Telugu Global
Arts & Literature

వివినమూర్తి నవలలు

వివిన మూర్తి చింతనా పరుడైన సృజన రచయిత. ఆలోచనలు రేకెత్తిచ్చే కథలు, నవలలు వ్రాయటం సరే ఆలోచనలే వస్తువుగా కథలు, నవలలు వ్రాయటం ఆయన ప్రత్యేకత.

వివినమూర్తి నవలలు
X

- కాత్యాయనీ విద్మహే

వివిన మూర్తి చింతనా పరుడైన సృజన రచయిత. ఆలోచనలు రేకెత్తిచ్చే కథలు, నవలలు వ్రాయటం సరే ఆలోచనలే వస్తువుగా కథలు, నవలలు వ్రాయటం ఆయన ప్రత్యేకత. అలా వ్రాయటం ‘అద్వైతం’ కథతో మొదలు. (1992). ఆలోచనలను వస్తువు చేసుకుని రాయటంలో రచనలో ఆర్ద్రత తగ్గే ప్రమాదం,కథకి నప్పని విషయాలతో తెలివితేటల ప్రదర్శన చేస్తు న్నాడనిపించుకొనే అవకాశమూ ఉన్నాయని తెలిసీ, అయినా అలాగే వ్రాయాలని గట్టిగా పూనుకొన్న రచయిత ఆయన. తన రచనలలో ముఖ్య పరిణామం అదే అన్న ఎరుక కూడా ఆయనకు ఉన్నది. (‘నా’ గురించి నాలుగు మాటలు, 2006, జగన్నాటకం కథల సంపుటి) ఆ పూనిక, ఆ ఎరుకల పతాక స్థాయి రచనగా 2022 లో ‘కొంతమంది .. కొన్నిచోట్ల’ నవల వచ్చింది.

ఈ నవల చదివాక వివినమూర్తి సాహిత్య సృజన కారణమైన సామాజిక తత్వ సూత్రం ఏమిటి? అన్న ప్రశ్న కలిగింది. వ్యక్తులను, సమూహాలను, స్త్రీపురుషులను,వాళ్ళ మధ్య సంబంధాలను నిర్దేశించటంలో కుటుంబం, సమాజం, పని స్థలం వంటి వ్యవస్థల పాత్ర ను ఆయన ఎలా చూస్తున్నారు? మానవ సంబంధాలలోని సంఘర్షణలకు కారణాలను ఎక్కడ గుర్తి స్తున్నారు? ఏ పరిష్కారాలను సూచిస్తున్నారు? అన్న ప్రశ్నలతో మొదటి నుండి ఆయన వ్రాసిన నవలలన్నీ చదవాలనిపించింది. వివినమూర్తి ముప్ఫయి ఏళ్ల వయసులో నవలలు వ్రాయటం మొదలు పెట్టారు. ఆయన మొదటి నవల ‘ఓ కథ ముగిసింది’ 1979 జులై జ్యోతి మాసపత్రిక అనుబంధ నవలగా వచ్చింది. ఆ నాటి నుండి 2022 జులై లో వచ్చిన ‘కొంతమంది కొన్నిచోట్ల’ నవలతో కలుపుకొని నలభై మూడేళ్ళ కాలం మీద ఆయన వ్రాసిన నవలలు పదకొండు. చారిత్రక నవల హంసగీతం(2003) మినహాయించి మిగిలిన పది నవలలు నా జిజ్ఞాసకు సరైన ముడిసరుకు. అవి1. కథ ముగిసింది 2. బండ మనిషి 3. రేపు మీదే 4.వ్యాపారబంధాలు 5. విమానం వచ్చింది 6. ఉద్యమం 7. ఆ మనిషి 8. అలసిన కన్నులు 9. పాడుకాలం 10. కొంతమంది కొన్నిచోట్ల.

“పుట్టుక నీది/ చావు నీది/ బ్రతుకంతా / సమాజానిది” అని కాళోజి అంటే బ్రతుకంతా ప్రశ్నలు అంటారు వివినమూర్తి. ప్రశ్నలు సామాజిక సమస్యలకు, సంఘర్షణలకు సంబంధించినవి కావచ్చు. సమాజంలో వ్యక్తుల అనుభవాలకు, ఆంతరిక సంఘర్షణలకు, మానసిక ప్రవృత్తులకు సంబంధించినవి కావచ్చు. ఆ ప్రశ్నలకు దొరికిన జవాబులే తన రచనలు అంటారు ఆయన.( వివినమూర్తి వెదుకులాట,సాహిత్యమూ జీవితమే, బ్లాగ్) ఆ రచనలలో పది నవలలకు పరిమితమైన విశ్లేషణ ఈ వ్యాసం. వివినమూర్తి నవలలను అధ్యయన సౌలభ్యం కోసం వస్తువు రీత్యా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.అవి 1. స్త్రీపురుష ఆకర్షణలు, లైంగిక ఆసక్తులు, లైంగిక నీతి కేంద్రంగా వచ్చిన నవలలు. 2 మతం మాయను చిత్రించిన నవలలు3. విద్యారంగ రాజకీయ నవలలు.4. పారిశ్రామిక రంగ సంబంధి నవలలు.

1.స్త్రీ పురుష ఆకర్షణలు, లైంగిక ఆసక్తులు, లైంగిక నీతి కేంద్రంగా వచ్చిన నవలలు

వివినమూర్తి నవలల్లో సగానికి సగం స్త్రీపురుష సంబంధాలను చుట్టుకొని అభివృద్ధిచేయబడినవే. ‘ఓ కథ ముగిసింది’ (1979), బండమనిషి( 1985) రేపు మీదే (1986) వ్యాపార బంధాలు (1986) ‘కొంతమంది .. కొన్నిచోట్ల’ నవలలకు ప్రధాన వస్తువు ఇదే. విమానం వచ్చింది నవలలో అదొక చిన్న పాయ.

1.1. ‘ఓ కథ ముగిసింది’ నవల చంటిపిల్ల తల్లి వసంత భర్త రాంబాబు కోసం ఎదురుచూస్తున్న ఒక వర్షపు రాత్రి మొదలవుతుంది. ఆరాత్రే ముగుస్తుంది. వానలో రాంబాబు కావాలంటూ వచ్చిన ఒక మనిషిని లోపలికి వచ్చి కూర్చోమంటుంది వసంత. తీరిగ్గా కూర్చుని మాట కలుపుతూ ఆమె గురించిన ఎనిమిదేళ్ళక్రితపు రైలు ప్రయాణపు ఘటనను గుర్తు చేసాడు. అదెలా అతనికి తెలుసు అని విస్తుపోతూ అతన్ని అడిగింది. అసలుకథ వినూ అంటూ అతను లలిత, పద్మ, విజయల స్నేహం గురించి వాళ్ళ జీవితాలలో సంభవించిన పరిణామాల గురించి, వాళ్ళ ముగ్గురి జీవితాలలో విషాదానికి కారకుడైన రాంబాబు గురించి చెప్పింది విన్నాక అతనిని చంపటానికే ఆ యువకుడు వచ్చినట్లు వసంతకు అర్ధం అవుతుంది. అదే సమయానికి ఇల్లు చేరి తలుపు కొడుతున్న భర్త కంటపడకుండా పక్క గదిలో ఉండమని అతనికి చెప్పి తలుపు తీస్తుంది. తాగి వచ్చిన భర్తను ఇంతసేపు ఎక్కడున్నావ్? ఏం చేసావు అని అడుగుతుంది. విజయను చంపానని ఒప్పుకోమంటుంది. జవాబు చెప్పక పోవటమే కాక తనకు భార్యా పిల్లలు అనే సెంటిమెంట్స్ ఏమీ లేవని ఆమెను, బిడ్డను కూడా ఏమి చేయటానికైనా వెనుదీయనన్నట్లుగా నిర్లక్ష్యంగా మాట్లాడిన రాంబాబును ప్రతిఘటించకపోతే బతుకు లేదనే నిశ్చయానికి వచ్చిన అనివార్య స్థితిలో వసంత అతనిని కత్తితో పొడిచి చంపుతుంది. నేనే చంపాను అని పోలీసులకు చెప్తుంది. ఎందుకు అన్న వాళ్ళ ప్రశ్నకు “ భూమ్మీద ఉండదగని మనిషి గనక” అన్నది ఆమె సమాధానం. ఈ సమాధాన వాక్యమే నవలకు ముగింపు.

ఈ నవలలో ప్రధానమైంది ముగ్గురు స్త్రీల జీవితంలోని లైంగిక సంబంధాల సంక్షోభం. ఆ ముగ్గురూ హైస్కూల్ చదువుల నాటి నుండి సహవిద్యార్థులు, మంచి స్నేహితులు. లలిత, పద్మ, విజయ. బిఎ పరీక్షలు వ్రాసి ముగ్గురూ కలిసి ఎండాకాలం సెలవులకు విజయ అమ్మమ్మగారి వూరు ఒంటిమామిడి కి వెళ్ళటం దగ్గర కథ మొదలవుతుంది.యవ్వన సహజమైన ఉత్సాహం, ఉద్వేగాలు, ఆకర్షణలు, సవాళ్లు ఆ ముగ్గురు ఆధునిక యువతుల స్వభావంలో భాగం. రైలు ప్రయాణంలో పరిచయమైన సుధాకర్ తో స్నేహంలో కానీ , ఒంటిమామిడిలో అతనితో కలిసి తిరగటంలో, వాళ్ళింటికి వెళ్లి పేకాడటంలో కానీ ఆ స్వభావమే కనబడతాయి. పద్మ పిచ్చివాడైన విజయ మేనమామ విశ్వాన్ని శాసించి మామూలు మనిషిని చెయ్యాలన్న సవాల్ తనంతట తాను స్వీకరించటంలోనూ బలీయమైనది ఆ స్వభావమే. అయితే ఆ క్రమంలో విశ్వాన్ని తీసుకొని బీచ్ కు వెళ్లిన పద్మ అనూహ్యంగా అతని వల్ల లైంగిక అత్యాచారానికి గురికావటం ఒక నాటకీయ పరిణామం. అది కేంద్రంగానే నవల ఇతివృత్తం విస్తరించింది. ఆ క్రమంలో లైంగిక నీతికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చర్చకు వచ్చాయి.

అత్యాచారానికి గురైన పద్మలో కలిగిన తక్షణ ప్రతిస్పందన తాను అపవిత్రమయ్యానన్న భావన. శరీరాన్ని, బతుకును అసహ్యించుకొని త్యజించాలన్నంత గాఢమైన ఉద్రేకం. విజయ, లలిత ఇచ్చిన స్నేహం ఉద్రిక్తతను కాస్త తగ్గించింది కానీ దుఃఖాన్ని తగ్గించలేదు. బతుకు మీద ఆశను పెంచలేదు. ఆ సమయంలో ఆమె గర్భవతి అని తెలిసింది. విజయ అబార్షన్ చేయించుకోమంటే పద్మ అందుకు ఇష్టపడలేదు. తల్లీ తండ్రీ కూడా మరణించి ఒంటరి అయిన తనకు బతకటానికి ఆ గర్భస్థ శిశువే ఆలంబన అనుకొని ఉంటుంది పద్మ. పెళ్లి మీద ఆశవుంది కానీ తనను ఎవరు ఇష్టపడతారు అన్న ప్రశ్న ఆమెకు ఉంది. పెళ్ళికి స్త్రీ శరీర పవిత్రతను మొదటి షరతుగా చేసిన సామాజిక నీతి కలిగించిన నిస్పృహ నుండి వచ్చిన ప్రశ్న అది. ఈ పరిస్థితులలో సుధాకర్ తో ఆమె పెళ్లి మరొక నాటకీయపరిణామం.

నిజానికి సుధాకర్ విజయను పెళ్లిచేసుకొంటే బాగుండునని ఆమె తల్లి అనుకొంటే అతను తనకు లలితను పెళ్ళిచేసుకోవాలని ఉందంటాడు.కులాన్ని, కుటుంబాన్ని కాదని అతనిని పెళ్లిచేసుకోగల సాహసం తనకు లేదంటుంది లలిత. అటువంటప్పుడు అతను పద్మను చేసుకొనేట్లు ఒప్పిస్తే పద్మ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అందుకు లలితను ప్రేరేపించింది విజయ. తత్పలితమే పద్మ సుధాకర్ ల పెళ్లి.

లలిత చెప్పిందని చేసుకొన్నా పద్మను పెళ్లాడటం ఆదర్శం అని తనను తాను నమ్మించుకొన్నా తక్షణం ఆమెను స్వీకరించటానికి సుధాకర్ కు అడ్డువచ్చింది ఆమె శరీరం మలిన పడింది అన్న సంప్రదాయ భావనే. మరెవరో ముట్టిన శరీరం భర్తగా అతనికి అక్కునచేర్చుకొని ఆదరించటానికి అనర్హమైనదిగా అనిపించింది. ఆ అడ్డు గోడలు కూలి ఎప్పటికైనా తాను స్వీకరించటానికి సంసిద్ధం అయ్యేవరకు ఆమె ఓరిమితో నిరీక్షించాలి అని అతను ఆశించాడు. ‘పెళ్లాడేస్తే చాలు’ అని పెళ్లాడిన సుధాకర్ తో ఒక కప్పు కింద ఉంటున్నా సంభాషణ స్నేహమూ, సహజీవనమూ లేక పద్మ జీవితంలో ఏర్పడ్డ శూన్యంలోకి రాంబాబు ప్రవేశించడంతో ఆమె జీవితం సంక్షోభంలో పడి మరణంతో ముగిసింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని ఇద్దరుబిడ్డల తల్లి అయి సినిమారంగంలో డిస్ట్రిబ్యూటర్ భార్యగా సంపదను, హోదాను అనుభవిస్తున్న లలిత జీవితంలోకి ప్రవేశించి మోహపెట్టి మాయచేసినవాడు కూడా రాంబాబే. తామిద్దరి సాన్నిహిత్యాన్ని చూపే నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె జీవితంలో సంక్షోభం నింపాడు. అదే రాంబాబు సుధాకర్ స్నేహితుడిని అంటూ విజయ జీవితంలోకి ప్రవేశించాడు. జీవితంలోని సాదాతనంతో తృప్తి పడలేని విజయ తత్వం అతనికి కలిసివచ్చిన అవకాశం. తన ప్రయోజనాలను ప్రశ్నించినందుకు ఆమె గొంతు నులుమటానికి, మెడకు వైర్ తో ఉరిపెట్టి చంపటానికి కూడా వెనుకాడనివాడతను.

అత్యాచారానికి గురైన పద్మ పెళ్లయి కూడా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకొనటం, ఇద్దరు పిల్లలతల్లి లలిత వైవాహికేతర సంబంధం ఏర్పరచుకొనటం, విజయ వివాహం లేకుండా రాంబాబుతో సంబంధంలో ఉండటం - ఈ మూడూ స్థిరపడి ఉన్న సామాజిక విలువల దృష్ట్యా అనైతిక సంగతులు. ఒక భార్యవుండి మరో ముగ్గురుస్త్రీలతో సంబంధం పెట్టుకొన్న రాంబాబు నైతికత అసలు సమస్యే కాదు.పైగా పురుష సమాజ ప్రతినిధిగా అతనే నీతి అవినీతుల విభజనరేఖలు సృష్టించినవాడు. వాటిని కాపాడినవాడు.అతని దృష్టిలో కుటుంబం నీతిసామ్రాజ్యం. తన భార్య దానికి చక్రవర్తిని అంటాడు. తాను చేసేదేమీ ఆమెకు తెలీదు, తెలీరాదు అని కూడా అనుకొంటాడు. గృహసామ్రాజ్య చక్రవర్తిని అయిన భార్యపట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో దానికి విశ్వం సాక్షి. రైల్వే స్టేషన్ లో ఏదో జబ్బుతో పోరుపెట్టి ఏడుస్తున్న కొడుకును సముదాయించలేక , చుట్టూ ఉన్న సామాను విడువలేక సతమవుతున్న పదహారేళ్ళ భార్యకు దూరంగా కాఫీ తాగుతూ, పుస్తకాలు చూస్తూ కాలం గడిపిన ప్రభుద్ధుడతను. సామానుతో, పిల్లవాడితో ఆమె రైలెక్కే వరకూ ఆ దరిదాపులకే రానివాడు, భార్యమీద రైల్లో కూడా గట్టిగా అరిచి అవమానించగల భర్త అతను. నిజానికి ఇంట్లో నీతి సామ్రాజ్యమైనా, బయట అవినీతి సామ్రాజ్యమైనా పూర్తిగా స్వార్ధంతో సుఖ సౌకర్యాలకోసం అతను సృష్టించుకొనేవే. అతను వ్యాఖ్యానించేవే.

స్నేహమని, సినిమాలని రాంబాబు పెట్టిన మోహంలో పడి వచ్చిన విజయను అతను స్టేషను కు వచ్చి టాక్సీలో తీసుకువెళ్లాడు. ఎక్కడికి పోతున్నాం? మీ ఇంటికా అని ఆమె అడిగితే అక్కడకు ఆమె ప్రవేశం నిషిద్ధం అన్నట్లు ఇంటిని నీతి సామ్రాజ్యంగా పేర్కొన్నాడు అతను. ఆ మాటకు బాధ పడిన విజయ అయితే మనది అవినీతి సామ్రాజ్యమా అని ప్రశ్నించింది. ‘అలా విడదీసి చూసే ప్రపంచంతో మనకు పనిలేదు’ అని అన్నది అతని జవాబు. నీతి అవినీతి సామ్రాజ్యాల విభజనా అతనిదే, విభజన రేఖలతో మనకు పనిలేదని చెప్పగలిగింది అతడే. అతని సౌకర్యం కోసమే. అది పురుష ప్రపంచపు నీతి.

ఇలాంటివాళ్లకు ఇంట్లో భార్యలు ‘దేవతలు’. బయట తాను ఎంతమంది స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నా తెలియనట్లే బతికేస్తుంటారు కనుక. తమను ప్రశ్నించి ఇబ్బంది పెట్టరు కనుక వాళ్ళను దేవతలు అనటానికి అభ్యంతరం ఏముంది? అలాగే బయట తమ అనుభవానికి అందివచ్చే స్త్రీలు కూడా దేవతలే. ఆ మాత్రపు ప్రశంసే స్వాంతన లేపనమై అశాంత అసంతృప్త మహిళల అంతరంగాలను ముట్టుకొని సర్వసమర్పణగా ముగుస్తుంది. పురుషులకు కావలసింది అదే. సర్వ సమర్పణలో శరీరమూ ఉంటుంది, ఆర్ధిక ప్రయోజనాలూ ఉంటాయి. అందుకనే ఇంటి దేవత ఒక్కతే అయినా బయటి దేవతలు ఎంతమందైనా ఉండవచ్చు. వీలు కావాలి అంతే. రాంబాబుకు వీలైంది. సుధాకర్ భార్య పద్మనే కాదు, సుధాకర్ ఆరాధించిన లలితను, సుధాకర్ ను ఆరాధించిన విజయను కూడా ‘ దేవతలు’ చేసుకొనేవరకు రాంబాబు విశ్రాంతి తీసుకోలేదు. పద్మవల్ల ప్రచురణ సంస్థకు పెట్టుబడులు, విజయవల్ల సినిమారంగంలో రచయితగా అవకాశాలు, లలితవల్ల డబ్బు సంపాదించాడు.

అత్యాచారానికి గురైన స్త్రీ అవమానంతో, అపరాధభావంతో జీవితమంతా క్రుంగి కుళ్ళి నశించాలని సమాజం ఆశిస్తుంది. పద్మ అలాకాక హృదయం ఇయ్యటానికి, శరీర సమర్పణకు ఒక పురుషుడిని, గౌరవకరమైన జీవితాన్ని కోరుకొన్నది. అత్యాచారం ఒక ప్రమాదం గా మరిచిపోదామంటే మరువనియ్యని సమాజానికి ప్రతినిధి అయ్యాడు పెళ్లాడిన సుధాకర్. ఆశించిన సహజీవన సౌమనస్యం లభించక భంగపడి బలహీనమైన పద్మ హృదయాన్ని, శరీరాన్ని లోబరచుకోగలిగాడు రాంబాబు. లైంగిక ఆసక్తులు, ఆర్థిక ప్రయోజనాలు తీరిపోయాక ఆమె అతనికి అక్కరలేనిదే అయింది. విజయ సంగతి కూడా అంతే.

తలకు తగిలిన బలమైన దెబ్బతో నాలుగేళ్ల చికిత్స తరువాత మామూలు మనిషి అయిన విశ్వం తన పిచ్చి తగ్గటానికి కారణమైన పద్మను వెతుక్కొంటూ పోయే క్రమంలో మేనగోడలు విజయ పాలిటా పద్మ పాలిటా శని రచయిత రాంబాబే అని తెలుసుకొన్నాడు. అతనిని చంపటానికి వాళ్ళిల్లు వెతుక్కొంటూ వెళ్ళాడు. అయితే రాంబాబు ను దోషిగా నిలబెట్టటం ఈ సమాజ లక్షణం కాదు అన్న స్పష్టత వివినమూర్తికి ఉంది.’ ఆ ముగ్గురూ ఎవరికి కావలసిన దానికోసం వాళ్ళు అతనితో చెయ్యికలిపారేకానీ అతను ఎవ్వరినీ రేప్ చెయ్యలేదే’ అని రాంబాబు భార్య ముఖతః చెప్పించిన మాటలలో ఆ సూచనే ఉంది. అది ఎంత మాయ, మిథ్య అయినప్పటికీ బ్రతుకు భద్రత భర్తతోటి జీవితంలోనే ఉందనుకొనే సాధారణ భార్య తర్కం.అయితే ప్రతి ఆడదాని జీవితాన్ని ఒక్కొక్క మగాడు నాశనం చేస్తాడని స్వీయానుభవం నుండి తెలిసిన ఆడది ఆమె. కానీ పద్మ విజయ లలితల జీవితాలు తెలిసాక అనేకమంది ఆడవాళ్ళ జీవితాన్ని ఒక్క మగవాడు నాశనం చేయగలడని ఆమెకు తెలిసి వచ్చింది. అప్పుడే బలహీనతలు ఉన్న ఆడవాళ్లు నీచులా? ఆడవాళ్ళ బలహీనతలను ఉపయోగించుకొని డబ్బు చేసుకునే మగవాళ్ళు నీచులా అన్న కొత్త ప్రశ్న ఆమె ముందు నిలబడింది. అప్పుడిక మగవాడిని దోషిగా బోనెక్కించక తప్పదు. తీర్పు ఇచ్చి శిక్షించకా తప్పదు. వసంత చేసింది అదే. ఆ రకంగా ఈ నవల మగవాడు నిర్మించి నిర్వహిస్తున్న లైంగికనీతి కుటుంబంలోనూ, బయటా కూడా స్త్రీలకు హానికరమైనది, పురుష ప్రయోజనాలకు ఉపయోగపడేది అని దాని ద్వంద్వ స్వభావాన్ని నొక్కి చెప్పింది.

