Telugu Global
Arts & Literature

చెప్పాలని ఉంది (కథానిక)

చెప్పాలని ఉంది (కథానిక)
X

జెబిఎస్ వెళ్లే మెట్రో కోసం

ఎమ్.జి.బి.ఎస్. స్టేషను లో ఎదురు చూస్తున్నాడు సీతారాముడు

పైన కప్పంతా పావురాల ఆవాసమై సందడి చేస్తుంటే, వాటి రెట్టలెక్కడ పడతాయోనని కింద మనుషులు జాగ్రత్తగా మసలుకుంటున్నారు.

క్లీనింగ్ సిబ్బంది వాటిని తుడిచే ప్రయత్నంలో ఉన్నారు.ఇదేదో పావురాల ఆటలా ఉందని నవ్వుకుంటున్నాడు సీతారాముడు.

పైనుంచో పావురం ప్రేమగా పలకరించింది.ఛీఛీ పాడురెట్ట అనుకుంటూ తనూ క్లీనింగ్ మొదలెట్టి చురచురా పైకి చూశాడు.

ట్రైన్ రావటానికింకా నాలుగు నిముషాలుంది.

అప్పుడే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. సీనియర్ సిటిజన్ ఒకాయన బయటికొచ్చి సీతారాముడి వంక చిరునవ్వుతో చూశాడు. మామూలుగా స్పందించే వాడే సీతారాముడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేక తలతిప్పుకున్నాడు.

కానీ ఆ సీనియర్ సిటిజన్ పట్టించుకోకుండా అందరితో మాటలు కలుపుతున్నాడు. స్టేషను క్లీనింగ్ సిబ్బందిని ఏదో అడుగుతున్నాడు.వాళ్ళేదో సమాధానం చెప్పినట్టున్నారు.

వాళ్లంతా ఆయన్ని చూసి నవ్వు తుంటే తనూ నవ్వు కలిపి వాళ్ళతో సెల్ఫీ దిగి చేయూపాడు. వాళ్లు ఇంకోవైపు వెళ్లిపోయారు.

ఆ సీనియర్ సిటిజన్ ఈసారి మెళ్ళో ఐడి కార్డులు వేలాడుతున్న ఇద్దరు కుర్రాళ్లను పలకరించి షేక్ హాండిచ్చాడు.అక్కడే ఉన్న ఐదారుగురి ఆడపిల్లలకు హలో చెప్పాడు. దేవుడి దీవెనలా ఆపిల్లల స్వచ్ఛమైన నవ్వు అందరిపై కొద్ది క్షణాలు ఉదయ రవిబింబంలా ప్రకాశించింది.

ట్రైన్ రావటానికింకా నిముషముంది. స్టేషను సెక్యూరిటీ సిబ్బంది విజిల్ తో ప్రయాణీకులని అలర్ట్

చేస్తున్నారు.కాస్త వెనక్కి జరగండని సూచన చేస్తున్నారు.

ట్రైన్ లో అందరికీ సీటు దొరుకుతుంది. అయినా చిన్నా, పెద్దా తేడాలేకుండా ఆదుర్దా పడిపోతున్నారు.సీతారాముడు ధీమాగా ఉన్నాడు సీనియర్ సిటిజన్ సీట్లున్నాయి కదాని.

కానీ తలుపు పక్క సీటుకావాలని తనూ తొందర పడ్డాడు.

ట్రైన్ తలుపులు మూసుకుంటుంటే

అప్పుడెక్కాడా పేరు తెలియని సీనియర్ సిటిజన్.

సీతారాముడు పక్కనే ప్లేసుండటంతో వచ్చి కూర్చున్నాడు.

ఈసారి మళ్లీ ఇక్కడ కూడా తయారయ్యాడు అనుకోలేకపోయాడు సీతారాముడు.

మరోసారి పలకరింపుగా నవ్వాడా పెద్ద మనిషి.ఇతనికి కొంచెం స్క్రూలూజ్, అది తేల్చేయాలనుకున్నాడు సీతారాముడు.

"మీరు మెట్రో మొదటిసారెక్కారా మాస్టారూ,అందరినీ తెగపలకరించేస్తున్నారు"

కాస్త హేళనగా అడిగాడు.

దాన్ని పట్టించుకోని ఆ పెద్దాయన సీతారాముడు భుజం తట్టాడు.

తనని చిన్నపిల్లాడిని చేసి భుజం తట్టడం ఇంకా నచ్చలేదు సీతారాముడు కి.

"నా పేరు వరహాల్రావు.

రిటైర్డ్ జర్నలిస్టుని."

అంటూ పరిచయం చేసుకున్నాడు.

"నా పేరు సీతారాముడు. రిటైర్డ్ బ్యాంకర్ని"తనెవరో చెప్పడానికి ఇష్టపడని సీతారాముడుకి ఆరోజు తప్పలేదు.

"ఎందుకు మీరు ప్రతివాళ్ళతో కల్పించుకుని మాట్లాడుతున్నారు.

వాళ్ళెవరో తెలియకపోయినా"

కొంచెం నిరసనగా అడిగాడు సీతారాముడు.

