Telugu Global
Arts & Literature

అందుకే (కవిత)

అందుకే (కవిత)
X

ప్రియా!

నీ మౌనయజ్ఞం ముందు

బిగ్ బాంగ్ థియరీ సైతం ఓడింది

ఇప్పుడు అనిపిస్తోంది

సృష్ట్యాది విస్ఫోటనానికి కారణం

ధ్వని కాదేమో!

అది మౌనమేమోనని!..

నీ కొఱకైన తపనలో

చక్కెర పలుకులు..

చెక్కిన వజ్రాలై.. జిగేల్మంటున్నాయ్

నుడుల మడులన్నీ..

వెన్నెల మడుగులవుతున్నాయ్

అక్కరాల చక్కదనాలన్నీ...

చలిమల చెలమల వాకలై...

దిక్కులకు పారుతున్నాయ్

భావాలన్నీ...ఆర్ద్రబాష్పాలయి

మేఘాలుగా అంబరాలను చుంబిస్తున్నాయ్

కానీ…

నీ మౌనం ఒక్కమారైనా

పలుకుగా మారదేం?...

ఆ మౌనముద్రలో కొలువైన ధ్వనిశాస్త్రాలను

ఆలోచనకు చిక్కని

ఏ లోచనాలతో అధిగమించను చెప్పు?!

నీ గుండెల్లో నెలవైన హిమనగాన్ని

నా ఊహలకు దక్కని

ఏ పరికరాలతో అధిరోహించను చెప్పు!.

దిరిసెన పూదోపుకి

ముండ్ల కంచెలా

నీ మనసుకెందుకు

ఆ మౌనం కావలి?!

ముళ్ళు కళుక్కున గుచ్చిన ప్రతిసారీ..

గుండెను గండశిలగా

మార్చుకుంటున్నా...

ఎదురుచూపులు

రెప్పలకు ఒరుసుకుపోకుండా

కనుపాపలు నిత్యం

కందెనను స్రవిస్తూనే ఉన్నా...

తాలిమి ఫలితం ఏముందని?

కణ విభజన జరిగి

క్షణాల కణాలు పెరుగుతాయా చెప్పు?!

చెలిమికి దక్కేదేముందని!

బ్రతుకు పుటల్లో...నిజం కాలేని

నెమలీక ప్రసవాలేనా?

మమతకు సాఫల్యమేంటని?

కరకుబారిన గుండె పొరల్లో

శిలాజ జీవనమా?

అందుకే...

రాగం చెవులకు వినబడితే చాలదు

గుండెనూ తడితేనే...

పాటయి బ్రతికేది...

అనురాగం గుండెను

తడితేనే చాలదు

శ్రుతి పుటనూ మీటితేనే బ్రతికించగలిగేది...

- పాలపర్తి హవీలా

First Published:  25 Jan 2023 3:10 PM GMT
Next Story