ఈ నవలలో పద్మ జీవిత విధ్వంసానికి, విషాదానికి కారకుడైన రాంబాబు మీద విశ్వానికి భరించరాని కోపం వచ్చింది. ఎదురుగా కనిపిస్తే చంపేద్దామన్నంత ఉద్రేకం కలిగింది. అయితే అతని ఆలోచనలు రాంబాబును శిక్షించటం మీదకన్నా పద్మను రక్షించటం మీద ఉన్నాయి అని చెప్తాడు రచయిత ఒక చోట. అయితే అప్పటికే పద్మ ఆత్మహత్య చేసుకొన్నది. లైంగిక నేరానికి బాధితులై ఒంటరులై బాధపడే స్త్రీలను కాపాడుకొనటం అనే సంస్కారాన్ని ఈ నవలలో సూచించి వదిలేసిన రచయిత దానిని భౌతిక జీవిత వాస్తవంగా నిరూపించటానికి వ్రాసిన నవల ‘బండ మనిషి’.

1.2. ‘బండమనిషి’ 1985 మార్చ్ లో స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా వచ్చింది.దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పట్టా పొంది ఉద్యోగం లేక రికామీగా తిరిగే నలుగురు యువకులు రాఘవులు, భాస్కరం, రంగారావు, జగ్గు. ఈ నవలలో కథ లైంగిక అత్యాచారం దగ్గరే మొదలవుతుంది. చీకటి పడేదాకా ఎవరింట్లోనో కూర్చొని పేకాడిన మిత్రబృందం ఇళ్లకు వెళ్లి, అన్నాలు తిని, ఎనిమిదిగంటలకల్లా కాలువగట్టు మీద కలిసి, సెకండ్ షో సినిమా చూసి, గునుపూడి జంక్షన్ కి వచ్చి, జాతీయరహదారి మీద ఉన్న బంగార్రాజు టీ కొట్టుకు చేరి, అక్కడ బంగార్రాజు కూతురి గురించి అసభ్యంగా మాట్లాడి, బంగార్రాజు చేత దెబ్బలు తిని, కసితో అతన్ని, అతని అల్లుడిని కొట్టి, కూతురి మీద ఆత్యాచారం చేసి రాత్రికి రాత్రి రాజమండ్రి వెళ్లి హౌరా మెయిల్ ఎక్కి ఊరి నుండి తప్పుకొన్న నలుగురిలో ఖరగ్ పూర్ లో తేలిన జగ్గూ కథ ఇది. జగ్గు అనుభవ కథనంగా ఉత్తమపురుషలో సాగుతుంది నవల.

అత్యాచార ఘటనలో జగ్గూ భాగస్తుడు కాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే చెల్లెలు రత్నం పసితనమే అతనికి గుర్తువచ్చింది. బంగార్రాజును, అతని అల్లుడిని చావకొట్టటంలో ఉన్నాడు. అత్యాచారం చేసిన మిగిలిన ముగ్గురితో అతని స్నేహం ఊరంతా తెలిసిందే. బంగార్రాజు కొట్టులో నలుగురినీ కలిపి చూసినవాళ్లు ఉన్నారు. అందువల్ల మిగిలిన ముగ్గురికీ ఉన్న ప్రాణ మానహాని భయం అతనికీ ఉంది. అందుకని అందరూ కలిసి వూరు దాటేసారు. ఈ ప్రయాణం జగ్గూ ను ఖరగ్ పూర్ లో కార్మిక వాడవైపు, వర్గం వైపు చేర్చింది. భాష తెలియక, తాగిన టీకి ఇయ్యటానికి డబ్బులు జేబులో లేక, కొట్టు దగ్గర మనుషులతో గొడవపడుతున్న జగ్గూని ఆదుకొని ఇంటికి తెచ్చిన సత్యమే అతనిని రైల్వేలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేసే పనిలో కూలీగా చేర్చాడు. తమకుటుంబంలో మనిషిగా కలుపుకొన్నాడు. ఆ ఇంట్లో జబ్బుపడి మంచాన ఉన్న సత్యం భార్య తప్ప సత్యంతో సహా, - అయిదేళ్ల కుర్రాడు మినహా - మిగిలిన ముగ్గురు పిల్లలు లక్ష్మి, రాము, సన్యాసి పొట్టకూటికోసం ఏ దో ఒక పని బాధ్యతగా చేస్తున్నవాళ్ళే. వాళ్ళతో కలిసి ఉండటం వల్లనో ఏమో జగ్గూ మనుషుల కోసం మెత్తనవుతూ వచ్చాడు. మనుషులకోసం నిలబడేవాడుగా పరివర్తన చెందాడు. అందువల్ల అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును నిరూపించిన ఘటనలు మూడూ స్త్రీలకు సంబంధించినవే కావటం గమనించవచ్చు.

ఫిబ్రవరిలో వూరు వదిలి వెళ్లిన జగ్గూ ఆగస్టు లో చెల్లెలి పెళ్లి కోసం వూరికి తిరిగివచ్చాడు. చెల్లెలు రత్నం స్కూల్ మాస్టారు రాజును ఇష్టపడింది కానీ, కులం తక్కువవాడన్న తల్లి అభ్యంతరానికి లొంగి వాళ్ళు తెచ్చిన వరుడిని పెళ్లాడటానికి సిద్ధపడుతున్నది. ఆ విషయమే రాజుకు నచ్చచెప్పాలని చూస్తున్నది అని తెలిసినప్పుడు అతను భరించలేకపోయాడు. ఇద్దరినీ ఆ రాత్రి తల్లిదండ్రుల ముందుకు తీసుకువెళ్లి అసలు విషయం చెప్పాడు కానీ రత్నం అతనితో సహకరించలేదు. అన్నను ఆసరాగా చేసుకొని తన ప్రేమ నిలుపుకోవాలని అనుకోలేదు. తల్లిదండ్రుల భావాలకు దాసులుగా మిగిలిపోవటానికి స్వంత ఇష్టాలను, స్వీయ నిర్ణయాలను వదిలేసిన రత్నాన్ని, పిల్లల మనోభావాలు పట్టించుకోకుండా కుల గౌరవం, కుటుంబ మర్యాద మొదలైన సంప్రదాయ చట్టాలకు కాపుకాసే తల్లిదండ్రులను అతను సహించలేకపోయాడు. అన్నీ జారిపోతున్న ఇల్లు తాను ఇమడగలిగిన ఇల్లు కాదని అతనికి అనిపించిందంటే అతను నూతన మానవుడుగా తయారవుతున్నాడన్నమాట.

ఊళ్ళో బంగార్రాజు కూతురిపై అత్యాచారం చేసిన మిత్ర బృందంలో రంగారావు ఆత్మహత్య చేసుకొనటం, రాఘవులు హత్య చేయబడటం, అత్యాచారానికి గురైన లక్ష్మి మొగుడు చిన్నానే వాటికి కారకుడని భయపడి చస్తూ భాస్కరం బ్రతుకు వెళ్లదీయటం తెలుసుకొన్న జగ్గూకు భాస్కరం ద్వారా పిచ్చెక్కిన బంగార్రాజు కూతురు రాజమండ్రి ఆసుపత్రిలో ఉందని తెలిసాక తిరుగు ప్రయాణంలో ఆమెను చూడకుండా ఉండలేకపోయాడు. మిలటరీ నుండి సెలవులకు వచ్చి ఆసుపత్రిలో ఉందని తెలిసి అక్కను చూడాలని వచ్చిన తమ్ముడిగా పరిచయం చేసుకొని ఆమెను చూసాడు. ఆరునెలలక్రితం పుష్టిగా బొద్దుగా ఉన్న ఆ మనిషి జీవచ్ఛవంలా ఉండటం చూసి కదిలిపోయాడు. తండ్రి గానీ, భర్త గానీ ఆమెకు సరైన వైద్యం చేయించకుండా వదిలెయ్యటాన్ని గమనించి వేదనపడ్డాడు. ఆమె బాధ్యత తీసుకొనటం ధర్మంగా భావించాడు. మర్నాడు ఆసుపత్రికి వచ్చేసరికి ఆమె చనిపోయిందన్న వార్త విని శవాన్ని తీసుకువెళ్లి దహన క్రియలు నిర్వహించాడు.

ఈ సందర్భంలో అతనికి వచ్చిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. సెక్స్ నేరాలకు గురైనవాళ్ల పై దాని ప్రభావం ఎందుకు అంత తీవ్రంగా ఉంటుంది? అన్నది ఒక ప్రశ్న.అత్యాచారానికి గురికావటం స్త్రీ శీలానికి సంబంధించిన సమస్య. ఆమె శరీరం అపవిత్రమైనట్లే. అది కుటుంబం పరువుకు, ప్రతిష్టకు సంబంధించిన విషయంగా చూడబడుతుంది. ఈ పరిస్థితులలో బిగుసుకు పోయే కుటుంబ సంబంధాలలో బాధిత స్త్రీకి అవసరమైన సానుభూతి , స్నేహం, ఓదార్పు, నైతిక ధైర్యం లభించవు. అత్యాచారం ఒక దెబ్బ అయితే ఒంటరిగా దాని బాధను, దుఃఖాన్ని భరించవలసి రావటంలో పొందే ఒత్తిడి ఫలితమే కావాలి బంగార్రాజు కూతురు పిచ్చిది కావటం, ఒంటిమీద బట్టలు తీసేసుకొనటం, ఒళ్ళంతా రక్కేసుకొనటం. ఇలా స్త్రీలు తమ శరీరాన్ని తామే హింసించుకొనే తీవ్ర స్థితికి శరీరమాలిన్య భావనను తలకెక్కించిన సమాజమే కారణం.

ఆ సమాజంలో భాగమే ఆమె తండ్రి. కూతురికి ఆ స్థితి ఎందువల్ల కలిగిందో వూళ్ళో తెలియటమైనా, డాక్టర్లకు చెప్పటమైనా ఆయన కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విషయాలు. అందుకే మౌనం. ఆసుపత్రిలో చేర్చాడేకానీ అతీగతీ చూడలేదు. భర్త కంటికే కనబడకుండా పోయాడు. అలా ఒంటరి చేయబడిన ఆ బాధిత మహిళ పిచ్చిది కాక ఏమవుతుంది? ఆసుపత్రి నుండి పారిపోయి రైలు కిందపడి మరణించకుండా ఏమవుతుంది? ఇది అర్ధమైన జగ్గూ గుండె అవిసిపోయింది. కనుకనే ఇదేం మనుషులు? కామపరమైన సంఘటనలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చుకొంటారు? అన్న ప్రశ్నలు అతనిని వేధించాయి. మగవాడి కాసేపటి సుఖం ఆడదాని జీవితానికి శాశ్వత దుఃఖం కావటంలోని అన్యాయాన్ని గురించి ఆందోళన పడ్డాడు. ఈ మొత్తంలో మనిషిని నొక్కేసి హింసించే సంప్రదాయ భావజాల చట్రాల పట్ల వ్యతిరేకత, నిరసన జగ్గూ ప్రవర్తనలో భాగమై కనబడతాయి.

ఖరగపూర్ వెళ్లేసరికి జగ్గూ కు మరొక సమస్య ఎదురైంది. అది చనువుగా ఉంటూ చలన చైతన్యంతో తనకు స్నేహాన్ని, అభిమానాన్ని పంచిన లక్ష్మి, తనతో సహజీవనాన్ని కోరిన లక్ష్మి కలకత్తా వెళ్ళిపోవటం. పెళ్లిళ్లు, జబ్బులు, పెరిగే ఖర్చులు అప్పులు చేయకతప్పని కూలీ బతుకులు, వాళ్లకు అప్పులిచ్చి పనిచేసేచోట రోజు కూలీ నుండి వడ్డీలు వసూలు చేసే సేట్లు, అప్పు చెల్లించలేని వాళ్ళ ఆడపిల్లల శరీరాలను కుదువబెట్టుకొని బకాయిలు చెల్లువేసే భయంకర వ్యవస్థ, అప్పు బాకీ కింద ఆడవాళ్లను చెల్లువేసుకొని వాళ్ళ శరీరాలతో వ్యాపారం చేసే వ్యవస్థ అతనికి తెలిసివచ్చిన సందర్భం అది. కలకత్తాలో ఏ వేశ్యాగృహానికో అమ్మివేయబడిన లక్ష్మిని వెతుక్కొంటూ వెళ్లి ఆమెను విడిపించుకొని రావటం అతను తీసుకొన్న కార్యక్రమం. అందులో అతను విజయం సాధించటం నవల ముగింపు.

ఒక కథ ముగిసింది నవలలో విశ్వంలోని రెండు పార్శ్వాలు ఈ నవలలో చిన్నాగా, జగ్గూగా రెండు వేరు రూపాలను పొందాయి. విశ్వంలో పద్మ జీవితాన్ని ధ్వంసం చేసిన రాంబాబును చంపెయ్యాలన్నంత కోపం ఉంది. చిన్నా ఆ పార్శ్వానికి ప్రతినిధి. కనుకనే ‘నాలుగు గొడ్లు కలిపి తొక్కిన గడ్డి అది, ఏ నోటితో ముట్టుకుంటాం’ అని ఆమె మానాన ఆమెను వదిలేసి, ఆమెను ‘పాడుచేసిన’ ఆ నలుగురిని వెతుక్కొంటూ ప్రతిఒక్కడినీ చంపటమే లక్ష్యంగా తిరిగాడు. ఫలితం భార్యను కోల్పోవటం. విశ్వంలో మరొక పార్శ్వం పద్మను రక్షించుకొనటం ఎలా అన్నతీవ్రమైన నిజాయితీతో కూడిన ఆవేదన. జగ్గూ దానికి ప్రతినిధి. విశ్వంలో ఆలోచనాస్థాయిలో ఉన్నదానిని ఆచరణ వాస్తవం చేసిన వ్యక్తిత్వం అతనిది. విశ్వం పద్మను శరీర పవిత్రతాపవిత్రతల విచికిత్స నుండి కాక తనకు జీవితాన్నిచ్చిన మానవిగా చూసాడు కనుకనే తనవల్ల అల్లకల్లోలమైన ఆమె జీవితాన్ని శాంతి తీరానికి చేర్చాలనుకొన్నాడు. జగ్గూ కూడా అంతే. ఏ షరతులూ లేని ప్రేమను ఆత్మీయతను పంచిన లక్ష్మిని పేదరికం వల్ల స్త్రీగా ఆమె ఎదుర్కొనవలసి వచ్చిన దైన్యం నుండి విముక్తం చేసి ఆమెతో జీవితం గడపాలనుకొన్నాడు. కామపరమైన సంఘటనలకు జీవితంలో అనవసరమైన ప్రాధాన్యత ఇయ్యటమే విషాదం అనుకొన్నాడు కనుక తాను దానిగురించి ఆలోచించలేదు. తనను నమ్ముకొన్న మనిషి పట్ల బాధ్యతగా ఉండటం కన్నా గొప్ప మానవ విలువ మరొకటి లేదని నమ్మి ప్రవర్తించాడు. ఆ రకంగా అతను విశ్వంలోని రెండవ పార్శ్వానికి ఉన్నత అభివ్యక్తి.

నైతిక విలువలు లేని, డబ్బుకుతప్ప మరిదేనికీ కట్టుబడని, మానవత్వం లేని జాతిగా పేద వాళ్ళను నిర్వచించి నిరూపించే పెద్దమనుషుల సమాజపు తలకిందుల న్యాయాన్ని విమర్శకు పెట్టటం, పేదరికంలోనూ అవసరమైన, నిజమైన సహాయాన్ని, స్నేహాన్ని అందించగల ఒకరి కోసం ఒకరు నిలబడగల ఐక్యత పేదల అతి సహజ మానవీయ లక్షణంగా నిరూపించటం ఈ నవలేతివృత్తంలో చక్కగా ఇమిడిపోయాయి. కార్మిక వాడలను, అథోజగత్తును నేపథ్యంగా చేసి లైంగిక నీతి గురించిన మిధ్యాభ్రమలను తుడిచిపెట్టగల సామాజిక పరివర్తన గురించి ఆశను, నమ్మకాన్ని వాగ్దానం చేస్తుంది ఈ నవల.

1.3. 1986ఆగష్టు స్వాతి పత్రికకు అనుబంధంగా వచ్చిన ‘రేపు మీదే’ నవల ఇతివృత్తం కూడా లైంగిక సంబంధాలు , నీతి అనే వాటిని చుట్టుకొనే విస్తరించింది. ‘ఓ కథ ముగిసింది’ నవలను చదువుకొన్న పట్టణ ఎగువ మధ్యతరగతి నేపథ్యంలో, ‘బండ మనిషి’ నవలను దిగువ మధ్యతరగతి, శ్రామికవర్గ నేపథ్యంలో నడిపిన రచయిత ఈ నవలను భూస్వామ్య సంప్రదాయ క్షీణ విలువల, విశ్వాసాల నేపథ్యంలో నడిపారు. భూస్వామ్య సమాజం దేవుడి గురించో, దెయ్యాల గురించో అనవసరమైన అభూతకల్పనలను రచించి ప్రచారంలో పెడుతూ మనుషులను ఎప్పుడూ ఏదో ఒక భ్రమా లోకంలో తిప్పుతుంటుంది. జీవిత వాస్తవం అయిన లైంగిక ఆకర్షణలు, ఆసక్తుల గురించి ఆలోచించటం, మాట్లాడటం ఈ సమాజంలో, కుటుంబంలో నిషిద్ధం అవుతాయి. ఆరోగ్యకరమైన పద్ధతిలో కామప్రేరణలు అభివృద్ధి చెందటానికి సరైన జ్ఞానం, మార్గదర్శకత్వం అసలే లభించదు. ఈ పరిస్థితిలో యువతీ యువకుల మనస్తత్వాలు ఏ వికృతులకు లోనవుతాయో, ఏ అనర్ధాలు సంభవిస్తాయో ఎవరికీ పట్టనిదే అవుతున్నది. ఆ చీకటికోణాల వైపు దృష్టి మళ్లిస్తుంది ఈ నవల.

ఆర్థికంగా దిగనాసిల్లుతున్న భూస్వామ్య గతవైభవానికి సంబంధించిన డాబూ దర్పాల, పరువు ప్రతిష్టల దానధర్మ దయాగుణాల మత్తులో నిష్క్రియాపరులుగా జీవితం గడిపేసే లచ్చింపేట దివాణం జమిందారుల ఇంటి బిడ్డ పదమూడు పద్నాలుగేళ్ల సరోజ. నలుగురు అన్న దమ్ముల ఉమ్మడి సంసారంలో ఇంటికి ఒకే ఒక్క ఆడపిల్ల ఆమె. ఇంటి మహాలక్ష్మిగా ముద్దు చేయబడింది. గారాబంగా పెరిగింది. తనకు అన్నీ ఉన్నాయి అన్న ఎరుక, ఏమీ లేనివాళ్ల పట్ల జాలి, తనకున్నది లేనివాళ్లకు ఇచ్చేయాలన్న దయాగుణం ఆమె కు తండ్రి నుండి వారసత్వంగా అబ్బిన గుణాలు. కౌటుంబిక ఆర్ధిక వాస్తవం తెలియనట్లే ప్రవర్తించే తండ్రి తల్లితో కలిసి ఆ కూతురి దయాగుణానికి మురిసిపోయాడే కానీ, ఒక పినతండ్రి ప్రోత్సహించాడే కానీ ఎవరూ ఆ పిల్లను లోక వాస్తవాలవైపు కళ్ళు విప్పేందుకు ప్రేరేపించలేదు. దానికి తోడు దివాణపు శిధిల భవనాల మధ్య ఆమెకు అందివచ్చిన జ్ఞానం అంతా దేవుడికి, దయ్యాలకు, పునర్జన్మలకు సంబంధించినదే. ఈ పరిస్థితులలో శరీర స్పృహ, స్త్రీత్వ స్పృహ వికసించని ఆడపిల్ల జీవితం ఎలా ఉండటానికి వీలుందో చూపిస్తుంది ఈ నవల.

పుట్టకముందే తండ్రిని, పుట్టాక తల్లిని కోల్పోయి అమ్మమ్మ పెంపకం లో పెరిగి చదువు అబ్బక ఆ తరువాత మేనమామ ప్రాపకంలో ఇంట్లో ఆయన భార్య చెప్పే పనులు చేస్తూ అవి సరిగా చేయలేదని చీవాట్లూ, దెబ్బలూ తింటూ ఎవరికీ కానీ బతుకు బతుకుతున్న ఇరవై ఏళ్ల యువకుడు రవి వర్మ. బానిస జీవితంలో కోపోద్రేకాలను చూపే అవకాశమే లేనివాడు. అణచిపెట్టబడిన ఆ ఉద్రేకాలు వక్రరూపంలో లైంగిక ఆసక్తులుగా అతని అంతరంగాన్ని ఆక్రమించుకొని తింటున్నాయి. పద్నాలుగేళ్లు వచ్చినా ఆడామగా శారీరక భేదం గురించి కానీ, మగవాడి కళ్ళల్లో, మాటల్లో, ప్రవర్తనలో కనపడే లైంగిక ఆసక్తులను కానీ గుర్తుపట్టలేని స్థితిలో మిగిలిన సరోజను, స్త్రీని శరీరంగా తప్ప చూడలేని మానసిక వికృతితో సంచరించే రవిని ఒకదగ్గరకు చేర్చి వాళ్ళమధ్య జరగటానికి వీలున్న ఒక నాటకాన్ని ప్రదర్శించారు రచయిత.