"అదా మీ సందేహం,

చెబుతానాగండి.నేనో వంటరి పక్షిని.నాదారిన నేను స్వేచ్ఛగా ఎగురుతుంటే నన్నమెరికా పంజరంలో బంధించాడు నా కొడుకు.అర్థం కాలేదు కదూ.! ఒంటి శొంఠి కొమ్ముగా ఉండిపోయానని మా అబ్బాయి ఓ ఆర్నెల్లు తనతో ఉండమన్నాడు. నచ్చకపోతే వెళ్లి పోదువుగాని అన్నాడు. వాడికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. కొడుకు, కోడలు ఇద్దరివీ ఉద్యోగాలే. పాపం శని,ఆదివారాలను నా కోసం ఖర్చు పెట్టేవారు. అది నాకు నచ్చేది కాదు.మిగిలిన రోజుల్లో నేను అక్కడుండే లైబ్రరీకి

వెళ్లేవాడిని. నాకు కావలసిన పుస్తకాలు కొన్ని చదివే వాడిని.

అక్కడ క్రమశిక్షణ,నిశ్శబ్దం కొంచెం ఇబ్బంది పెట్టేవి.ఎప్పుడు ఆర్నెల్లు అవుతాయాని ఎదురు చూశాను.

అవగానే బయల్దేరొచ్చేశాను. నిన్నే దిగాను. ఇవాళే బయటికొచ్చాను. మన వూరి గాలీ, ధూళే కాదు

ఇక్కడి మనుషులను చూడగానే ప్రాణం లేచొచ్చింది.వాళ్ళందిరితో పలకరించి మాట్లాడాక మండుటెండల్లో చల్లని మంచినీళ్లు తాగినంత సంతోషం కలిగింది. ఇదికదా జీవితం,ఆర్నెల్లపాటు మిస్సయ్యింది అనుకున్నాను. అందుకే ఎవరు కనిపించినా చాలాకాలం తర్వాత చూసిన ఆప్తమిత్రులవిపించారు.వీళ్ళందరికీ ఎంత ఋణపడి ఉన్నాను అనిపించి పలకరించాను.అప్పుడు మనసు కుదుటపడింది.

తీర్చిదిద్దినట్టున్న భవనాలు, రోడ్డులు, ఈ మెట్రో సిటీకి తోపు అనుకుంటాం కానీ, సిటికి కట్టిన తోరణాలు మనుషులేనని మళ్లీ మరోసారి అర్ధమయింది.దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ గుర్తుకొచ్చాడు. "

ప్రవాహంలా సాగాయి అతని మాటలు.

బిత్తరపోయాడు సీతారాముడు. ఏం మాట్లాడుతున్నాడీ పెద్దమనిషి, హాయిగా కొడుకు దగ్గరుండకుండా

ఊకదంపుడు ఉపన్యాసం చెప్పాడు

తన కొడుకు దగ్గరకు ఎప్పుడు వెళదామా అని ఎదురుచూస్తున్నారు తను,భార్య.

కొడుకేమో రేపు మాపు అంటూ వాయిదాలేస్తున్నాడు అనుకుంటూ

మరోసారి వింతగా చూశాడు వరహాల్రావు వంక.

"నెక్స్ట్ స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, డోర్స్ విల్ బి ఓపెన్ ఆన్ ది లెఫ్ట్."

రీనీఖన్నా గొంతు మెట్రో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ స్పీకర్ లో ఖంగుమంటుంటే లేచాడు. సీతారాముడితోపాటు ఆ పెద్ద మనిషి కూడా లేచాడు.

"కాంతారా" సినిమా చాలా బావుందని చదివాను. పక్కనే సుదర్శన్ లో ఉంది. వస్తారా మీరు కూడా. మీకు కుదిరితేనే."

"నిన్నొచ్చారు, ఇవాళ సినిమానా "

ఆశ్చర్యంగా అడిగాడు.

"భేషుగ్గా..అసలు థియేటర్ లో చూస్తేనే సినిమా..ఆ చీకట్లో చప్పట్లు, ఈలలు, కేకలు.. ఇంట్లో టీవీలో చూస్తే ఏముంటుంది. ఎవరో అన్నట్లు అదో సామూహిక ఉన్మాదం.అందరితో కలిసి చూడటమో కళ "

"లేదండీ, నాకు పనుంది "

చికాకుగా సీతారాముడు అతన్నుంచి తప్పించుకున్నాడు.

చిరునవ్వుతో భుజం తట్టి నో ప్రాబ్లం అంటూ వెళ్లి పోయాడతను.

వరహాల్రావు వదలిన వెలుగేదో ప్రభాతకిరణంలా గుచ్చుకుంది సీతారాముడుకి.

తలెత్తి చూశాడు. దూరంగా దట్టమైన పొగమంచులాటి మనుషులు జరిగిపోతూ కనిపిస్తున్నారు.ఆనవాలు పట్ట లేనంతగా వాళ్ళలో కలిసిపోతున్నాడు ఆ పెద్దమనిషి కూడా

కొసమెరుపేమిటంటే అతని కోసం సీతారాముడు అప్పుడప్పుడు ఎమ్. జి. బి. ఎస్. మెట్రో స్టేషను కు వెళుతుంటాడు అతనేమయినా కనిపిస్తాడేమోనని. కనిపిస్తే తన కబుర్లు మరికొన్ని విందామని

తనతో కలిసి కప్పు కాఫీ తాగాలనుందని..ఆనాటి తన మూడీ బిహేవియర్ కు సారీ చెప్పాలనుందని.. ఇలా చాలా అనుకుంటాడు.కాలం అతనికా

అవకాశం ఎప్పుడిస్తుందో మరి

-సి. యస్. రాంబాబు

First Published:  25 Dec 2022 12:58 PM GMT
Next Story