Telugu Global
Arts & Literature

మువ్వన్నెల భారతం (బాల గేయాలు )

మువ్వన్నెల భారతం (బాల గేయాలు )
X

మునుల గన్న భూమిమనది

ముదితలేలు భూమి మనది

ముందుచూపు గల్గెనేని

మురిసి మెరయు భవిత మనది

ముచ్చటైన నేల మనది

ముజ్జగముల సాటి మనది

ముట్టడిలో నెగసిపడెడి

ముద్రగల్గు చరిత మనది!

ముద్దులొలుకు భూమిమనది

ముఖ్యనదీ గామి మనది

ముఖమున వేదములు గలది

మువ్వన్నెల నేత మనది!

ముగ్గుల ముంగిలి మనది

ముచ్చులనే తరుమునుది

ముదమారగ ఆతిథ్యం

మురిసి యిచ్చు నేల మనది!

"మువ్వ"కు స్థానము గలది

ముగ్ధత వాసమ్ము గలది

ముకుతాడిది వేయగలదు

ముసుగులు తొలగించగలదు!

ముడులెరుగని త్రాడుమనది

ముళ్ళు లేని బాటమనది

ముంజవంటి గిరులగలది

ముంజకేశు నిలయమిది!

ముంగిలిలో కడలిగలది

ముంగిసవలెకలబడునది

ముక్కెర వలె గంగానది

ముత్యముగా అమరినది!

ముష్కరులను ఛేదగలది

ముక్కంటులు పెక్కుగలది

మువ్వన్నెల బావుటాను

ముద్రౌ కనుభారతమిది!

-కిలపర్తి దాలినాయుడు

First Published:  14 Aug 2023 10:20 PM GMT
Next Story