రవి బీదవాడు, ఒక్కడే ఉంటాడు, తన అన్నం తానే వండుకొంటాడు ఇవి సరోజలో రవిపట్ల జాలిని కలిగించిన విషయాలు.ఆమె సిఫారసుతో దివాణం వంటింటి నుండి వచ్చే కూరలు తింటూ రవి అదంతా సరోజకు తన మీద ఉన్న ప్రేమ అనుకొంటాడు. తల్లి ప్రస్తావన ఆమెలో తనపట్ల జాలిని, శ్రద్ధను కలిగిస్తున్నదని తెలిసి పదేపదే తల్లి కలలో కనిపించటం గురించి చెప్తుంటాడు. ఆమె సరోజ రూపంలో కనిపిస్తున్నదని కల్పిస్తాడు. అది పట్టుకొని సరోజ తాను అతని తల్లిగానే లోలోపల భావనలు పేనుకొంటుంది. తల్లిగా అతనిపట్ల తనకు బాధ్యత ఉందనుకొనే భ్రమలోనే అతనివెంట ఊరిడిచి వెళ్తుంది. ఆమె శరీరాన్ని కోరి తాను చేసే మాయను గుర్తించలేని సరోజ తల్లి తనం అతనిని తనలోని లైంగిక వక్రతలను చక్కబరచుకొని మనిషిగా నిలబడే స్థితికి తీసుకు వెళుతుంది. మంచికి మారటానికి సిద్ధపడుతున్నయువకుడి ప్రాణాలు దివాణం పరువు ప్రతిష్టలకు బలిపెట్టబడటంతో, ప్రాణాలతో సరోజను ఇల్లు చేర్చటం తో ఆ నాటకం ముగిసినట్లే. ఈ క్రమంలో స్త్రీ శరీరాన్ని పొందటానికి వ్యక్తిగా పురుషుడు చేసే ప్రయత్నం ఎన్ని అబద్ధాలతో ఎన్ని మాయలతో ఎంత నటనత , ఎంత వంచనతో కూడుకొన్నదో చూపటం ఒక భాగం అయితే అదే సమయంలో ఏ షరతులూ లేని ప్రేమను అందించగల స్త్రీల స్వఛ్ఛత, సహృదయత మగవాడిలో ఉన్న మానవత్వం మేల్కొనటానికి కారణం అవుతుందని సూచించటం మరొక భాగం. అయితే కులం, దాన్ని మించి ధనం, హోదా , కుటుంబ పరువు, వంశ ప్రతిష్ట మొదలైనవి స్త్రీపురుషుల మధ్య ఆకర్షణలను సంబంధాలను నియంత్రించేవిగా ఉండటం అసలు విషాదం. అది భూస్వామ్య అవలక్షణం. ఈ నాటికీ జరుగుతున్న పరువు హత్యలు దాని అవశేషమే.

నవల అక్కడ ముగియదు. సరోజ పెళ్లి దీనిలో చివరి అంకం. ఆడపిల్ల ఎవరితోనో వెళ్ళిపోవటం వల్ల పోయిన పరువును నిలబెట్టుకోవాలంటే వెంటనే ఆ పిల్లకు కులమింటి పెళ్ళిచేయాలి. రవి హత్యను కళ్లారా చూసి కొడుకును కోల్పోయిన తల్లివలె దుఃఖపడే సరోజకు చచ్చినవాడు ఆమె కడుపున మళ్ళీ పుడతాడు అన్న ఓదార్పు వాక్యం పెళ్ళికి సిద్ధపడేట్లు చేసింది. తాతలు వంటలు చేసి నీళ్లు మోసి బతికినవాళ్ళని, తండ్రి సినిమా నటుడని ఏ వరుడిని ఇంతకు పూర్వం తిరస్కరించాడో రఘుపతి ఆ ఇంటికే వెళ్లి ఆ సంబంధమే నిశ్చయం చేసుకొని వచ్చాడు. ఆ పెళ్ళికి మగపెళ్ళివారి పక్షాన వచ్చిన వాళ్లలో ఇద్దరు - ఒకరు రవి స్నేహితుడు , మరొకరు పోలీసు ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం లాడ్జ్ లో సరోజను రవితో చూసినవాళ్లు. ఆ విషయం బయటకు వచ్చేసరికి పెళ్లి అయిపొయింది. అయినా వరుడి తల్లిదండ్రులు ఆ సంబంధం తెగతెంపులు చేసుకొని వెళ్లిపోవాలని అనుకొన్నారు. వరుడు దానిని వ్యతిరేకించి నిలబడ్డాడు. వంశం, కులం అని పట్టుకు వేళ్ళాడే పాతతరం వైఖరిని నిరసించాడు ఆధునిక యువకుడైన మధు. మనుషుల్ని మనుషులుగా గుర్తించే కొత్త తరానికి ప్రతినిధిగా మాట్లాడాడు అతను. స్త్రీ శీలాన్ని కోల్పోతే సమస్తమూ కోల్పోయినట్లు బెంబేలెత్తే అవివేకాన్ని విమర్శించి, స్త్రీ శీలం కోల్పోయిన పరిస్థితుల గురించి విచారించే వివేకాన్ని పెంచుకోవాలని అన్నాడు. విశ్వం, జగ్గూలకు పరిణతరూపంగా ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ పాత్రను సృజించి ‘పావన నవజీవన బృందావన నిర్మాతల’ వైపు వేలు చూపారు వివినమూర్తి. ఆ రకంగా వివినమూర్తి తొలి నవలలు మూడూ మూడు భిన్న కథేతివృత్తాలతో నడిచినా లైంగిక సంబంధాల గురించిన నైతికానైతికతల చర్చ, ప్రత్యేకించి స్త్రీ శీలానికి, పవిత్రతకు సంబంధించిన మాయ పొరలను తొలగిస్తూ వాస్తవం వైపు మేల్కొల్పే సంస్కారం మూడింటిలో సామాన్య అంశం అయింది.

1.4. పాఠకులు గుర్తుంచుకొనే తన నవలల్లో ఒకటిగా వివినమూర్తి పేర్కొన్న ‘వ్యాపారబంధాలు’. ( వివినమూర్తి వెతుకులాట, సాహిత్యమూ జీవితమే బ్లాగ్, ఇంట్రో) నవల కూడా యువతీ యువకుల మధ్య ఆకర్షణ, లైంగిక ఆసక్తులు, పరిణామాలకు సంబంధించిందే. దానిని ఆర్ధిక కోణం నుండి చర్చకు పెట్టటం విశేషం. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడిన ఈ నవలను 1986 ఫిబ్రవరిలో పల్లవి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఆలోచనాజీవితానికి కెటలిస్ట్ అయిన తండ్రిగారికి ఈ నవలను ఆయన అంకితం చేశారు.

ఆధునిక పౌర సమాజంలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నపాతికేళ్ల పట్టణ మధ్యతరగతి యువతికి మగవాళ్ళతో స్నేహానికి, నచ్చినవాడిని సహచరుడుగా ఎంపిక చేసుకొనటానికి, లైంగిక సంబంధాలు ఏర్పరచుకొనటానికి లభించిన స్వేఛ్చ ఆమెకే హానికరంగా, అవమానకరంగా, దుఃఖ కరంగా పరిణమించే పితృస్వామిక ధనస్వామ్య వ్యవస్థలోని వైరుధ్యాలను చర్చలోకి తెచ్చింది ‘వ్యాపారబంధాలు’ నవల ఇతివృత్తం.

ప్రేమించిన మాధవరావుతో పెళ్ళికి పూర్వమే ఏర్పడిన సంబంధం వల్ల గర్భవతి అయిన కూతురు దుర్గ పెళ్లి విషయం అతని పెద్దలతో మాట్లాడటానికి రమణయ్య వాళ్ళ వూరు వెతుక్కొంటూ బయలుదేరటం దగ్గర మొదలవుతుంది ఈ నవలలో కథ. నానా గొడవపడి తండ్రిని పంపిన దుర్గకు, అయిష్టంగానే అయినా కూతురిబ్రతుకు గురించి, భవిష్యత్తు గురించి వేదనతో వెళ్లిన రమణయ్యకు, రమణయ్య ఇంటిల్లి పాదికి మాధవరావు మరొక పెళ్ళికి సిద్ధమైనాడన్న వార్త కలిగించిన దుఃఖం, అవమానం, ఆశాభంగం తత్ఫలితమైన ఉద్వేగాలు, ఉక్రోషాలు కలిసి వాళ్ళమధ్య సంబంధాలను ఎలా సంక్షోభంలోకి నెట్టాయో చూపటమే ఈ నవల ఇతివృత్తం.

రమణయ్య మాధవరావు తండ్రి నూకరాజును కలుసుకొనటానికి చేసిన ప్రయాణంలో చేసిన ఆలోచనలు, నూకరాజుతో జరిపిన సంభాషణ ప్రేమకు, పెళ్ళికి, మానవ సంబంధాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను చర్చలోకి తెచ్చాయి. చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఒకరినొకరు ఇష్టపడి దగ్గరయ్యే యువతీయువకులకు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి తల్లిదండ్రుల ప్రమేయం అవసరమా? ప్రేమ, పెళ్లి కాల్పనిక భావోద్వేగాలకు, ఆదర్శానికి, ధర్మానికి సంబంధించినవా లాభనష్టాలకు సంబంధించినవా? ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపార దృష్టే మానవసంబంధాలను వ్యాపార సంబంధాలుగా మారుస్తున్నదా? ఈ ప్రశ్నలను చర్చలోకి తెచ్చినవాడు నూకరాజు. తన ప్రేమ విషయం మాటమాత్రంగానైనా తనతో చెప్పకుండా పెళ్ళికి సిద్ధపడిన కొడుకు రహస్యం అప్పుడే తెలిసిన తండ్రిగా అతని ప్రవర్తనకు కారణాలను ఊహించుకొనే క్రమంలో వచ్చిన ప్రశ్నలకు తనలో తానే పేనుకొన్న సమాధానాలు రమణయ్యతో పంచుకొన్న అభిప్రాయాలుగా వ్యక్తం అయ్యాయి.

మాధవరావు అయినా దుర్గ అయినా తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించుకున్నవాళ్ళు కాదు. వాళ్లకు చెప్పి దైహికంగా దగ్గరైనవాళ్లు కాదు. మాధవరావు ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు అంటే దుర్గను పెళ్లిచేసుకొనే ఉద్దేశం అతనికి లేదు అనే అనుకోవాలి. అంతవరకు చెప్పకపోయినా నెల తప్పిన విషయం తెలిసాక పెళ్లి కోసం తొందరపడటం దుర్గకు అనివార్యం అయింది. కను కనే తల్లిదండ్రులకు చెప్పవలసి వచ్చింది. పెళ్లి విషయం మాట్లాడి రమ్మని తండ్రిని మాధవరావు ఇంటికి పంపవలసి వచ్చింది. మాధవరావు దగా చెయ్యడు కదా అని సందేహపడింది. దగా చేస్తే ఏమిటి కర్తవ్యం అని భయాందోళనలకు గురైంది.

ప్రేమించుకొనటం ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణకు, భావోద్వేగాలకు సంబంధించింది. అయితే పెళ్లి కులగోత్రాలకు, పరువు ప్రతిష్టలకు, ఆస్తులు, కట్నాలు, లాంఛనాలు మొదలైన ఆర్ధిక ప్రయోజనాలకు సంబంధించినది. అటువంటప్పుడు ప్రేమ పెళ్లిగా పర్యవసించటానికి కుటుంబం అవరోధం అవుతుంది. తల్లిదండ్రులు కానీ పెంచి ప్రయోజకులను చేసామన్న భావోద్వేగాల ప్రకటనతో యువతీయువకులను ప్రేమ వ్యవహారాలు ఒదులుకోమని ఒత్తిడి పెట్టవచ్చు. కుటుంబంతో, ఆస్తితో నీకెలాంటి సంబంధమూ ఉండదని బెదిరించనూ వచ్చు. కట్నకానుకలు కోల్పోతావని ప్రలోభ పెట్టవచ్చు. ఈ నవలలో ప్రలోభం తల్లిదండ్రులది కాదు. కొడుకుదే. అందు వల్లనే ప్రేమించి తనవలన గర్భవతి అయిన అమ్మాయి ఒకతి తన జీవితంలో లేనట్లే పెళ్ళికి ఇష్టంగా సిద్ధపడ్డాడు. ఇందులో కొడుకు వ్యాపారదృష్టిని చూసాడు తండ్రి. తండ్రీ బిడ్డల సంబంధాల నుండి మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగానే ఉన్నాయన్న వాస్తవం వైపు కళ్ళు తెరిచిన వ్యక్తి పలవరింతగా ఉంటాయి నూకరాజు మాటలు.పట్నవాసపు బడిపంతులు రమణయ్యకు ఉండటానికి వీలున్నఈ రకమైన అవగాహన భూస్వామ్య గ్రామీణ సమాజంలో జీవిస్తున్న నూకరాజుకు ఉండటం ఎలా సాధ్యమైంది? అన్నది వేరే ప్రశ్న.

వెళ్లిన పని కాక, ఆడపిల్లలుగల మధ్యతరగతి తండ్రికి ఉండే భయాలు, బాధల వత్తిడిలో కుంగిపోయి తిరిగి వచ్చిన రమణయ్య వెళ్లిన పని చేసుకురాలేకపోయానన్న ఉక్రోషంతోనో అక్కసుగానో నూకరాజు వల్ల కొత్తగా తెలుసుకొన్న లాభనష్టాల వ్యాపార వ్యవహార జ్ఞానాన్నిఇంట్లో భార్యా పిల్లల ముందు మాటలుగా విసిరేసాడు. భంగపాటుకు గురైన దుర్గ వాటిని అర్ధం చేసుకొన్న తీరు, జీవితానికి అన్వయించుకొన్న తీరు, అందువల్ల తాను క్షోభ పడుతూ ఇతరులను క్షోభ పెట్టిన వైనం నవలలో అసలు విషయం.

కారల్ మార్క్స్ తాత్విక భావనలలో ‘మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు’ అన్నది కీలకమైనది. ఉత్పత్తి వనరులు భూమి, నాగళ్లు, యంత్రాలు. వాటిని ఉపయోగించి సంపదలను ఉత్పత్తి చేసే కార్మికులు,కర్షకులు ఉత్పత్తి శక్తులు. కానీ ఉత్పత్తి వనరులు వాళ్ళ అధీనంలో వుండవు. భూస్వాముల పెట్టుబడిదారుల అధీనంలో ఉంటాయి. ఉత్పత్తి వనరులకు వాటి మీద ఆధిపత్యానికి , ఉత్పత్తిశక్తులు సృష్టించే సంపదకు, దాని పంపిణీకి మధ్య ఉండే సంబంధాలే ఉత్పత్తి సంబంధాలు. అవి అసమానతలను సృష్టిస్తాయి. దోపిడీ, హింస, విధ్వంసం అందులో ఉంటాయి. వాటిని మార్చాలంటే అందుకు గురి అవుతున్న ఉత్పత్తిశక్తులు కారణాల గురించిన జ్ఞానంతో, మార్పు గురించిన చైతన్యంతో పోరాటశక్తులుగా పరిణామం చెందాలి అన్నది అంతరార్ధం. మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు అన్న ఎరుక లేకపోతే పూర్వజన్మ కర్మ, చేసుకొన్న పాపం వంటి మిథ్యా భావనల మాయలో ఉత్పత్తిశక్తులు క్రియాహీనమై పోతాయి.

అయితే ‘వ్యాపార బంధాలు’ నవలలో మనుషులు ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేని మధ్యతరగతి వర్గం వాళ్ళు. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు. అంటే సేవా రంగంలో ఉన్నవాళ్లు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేదు కనుక మధ్యతరగతి పీడనకు, దోపిడీకి గురయ్యే వర్గం కాదు. కానీ అసమ ఉత్పత్తి సంబంధాల వల్ల ఒక దగ్గర పోగుపడే సంపద స్వంత ఆస్తి వ్యవస్థను , వ్యక్తిగత కుటుంబాన్నీ నిర్మించింది. ఉత్పత్తి సంబంధాలలో ఉన్న అవలక్షణాలన్నీ తద్వారా కుటుంబ సంబంధాలలో భాగమైపోతాయి. ఇదంతా మధ్యతరగతి ఉద్యోగవర్గానికి తెలుసు అనలేము కానీ ఏదో ఒక రూపంలో అవి జీవితాన్ని శాసించటం, బాధించటం అనుభవానికి వస్తుంటుంది. కారణం తెలియక అసహనం పెరుగుతుంది. కోపం కలుగుతుంది. దుర్గ ఆ స్థితిలో ఉన్న స్త్రీ.

దుర్గప్రేమించిన మాధవరావు మగవాడు కనుక ఆమె ఇయ్యలేని కట్నకానుకలు ఇయ్యగలిగిన మరొక ఆడపిల్లను పెళ్లాడగల ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. ప్రేమించి తనకు శరీరాన్ని కూడా సమర్పించి గర్భవతి అయిన దుర్గ ను కాదనుకొని మరొకస్త్రీని పెళ్లాడటం అనైతికం అన్న అపరాధ భావన ఏ కోశానా అతనికి లేదు. నమ్మిన స్త్రీని మోసం చేస్తున్నానే అన్న పాపభీతి లేదు. దానికి నిజంగా సిగ్గుపడ్డవాడు అతని తండ్రి. ఆర్ధిక ప్రయోజనాలు ఒక్కటే మాధవరావును నడిపించాయి. అంతకన్నా మూడురెట్లు లాభం కట్నం రూపేణా వస్తున్నందువల్ల కావచ్చు తండ్రి చెప్పాడని దుర్గకు ఐదువేలు పరిహారం ఇయ్యటానికి వచ్చాడతను. ‘బూర్జువా వర్గం భావోద్వేగాలకు, అనురాగానికి సంబంధించిన ముసుగును చించివేసి కుటుంబ సంబంధాలను డబ్బు సంబంధాల స్థాయికి కుదించింది’ అని మార్క్స్, ఎంగెల్స్ ఏదైతే కమ్యూనిస్టు పార్టీ మానిఫెస్టోలో చెప్పారో దానిని నిరూపిస్తున్నట్లుగా ఉంది అతని ప్రవర్తన.

అది ఇంత స్పష్టమైన తాత్విక భావనగా దుర్గకు అర్ధం అయ్యే అవకాశం లేదు. తన వ్యక్తిత్వానికి జరిగిన తీరని అపచారం మాత్రమే ఆమె అనుభవం. అయితే అందుకు మూల కారణాలు కానీ, ఎదుర్కొనవలసిన శత్రువు కానీ స్పష్టంగా తెలియకపోవటమే విషాదం. తత్ఫలితమే లోక సహజమైన మధ్యతరగతి భయాందోళనల మధ్య తనను అపరాధిగానో, భ్రష్టురాలిగానో భావించి ఆక్రోశించే తల్లిదండ్రులను పిల్లలమీద ప్రేమలేని డబ్బు మనుషులుగా భావించి ద్వేషించింది. ఆమె సమస్యకు ఏదో ఒకరకమైన పరిష్కారాన్నిఇయ్యాలని తాపత్రయ పడిన ఆత్మీయల ఉద్దేశాలను శంకించి దూరం చేసుకొన్నది. అందరితో సంబంధాలను తెంచుకొని ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నది. చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని వదిలి టైపిస్ట్ గా హైదరాబాద్ కు మారటంతో ఆమె జీవితంలో మొదటి ఘట్టం ముగిసింది.

ఆ తరువాత నాలుగేళ్లకు “తన విలువలు ఏమిటి? తన బ్రతుక్కు గమ్యం ఏమిటి? జీవితంలో కూడదీసుకోరాని నష్టం జరిగిపోయిందన్న దుఃఖమే కొనసాగాలా? కూడదీసుకొనటానికి ప్రయత్నమూ అన్వేషణా జరగవద్దా? అన్న ప్రశ్నలతో దుర్గ జీవితంలో రెండవ ఘట్టం మొదలైంది. టీచర్ ఉద్యోగ కాలం నాటి స్నేహితురాలు రామలక్ష్మి పెళ్లిలో ఆమె పెత్తండ్రి కొడుకు శేషగిరి పరిచయం దుర్గ జీవితంలో కదలికలకు కారణం. రామలక్ష్మి చెప్పినదానినిబట్టి అతని దృష్టిలో ఆమె ఒక దరిద్రుడు దగాచేసినా కుంగిపోకుండా తనకాళ్లమీద తాను నిలబడి, తన బ్రతుకు తను నిర్ణయించుకున్న సాహస వనిత. సాహసం జ్ఞానం నుండి పుడుతుంది లేదంటే చుట్టూ మనుషులనుండి పుడుతుంది అనుకొనే అతను ఆ రెండూ ఆమె విషయంలో కారణం కాదని తెలిసి ఆశ్చర్య పడ్డాడు. ఆమెకు జ్ఞానం ఇయ్యాలని ఆత్రపడ్డాడు. కట్నాలు తప్పు అని ఆమె అంటే అలాంటి తప్పులన్నిటికీ సమాజంలో పేదా గొప్ప తేడాలుండటమే కారణమని చెప్పి ఆమెను సరైన దోవకు నడిపించాలని ప్రయత్నించాడు. ‘నేనిలా ఎందుకున్నాను అన్న ఆలోచనలోంచి బయటకు వచ్చి నన్ను ఏ శక్తులు ఇలా ఉంచుతున్నాయి?అన్న ఆలోచనలోకి నడవాలని’ అందుకోసం పుస్తకాలు చదవాలని ఆమెను ప్రేపించాడు. ఈ క్రమంలో కమ్యూనిజం పట్ల అభిమానం, అదే సమయంలో సంశయాలు కూడా ఈ నవలలో ప్రస్తావనకు వచ్చాయి. కమ్యూనిజం ప్రతిపాదించే సాంఘిక స్థితి మంచిదే కానీ దానిని సాధించటానికి చెప్పే మార్గాలు మాత్రం సరైనవి కావు అన్నది ఒక అభిప్రాయం. కమ్యూనిజం మానవుడు ఎదుర్కొనే చాలా సమస్యలను పరిష్కరించగలదు కానీ ఏ పద్ధతులద్వారా సాధించబడగలదో స్పష్టపడలేదు అన్నది మరొకటి. ఏ పద్ధతులద్వారా అయినా కమ్యూనిజం వస్తే బాగుంటుందనే ఆశ ఉంది. ఇంత పెద్ద మార్పు ఎప్పుడు వచ్చేను అన్న నిస్పృహ కూడా ఉంది.

