుతూనే ఉన్నాడు’ అన్న ఆవుల సాంబశివరావు గారి మాటల్లోని అంతర్యం బోధపడుతుంది. విభిన్న సిద్ధాంతాల సారాన్ని విశ్లేషించి పాఠకుల ముందుంచిన గోపీచంద్ శైలికి అబ్బురపడతాము. అందుకనే ‘గోపీచంద్ రచనలన్నిటిలో - అది చిన్న కథ కానివ్వండి-మూలతత్వ విచారణకై ప్రయత్నం కనపడుతుంది. ఫలితమేమైనా దీక్షగా, ధైర్యంతో ఈ పరిశీలన చేశారు’ అన్నారు నార్లవారు తమ ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో.

1939లోనే సినిమారంగ ప్రవేశం చేసిన గోపీచంద్ - రైతుబిడ్డ, గృహప్రవేశం, ప్రియురాలు, ధర్మదేవత, చదువుకున్న అమ్మాయిలు సినిమాలకు రచయితగా వ్యవహరించారు. 1950లో వచ్చిన లక్ష్మమ్మ - సంచలన చిత్రానికి దర్శకుడు. దీనికి పోటీగా అప్పుడే శ్రీలక్ష్మమ్మ వచ్చింది. పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు కూడా ఆయన దర్శకుడు.

సాహిత్యం పట్టనంత మేధాశక్తి జీవన ప్రస్థానంలో తాత్వికాన్వేషణ దిశగా గోపీచంద్ ని నడిపింది. హేతువాదం నుండి ఆయన ఎంఎన్ రాయ్ రాడికల్ హుమనిజం వైపు మరలేరు. అక్కడా సంతృప్తి కలుగలేదు. నిరంతర సత్యాన్వేషణ సాగించారు.

గోపీచంద్ కథలు రాస్తున్న యువతని వెన్నుతట్టారు. నవలాకారుల్ని ప్రోత్సహించారు. తెలుగు సాహితీరంగంలో ఒక గొప్ప విజయాన్నీ, మలుపునీ సాధించిన ‘చక్రభ్రమణం’ నవల (1962) బహుమతి ఆయన నిర్ణయించినదే. గోపీచంద్ ముందుచూపుకు, సామాజికతకూ, పాఠకాభిరుచిని పట్టుకోగల నిశితమైన మేథకు- అదొక దృష్టాంతం.

ఆ నవలారచన పోటీలో తొలిసారి మేమూ (విహారి & శాలివాహన) పాల్గొన్నాము. అప్పుడు రాసిన ఆ నవల వ్రాతప్రతి ఇవ్వాల్టికీ నా వద్దనే వున్నది. గోపీచంద్ మా నవల చదివేరనే ఒక ‘ఘనత’ని చెప్పుకుంటూ వుంటాను!

ఆ పోటీకి ముందే, నేను తెనాలిలో వున్నప్పుడు రెండుసార్లు గోపీచంద్ గారిని చూశాను. ఒకసారి ఆవుల గోపాలకృష్ణమూర్తి గారి ఇంట్లో, వెలువోలు సీతారామయ్యగారు, ఇతర పెద్దలు ఉన్నారు. అది గోష్టి సమావేశం. గోపీచంద్ గారు అప్పుడు మాట్లాడినవన్నీ తాత్విక అంశాలు. రెండవసారి నేతి పరమేశ్వర శర్మగారి నాటకాల రిహార్సల్స్ రూమ్ లో ! అలా వారిని వినే అవకాశం కలిగింది.

గోపీచంద్ సమగ్ర సాహిత్యం వెలువడింది. దానిమీద సాయిచంద్ గారి ప్రమేయంతో ఒక సమీక్ష రాశాను, ఆంధ్రజ్యోతివారికి.

నవలలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, నాటికలు, సినిమాల రచన... ఇలా ఒకటేమిటి? చేపట్టిన ప్రతి ప్రక్రియమీదా తనదైన ముద్ర వేసిన మహారచయిత, మహనీయుడు గోపీచంద్. నిజానికి ఆయన స్థాయి ప్రపంచ ప్రసిద్ధ రచయితల పంక్తిలోనిది. 1962లో దివంతులైన గోపీచంద్ ని అరవైయేళ్లలోనే ఒక తరంవారు మరచిపోతూవుండటం, ఈతరం వారు చదవకపోవటం తెలుగు సాహితీరంగంలోని అనేక దురదృష్టాల్లో ఒకటి-

కథారచన పట్ల ఉత్సాహం చూపుతున్న కొత్తతరం వారైనా, ఆ మహనీయుని సాహిత్యాన్ని చదివి మరింత సంపన్నులవుతారని ఆ మహనీయుని సాహిత్యాన్ని చదివి మరింత భాషా సాహిత్య విషయాల్లోనూ, జీవన తాత్త్విక స్ఫూర్తిని పొందటంలోనూ సంపన్నులవుతారని ఆశిద్దాం! *

- విహారి

First Published:  3 Dec 2023 2:07 PM GMT
Next Story