Telugu Global
Arts & Literature

నాన్న స్మృతి లో..

నాన్న స్మృతి లో..
X

నాన్న స్మృతి లో..

ఈమధ్య ఓసారి

నాన్న కనిపించాడు

చలిరాత్రుల కలతనిద్రలో

కలల వాకిట్లోంచి

నవ్వుతున్న నాన్న

చంద్రుడిలా అగుపించాడు

మేము నాన్న వేలువిడిచి

నాన్న మమ్మల్ని విడిచి

చాలాకాలమే అయ్యింది

కరుగుతున్న కాలంతో పాటు

మా కంటితడి ఇంకిపోయిందో..

తెరపిలేని బతుకు పరుగులో

బాధ్యతల బరువు అలుపు నిచ్చిందో కానీ..

మా దైనందిన మేనిఫెస్టోలో

నాన్న జ్ఞాపకం చిన్నదైపోయింది

అందుకేనేమో..

కనురెప్పల చాటు నుండి నాన్న పిలవగానే

తుళ్లిపడి మేల్కొన్న

'పసి' బిడ్డనయ్యాను

పగలంతా ఆటలాడి ఇంటికొచ్చాక

మా మట్టి ఒంటిని రుద్ది

నాన నీళ్లు పోసేది మొదలు..

నాన్నకు మా కన్నీటితో చివరి స్నానం చేయించిందాకా..

స్మృతుల పక్షులు రెక్కలు విదిల్చుకుని

ఆ రాత్రి నా మస్తిష్కం చుట్టూ చక్కర్లు కొట్టాయి

అమ్మపై అలిగి

నాన్నకు చేసే చిట్టి చిట్టి ఫిర్యాదులు

పక్కూరి నుండి నాన్న తెచ్చే తినుబండారాలకై

ఆశతో మా ఎదురుచూపులు

జీవితమంటే..

ఒక్క 'నాన్నే' అనుకున్న రోజులవి

అయినా ఇప్పటికీ..

(బహుశా ఎప్పటికీ )

అనిపిస్తుంది

ఓ ఇరవై యేండ్లు వెనక్కి వెళ్లి

మళ్లీ నాన్న కనుసన్నల్లో

మెరిసే నక్షత్రాలమైతే బాగుండు కదాని

నాన్న బల్ల చుట్టూ

ఒలీవ మొక్కలమై అల్లుకోవాలని

ప్చ్...ఇప్పుడు నాన్న లేడు!

అన్నట్లు..ఆకాశంలో నుంచి చూస్తుంటాడేమో..

ఏ దుఖఃపు సుడి మనసును కదిపినా

నాన్న ధైర్యమిచ్చే సూర్యుడై పలకరిస్తాడు

తన రక్తబిందువుల కోసం

ఏటేటా కాసిన్ని కులాసా కబుర్లను

క్రిస్మస్ తాతతో కానుకగా పంపుతుంటాడు!

- గంగవరపు సునీత

First Published:  6 Dec 2022 6:26 AM GMT
Next Story