దుర్గకు శేషగిరికి మధ్య సంభాషణలలో స్త్రీపురుష సంబంధాల గురించిన చర్చకూడా ఒక భాగం. స్త్రీపురుష సంబంధాలలో శారీరక సంబంధం తప్పా ,మానసిక సంబంధం తప్పా అన్న ప్రశ్నను గిరి చర్చకు పెట్టినప్పుడు ఏది తప్పయినా శిక్ష ఆడదానికే అని దుర్గ చెప్పటం లో ఆమె అనుభవమే ప్రధానమైంది. లైంగిక సంబంధాలలో తప్పుకి శిక్ష శాశ్వతంగా ఉండకూడదు, శిక్షలో ఆడామగా తేడా కూడా ఉండరాదు అన్నది ఆమె అభిప్రాయం. లైంగిక అనుభవం ఇద్దరిదీ అయినా ఆ తప్పుకు శిక్ష స్త్రీల విషయంలో గర్భధారణ గా వ్యక్తం అవుతుందన్న దుర్గ ఆంతర్యాన్ని కనిపెట్టినట్లుగా గిరి దానికి కారణం ప్రకృతి కదా అంటాడు. దానిని నిరాకరిస్తూ దుర్గ మగాడి ఆధిక్యతే ఇందుకు ముఖ్య కారణం అంటుంది. పురుషులు సంస్కారం, ఆడవాళ్లు ధైర్యం అలవరచుకొనటం అవసరమని ఆకాంక్షిస్తుంది. కూడదీసుకోరాని నష్టం జరిగిపోయిందన్న దుఃఖంలో అందరినీ ద్వేషించి ఒంటరి తనాన్ని వరించిన దుర్గ కూడదీసుకొనటానికి ప్రయత్నం ప్రారంభించింది అనటానికి ఇది నిదర్శనం. కారణాలను వెతకటం పరిష్కారాల గురించి ఆలోచించటం అందులో భాగమే. ఈ క్రమంలో ఆమె శరీరమూ, హృదయమూ కూడా గిరిని కోరాయి. పెళ్లి , కుటుంబం లేని సామాజిక జీవితం అతను ఆదర్శంగా చెప్తే ఏ ఆశయ సాధనకైనా పెళ్లి అవరోధం కాదు అన్న అభి ప్రాయానికి వచ్చింది ఆమె. పొట్టకోసం ఉద్యోగం అవసరమైతే ఇంచుమించు అలాంటిదానికోసమే పెళ్లి అని దుర్గ అనటంలో శరీరానికి ఒక ఆకలి ఉంటుంది కనుక దానిని ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో తీర్చుకొనటానికి పెళ్లిని ఒక పద్దతిగా అంగీకరించాలన్న భావం ధ్వనిస్తుంది.

గిరికి పెళ్ళయిందన్న విషయం తెలిసాక కలిగిన ఆశాభంగంలో ఆత్మహత్యకు తలపడి బతికి బయటపడ్డ దుర్గ కృష్ణారావును పెళ్లాడటం ఆమె జీవితంలో మూడవ ఘట్టం. చేతులమీద ఆసుపత్రికి మోసుకెళ్లి బతుకు ఇచ్చిన అతను తనకు సరైన రక్షణ అన్న భావన, జీవితంలో శారీరక దాహాన్ని తీర్చే తోడు గురించిన బలమైన ఆశ అతన్ని పెళ్లిచేసుకోమని ఒత్తిడి పెట్టాయి. అతను చిన్న ఫ్యాక్టరీ లో వర్కర్, తక్కువ సంపాదన పరుడు, తనకులం కాదు. అయినా ఆమెకు అభ్యంతరంలేకపోయింది. భాష యాస ఆహరం తనవి కాని అతని కుటుంబం, అందులో మనుషులు వాళ్ళు తన సంపాదన మీద ఆధారపడి ఉన్నారన్న ఆధిక్యతా భావం , అహంకారం, మొదలైన వాటితో ఆమె సంసారం సంవాదాలతో సంఘర్షణలతో సర్దుబాట్లతో కొనసాగింది. ఈ క్రమంలో పెళ్లి వ్యాపారం, తాను డబ్బు పెట్టి పొందిన లాభం కృష్ణారావు అన్న భావం ఆమెను అంటిపెట్టుకొనే ఉంది.

కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంస్థలో పని చేసే కృష్ణారావు పెళ్ళికి ముందే దుర్గ కమ్యూనిస్టు పదాలను తోచినట్టు ఉపయోగిస్తుందని గుర్తించి అది తప్పని ఆమెకు చెప్పాడు. కమ్యూనిస్టు పరిభాషను ఎలాబడితే అలా వాడేసే ఆమెను తమ వర్కర్స్ ను ఎడ్యుకేట్ చేయటానికి సాయపడమని ఎలా అడగగలిగాడు అన్నది ప్రశ్న. పార్టీ స్త్రీల విభాగంలో చేరమని అడగటంలో ఆమెను ఎడ్యుకేట్ చేయటం అన్న ఉద్దేశం ఉన్నదో ఏమో మరి. దుర్గ స్త్రీల సంఘంలో చేరి పని చేయటం కృష్ణారావును మెప్పించటానికే కానీ స్వీయ చైతన్యంతో కాదు. అతను చెప్పిన పని చేయటం మదుపుగా పెట్టి సంసారంలో తన మాట చెల్లుబడి కావటం అనే లాభాన్ని ఆశించటం ఆమె స్వభావంగా ఆ తరువాత కృష్ణారావు గుర్తించి చెప్పాడు కూడా.

కమ్యూనిస్టు పార్టీ ఆచరణ పట్లా, పని పద్ధతి పట్లా విమర్శకు గిరిని వాడుకున్న రచయిత ఆ గిరిని కమ్యూనిస్టు ఆచరణలో ఉన్నవాళ్లకు మిత్రుడిగా చేశారు. కమ్యూనిజాన్ని గురించి గిరి చెప్పినది విని ఏర్పరచుకొన్న మిడిమిడి జ్ఞానం తప్ప సరైన కమ్యూనిస్టు చైతన్యమే లేని దుర్గను పార్టీ విధానాలమీద, పని పద్ధతి మీద విమర్శకురాలిగా చేయటం చూస్తాం. అన్ని సమస్యలకు పరిష్కారం కమ్యూనిస్టు వ్యవస్థలోనే అని నమ్మే కమ్యూనిస్టు పార్టీలో కూడా స్త్రీల విభాగం, విద్యార్థి విభాగం అంటూ ఇన్ని విభాగాలు ఉండటం ఏమిటి? అని తర్కిస్తుంది. కమ్యూనిస్టులకు హృదయం లేదు అని నిర్ధారించి చెప్పగలుగుతుంది. ఫ్యాక్టరీలో గొడవలకు బజార్లో గోడలమీద పోస్టర్లు వేయటానికి సంబంధం ఏమిటని పోరాట రూపాన్ని ఎద్దేవా చేయగలుగుతుంది. అయితే ఇదంతా బతుకు పట్ల అసంతృప్తులు ఉండి , దానిని మార్చుకొనటం గురించిన ఆశ , అశక్తతల మధ్య గందర గోళంలో మధ్యతరగతి ప్రదర్శించే శుష్క వాగాడంబరం అన్న సూచన కూడా నవలలో ఉంది.

ఆత్మహత్య ఆలోచనరాగానే నా చావుకు కారణం వీళ్ళు అంటూ తల్లిదండ్రుల పేర్లు , మాధవరావు, గిరి పేర్లు కాగితం మీద రాసి పెట్టిన దుర్గ గిరితో కలిసి అన్ని పుస్తకాలు చదివాక కూడా తన సమస్యకు కళ్ళముందు కనిపించిన నలుగురిని కారణంగా భావించే స్థాయి నుండి కనబడని సామాజిక కారణాలను అన్వేషించే దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యలేక పోయిందన్నది స్పష్టం. అందువల్లనే చావు బతుకుల్లో ఉన్న తనను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను చూస్తూ నానా గొడవ చేసింది. వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ప్రేమ భ్రమ అని తేల్చేసిన మాధవరావు ప్రవర్తన కలిగించిన దిగ్భ్రమ నుండి, తనను అక్కున చేర్చుకొని తల్లిదండ్రులు తిట్టొ కొట్టో తన జీవితాన్ని ఒక మార్గాన పెట్టాలని అంతరంగంలో ఆశపడుతూ పైకి చెప్పటానికి అభిమానపడుతూ ఎదుటివాళ్లమీదకు అపరాధం నెట్టెయ్యటమే భద్రకవచంగా చేసుకొన్న దుర్గ తాను క్షోభ పడింది. చుట్టూ ఉన్నవాళ్లను క్షోభ పెట్టింది. సహజ మానవీయ భావోద్వేగాలు ఊపేస్తున్నా ప్రేమకోసం హృదయం పరితపిస్తున్నా మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలు, ప్రేమ పెట్టుబడిని కోరుతుంది.. వంటి భావనలను లోలోపల బలంగా పేనుకొంటూ వాటి మధ్య తనను తాను బంధించుకొన్న దుర్గ విముక్తి చెందిందా? అంటే చెందింది. ఎప్పుడు? తానూ తల్లి అయిన క్షణాన.

ఫ్యాక్టరీలో సమ్మె మొదలై ఆ పనుల ఒత్తిడిలో తనను చూడటానికి కూడా కృష్ణారావుకు తీరిక దొరకని సమయంలో నెలలు నిండి హాస్పిటల్ లో చేరిన దుర్గ తన మీద అతనికి ఉన్న ప్రేమకు అతని ఆశయాలకు కర్తవ్యాలను పోటీ పెట్టింది. తన మీద ప్రేమ ఉంటే అన్నీ వదులుకొని తన దగ్గర ఉండిపొమ్మన్నది. ‘వ్యవస్థ ఇచ్చిన స్వేఛ్ఛా స్వాతంత్య్రం ఆమెకు అయినవాళ్లను కాలదన్నుకొనటానికి ఉపయోగ పడ్డాయని, ధనస్వామ్యంలో మానవ సంబంధాలు క్షీణదశకు చేరేమాట నిజమే అయినా వాటి వెనుక ఉన్న జీవం చచ్చిపోదని,’ దానిని చూడగలిగే చూపును కోల్పోకూడదని హెచ్చరిస్తూ కృష్ణారావు వెళ్ళిపోయాక దుర్గ ఆలోచించటం మొదలుపెట్టింది.

గుండాల దాడిలో బలమైన గాయాలతో ఆసుపత్రిలో ఉన్న కృష్ణారావు ఆపరేషన్ సమయంలో ఆమె దగ్గర ఉండే వీలు లేకపోయింది. గిరి దుర్గ తల్లిదండ్రులను టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాడు. అప్పుడు కూడా ఆమె నాదగ్గర డబ్బులేదు అని తండ్రిని లోకువకట్టి మాట్లాడకుండా ఉండలేకపోయింది. ‘అలాగే నువ్వు పైసా ఇయ్యక్కరలేదు, పురుడు అయ్యేవరకు సాయంగా ఉంటాం’ అని తండ్రి అన్నప్పుడు ‘నువ్వు మాట్లాడేది తప్పు , నువ్విలా ఉండకూడదు అని తండ్రి తనను శాసించవచ్చు కదా’ అని ఆరాటపడింది. ఆంతర్యానికీ అభివ్యక్తికి మధ్య సమన్వయం సాధించుకోలేని ఈ ప్రవృత్తి స్వీయ సానుభూతి లక్షణం.

మరోజన్మ లాంటి ప్రసవంలో, బిడ్డకు తొలివిడత రొమ్ము కుడపటానికి పడిన అవస్థాక్రమంలో ఆమెకు బిడ్డకు పాలు ఇయ్యటంలో, లాలించటంలో అనుబంధం తప్ప లాభాపేక్ష ఏదీలేదని స్ఫురించింది. అప్పుడు కానీ తల్లిదండ్రుల పట్ల తన ఆరోపణలో, ద్వేషంలో ఉన్న తప్పుఆమెకు అర్ధం కాలేదు. జీవితం, స్నేహాలు, పుస్తకాలు, ఉద్యమాలలో భాగస్వామ్యం ఏవీ మార్చలేకపోయిన దుర్గ ఆలోచనా ధోరణిని మార్పు వైపు కదిలించింది తాను తల్లి అయిన అనుభవం. అది స్వీయాత్మక వ్యక్తిత్వ లక్షణం.

ఏది ఏమైనా మనుషులను మూసలలో బిగించి చూడకుండా సమయం, సందర్భం వస్తే మారటానికి వీలైన చలన స్థితిలో ఉన్నవాళ్లుగా చూపటం, భిన్నాభిప్రాయాలు, భిన్న వ్యవహార ధోరణులు, వ్యక్తీకరణ పద్ధతులు కలిగి ఉండి కూడా స్నేహ సౌమనస్యాలతో సంబంధాలను నిర్మించుకొనటానికి, నిర్వహించుకొనటానికి ఉన్న అవకాశాల వైపు చూపటం ఈ నవల ఇతివృత్తంలో విశేషం.

వంశ వారసత్వ, ఆస్తుల వారసత్వ వ్యవస్థలో భావాల వారసత్వం గురించిన ఆలోచనను ప్రవేశపెట్టటం కూడా ఈ నవలలో ఒక అంశం. ప్రేమించి పెళ్లికాకుండానే దేహ సంబంధం పెట్టుకొని అందువల్ల ఆమెకు గర్భం వచ్చిందని తెలిసీ ఆమెను ఒదిలి మరొక పెళ్ళికి సిద్ధపడిన కొడుకును, ఐదువేలు ఇచ్చి ఆమెను వదిలించుకొనటానికి సిగ్గుపడని కొడుకును తండ్రి నూకరాజు తిరస్కరించిన తీరు ప్రత్యేకమైంది. వంశ వారసుడుగా అతని ఆస్తి వారసత్వాన్ని కాదనే హక్కు చట్టపరంగా తనకు లేదు. కానీ తన ధర్మానికి , న్యాయ బుద్ధికి వారసుడు కాలేకపోయిన కొడుకుతో మాట్లాడటం మానేసి, అతని ఇంటి కార్యాలను బహిష్కరించి, మరణించాక తనకు దహన సంస్కరాలు చేసే అవకాశాన్ని మూసేసి తన పరిధిలో అతను కొడుకును శిక్షించాడు. దుర్గకు కొడుకు పుట్టాడన్న సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి భావాల , ఆదర్శాల వారసత్వమే అసలైన వారసత్వంగా ప్రతిపాదించారు రచయిత.

1. 5. యువతీయువకుల మధ్య ఆకర్షణ, ఆసక్తులు నిత్యమూ … నిరంతరం … దేనికదే ప్రత్యేకం. అందుకనే 1988 లో వచ్చిన విమానం వచ్చింది నవల ఇతివృత్తంలోనూ దానిని మరొక పార్శ్వం నుండి చూపించకుండా ఉండలేకపోయారు వివినమూర్తి. పదెకరాల భూవసతి గల తండ్రికి కొడుకుగా బియ్యే చదివి, ఉద్యోగం ఏదీ రాక పత్రికలు చదువుతూ చెరువు గట్ల వెంట రికామీ గా తిరిగే పంథొమ్మిది ఏళ్ల చంటిబాబుకు, పత్రికలు చదివే అక్షరజ్ఞానం తప్ప మరొక కాలక్షేపం లేని పదిహేనేళ్ల సుందరికి మధ్య ఆకర్షణ పత్రికల, పుస్తకాల వినిమయం దగ్గర మొదలై ప్రేమలేఖల వినిమయం వరకు సాగి చివరికి ఇద్దరూ కలిసి వూరు వదిలి వెళ్ళటంతో ముగుస్తుంది. యవ్వనం ఆస్తిత్వ తపనతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిగా తనకు ఒక ప్రత్యేక గుర్తింపును ఆశిస్తుంది. చంటిబాబు తనకు రహస్యంగా పత్రిక పంపటం సుందరిలోని ఆ అహాన్ని సంతృప్తి పరిచింది. పత్రికలు వాళ్ళకిచ్చిన జ్ఞానం ప్రేమ కోసం ప్రాణమైనా ఇచ్చెయ్యగల భావోద్వేగాలు. రహస్య సమావేశాలు, సంభాషణలు సమూహాల మధ్య ఒకళ్ళనొకళ్ళు చూసుకొంటూ చేసుకొనే సంజ్ఞలు, ఇచ్చుకునే సంకేతాలు వాళ్ళకు తమ జీవితాలకు తామే నాయకులం అన్న నమ్మకం కలిగిస్తాయి. ఒక నూతన భావప్రపంచంలో విహరింపచేస్తాయి. ఇక వాళ్లకు వాస్తవంతో పని లేదు. కుటుంబాన్ని, కులాన్ని కాదని కలిసి వెళ్లిపోయే సాహసం ఒక్కటే వాళ్ళ కార్యాచరణ. ఇలాంటి అపరిపక్వ జీవుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం. అది సూచించటం వరకే ఈ నవలలో చిట్టిబాబు సుందరుల ఉపాఖ్యాన ప్రయోజనం.

1.6.

‘విమానం వచ్చింది’ నవల వ్రాసిన ఇరవై నాలుగేళ్ళ తరువాత స్త్రీపురుష సంబంధాల వ్యవస్థ పై అనేక ప్రశ్నలతో, సంప్రదాయ నమూనాలను సవాల్ చేస్తూ వివినమూర్తి వ్రాసిన పూర్తిస్థాయి నవల ‘కొంత మంది. కొన్నిచోట్ల’ (2022)

భార్యా పిల్లలు ఉన్న శివరామారావుకు మరొక స్త్రీతో ఉన్న సంబంధం బయటపడటం దగ్గర మొదలై అది ఆ కుటుంబంలో వ్యక్తుల మధ్య తెచ్చిన ఘర్షణలు పరిణామాల చిత్రణ మొత్తం స్త్రీ పురుష సంబంధాల చర్చగా, స్త్రీపురుష వివక్షకు మొత్తం సామాజిక ఆర్ధిక వివక్షలకు మధ్య వుండే సంబంధాల వెతుకులాటగా కొనసాగుతూ దేశీయ విప్లవోద్యమాన్ని స్పృశిస్తూ ప్రపంచదేశాల, జాతుల సంబంధాల సంఘర్షణల అంచులను తాకుతూ ముగిసిన నవల ఇది. ఇతివృత్తం 1987 నుండి 2020 వరకు ముప్ఫయి మూడేళ్ళ కాలం మీద ప్రవర్తిస్తుంది.

శివరామారావుకు జయతో పది పదకొండు ఏళ్లుగా ( ఒకచోట ఎనిమిదేళ్లు , మరొక చోట పద్నాలుగేళ్ళు అని చెప్పబడింది) ఉన్న రహస్య సంబంధం భార్యాపిల్లలకు తెలియటం అనే బిందువు దగ్గర ప్రారంభించి దానికి ఎవరు ఎట్లా స్పందించారు? దానిని ఎవరు ఎట్లా నిర్వచించుకొన్నారు? ఎవరు ఎలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు? ఎవరు ఎందుకు సమాధాన పడలేకపోయారు? సిద్ధపడటానికైనా, సమాధానపడలేకపోవటానికి అయినా వాళ్లకు వచ్చిన ఆలోచనలు, ప్రశ్నలు ఎలాంటివి? మొదలైన ప్రశ్నలతో, వాళ్ళు ఎన్నుకొన్న ఆచరణల తో అలలు అలలుగా ఇతివృత్తాన్ని విస్తరింపచేస్తూ రచయిత దీనిని ఒక బృహత్ నవలగా చేసారు. ఆ రకంగా ఇది ప్రధానంగా స్త్రీపురుష సంబంధాలను భిన్నకోణాలనుండి చర్చకు పెట్టిన నవల. నిర్ధారిత సామాజిక భావజాల చట్రాలకు, వివాహ వ్యవస్థకు అతీతంగా ఉండే మానవ ప్రవృత్తులను, వ్యక్తిత్వాలను నిరూపించటానికి చేసిన ప్రయోగం. ఈ ప్రయోగంలో లైంగిక సంబంధాలు - నీతి, స్త్రీ పురుష వివక్ష, సమన్యాయ సమాజాన్ని వాస్తవీకరించగల సిద్ధాంతం - ఆచరణ అనే మూడు అంశాలు పరీక్షకు పెట్టబడ్డాయి.

స్త్రీపురుషులమధ్య వివక్ష సాధారణ అంశం అయిన సమాజంలో లైంగిక నీతి స్త్రీ విషయంలో సమస్య అయినట్లు పురుషుడి విషయంలో కాదు. అందువల్లనే వైవాహిక నీతిని తప్పిన స్త్రీ జీవితం సాహిత్య వస్తువు అయినట్లు పురుషుడి జీవితం కాలేదు. దీనికి భిన్నంగా వివినమూర్తి ఈ నవలలో వైవాహిక నీతిని తప్పిన పురుషుడిని కేంద్రంలోకి తెచ్చారు. వైవాహిక నీతిని అతిక్రమించి ప్రవర్తించటానికి పురుషులకు సామాజిక సమ్మతి తయారయ్యే ఉంది. అయినా అంతకంటే మించి మగవాళ్లకు కూడా వైవాహిక నీతిని తప్పటానికి వ్యక్తులుగా వాళ్ళ కారణాలు వాళ్లకు ఉంటాయి అనే దిశగా ఆలోచింపచేయటమే శివరామారావు జీవిత గమనం ద్వారా రచయిత ఉద్దేశించింది. శివరామారావు ఒకచోట కవితతో చెప్పుకున్నట్లు సంశయాత్మకుడు, పిరికివాడు. తనకేమి కావాలో, ఎలాపొందాలో తెలియనివాడు. దొరికినదానితో నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోలేడు. అలాగని కుటుంబంలో మగవాడి అసంతృప్తులకు, అశాంతికి పరిష్కారంగా సంప్రదాయ సమాజం కుటుం బానికి బయట స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొనటానికి తెరిచి ఉంచిన అవకాశాలు వాడుకోలేడు. మరి జయతో జీవితం అటువంటిది కాదా అన్న ప్రశ్న కలగక మానదు. కాదు అనుకొంటే మరి దానిని రహస్య సంబంధంగానే కొనసాగించటం ఎందువల్ల అని మరొక ప్రశ్నవస్తుంది. నైతిక అనైతిక విచికిత్స అతనిని వేధించిందా? దాని నుండి తప్పుకొనటానికే అనుక్షణం ఆలోచనా ప్రంపంచంలోనో,తాగుతూ గదిలో ఏకాంతంలోనో తనను తాను పారేసు కొన్నాడా అనిపిస్తుంది. ఈ పరిస్థితులలో తాను ఎంత ఒంటరితనంలో, ఎన్ని నిరాశ నిస్పృహల మధ్య జయ సాహచర్య చలువ పందిరి కిందికి చేరాడో కూతురు కవిత అర్ధం చేసుకోనాలని, సానుభూతి చూపాలని ఆశించాడు. భంగపడ్డాడు. “నా మీద నాకు లక్షాతొంభై అభియోగాలు ఉన్నాయి. వాటిలో జయతో కలిసి జీవించటం , బిడ్డను కనటం మాత్రం లేవు. నేను ఏ ఆడదానికైనా ద్రోహం చేస్తే అది జయకే. మీ అమ్మకి కాదు. “వ్యక్తి వేదనకి సమర్ధింపదగిన కారణం లోకానికి కనబడకపోవచ్చు. లోకానికి తెలిసేలా వ్యక్తి చేయలేకపోవచ్చు. అయినా వ్యక్తి వేదనా వేదనే.”అని శివరామారావుముఖంగా చెప్పించటంలో తాత్పర్యం అదే

భార్యా బిడ్డలు ఉండగా మరో ఆడదానితో సంసారం చేయటం తప్పే, చట్టం రీత్యా కూడా తాను ముద్దాయి అని ఒప్పుకొంటూనే శివరామారావు దానిని మానవతా దృష్టినుంచి చూడాలంటాడు. ఏకవీర నవలలో కుట్టాన్ భూపతి మాటలను ప్రస్తావిస్తూ తల్లిని, తండ్రిని ఎంచుకోలేనట్లే భార్యను ఎంచుకొనే అవకాశం లేని వివాహవ్యవస్థ ఇరుకుతనం గురించి ప్రస్తావించటం వేదనామూలం వైపు వేలు చూపటమే. అందులో తనకు జరిగిన అన్యాయాన్నికూతురు కవిత అర్ధం చేసుకోవాలని ఆశించాడు. ఆ అన్యాయం ఏమిటి? భార్యతో దృఢపడని మానసిక సంబంధం. అతను , అతని భార్య అనసూయ ఒకే కులగ్రామీణ భూస్వామ్య పితృస్వామిక సంస్కృతీ మూలం నుండి వచ్చిన వాళ్లే అయినా అతను చదువు, కేంద్రప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగం, సాహిత్య అభిలాష, అధ్యయనాలవల్ల కొత్త సంస్కారాన్ని, కొత్త భాషను అభివృద్ధిచేసుకొన్నాడు.తనప్రత్యేక కుల గ్రామీణ యాస, మాటతీరు, ప్రవర్తనా రీతితో మిగిలిన అనసూయతో మానసిక బౌద్ధిక సాన్నిహిత్యం అతనికి అసాధ్యం అయింది. కుటుంబంలో ఆమె అతని భౌతిక అవసరాలు చూసే మనిషిగా మిగిలి పోయింది.పరిణామంలో చదువులవల్ల, ఉద్యోగాల వల్ల, సాహిత్య సంస్కారాల వల్ల భార్యలతో మానసిక బౌద్ధిక సాన్నిహిత్యం అసాధ్యం అయిన పురుషుల అశాంతికి వైవాహికేతర సంబంధాలు పరిష్కారం అన్న వాదంగా అది తేలింది.

శివరామారావుకు హిందూ సమాజంలో వేల సంవత్సరాలుగా పేరుకుపోయిన సంస్కృతిపై- అది ‘వ్యక్తి’ ని లేకుండా చేసింది అన్న ఒక ఆరోపణ ఉంది. ఈ సమాజంలో స్త్రీలు ఎంత నిస్సహాయులో కంటికి కనిపిస్తుంది కానీ పురుషుని నిస్సహాయత ఎంత చూపించినా అరుంధతీ నక్షత్రంలా కనీకనిపించకుండానే ఉంటుందని అంటాడు. సంకెళ్లలో ఉన్నానని తెలిసినా తెంపుకొనటం సాధ్యం కానంతగా వ్యక్తిలోకి సమాజం చోరబడిందని నమ్ముతాడు.అందువల్లనే కావచ్చు తనను ప్రేమించి ప్రేమింపచేసుకొన్న జయతో సాహచర్యం రామారావు మానసిక అవసరాలను ఎంత సంతృప్తి పరచినా, పెళ్లి లేకుండా కామం, ‘పరస్త్రీ సంగమం పాపం’ అన్న సంప్రదాయ భావనతో కొంత వ్యథకు గురి అయినట్లు కనబడతాడు. అది గ్రహించి జయ తాళి చేయించుకొని కట్టించుకొన్నది. “అది పెళ్ళో కాదో నాకు తెలియదు. అది పెళ్లేనని ఆయన నమ్మారు. ఆయన నీతి తప్పలేదనుకొన్నారు. ఆయన నమ్మకం ఆయనకు ఆనందం కలిగించింది. ఆయన ఆనందం నాకు ఆనందం కలిగించింది.” అని ఆ చర్య గురించి తరువాతి కాలంలో జయ ఇచ్చిన వివరణను బట్టి నీతికి సంబంధించిన రామారావు దృష్టి సంప్రదాయ మూలమే అన్నది స్పష్టం. పెళ్ళివల్ల స్త్రీ మగవాడిది అవుతుంది. అనుభవ విషయం అవుతుంది. ధర్మబద్ధం అవుతుంది. ఆ రకంగా అతనికి పెళ్ళామే కావాలి. అయితే ఆ పెళ్ళాం తనంతట తాను నిర్మించుకున్న సొంత పెళ్ళాం కావాలి. అంటే తన ఎంపిక అయిఉండాలి.

క్లాస్ మెట్, స్నేహితుడు అయిన బాలు కవితకు వ్రాసిన ప్రేమలేఖ బయటపడిన సందర్భంలో కవితకు శివరామారావు కు మధ్య నడచిన సంభాషణలో ప్రేమ, పెళ్లి, పెళ్లి తరువాత ప్రేమ మొదలైనవి చర్చకు వచ్చాయి. నీతి అవినీతులకు విలువ ఇచ్చే మనసుకు వాటిని కాదనే శరీరానికి మధ్య వైరుధ్యం గురించిన అవగాహన శివరామారావుది. వయసులోకి వచ్చాక ఆడామగా మధ్య ఏర్పడే ఇష్టం ఎదుటి వ్యక్తి అర్హతలను బేరీజు వేసుకొని ఏర్పడేది కాదంటాడు. లెక్కలు గట్టి ఏర్పరచుకొనే ఇష్టం సహజం కాదు లౌకికం అన్నది అతని అభిప్రాయం. ఇష్టం అనేది ఇద్దరికీ కలగవచ్చు, ఒక్కరికే కలగవచ్చు, కానీ ఇష్టాలు అన్నీ పెళ్ళికి దారితీస్తాయా అంటే పరిస్థితులను బట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రేమకోసం అన్వేషణ పెళ్ళికి ముందూ తరువాత అనే తేడా లేకుండా సాగుతుండటం వాస్తవం అని అన్నా కెరినినా నవలను ప్రస్తావిస్తూ అనుకొంటారు ఇద్దరూ. ఇష్టం పెళ్లిగా మారటానికి కులం, భాష, మతం, కుటుంబ సంప్రదాయాలు అడ్డంకులు అని అంగీకరిస్తూనే తనకాళ్ల మీద తాను నిలబడగల చదువు, స్నేహంగా చర్చించి సహాయపడగల తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాటిని అధిగమించవచ్చునన్న అవగాహనకు వస్తారు తండ్రీ కూతుళ్లు.

జయకు కూడా స్వీయ ఎంపికే ముఖ్యం. అందుకు పెళ్లి కూడా అవసరం లేదు. మనుషులు కట్టుకొయ్య అవసరమైన పశువుల్లా కాకుండా స్వయంగా తమ జీవితాలనీ, బాధ్యతలనీ నియమనిష్టలనీ నిర్వచించుకోగలిన వికాసవంతులు కావాలన్నకొత్త చైతన్యంతో తన పట్ల గానీ, తనకు పుట్టే సంతానం పట్ల గానీ రామారావుకు ఏ సామాజిక ఆర్ధిక బాధ్యత లేదని చెప్పి మరీ అతనితో సహజీవనం ప్రారంభించింది జయ. ఆ రకంగా ఆమె అతనికన్నా చాలా ముందు ఉంది. ఇది ఎలా సాధ్యం అయింది?

అయిదుగురు ఆడపిల్లల తరువాత పుట్టి అయిదవతరగతి వరకు చదివి 13వ ఏట పెళ్లయి కాపురానికి వెళ్ళి, దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మే మూర్ఖత్వం తప్ప హేతువు అన్నది ఎరుగని అత్తవారింట 14 ఏళ్లకే ప్రసవంచిన బిడ్డను కోల్పోయి, పద్దెనిమిది ఏళ్లకు భర్తమరణిస్తే పుట్టింటికి చేరింది జయ. పెదబావగారి వెంట విశాఖ పట్ణణం చేరేవరకు ఆమె జీవితంలో ఒక ఘట్టం. నీలో మారే ఎలిమెంట్ ఉన్నది. మారు, మార్చు, జీవించు అని ఆయన ఇచ్చిన దిటవు తో వ్యక్తిగా తనను తాను నిర్మించుకొంటూ జీవించటానికి ఆమె చేసిన ప్రయత్నమే అసలు కథ. అది ఆమెకు 22 ఏళ్ల వయసులో బస్ స్టాన్డ్ లో బస్సు కోసం ఎదురుచూస్తూ చలం మ్యూజింగ్స్ చదువుకొంటున్నప్పుడు చూసిన శివరామారావు పుస్తకాలు చదివే ఆడవాళ్ళ పట్ల, అందులోనూ చలాన్ని చదివే ఆడవాళ్లపట్ల తన గౌరవాన్ని ప్రకటిస్తూ ఆమెను పలకరించటం దగ్గర మొదలైంది. ఆ పరిచయం స్నేహమైంది. రామారావు కళ్ళల్లోని వెలితిని వ్యధను, ఆరాటాన్ని అర్ధం చేసుకొనటానికి జయ ప్రయత్నం మొదలైంది. బ్రతకటం కోసం చదువుకోవాలని బ్రతుకుకు అర్ధం తెలుసుకోటం కోసం చదువు కోవాలని చెప్పి ఆ వైపు తోసిన కన్నతండ్రి లాంటి బావగారి గురించి చెప్పి జయ అతనిలో బ్రతుకు పట్ల అనురక్తి కలగటానికి ప్రేరకురాలు అయింది. అతనితో జీవితం పంచుకొనటం గురించిన ఆలోచనా బీజం ఎప్పుడో మనసులో పడి మొలకెత్తింది. అతను తనకు కావాలి అన్న నిర్ణయానికి వచ్చింది. “ ఇది నా ఎంపిక. ఫలితాలకు నేను బాధ్యురాలిని” అన్న నిర్ధారణకు వచ్చి రామారావు కు తన అభిప్రాయాన్ని చెప్పింది.

రామారావుని తనజీవితంలోకి ఆహ్వానించటం జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొనటంగా అనుకున్నానని వివాహం ఒక సంకెలగా భావించానని, ఇష్టపడి కొడుకును కన్నానని, జీవితం నా ఎంపికతో నేను నిర్మించుకొన్నాను అన్న తృప్తి తనకు అమూల్యమైనది అని చెప్పుకొన్న జయ కు ఈ రకమైన అవగాహన చలాన్ని చదవటం వల్లనో, ‘జ్ఞానపిత’ అయినబావగారితో చేసిన చర్చవల్ల కలిగిందన్న సూచన తప్ప ఆమె పుట్టి పెరిగి జీవిస్తున్నసమాజపు చలన చైతన్యాల నేపధ్య ప్రభావం ఎక్కడా కనబడదు. అలాగే దాదాపు తండ్రి వయసులో ఉన్న బావగారికి అంతటి ఉదా రభావజాలం,ఏ విషయమైనా అధికార స్వర స్పర్శ లేకుండా మరదలు జయతో మాట్లాడగలిగిన ప్రజాస్వామిక సంస్కారం ఎక్కడినుండి అబ్బిందీ అన్నదానికి కూడా ఆధారాలు ఏవీ లేవు. స్కూల్ టీచర్ కావటం, సాహిత్యం చదవటం, విశాఖపట్నంలో జీవితం ఆ సంస్కారాన్ని ఇచ్చాయేమో అనుకోవాలి.

జయ పద్దెనిమిది ఏళ్లకు భర్త మరణిస్తే 22 ఏళ్ళవయసులో రామారావును ఇష్టపడి సహజీవనం కోరుకొన్నది. అయిదవతరగతితో చదువు ఆపేసిన ఆమె ఈ నాలుగు ఏళ్లలో ఏమి చదివిందో కానీ అప్పటికి ఆమె ఉద్యోగం కూడా చేస్తున్నది. బిడ్డను కనాలన్న నిర్ణయమూ తనదే. 1979 లో పిల్లాడు పుట్టాడు. 1987 నాటికి బెల్ లో ఉద్యోగం సంపాదించుకొని బెంగుళూరు చేరింది. ఈ రకమైన కొత్త జీవిత సంబంధాలు నిర్మించుకొనటం ఆమె ఎంపిక నిజమే. కానీ తదనంతర సామాజిక జీవితగమనంలో దాని పరిణామాలు,ప్రభావాలు ఎలాంటివి? బిడ్డతల్లిగా , ఒంటరి స్త్రీగా, ఒకానొక చోట వితంతు స్త్రీగా ఏ సంఘర్షణా లేకుండానే ఆమె జీవితం నల్లేరుపై బండి నడకగా సాగిందని అనుకోవాలా? ఊహించినవే కనుక బాధపడి ప్రయోజనం లేదని మౌనంగా భరించింది అనుకోవాలా? ఈ మొదలైన ప్రశ్నలకువున్న అవకాశాన్ని ఈ నవలేతి వృత్తం స్పృశించలేదు.

శివరామారావు వదిలేసి వెళ్లిన కుటుంబ బాధ్యతను జయ స్వీకరించింది. అయితే అది ఆ కుటుంబానికి తానేదో ద్రోహం చేశానన్న అపరాధ భావంతో కాదని, రామం తనవాడు అనుకొన్నది కనుక అతని కుటుంబం తనదే అనుకొనటం వల్లనే అన్న స్పష్టత ఆమెకు ఉంది. తనకు సంతోషాన్ని ఇచ్చే ఎంపికలు సామాజికంగానో, ఆర్ధికంగానో బరువైనవే అయినా వాటికోసం నిలబడటం ఆమె దీక్షగా సాధన చేసి సాధించుకొన్న విలువ. తనను ద్వేషించే నవతను కూడా అది ఆమె ఎంపిక, అందుకు ఆమెకున్న కారణాలు ఆమెకు ఉన్నాయి అని ఆమె కోణం నుండి అర్ధం చేసుకోగల వివేకం , సహించగల వితరణ ఆ సాధన వల్ల సమకూడినవే.

ఇక శివరామారావుకు జయతో వున్న సంబంధంవల్ల కలవరానికి, కల్లోలానికి గురైనవాళ్లు ఆయన భార్య అనసూయ, కూతుళ్లు కవిత, నవత. అనసూయ సంఘం తయారుచేసిన మనిషి. భర్త రామారావుకు మరొక స్త్రీతో సంబంధం ఉన్నదన్న విషయం తెలియగానే దుఃఖం, తెలియకుండా ఉంటే బాగుండేది అన్న ఆలోచన, కుటుంబలో మగవాళ్లందరికీ ఉన్నదేగా అన్న స్పృహ , చస్తే సరి పోతుందన్న నిస్పృహ, అంతలోనే పిల్లల ఆకలి గురించిన బాధ్యత, ఏమీ జరగనట్లు వంట , వడ్డన, అలవాటుగా టివి చూడటం, సాధిస్తూనే అయినా అతనితో కాపురం తప్ప విడాకుల ఆలోచననకే ఉలికి పాటు ఇవన్నీసర్దుకు పోవటంలో భాగమైన అసంకల్పిత చర్యలే. భర్తకు మరొక స్త్రీతో సంబంధం ఉండటం తన మీద ప్రేమ తగ్గటంగానో, నిర్లక్ష్యం చేయటంగానో, అవమానకరంగానో అనిపించలేదు అనసూయకు. అవి మగవాళ్లకు అందరికీ ఉండేవే. కొట్టడు కనుక మిగిలినవాళ్ళకన్నామంచివాడే. విడాకులు తీసుకొని, సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్నంతగా అతనిని ద్వేషించలేకపోవటం సాధారణంగా స్త్రీలందరికీ సర్దుకుపోయి బతికేట్లు ఇయ్యబడిన శిక్షణ ఫలితమే అనుకోవచ్చు. అన్నిటికన్నా ఆమెను వేధించిన ప్రశ్న ఆస్తిని, ఆర్ధిక వనరులను భర్త ఆ రెండో ఆవిడకు ధారాదత్తం చేస్తే తన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఏమిటన్నదే.

తల్లికి దుఃఖ కారణమైన మరొక స్త్రీతోటి తండ్రి సంబంధం సంగతి తెలిసిన క్షణం నుండి కవితలో చెలరేగిన ఆలోచనలు, చెల్లితో, తండ్రితో చేసిన సంభాషణలు స్త్రీపురుష సంబంధాల స్వరూప స్వభావాలను అర్ధం చేసుకొనే తర్కంలో భాగమే.తండ్రి గురించి తల్లికి తెలియని విషయాలు జయకు తెలియటం, తండ్రితో జయ చనువు, ‘లోకం వద్దనే సంబంధాలు కాదూ కూడదన్నా లోకంలో ఉంటాయి’ కానీ వాటి గురించి కించపడవలసిన అవసరం లేదని చెప్పగల జయ వ్యక్తిత్వ ప్రకటన- స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన ఆదర్శ సంబంధం గురించిన కవిత ఊహలను ఎక్కడో తాకాయి. అయినా తండ్రి చర్యను ఆమోదించలేకపోయింది. తండ్రి తన అధ్యయనాన్ని, ఆలోచనలను, పరిశీలనలను, అవగాహనను తల్లితో పంచుకొనటానికి,ఆమెను మార్చుకొనటానికి ఉపయోగించే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణ కవితకు వుంది. అందువల్లే ‘మీ మాటలు వినాలని లేదు. మిమ్మల్ని అర్ధం చేసుకోవాలనీ లేదు, ఎందుకో మీకు తెలియాలంటే మీరు స్త్రీకావాలి” అని నిష్కర్షగా చెప్పింది. తండ్రి వేదన సహజమైన అనుకంపను కలిగించగలిగినా వినే సహనం, బాధపడకు అని ఓదార్చగల మానవత్వం చూపలేక పోవటానికి ఆమెకు ఉన్న సంకెళ్లు కారణమంటాడు రచయిత. “ఆ సంకెళ్లు సామూహిక స్త్రీ పరమైనవి. ఆ సంకెళ్లు తల్లి పరమైనవి. ఆ సంకెళ్లు తల్లి వంచిత అన్న భావపరమైనవి” కనుకనే స్త్రీగా ఆమె తల్లి పక్షాన నిలబడింది. అదే సమయంలో తల్లి ప్రవర్తనలో క్షణక్షణం వచ్చే మార్పులను పరిశీలిస్తూ అసలు ఒక సమస్య, అందువల్ల కలిగే దుఃఖమే లేనట్లు తల్లి వేరే వ్యాపకాలలో, ముచ్చట్లలో పడిపోవటాన్నిఅర్ధం చేసుకోలేక తనమనసు అమ్మకి అనుకూలంగా లేదా అని సందిగ్ధానికి లోనవుతుంటుంది. తల్లి పట్ల ప్రేమగా,బాధ్యతగా ఉంటూనే ఆమెలోని లోపాలగురించి ఆలోచించటం, తప్పు చేసాడనుకొంటూనే తండ్రిపై ప్రేమను ఒదులుకోలేకపోవటం కవిత వ్యక్తిత్వం.

తండ్రికి మరొక స్త్రీతో సంబంధం కుటుంబంలో తెచ్చిన కల్లోలానికి మేనమామ పెదనాన్న చిన్నాన్న చూపదలచిన పరిష్కారం ఆస్తి నిర్వహణ తండ్రి చేతి నుండి తల్లి చేతికి బదలాయించడం అని స్పష్టం అయినప్పుడు వాళ్ళ చర్చలలో తల్లి మనోవేదన ప్రసక్తి లేకపోవటం కవిత గమనించింది. తల్లికి మనసు గురించిన స్పృహ ఉన్నదా అన్నది కూడా ఆమెకు సందేహమే. మూడురోజులుగా ఇంటికి రాని భర్త ఊళ్ళోనే ఆసుపత్రి లో ఆపరేషన్ అయి ఉన్నాడని, జయను పిలిపించుకొన్నాడని తెలిసినప్పుడు తల్లి ఏడ్చిన ఏడుపు భర్తకు వచ్చిన కష్టానికా అందు వల్ల తనకు కలిగిన కష్టానికా, జయ ద్వారా తెలుసుకోవలసి వచ్చినందువలనా అని అర్ధం కాక విలవిలలాడటంలో అదే సూచ్యం. తల్లి జయను ఇంటికి పిలిచి ఆదరించిన తీరును పరిశీలిస్తు న్నప్పుడు కూడా కవితలో అలాంటి ప్రశ్నలే.

తండ్రికి జయకు ఉన్న సంబంధంలోని గాఢతను అర్ధం చేసుకొనటానికి కవితకు ఉపయోగపడింది ఈ సందర్భమే. తాను ద్వేషించాలనుకొన్న మనిషి పంచిన స్నేహం, తండ్రి కి ఆమె పట్ల ఉన్న నమ్మకం, ఆయనకు కావలసింది ఏమిటో గ్రహించి సమకూర్చటానికి ఆమె చూపే శ్రద్ధ, బాధ్యత ఆమెకు ప్రత్యక్ష అనుభవ విషయం అయింది అప్పుడే. ‘మీ మధ్య సంబంధానికి మీరుపెట్టే పేరు ఏంటి? అని కవిత అడిగిన ప్రశ్నకు జయ లోకం పెట్టిన పేర్లు తెలుసు కానీ వాటిని ఉచ్చరించటానికి తన సంస్కారం ఒప్పుకోవటం లేదంటూ ఒక్కో సందర్భంలో కొన్నిటికి మనకు తెలిసిన పేర్లు చాలవు అంటుంది. వ్యక్తుల సమస్యలు పరిష్కరించటానికి ఏర్పడిన సమాజమే వాళ్లకి సమస్యలు సృష్టిస్తున్నప్పుడు సమాజనియామాలకు బాహిరంగా పరిష్కారం వెతుక్కొన వలసిన సందర్భాలు వస్తాయని, కొత్త సంబంధాలకు కొత్తపేర్లు ఇంకా పెట్టుకోవలసే ఉంది అని చెప్తుంది. తండ్రిస్వరమూ, భాషా జయస్వరమూ, భాషా ఒక్కలాగే ఉన్నాయని తోచిన కవితకు అందువల్లే వాళ్ళు ఒకటి కాగలిగారా? లేక ఒకటవటం వల్ల ఆ భాష , స్వరమూ వచ్చాయా అన్న ప్రశ్న వచ్చింది. ఆ రకంగా తండ్రికి, జయకు ఉన్న సంబంధాన్ని భావాల, అభిప్రాయాల సంస్కరాల సమానత ప్రాతిపదిక మీద అర్ధంచేసుకొనే స్థితికి కవిత చైతన్యం పరిణమించింది.

కవిత తండ్రి అదృశ్యం తరువాత అతని ఆచూకీ కోసం జయకు ఫోన్ చేసినప్పుడు సమాధానం ఇచ్చిన పెద్దావిడ మాటలను బట్టి తండ్రీ జయ అన్నాచెల్లెలుగా చెప్పుకొంటున్నారని తెలిసి అసహ్యంగా అనిపించినా అలా చెప్పుకొనే రహస్య సంబంధంలోని నిస్సహాయత్వం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. కవిత తన చదువు పూర్తి చేయటానికి సహాయం చేస్తే ఉద్యోగం చేసుకొని తల్లిని చెల్లిని పోషించుకోగలనని చెప్తున్నా వినకుండా పెత్తండ్రి చదువులు చెప్పించలేననని తమతో పాటు వూరికివస్తే పెళ్లిళ్లు చేసే బాధ్యత తీసుకొంటానని అన్నప్పుడు ఆ చదువు బాధ్యత తాను తీసుకొంటానని జయ ముందుకు రావటం కవితకు ఆమె పట్ల గౌరవాన్ని మరింత పెంచింది. ఆనాడు చదువుకోసం ఆమెదగ్గర చేరిన కవిత ఆమెతో కలిసిన కొత్త కుటుంబాన్ని నిర్మించుకొన్నది. ఆమె కొడుకుకు అక్క అయింది.

నవత కవిత లాగా ఆలోచనాజీవి కాదు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది అనేస్తుంది. జయ తండ్రికి వ్రాసిన ఉత్తరం చదివిన ఆమె తక్షణ ప్రతిస్పందన మోరల్స్ లేవని తండ్రిని అసహ్యించుకొనటం, ద్వేషం ప్రకటించటం. తల్లి పట్ల జాలిపడటం. ఉద్రేకాలతో ఊగిపోయే ప్రవృత్తి తనది. అందువల్లే తండ్రిని మొహం పట్టుకొని మోసగాడివి అంటూ మాటలతో అసహ్యాన్ని వ్యక్తపరిచింది. మోరల్స్ లేని తండ్రికి బుద్ధిచెప్పాల్సిందే అని భావించింది. తల్లి విడాకులు తీసుకొని అతనిని వదిలెయ్యటమే పరిష్కారంగా తీర్పు ఇచ్చింది. లాయర్ ను సంప్రదించి అందుకు ఏర్పాట్లు తక్షణమే చేయాలని తొందర పడింది. ఈ క్రమం లో నీతి తప్పిన స్త్రీపట్ల భర్త నుండి అందరూ తీర్పరులే అయి తక్షణ శిక్ష అమలవుతుండగా నీతి తప్పిన పురుషుడితో సర్దుకొని బతికెయ్యమని స్త్రీకి బోధ చెయ్యటంలోని వివక్ష ఆమెకు అర్ధం అయింది. ఆడదాని విషయంలో నీతిని పాటించటం ఒక విలువగా చేసి మగవాడు దానిని యథేచ్ఛగా అతిక్రమించి నడవటంలోని అన్యాయం ఆమెను బాధించింది. తల్లికి జరిగిన అన్యాయం సంగతి ఆలోచించకుండా ఆస్తిపాస్తుల వ్యవహారాలు మాట్లాడుతున్న పెత్తండ్రి పినతండ్రులతో, మేనమామతో తండ్రిని విడాకులకు ఒప్పించమని గొడవపడింది. పోషణకోసం నీతి తప్పిన మగవాడిని భరించటం ఆత్మగౌరవ హీనతగా భావించింది.

తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయి, చదువుకానీ , ఆదాయం ఇయ్యగలిగిన ఉపాధి కానీ లేని తల్లి, చదువులు ఇంకా పూర్తిచేయని అక్కాచెల్లెళ్లు తామిద్దరూ నిరాధారంగా మిగిలినప్పుడు పెత్తండ్రి బెంగుళూరులో ఉంచి చదివించలేము.. వూరికి తీసుకువెళ్లి పిల్లల పెళ్లిళ్లు చేస్తామని అన్నప్పుడు మాకేం అక్కరలేదు అని కోపంతో తిరస్కరించిన నవత ‘చదువులు నేను చూసుకొంటాను’ అని జయ ముందుకు వచ్చినప్పుడు ఆ సహాయం అందుకొనటానికి సిద్ధమైన అక్క మీద తల్లి మీద అంతే ఆగ్రహం ప్రకటించింది. తండ్రిని ఎంత ద్వేషించిందో జయను అంత ద్వేషిస్తూ అంతకంటే పెదనాన్న పినతండ్రులతో వెళ్ళటానికి, జుట్టుకట్టుబొట్టువ్యవహారాలలో వాళ్ళ ఇష్టానికి అనుగుణం గా మసలుకొనటానికి,పెళ్ళిచేస్తే చేసుకొనటానికి సిద్ధపడింది. మెడిసన్ లోను ఇంజనీరింగ్ లోనూ కూడా బెంగుళూరు కాలేజీలలో చదువుకొనటానికి సీటువచ్చినా జయ సహాయం పొందటం ఇష్టం లేక వదులు కొన్నది.అంతే కాదు ఆమె సహాయంతో చదువుకొంటున్న అక్కను నీతిలేని దానిగా పరిగణించింది. ఈ మొత్తంలో వైవాహికేతర లైంగిక సంబంధాలు అసహ్యించుకోవలసిన అవినీతి చర్య అన్నస్థిర భావనే నవత ప్రవర్తనను శాసించిన శక్తి.

తన ఆవేశానికి,ఆవేదనకు తగిన ప్రతిస్పందనలేని కుటుంబంతో, సమాజంతో సమాధాన పడలేని పరిస్థితితులలో నవత కమ్యూనిస్టు పార్టీ కి చేరువైంది.ఆ క్రమం లో పేదరికం అసలు సమస్యా లేక స్త్రీలపై వివక్షా అన్న విచికిత్సలో కూడా పడింది. స్త్రీలపై వివక్ష వైపే ఆమె మొగ్గు. తండ్రి అనైతికత గురించిన అసహనం నుండి రోడ్డు పైన వచ్చేపోయే స్త్రీలపట్ల రకరకాల వేధింపులు, వేధించినవాళ్లను కాక వేధింపులకు గురైన స్త్రీలను కట్టూబోట్టూ కారణంగా దోషులుగా నిర్ధారించే తీర్పులు, రకరకాల పనుల మీద నలుగురిలో తిరిగే ఆమ్మాయిలను సులభంగా అనుభవానికి దొరికే వాళ్ళనుకొనే పురుష ఉద్యోగుల ధోరణి, ఇళ్ళల్లో పురుషులు భార్యమీద చేసే పెత్తనం, పెట్టె హింస చూస్తూ వింటూ వచ్చిన నవత ఆ పరిస్థితిని మార్చటానికి కమ్యూనిస్టు సమాజం ఒక్కటే మార్గమని విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది. తరతరాలుగా స్త్రీలు అనుభవిస్తున్న వివక్షపట్ల స్త్రీలకు జరుగుతున్నఅన్యాయాల పట్ల క్రోధం ప్రకటిస్తూ దానికి పరిష్కారంగా విప్లవోద్యమ ఆచరణను ఎన్నుకొనటం వరకు ఆమె జీవితంలో పరిణామాలన్నీ ఉద్వేగాలతో, తుఫాను వరవడిలో సంభవించినవే.

లైంగిక నీతికి సంబంధించిన ఒక గాఢమైన అభినివేశంతో నిరంకుశమైన అభిప్రాయంతో ప్రారంభమైన నవత రాజును అతని నిజాయితీని ఇష్టపడింది. కానీ అతను నమ్మిన ఆర్ ఎస్ ఎస్ సంఘం తనుకోరే మంచి సమాజాన్ని , స్త్రీ పురుష వివక్ష లేని సమాజాన్ని తెస్తుందని నమ్మకంలేక అతనిని వదిలి విప్లవోద్యమంలోకి వచ్చిందే కానీ అతని మీద ఇష్టాన్ని వదులుకోలేదు. అదే సమయంలో ఉద్యమంలో సహచరుడైన సంకేత్ పట్ల అంతటి ఇష్టమూ కలిగితే ఒకేమారు ఇద్దర్ని కావాలనుకునే తన మానసిక భావ స్థితి లోని పాపపుణ్యాల విచికిత్సలో పడింది. సంకేత్ తో అత్యంత సహజంగా ఏర్పడిన ఒక నాటి శారీరక సంబంధంలో ఆనందాన్ని పొంది ఒక వ్యక్తి ఏకకాలంలో ఇద్దర్ని ప్రేమించటం సాధ్యమా అని తన అనుభవాన్ని తానే ప్రశ్నించుకొన్నది.

ఈ సందర్భాలను కల్పించటంద్వారా రచయిత సాధించిన ప్రయోజనం ఏమిటి? బుద్ధికి, ఆదర్శానికి, శరీరానికి వాస్తవానికి మధ్య వైరుధ్యం ఉండటానికి వీలుందని చెప్పటం.లోకం నిర్ధారించిన లైంగిక నీతి స్త్రీపురుష సంబంధాల నియంత్రణాపేక్ష నుండి రూపొందింది. శరీరము, మనసు, బుద్ధి రకరకాల స్నేహ సంతోష భావోద్వేగాల సంబంధంలో లైంగిక ఆసక్తులుగా విశిష్టంగా వ్యక్తం అవుతుంటాయి. అది లైంగిక నీతి తప్పటంగా లోకానికి అనిపిస్తుంది అన్న వాస్తవాన్ని అర్ధం చేసుకొనే స్థాయికి నవత మేల్కొన్నది అని సూచించటమే. అభిప్రాయాన్ని అంటుకొని ఉద్విగ్నత ఉంటుందని ఉద్విగ్నత కాలంతో పాటు చల్లారుతుందని, కొత్తఘటనలు, సంభాషణలు అభిప్రాయాలను మారుస్తాయని కవిత ముఖంగా అనిపించిన వాక్యార్ధాన్ని నవత జీవితక్రమంలో నిరూపించాడు రచయిత. తండ్రితో సంబంధం ఏర్పరచుకొని కొడుకును కన్న నీతిలేని మనిషి అని నవత ఏ జయను ద్వేషిస్తూ, అవమానిస్తూ వచ్చిందో ఆ జయను నవల చివరకు వచ్చేసరికి అమ్మా అని పిలవగలిన పరిణితికి పరివర్తన చెందింది.

నవతలో ఈ రకమైన పరివర్తనను చూపటంలో రచయిత ఉద్దేశం ఏమిటి? స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ, మోహం, ప్రేమ ఎప్పుడు ఎలా ఏర్పడతాయో చెప్పటం కష్టం. ఆస్తులు, అంతస్తులు, కులాలు మత ధర్మశాస్త్రాలు లైంగిక సంబంధాల విషయంలో ఎన్ని విధి నిషేధాలు ఏర్పరచినా మానవ ప్రవృత్తిని, భావోద్వేగాలను, శారీరక సంచలనాలను నియంత్రించటం సాధ్యం కాదని ఎప్పటికప్పుడు రుజువు అవుతుండగా అటువంటప్పుడు స్థిరపడిన లైంగిక నీతిని అతిక్రమించారని మనుషులను శిక్షించటమైనా, ద్వేషించటమైనా అమానవీయం, అప్రజాస్వామికం అన్న అభిప్రాయాన్ని బలపరచటమే అనుకొనాలి.

వీటన్నింటికన్నాఈ నవలలో ముఖ్యమైన ప్రశ్న మానవ సంబంధాలలో లైంగికనీతికి ప్రమేయం ఎంతవరకు అన్నది. మనుషులను మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని వేరు చేసి చెప్పటానికి ప్రమాణం నీతి. నిజం చెప్పటం నుండి అనేక అంశాలు నీతి పరిధిలోకి వస్తాయి. కానీ అది తరచు లైంగిక నీతి అన్న అర్థంలోనే ప్రయోగించబడుతుంటుంది. మిగిలిన సుగుణాలు ఎన్ని ఉన్నా లైంగిక నీతి తప్పిన మనుషులను ద్వేషించటం, దూరం పెట్టటం, సవాలక్ష సాంఘిక ఆర్ధిక వ్యవహారాలలో అవినీతిపరులైన మనుషులను లైంగికనీతి తప్పలేదన్న ఒకేఒక కారణంతో గౌరవించటం సమాజంలో కనిపించే వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని గురజాడ నుండి బుచ్చిబాబు వరకు అందరూ తమ రచనలలో చర్చకు పెట్టినవాళ్ళే. వివినమూర్తి కూడా ఈ నవలలో ఆ పనే చేసారు.

లైంగికనీతి సాపేక్షమా నిరపేక్షమా అన్న కోణం నుండి ఈ సమస్యను నిర్వహించారు రచయిత. లైంగిక సంతృప్తి జీవితంలో ఒకానొక అంశం. అదే సమస్తం కాదు. మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి అదొక్కటే కాదు. తండ్రి మరొక స్త్రీతో ఏర్పరచుకొన్న సంబంధం తల్లికి జరిగిన అన్యాయం అని కవితకు తెలుసు. విషయం తెలియగానే కవితకు తండ్రి పట్ల కలిగిన ఆగ్రహం తండ్రీ కూతుళ్లుగా తమ మధ్య ఇంతకు పూర్వమే నిర్మితమైన ఆప్యాయ ఆత్మీయ సంబంధాల సాపేక్షత నుండి కరుగుతూ కనుమరుగు అవటం చూస్తాం. తండ్రిని ప్రేమించదగిన అనేకానేక సందర్భాల జ్ఞాపకాలతో కూడిన ఆలోచనలు ఒక్క లైంగికనీతిని బట్టి ఆయనను విలువకట్టటం అర్ధరహితం అని తేల్చేశాయి. తండ్రిని ఎక్కువకాలం ద్వేషించటం, దూరం పెట్టటం ఇక ఆమెకు సాధ్యం కాలేదు. తండ్రికి తల్లిదగ్గర లేని చనువు జయ దగ్గర ఎలా వుంది? తల్లి దగ్గర పొందలేని నమ్మకం జయదగ్గర ఎలా లభించింది? అని ప్రశ్నించి తరచి చూచుకొంటున్న కొద్దీ లభించే సమాధానాలు జయతోటి తండ్రి సంబంధాన్ని సానుభూతితో అర్ధం చేసుకొనే స్థాయికి ఆమెను చేర్చాయి. తండ్రికి, జయకు ఉన్న సంబంధాన్ని భావాల, అభిప్రాయాల సంస్కారాల సమానత ప్రాతిపదిక మీద ఏర్పడినదిగా అర్ధంచేసుకొనే పరిణితిని ఆమె సాధించింది. ఇదెలా సాధ్యమైంది అంటే అవతలి వాళ్ళవైపు నుండి ఆలోచించగల సహన భావన వల్ల. ఎదుటివాళ్లలోని సుగుణాల సాపేక్షతలో లైంగికనీతి అతిక్రమణ అనేది అతిచిన్నదై పోవటం వల్ల.

శివరామారావు చిన్న కూతురు నవత అక్క లాగా కాకుండా లైంగిక నీతి నిరపేక్ష అంశం అనుకొన్నది. మోరల్స్ లేవని తండ్రి మీద తీర్పు ప్రకటించింది. అందువల్ల మిగిలింది తండ్రిని, జయను ద్వేషించటమే. మోరల్స్ లేవు అని ఏ మనుషులను ద్వేషించిందో వాళ్ళ పట్ల సానుభూతితో మాట్లాడిన తల్లిని, అక్కను కూడా ద్వేషించటం దానికి గొలుసు చర్య. ఈ మొత్తంలో వైవాహికేతర లైంగిక సంబంధాలు అసహ్యించు కోవలసిన అవినీతి చర్య అన్నస్థిర భావనే నవత ప్రవర్తనను శాసించిన శక్తి. లోకం నిర్ధారించిన లైంగిక నీతి స్త్రీపురుష సంబంధాల నియంత్రణాపేక్ష నుండి రూపొందింది. స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ, మోహం, ప్రేమ ఎప్పుడు ఎలా ఏర్పడతాయో చెప్పటం కష్టం. ఆస్తులు, అంతస్తులు, కులాలు మత ధర్మశాస్త్రాలు లైంగిక సంబంధాల విషయంలో ఎన్ని విధి నిషేధాలు ఏర్పరచినా మానవప్రవృత్తిని, భావోద్వేగాలను, శారీరక సంచలనాలను నియంత్రించటం సాధ్యం కాదని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే వుంది. అది స్వీయ అనుభవం అయినప్పుడు కానీ నవతకు స్థిరపడిన లైంగిక నీతిని అతిక్రమించారని మనుషులను శిక్షించటమైనా, ద్వేషించటమైనా అమానవీయం, అప్రజాస్వామికం అన్న అవగాహన కలగలేదు.

లైంగికనీతికి సంబంధించిన స్థిరపడిన సూత్రీకరణలు, విశ్వాసాలకు భిన్నమైన కాస్త అటూఇటూ అయిన అనుభవాలను ఎదుర్కొనటంలో మనుషులు ఎంత ఘర్షణకు, వేదనకూ గురి అవుతారో మానవ సంబంధాలలో అదెంత క్రూరంగా వ్యక్తం అవుతుందో నవత ముఖంగా చూపిన రచయిత దాని ఇంకొక పార్శ్వాన్ని స్పృశించటానికే బాలూ కవితల ప్రేమ ఉదంతాన్ని ఇతివృత్తం లో భాగం చేశాడా అనిపిస్తుంది. బాలూ కవితల స్నేహానికి ఉభయుల తండ్రులనుండి ఆమోదం ఉంది. ఒకరి ఇళ్లకు ఒకళ్ళు వస్తూపోతూ కలిసి చదువుకొంటూ కూడా ఉంటారు. బాలూ ఆత్మహత్య చేసుకొనటానికి ముందురోజు కవితా వాళ్ళింటికి వచ్చాడు. నవతకు తెలియని లెక్కలేవో అతను చెప్తుంటే కవిత కాసేపు పడుకొని వస్తానని లోపలకు వెళ్ళింది. ఆమె లేచి వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. మర్నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. “ నా కవితా నన్ను క్షమించు. నీకు ద్రోహం చేసాను. నేను నీకు తగను. నన్ను మర్చిపో . సుఖంగా ఉండు” అని వ్రాసిపెట్టి పోయాడు.

ఆ తరువాత ఎప్పుడో బాలూ తండ్రి గోపాలయ్యర్ వ్రాసిన ఉత్తరాన్ని బట్టి పెళ్ళికి ముందే లైంగిక సంబంధాలు అనైతికం అన్న లోకవాక్యంలో విశ్వాసం వల్ల దానిని భగ్నపరిచానన్న ఒత్తిడి నుండి అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అలాంటి శారీరక సాన్నిహిత్యం తమ మధ్య ఏమీ లేదే అని విస్తుపోతుంది కవిత. ఆ తరువాత ఎప్పుడో నవత కవితకు వ్రాసిన ఉత్తరంలో దానికి సమా ధానం ఉంది. ఆ రోజు బాలూ లెక్కలు అర్ధం చేసుకొనటం ఎలాగో బోధించిన పద్ధతికి సంతోషం పట్ట లేక మైమరచి అతనిని గట్టిగా కావలించుకొని బుగ్గల మీద ముద్దు పెట్టుకొన్నానని నవత వ్రాసింది. మైల పడిపోయాననుకొన్నాడేమో ఇంత దారుణమైన పనిచేశాడు అని వ్యాఖ్యానం జోడించింది కూడా. అతను ఎలా భావించినా ఆమె దృష్టిలో బాలూకి ఇచ్చిన కౌగిలీ, ముద్దూ ఒక ప్రశంసా చిహ్నాలు మాత్రమే. గోపాలయ్యర్ , నవత రాసిన ఉత్తరాలను కలిపి చూస్తే కవితను ఇష్టపడిన బాలూ నవత కౌగిలింత వల్ల, ముద్దువల్ల తనలో కలిగిన సంచలనాన్ని అనైతికంగా భావించి దోషభావంతో కవితకు ద్రోహం చేశానన్న చింతతో ఆత్మహత్య చేసుకున్నాడని అర్ధం అవుతుంది. లైంగిక నీతికి సంబం ధించిన సంప్రదాయక విలువ నవత లాంటి వాళ్లకు జీవితకాలపు సంఘర్షణగా ఉంటే బాలూ వంటి వాళ్లకు ప్రాణాంతకమే అవుతున్నదన్న హెచ్చరికను ఇస్తుంది ఈ నవల. సామాజిక చింతన, ఆచరణల క్రమంలో అనుభవాలు విస్తృతమయ్యే క్రమంలో నవత ఆ సంఘర్షణ నుండి విముక్తం కాగలిగింది. అందుకు అవకాశం లేని,బౌద్ధిక మానసిక పరిపక్వత లేని బాలూ దానికి బలి అయ్యాడు. కథా గతంగా లైంగిక నీతికి అనవసరమైన ప్రాధాన్యత ఇయ్యటం బాలూ కు ఉన్న ఆటిజం లక్షణ పరిణామం కావచ్చు, కానీ అది ఈ సమాజానికే పట్టిన ఒక జబ్బు అని రచయిత భావిస్తున్నాడా అనిపిస్తుంది. నిజానికి ఈ నవల ఇతివృత్త పరిధి ఇంతే. కానీ లైంగిక నీతి నుండి లైంగిక వివక్ష అన్న సూత్రాన్ని లాగి విప్లవోద్యమంతో ముడిపెట్టి దానిని విలువకట్టే విఫలయత్నం జరిగింది ఈ నవలలో.

నవత విప్లవోద్యమంలోకి వెళ్ళటానికి కారణాలుగా చూపించబడినవి కమ్యూనిస్టుపార్టీ మేనిఫెస్టో చదవటం. కొన్ని సభలకు వెళ్ళటం. యువత దృష్టిని వ్యక్తిగతం నుండి ప్రపంచం వైపు మరలించటం పనిగా పెట్టుకొన్న కమ్యూనిస్టులతో కలిగిన పరిచయాలు. చేసిన సంభాషణలు, అధ్యయనాలు. భర్తచేత తన్నులు తినే స్త్రీలను, ఒళ్ళమ్ముకొనే స్త్రీలను, పేదరికం కారణంగా విషాదం నిండిన ముఖాలను చూడటం. ఉత్పత్తి సంబంధాలలో మార్పు గురించిన సిద్ధాంత అవగాహనకు ఇవి ఎంతవరకు దోహదం చేశాయి? ఆచరణలో భాగస్వామ్య విలువను ఎంత పెంచాయి? అంటే జవాబు లేదు. లేకపోగా నవత ముఖంగా మార్క్స్ చెప్పిన ఆసియా ఉత్పత్తి విధానంగానీ సాకేత రాజన్ చెప్పిన శూద్ర ఉత్పత్తి విధానం గానీ అద్భుతమైన విశ్లేషణలే గానీ ఉద్యమ ఆచరణలో అవేమీ మార్పుని తీసుకురాలేకపోయ్యాయి అని తీర్మానించటం చూస్తాం.

పేదరికమా వివక్షా ఏది ముందు పరిష్కరించవలసినదన్న ప్రశ్నతో మొదలైన నవత పద్నాలుగు ఏళ్ల విప్లవోద్యమ ఆచరణ తరువాత కూడా ఆ ప్రశ్న వద్దే తచ్చాడటం చూస్తాం. ఆ విషయంలో విప్లవోద్యమ ఆచరణ అనుభవం నుండి ఆమెకు స్పష్టమైన ఒక అవగాహన అభివృద్ధి చెందకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వివక్షను విశ్లేషిస్తూ విముక్తిని కోరిన స్త్రీవాదం మీద పూర్తి నమ్మకమూ లేదు. అందులో పురుషులపై ఉన్న ఫిర్యాదు సబబైనదే అయినా అది అసమగ్రం అయిందిగానే ఆమెకు అనిపిస్తుంది. కమ్యూనిస్టులు మొత్తం గురించి ఆలోచిస్తుండగా స్త్రీవాదులు అందులో శకలం గురించి ఆలోచిస్తున్నారన్న అవగాహన దానికి కారణం. మొత్తం గురించి ఆలోచించే ఆచరణ కార్యక్రమంతో ముందుకు పోయే కమ్యూనిస్టు నిర్మాణంలో స్త్రీలు ఎదుర్కొనే వివక్షకు పరిష్కారం ఉందన్న అవగాహనతో ఏ విప్లవోద్యమంలోకి నడిచివచ్చిందో దానిని సందేహించకుండా కూడా ఉండలేక పోయింది. మార్గం పట్ల నమ్మకం పోతున్నట్లు ప్రసాదంకుల్ కు ఉత్తరం కూడా రాసింది. పద్నాలుగు ఏళ్ల ఆమె ఉద్యమ గమనం 1990 నుండి 2004 వరకు. స్త్రీ సమస్య గురించి జరిగిన విస్తృతమైన చర్చ, నిర్దిష్టమైన అవగాహనతో దండకారణ్య మహిళా సంఘ నిర్మాణం, ఆచరణ ఆ సమకాలపు చారిత్రక వాస్తవం. కాగా ఆ చరిత్రతో అసలు ఏ సంవాదం, సంభాషణ నవతకు లేవు.

ప్రసాద్ అంకుల్ చేసిన ‘నిజాయితీ వ్యక్తిగతవిలువ . భావజాలం వ్యక్తులకు బయటది. భావజాలాలు మారినా మిగిలేది నిజాయితీ’ వంటి సూత్రీకరణలు, రాజు అనే ఆర్ ఏసెస్ ప్రతినిధి ముఖంగా కమ్యూనిజాన్ని జనరంజకంగా అభావం చేయటానికి కల్పించిన తర్కం అన్నీ కలిసిన ఒక తాత్విక గందరగోళ స్థితిలో వ్యక్తి , వ్యక్తి ధైర్యం, నిజాయితీ, గతాన్ని వదులుకొనటం మొదలైన విలువలతో మాత్రమే కులమత వర్గ లింగ అస్తిత్వాలతో విభజితమైన సమాజం ఏకం అవుతుందని నిర్ధారిస్తూ ఆ దిశగా అడుగు కదపాలన్న సూచనతో నవల ముగుస్తుంది.

మొత్తంగా ఈ నవలలో మనుషులు ఎవరూ తర్కించినంతగా జీవించలేదు.ఎవరితర్కం వారిదే. ఎవరి ప్రశ్నలు వాళ్ళవే.ఎవరి సమాధానాలు కూడా వాళ్ళవే. అది లోకంలో ఉన్నదే కావచ్చు కానీ వాస్తవజీవితంలో ఏదో ఒక తలంలో అవి సంఘర్షించటం, మార్పుకు కారణం కావటం కూడా ఉంటుంది. కానీ ఈ నవలేతివృత్తంలో దానికి చోటు లేకపోయింది.

ఏమైనా సంక్షోభ సందర్భాలలో పురుషుల వలె పలాయనం చిత్తగించకుండా సంఘర్షిస్తూ నిలబడగల స్త్రీల జీవశక్తిని నిరూపించిన నవలగా ఇది ప్రత్యేకమైంది.

2. మతం మాయను చిత్రించిన నవలలు

సామాజిక సంబంధాలను, మానవ సంబంధాలను నిర్దేశించి నడిపే ఉత్పత్తి సంబంధాల సంగతి తెలిసిందే. అదే స్థాయిలో వాటిని ప్రభావితం చేసే మతం ఒకటి ఉంది. ఉత్పత్తి సంబంధాలలో ఉండే దోపిడీ, హింస, మత సంబంధాలలో ఉన్నట్లు కనిపించక పోవచ్చు కానీ అది కూడా అంతిమంగా ఆర్ధిక ప్రయోజనాల సంబంధంలోనే ప్రవర్తిస్తుండటం, వివక్షను సామాజిక ధర్మంగా ప్రచారంలో ఉంచటం, దోపిడీని కర్మఫలంగా సామాజిక ఆమోదయోగ్యం చేయటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. విమానంవచ్చింది, ఓ మనిషి వంటి నవలల్లో వివినమూర్తి మత నాణెపు ఆ మరో ముఖాన్ని అర్ధం చేయించటానికి ప్రయత్నించారు.

2.1. విమానం వచ్చింది నవల 1988 లో అనిల్ అవార్డు అందుకొని 1989 జులై స్వాతి పత్రికకు అనుబంధంగా ప్రచురించబడింది. 1976 నుండి 1986 వరకు పదేళ్ల కాలం మీద ఎనిమిదిసార్లు తిరగరాసిన నవల.పిల్లల చూపుతో పెద్దల ప్రపంచాన్ని ఆవిష్కరించాలన్న తపనతో చేసిన ప్రయోగం. ఆ పిల్లలు రాజు, రాంకుట్టు, వాళ్ళ కంటే పెద్దది సుందరి. కథ అనకాపల్లి కి దగ్గర మంగారం గ్రామంలో నడుస్తుంది. పెద్దల ప్రపంచం ఏమిటి? ఒక వైపు బతుకు తెరువు సమస్యలు, మరొక వైపు ఆధాత్మిక ఆసక్తులు, పెత్తనాలు, వైరుధ్యాలు, వైషమ్యాలు. వాటికీ తోడు యువతీ యువకుల మధ్య ఆకర్షణలు. పిల్లలకు వీటితో పనేమిటి? ఆప్రపంచపు కదలికలో తమకు బుల్లి పాత్ర ఉందన్న ఎరుక ఇచ్చే ఉత్సాహం, చిన్నచిన్న అవసరాలు, స్నేహాలు సంతోషాలు, సందళ్ళు వాళ్ళను నడిపించే శక్తులు. అలాంటి పిల్లల స్వభావాలను, ఆలోచనలను, చర్యలను ప్రధానం చేస్తూ పెద్దల ప్రపంచ గమనాన్ని చూపించటం ఈ నవల చేసిన పని. ఒక సంక్రాంతికి ముందు శీతాకాలంలో మొదలైన కథ మరొక సంక్రాంతిని చూసి శివరాత్రి నాడు ముగుస్తుంది.

1968 లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తరిగిపోతున్న విదేశీమారకద్రవ్య సమస్యను ఎదుర్కొనటానికి బంగారం నియంత్రణా చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో ఈ నవల ప్రారంభం అవుతుంది. ఈ చట్టాన్ని బట్టి వ్యక్తుల వద్ద బంగారం నాణాల రూపంలో గానీ కడ్డీల రూపంలో గానీ బంగారం నిల్వ ఉండటానికి వీల్లేదు. కంసాలుల దగ్గర వంద గ్రాములను మించి ఉండటం నిషేధం. ఈ పరిస్థితులలో జనం బంగారం కొనటం, నగలుచేయించుకొనటం తగ్గిపోయేసరికి సంప్రదాయంగా వస్తున్న బంగారు ఆభరణాల తయారీ వృత్తిలో ఉన్న కంసాలుల పై దాని ప్రభావం పడింది. అనేకమంది పనులు కోల్పోయారు. ఆర్ధికంగా దిగజారిపోయారు.ఈ నవలలో రాజు తండ్రి సోమాచారి అలా దిగజారి పోయిన వృత్తి పని వాళ్లలో ఒకడు. అలా బతుకులు కోల్పోయిన వాళ్లు జీవనాధారం చూపించవలసినదిగా సంతకాలు పెట్టి ప్రభుత్వానికి కాగితాలు పెట్టుకొంటున్న విషయం కూడా ఈ నవలలో ప్రస్తావనకు వస్తుంది. ఈ నేపథ్యంలో సోమాచారి జీవితంలో వచ్చిన సంక్షోభం, దాని పరిణామాలు ఈ నవల ఇతివృత్తంలో ఒక ప్రధానమైన పాయ.

భార్యతో, చిన్న కూతురితో పెద్దల్లుడు ఆ ఊరి కరణమూ అయిన భాస్కరం ఇంటికి వచ్చిన వినాయకరావుకి , కొత్త హరిజనవాడలో వెలసిన చర్చిని చూసి ‘ఎక్కడో పుట్టిన మతం ఇంతదూరం ప్రయాణం చేసి ఈ మారు మూల కుగ్రామంలో కూడా తన దేవుడికి ఒక గుడి కట్టుకోగా వూళ్ళో ఒక్క గుడి అయినా లేకపోవటం ఏమిటన్న ఆలోచన రావటం దగ్గర మొదలైన కథ గుడి నిర్మాణం విషయంలో వచ్చిన కుల పట్టింపులు … గుడి నిర్మాణ సంరంభాలు, సంఘర్షణలతో కొనసాగటం నవల ఇతివృత్తంలో మరొక ప్రధానమైన పాయ. ఇది సోమాచారి జీవిత పరిణామాల పాయను ఒరుసుకొంటూ , కలిపేసుకొంటూ సాగుతుంది. ఈ మధ్యలో సుందరి చంటిబాబుల మధ్య ఆకర్షణ, పుస్తకాల , ప్రేమలేఖల వినిమయం చివరికి ఇద్దరినీ కలిసి ఊరువదిలిపోయేట్లు చేయటం అనే మరొక సన్నని పాయ ఉంది. ఈ మూడింటి లోని ఉధృతి, బాధ, వేదన, విజయం అర్ధం చేసుకోగల వయసు లేకపోయినా అన్నిటికీ ప్రత్యక్షసాక్షిగా రాజు, కొన్ని సందర్భాలలో రాంకుట్టు - వాళ్ళిద్దరి ఆలోచనలు, బాధలు, దుఃఖాలు, సందేహాలు సంతోషాలు కూడా ఈ నవలేతి వృత్తంలో భాగం అయ్యాయి.

రాజు స్నేహితుడు రాంకుట్టు కరణం భాస్కరం కొడుకు. రోడ్డుకు ఒకవైపు చెరువు గట్టుకు దగ్గర రాజు గుడిసె. రోడ్డుకు అవతల పెంకుటిల్లు రాంకుట్టుది. తెల్లవారిందంటే ఇద్దరూ ఒకదగ్గరే. నలుగురు కూడే చోటు వాళ్ళిద్దరికీ ఇష్టం. భోగినాడు మధ్యాహ్నం గుడి కట్టటటం గురించి బ్రాహ్మల ఇళ్లమధ్య ఖాళీ జాగాలో ఊరివాళ్ళు సమావేశమైతే రాజూ, రాంకుట్టూ కూడా అక్కడ చేరారు. అక్కడేదో చిన్న ఘర్షణ జరగటం చూసారు కానీ అదేమిటో వాళ్ళ మనసుకు ఎక్కలేదు. అర్ధం కాలేదు. రాజు గుడిసెకు వెనకవైపు గుడి కడతారని మాత్రం వాళ్లకు అర్ధమైంది. హుషారుగా వెళ్లి రాజు తల్లికి ఆవిషయం చెప్తే ‘కాపులు మరొక గుడి కడతారట’ అని ఆమె చెప్పింది. సమావేశంలో జరిగిన కలకలం కుల భేదాల ఫలితమని దానికీ దీనికీ సంబంధం ఉందని తెలుసుకోలేని వయసులో వూళ్ళో రెండు గుళ్ళు వాడికి సంతోష కారణమైనవే.

ఊళ్ళో గుడి ఉండాలని ప్రతిపాదన పెట్టి ముందుపడిన వినాయకరావు ఎవరు? కరణంగా కాగితాలు వ్రాయటం , లెక్కలు వేయటం మినహా రెండుచేతులా సంపాదించటం చాతకాని అల్లుడి ని వృద్ధిలోకి తేవాలని అందుకోసం మంగారంలో స్థిరపడదామని వచ్చిన వాడు. నవల ప్రారంభంలో “ఆ వూరి రైతులకు అనకాపల్లి మార్కెట్ ను వినాయకరావే పరిచయం చేసాడు” అన్న వాక్యం అప్పటికే ఆ వూరికి ఆయన రాకపోకలు తరచుగా జరుగుతూనే ఉన్నాయని, అది చుట్టపు చూపు వ్యవహారం కాదని సూచిస్తుంది. మార్కెట్ ను పరిచయంచేయటం అంటే మార్కెట్ ను నిర్ణయించే శక్తుల చేతికి రైతుల జుట్టు అందించటమే. చెరుకును పండించి బెల్లం తయారు చేసే రైతులకు మదుపు పెట్టగల సుబ్రహ్మణ్యం వంటి షావుకార్లను, ధర్మాత్ములుగా, ధర్మవడ్డీ తీసుకొని మదుపు పెట్టగల మహనీయులుగా చెప్ప గలవాడు. బెల్లం దిమ్మలు అతని కొట్టుకే వెయ్యమని హితవు చెప్పేవాడు. అప్పు ఇచ్చినవాడి కొట్టుకు సరుకు తోలటం అంటే దాని ధర నిర్ణయం రైతు చేతి నుండి మదుపుదారుడికి బదలాయించటమే. అదీ వినాయకరావు అంటే. కాలువ మీద బ్రిడ్జి వస్తే బెల్లం తీసుకుపోయే లారీ రైతు పొలంలోనే ఉంటుంది అని వినాయకరావు చూపిన సుందర భవిష్యత్ చిత్రం అంతిమంగా రైతుకు ప్రయోజనకరమా? మదుపుదారుడికి ప్రయోజనకారమా అన్నది ఆలోచిస్తే అర్ధం అవుతుంది.

అటువంటి వినాయకరావు వూళ్ళో గుడి కట్టించాలని తలపెట్టాడు. అది ఊళ్లోకి ఎన్ని సమస్యలను తెచ్చిందో, వాటిమధ్య సంబంధం ఏమిటో నవలలోని కథాగమనాన్ని, సంభాషణలను జాగ్రత్తగా గమనించుకొంటూ పోతే అర్ధం అవుతుంది. గుడి నిర్మాణ ప్రతిపాదన ముందు అధికారం గురించిన సమస్యను తెచ్చింది. గుడి పై అధికారం అంటే ధర్మకర్తలుగా ఉండటం. ధర్మ కర్తలుగా ఉండటానికి అర్హులు ఎవరు? గుడి కోసం భూములు ఇచ్చినవాళ్లు. భూములు ఇచ్చినవాళ్లు ఎవరు? అవసరానికి మించి భూమి వున్నవాళ్లు. భూపరిమితి చట్టాలు నిర్ణయించిన వ్యక్తి కమతాల గరిష్ట పరిణామాన్ని మించి భూములు ఉన్నవాళ్లు. ఆ భూములను గుడులకు రాసెయ్యటంలో దాగిన అసలు ప్రయోజనం ప్రభుత్వాలు స్వాధీనంచేసుకొనటానికి మిగులు భూమిని లేకుండా చేయటమే కాకుండా ఆ గుడులకు ధర్మకర్తలుగా భూమి మీద పెత్తనం కోనసాగించగలస్థితి మిగుల్చుకొనటం. అలా మిగులు భూములు ఉన్నవాళ్లు బ్రాహ్మణులే కావటం వల్ల ధర్మకర్తలు అందరూ వాళ్ళే అయ్యే పరిస్థితి కనిపించేసరికి ఇతరులలో కలిగిన అసంతృప్తి ఫలితమే ఆ అధికారంలో తమవాటా ఏమిటన్నప్రశ్న. సంతృప్తి కరమైన సమాధానం రాకపోవటం వల్లనే రెండగుడి ఆలోచన. అంటే గుడి కేవలం భక్తికి, ఆధ్యాత్మిక సంతృప్తికి సంబంధించిన నిర్మాణం కాదు. దానితో ముడిపడి అధికారం వుంది.ఆ అధికారం ఆర్ధిక మూలం. దానికి కులంతో సంబంధం ఉంది. ఆ రకంగా అధికారం కోసం మొదలై కుల ప్రాతిపదిక మీద గ్రామంలో చీలికలకు దారితీసింది వినాయకరావు గుడి నిర్మాణ ఆలోచన. ఈ పరిణామాలను వినాయకరావు ఎలా వ్యాఖ్యానిస్తాడు? పాండురంగడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదని భగవంతుడిని బాధ్యుడిని చేసి చెప్తాడు.

వూళ్ళో వచ్చిన కుల చీలికలతో గైరమ్మ పండగకు రెండు గైరమ్మలు తీయటం రెండు పక్షాలవాళ్ళు కొట్టుకొనటం జరిగినప్పుడు గొడవలు వూళ్ళో వాళ్ళ అహంకారాలవల్ల వచ్చాయా? ఆ పైవాడి సంకల్పం వల్ల వచ్చాయా అని చర్చిస్తున్నట్లు వేసిన ప్రశ్నలలో పైవాడి సంకల్పం వైపే వినాయకరావు మొగ్గు వినిపిస్తుంది. దానికి కొనసాగింపుగా సాగిన సంభాషణలో వూళ్ళో గొడవలు పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడుతూ అందరినీ పిలిచి దేవాలయ ప్రాంగణంలో మాట్లాడుకుందాం. భగవచ్చిత్తం ఉంటే మనకళ్లకు కట్టిన మాయ అదే పోతుంది అని సామరస్యానికి ఒక మార్గం సూచించాడు కూడా. సామరస్యం కుదురుతుందా కుదరదా అంటే అది అతని అభిప్రాయం ప్రకారం ‘భగవచ్చిత్తం’ పై ఆధారపడింది. లోకాల్లో ఇన్నేసి మతకలహాలు వస్తున్నాయి పరమాత్ముడి ఆమోదముద్ర లేకుండా వస్తాయా? వచ్చినచోట జనం మళ్ళీ మామూలుగా బతికేలా ఆయన చెయ్యటం లేదా అని ఒక తర్కం కూడా చేస్తాడు. కర్తృత్వం భగవంతుడి పైకి నెట్టివేయటంలో క్రియలోని మంచి చెడుల ఫలితాలకు, పరిణామాలకు బోనులో నిలబెట్టటానికి వీల్లేని బాధ్యుడిని సృష్టించి ఎవరూ భౌతిక వాస్తవాలమీద మాట్లాడ కుండా చేయటం అందులోని వ్యూహం. ఇదంతా వ్యక్తిగా అతను పూర్తి తెలిసి చేసిన కుట్ర కాకపోవచ్చు. అయినా వర్గ సమాజ ప్రయోజనాల కొరకు రూపొందే మత భావజాల సంస్కృతిలో తన ప్రయోజనాలు అంతో ఇంత వున్న వాళ్లందరికీ అది ప్రచారం చెయ్యవలసినదే అవుతుంది.

దేవాలయనిర్మాణం పూర్తయ్యేసరికి కావలసిన పురోహితుడిని ఏర్పాటు చేయమని చెప్తూ దేవుడిపేర్న ఏదో కొంత భూమి పెట్టాం. దాని మీద వచ్చిందంతా ఇచ్చెయ్యమంటే ఇచ్చెయ్య లేం గానీ - అంటూ నెలజీతం, దానికి తోడు పళ్లెం లో వేసే కానుకలు ఉంటాయని వినాయకరావు చెప్పిన మాటలు దేవుడి పేర పెట్టిన భూమి మీద వచ్చే ఆదాయం కొంత దేవాలయానికి ఖర్చుపెట్టినా ఎంతో ఒకంత భూమి వ్రాసినవారి హక్కుభుక్తం అవుతుందన్న దానినే సూచిస్తాయి. ఆ తరువాతెప్పుడో ‘ఇందులో పదిరూపాయలుండబట్టే ఈ గుడి లెగిసింది’ అన్న కాపు యువకుడి మాటలు దాన్నే బలపరుస్తాయి. ఆ మాటకు హృదయంలో ఈటె దిగినట్టు విలవిలలాడిన వినాయకరావును ఓదారుస్తూ ఆలా అనగూడదని మందలిస్తున్న పెద్దలకు ఆ యువకుడు తాను అన్నదానిలో తప్పు లేదంటూ మిగులు భూముల్ని గవర్నమెంట్ తీసుకుంటుందని ముందే దాన్ని గుళ్ళూ, గోపురాల పేరున పెడితే దాని మీద వచ్చే ఆదాయమంతా దేముడు అడగొచ్చాడా అని సవాల్ చేయటం గుడి వెనుక ఉన్న అసలు ఆర్ధిక రాజకీయాన్ని బయటపెట్టేదే.

గుడి సమాజంలోని అసమానతల యథాతథస్థితిని కొనసాగించే వ్యవస్థ. వినాయకరావు పాత్ర ప్రవేశిస్తూనే కాలువ మీద పేనాం వేసే సూరయ్యను ముట్టుకోవద్దని కూతురిని హెచ్చరించటం సామాను ముట్టుకోవద్దని అతనిని వారించటం గమనిస్తే అస్పృశ్యత ను పాటించే వాడు అన్నది స్పష్టం. గుడి నిర్మాణంలో బ్రాహ్మణుల ధర్మకర్తృత్వమే అతనికి అభిలషణీయం అయింది. కాపులు వాటా అడగటం కంటగింపు అయింది. పరిస్థితి ని బట్టి ఒకళ్ళను తీసుకోక తప్పలేదు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ను కొనసాగించే పనిలో ఉన్న వినాయక రావు కి కూతురు సుందరి కాపు యువకుడు చిట్టిబాబుతో ఊరువదిలివెళ్లటం ప్రాణాంతకమే అయింది.

ఇలాంటి నిర్మాణాలకు అనుబంధంగా వచ్చే సమస్య నిర్వాసితత్వం. సోమాచారి జీవితం నెపంగా ఈ నవల ఆ సమస్యను కూడా సంబోధించింది. పోరంబోకు భూమిలో వేసుకొన్న గుడిసె అతనిది. అతని ఇంటి వెనకభాగంలోనే దేవాలయ నిర్మాణం ప్రారంభం అయింది. తమ ఇంటికి ఆనుకొనే గుడి కడుతున్నారని రాజు గొప్పై పోతుంటే బంగారంపై నియంత్రణ చట్టం వలన అతని తండ్రి సోమాచారి నగల తయారీ పనులు లేక అవసరాలకు కటకట పడుతుంటే కూరగాయ మొక్కలు పెంచుకొనే దొడ్డి అంతా గుడి ఆవరణలో కలిసిపోయి ఇంట్లో తిండికి, అమ్ముకొంటే మిగిలే అణా బేడా డబ్బులకు కరువు ఏర్పడిందని తల్లి లక్ష్మి దిగులుపడింది. “ పోరంబోకులో వాళ్ళు కట్టుకొన్న గుడిసె స్థలంలోకే దేవుడు కూడా జొరబడ్డాడు. మనుషుల ఆక్రమణ మీద కసుబుస్సు మనే గ్రామ పంచాయితీ దేవుడు ఆక్రమిస్తే భక్తితో కళ్ళు మూసుకుంది.” అని రచయిత ప్రభుత్వ పాలనా వ్యవస్థలు కూడా మనుషులకన్నా దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చే స్థితిలో ఉందని సోమాచారి పరిస్థితిని వ్యాఖ్యానించారు. లౌకిక ప్రసక్తిలేని రాజ్యాంగం ఉనికిలో ఉన్నట్లా లేనట్లా అన్న ప్రశ్న కలగక మానదు.

సోమాచారి నగల తయారీకి వాడుకొంటున్న ఇంటి వీధరుగుగది పూజారికి అవసరమవు తుందని ఖాళీ చెయ్యాలని మరిడీ రాజు చెప్పాడు. అది ఆమెకు దుఃఖ కారణం అయింది. ‘ఆ బాబొచ్చి గోల్డు కంట్రోలెట్టి’ ‘ఈ బాబొచ్చి ఈ గుడి పేరెట్టి’ కడుపు మీద కొట్టారని వలవలా ఏడ్చింది ఆమె. ఆ తరువాత అతని మరణపర్యంతం జరిగిన పరిణామాలు ఆమెను ఏడిపిస్తూనే ఉన్నాయి. పనిస్థలం పోయి పనిలేక కుటుంబ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కోసం సోమాచారి ఏ చట్టవిరుద్ధ కార్యకలాపాలలో భాగం అయ్యాడో కానీ అవి కూడా ఆమెకు దుఃఖకారణమే అయ్యాయి. అన్నం లేనప్పుడు అమ్మ ఏడ్చిందంటే అందులో ఏదో న్యాయం ఉందనుకొన్న రాజు అన్నానికి లోటు లేనప్పుడు కూడా తల్లి ఏడవటం ఎందుకో అర్ధం కాక బాధపడ్డాడు. సోమాచారి ప్రమాదానికి గురై మంచం పడితే సంసారం బరువును మోయటానికి తల్లి ఏవేవో పనులు చేస్తుంటే మంచం మీదినుండి లేవలేని తండ్రిని, చెల్లెలిని చూసుకోవలసినవాడైనాడు రాజు. అలా గుడి రాజు బాల్యాన్ని మింగింది. గుడి పెటకం పెట్టి మరిడీ రాజుగారి వీధరుగు గది ఖాళీ చేయించటానికి కారకుడని వినాయకరావు మీద సోమాచారికి వచ్చిన కోపం ప్రభావాలు రాజు అందమైన బాల్యాన్ని బాధామయం చెయ్యటం కూడా చూడవచ్చు. తండ్రి తనను రాంకుట్టి కోసం వాళ్ళింటికి వెళ్లవద్దని కొట్టి శాసించటం, తాను రాంకుట్టును కలవకుండా తల్లి వెనక్కు లాక్కుపోవటం తల్లుల కళ్ళు కప్పి కలుసుకొనటానికి ఆ పసివాళ్లు పడిన ఆరాటం ఇవన్నీ గుడిని అనుసరించి జరిగిన జీవనోపాధుల , మానవ సంబంధాల విధ్వంసాన్ని సూచించేవే.

ఈ పరిస్థితులలో న్యాయంగా స్పందించినవాళ్లు స్త్రీలే కావటం విశేషం. సోమాచారి దుస్థితికి కావాలని కాకపోయినా తండ్రి కారకుడని వినాయకరావు పెద్దకూతురు అనుకొంటుంది. తండ్రిని ప్రశ్నించలేదు కానీ వాళ్ళ ఆకలి తీర్చటానికి ఇంటినుండి కూరలు మొదలైనవి పంపుతూ తండ్రి చేసిన చెడుకు పరిహారం పరిహారం చేస్తున్నట్లు తృప్తి పడింది. చిన్న కూతురు సుందరి కాపులను ట్రస్టీలుగా పెట్టకుండా వూళ్ళో చీలికలు, గొడవలకు కారణమయ్యావని తండ్రిని సూటిగానే నిరసిస్తూ మాట్లాడింది.

2.2 . ‘ఆ మనిషి’ 1992 జూన్ చతుర నవలగా ప్రచురించబడింది. మతం గొడుగు కింద మనుషుల భయాలను , సందేహాలను సొమ్ము చేసుకొని ఆధిపత్యం చెలాయించటానికి పుట్టుకొచ్చే వివిధశక్తుల విన్యాసాన్ని, తద్వారా జరిగే జీవిత విధ్వంసాన్ని చిత్రించిన నవల ఇది. ఇందులో విధ్వంసమైన జీవితం శాంతది. శాంత చెప్తున్నట్లుగా ఉత్తమ పురుషలో సాగుతుంది నవలలో కథనం. మూఢవిశ్వాసాలతో జీవితాన్ని హింస పెట్టుకొనటమే వ్యక్తుల సుఖానికి, సమస్యల పరిష్కారానికి కుటుంబ శ్రేయస్సుకు అనుసరించదగిన మార్గంగా జీవిస్తున్న అత్తగారింటి మనుషుల మధ్య అనుక్షణం శారీరకంగా మానసికంగా చచ్చి బతకవలసిన అవమానకరం, దుస్సహమూ అయిన పరిస్థితుల నుండి ముగ్గురు పిల్లలతో బయటపడి పుట్టిల్లు చేరిన పాతికేళ్ళు నిండని యువతి శాంత. కథా రచయిత అయిన చిన్నబావగారిని తన వేదనాభరిత జీవితాన్నికథగా వ్రాయమని అడుగుతూఉంటుంది. చివరకు ఆయన సలహా మీద తానే వ్రాసిన తన జీవితానుభవాల కథనమే ‘ఆ మనిషి’ నవల అయింది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ప్రేమలు, బాధ్యతలు, వాటిని మింగేసే అధికారాలు, అహంకారాలు, అభద్రతల మధ్య జరిగే వింత నాటకం ఈ నవలలో చూస్తాం.

పిఠాపురం షుగరుమిల్లులో పనిచేసే గోవిందరాజు అయిదుగురు సంతానంలో చివరిది శాంత. ఇద్దరు అన్నలకు ఇద్దరు అక్కలకు చెల్లెలు. వాళ్ళెవరూ పూర్తిచేయని ఎస్సెల్సీ పూర్తి చేసి పై చదువులగురించి ఆశపడింది. తండ్రి ఆ విషయం పట్టించుకోకుండా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తండ్రిని ఆ ప్రయత్నం నుండి తిప్పి తన చదువుకు కుటుంబలో ఎవరో ఒకరు మద్దతు ఇయ్యకపోతారా అని ఎదురుచూసింది. కాలేజీకి వెళ్లి ఏ అప్రతిష్ట పనయినా చేస్తే నేనూ నా తమ్ముళ్లూ నూతిలో పడి చావాల్సిందే అని కేకలేస్తూ తండ్రి కూతురి కోరికను తిరస్కరించాడు. ‘ఆడపిల్లకు డిగ్రీ ఉంటే అంతకన్నా చదువుకొన్న వాణ్ని తేవాలి అంత శక్తిలేదు’ అన్నది అసలు వాస్తవం కాగా దానిని కప్పిపుచ్చటానికి ఇలా కుటుంబ ప్రతిష్టను కూలదోసే పనులకు దిగుతా రన్న దోషగుణాన్నిఆడపిల్లలకు ఆపాదించి అవమానించటం ఒక వ్యూహం అవుతుంది.

పెళ్లి సంబంధాలు వెతకటం, వాటి మంచి చెడ్డల విచారణ, కట్నాల బేరాలు, పెళ్ళివారి మర్యాదలు, అలకలు , ఇరుపక్షాల మధ్య పంతాలు, పట్టింపులు, ఒకరిపట్ల ఒకరికి లోకువ భావం - ఇలాంటివన్నీమధ్యతరగతి మానవ సంబంధాలలోని ప్రేమ రాహిత్య స్థితికి గుర్తులు.ఇక భార్యలుగా ఇళ్ళల్లో స్త్రీల బతుకు మరీ లోకువ. దానిని కప్పిపుచ్చుకొనే వ్యూహాలు ఎన్నో. బయట కష్టపడి వచ్చే మొగుడి అవసరాలు- అవి పేకాట వంటి దుర్వ్యసనాలు అయినాసరే - కనిపెట్టుకొని చూడటటమే ధర్మంగా నమ్మి, అలా నమ్మి జీవించటంలోనే తన బతుకు భద్రత ఉందని తెలిసి తనను తాను సిద్ధంచేసుకోనటమే కాక పిల్లల సేవలను కూడా అందుకే వినియోగించటం స్త్రీల జీవన సంస్కృతి అవుతుంది. భర్తల ఆగడాలు , లోపాలు దాచుకొని వాళ్ళను వెనకేసుకొని వచ్చి మాట్లాడటంలోనే తమ గౌరవం ఉందనుకొనే ఆత్మవంచనల పరవంచనల బతుకులు స్త్రీలవి. మొత్తంగా ఎవరికివాళ్లు ఎవరో నడిపిస్తే నడుస్తున్నట్లు చేసే సంభాషణ లేని, స్నేహం లేని సంసారాలు - జీవితమే ఒక నాటకం అనిపించేలా ఉంటాయి.

అవసరాలకు, వనరులకు మధ్య వ్యత్యాసం,దానిని అధిగమించటానికి మార్గాలు కనబడని, సాధనాలు సమకూడని ఒక స్థితిలో నిలబడటానికి ఆసరాగా మనుషులు పెంచుకొనేవి విశ్వాసాలు. అవి అంధవిశ్వాసాలై నమ్మకంలో భాగం అయినప్పుడు జీవితం ఎంత భీభత్సం అవుతుందో శాంత జీవితం చూపిస్తుంది. కట్నం దగ్గర బేరం కుదరక శాంతను వద్దనుకొన్నవాళ్ళు ఏడాది తరువాత ఆమే కావాలని కబురు చేశారు. ఎవరో పంగనామాలాయన ఆ పిల్లను చేసుకొంటే సిరి ఎత్తుతుందని చెప్పాడని , నాడీ గ్రంధాలు ఆమె అతనికి మూడుజన్మల నుండి పెళ్ళాం అని చెప్తున్నాయి అని వాళ్ళు ఆ అభిప్రాయానికి వచ్చారు. ఆ సంబంధం , ఆ నమ్మకాలు, వాళ్ళ పల్లెటూరి నజ్జుతనం, వాళ్ళడిగిన కట్నం ఇవేవీ ఆ సంబంధం చేసుకోవాలా వద్దా అని చర్చించి నిర్ణయం తీసుకొనటానికి వాళ్లకు ఉపయోగపడలేదు. చేసుకొంటాం అని రావటమే గొప్ప అన్నారు ఒకరు. మాట నిలకడ లేకపోవటం ఏమిటని మరొకరు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి .. వాటి నుండి మనం లాభం చేసుకోవాలనుకొనటం తప్పు అన్నారు ఇంకొకరు. వాళ్ళడగిన కట్నం ఇయ్యలేం కనుక అయ్యేదుంటే అవుతుంది కాకపోతే కాదు … నాడీ జాతకంలో ఉన్నది నిజమైతే పెళ్లి ఎవరూ ఆపలేరు అని వేరొకరు. దానికర్మ .. ఎవరూ తప్పించలేరు అని అన్నది చివరకు తల్లి. హేతువు మీద తర్కం మీద , ఆలోచన మీద ఆధారపడిన మనుషుల నిర్ణయాత్మక శక్తి నమ్మకాలు , జాతకాలు , కర్మ అనే వాటికి తాకట్టు పెట్టటం అలవాటుగా మారిన స్థితిలో జరుగుతున్నపెళ్లిళ్ల బండారం బయటపెడుతుంది ఈ సందర్భం.

పెళ్లిలో జరిగిన గొడవల ఒత్తిడి, నిద్రలేమి, సరిగా తిండి లేకపోవటం, ప్రయాణపు అలసట వీటితో పెళ్లయి అత్తగారింటికి వెళ్లిన శాంత కళ్ళకు చీకట్లు కమ్మి తూలిపడిపోతే ఆమె ఒంటి మీదికి ఎవరో వచ్చారని, సత్యనారాయణ స్వామి ఆగ్రహం అని కులదేవతకు చీరపెట్టలేదు అని, ఇంట చచ్చిపోయిన ఆడపడుచుకు చీరపెట్టలేదని తలా ఒక రకంగా కారణాలు వెతకటాన్ని, ఏవో మంత్రాలు చదువుతూ నీళ్లు చల్లటం వగైరా చర్యలచెప్పటం ద్వారా రచయిత జీవితాన్ని ఆవరించుకొని ఎంత మూఢత్వం పాలిస్తున్నదో సూచించారు. పెళ్లి అయ్యాక కొత్తకోడలితో ఇంటికి తిరిగివచ్చే మగపెళ్ళివాళ్ళు మర్నాడు గృహప్రవేశం, సత్యనారయణ వ్రతం, వెంకటేశ్వర దీపారాధన చేసుకొనటం ఇప్పటికీ అలవాటుగా కొనసాగుతున్న ఆచారమే. కొత్తదంపతులు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనే మొక్కులు కూడా కనిపించేవే. ఆ మోతాదుకు అలవాటుపడిపోయిన సమాజంలో అవి ఎబ్బెట్టుగా కనబడవు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క మోతాదులో ఉంటాయి అవి. ఒక మోతాదుకు అలవాటు పడ్డవాళ్లకు అంతకు మించిన మోతాదుకు తట్టుకోనటం కష్టంగానే ఉంటుంది.

బ్రాహ్మణ కుటుంబాలలో బహిష్టు మూడురోజులు ఆడవాళ్లు వేరేగా ఎవరినీ తగలకుండా కూర్చొనే ఆచారం ఉంది. శాంతకు అది పుట్టింట్లో సమస్య కాలేదు. అక్కడ స్నేహం, సమయానికి తిండి అమరటం వంటివి ఉన్నాయి. భర్తతోటి వంటరి కాపురంలో అతను వండి పెట్టేసి ఆఫీసుకు పోతే ఎవరు వచ్చి పెడతారా అని ఎదురు చూడవలసిందే. ఇరుగింటి పొరుగింటి వాళ్ళ సమయం మీద, దయ మీద అఆధారపడవలసి వచ్చిన ఆ వాతావరణం శాంతను బాధించింది. శనివారాలు ఉపవాసాలు ఉండటం అదొక అలవాటు. పుట్టింట్లో అది ఆనాడు మినపరొట్టో, ఉప్పుడు పిండో తినటంగా సరదాగా ఉండేది. భర్త శనివార దీక్ష రోజంతా మడితో, రాత్రి వేరేగా తానే వండుకొని తినటంగా ఉండేది. శాంతకు పుట్టింట్లో కూడా దేవుడు ఉన్నాడు కానీ అస్తమానం గుళ్లకు వెళ్లటంలేదు. తల్లి రోజూ ఇంట్లో దీపం పెడుతుంది. అంతే. భర్త వారానికి మూడుసార్లయినా తీసుకువెళతాడు. ఇలా అలవాటుగా కొనసాగుతున్న జీవితాన్ని పాలించే ఆచారాలను, విశ్వాసాలను భిన్న మోతాదులలో చూపించటం ద్వారా రచయిత వాటిని మనిషికి కలిగించే సౌకర్య అసౌకర్యాల దృష్ట్యా, మనుషులమధ్య సంబంధాలపై నెరిపే ప్రభావాల దృష్టా విలువ కట్టటం అవసరమని సూచించినట్లయింది.

మనిషికి వ్యక్తిగత స్థాయిలో ధైర్యాన్ని ఊరటను ఇయ్యగలిగిన నమ్మకాలు ఒకరకం. మనుషుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని దెబ్బతీసే నమ్మకాలు హానికరమైనవి. హానికరమైన నమ్మకాల విస్తృతి, ప్రచారం నానాటికీ పెరిగిపోవటం ఆధునిక యుగ శాస్త్రీయ జ్ఞాన వికాసాలకు జరుగుతున్న తీరని అపచారం. అది విమర్శకు పెట్టవలసినంత, నిరసించవలసినంత పెనుప్రమాదంగా పెరిగిపోతున్న విషయం వివినమూర్తి ముప్ఫయి ఏళ్ళక్రితమే గుర్తించగలిగారు కనుక ఈ నవల వ్రాసారు. కడుపుతో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లే అలవాటు శాంత అత్తవారింట లేదు. శాంత అత్తగారి తొలి ఆడబిడ్డ అయిదేళ్లకే చనిపోవటానికి, తరువాతి మగబిడ్డ కు మతి చలించటానికి కడుపుతో ఉన్నపుడు డాక్టర్ కు చూపించటమే కారణమని వాళ్ళ నమ్మకం. ఆ తరువాత కడుపులకు ఆమె డాక్టరుకు చూపించుకోలేదు కనుక వాళ్ళు బాగున్నారు. అన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా వదినగారు డాక్టర్ ను చూడకపోవటమే కారణం. ఇది శాంత అత్తవారింటి అనుభవం. ఆనవాయితీ. శాంత తల్లిదండ్రులు ముందుబడి వియ్యాలవారి అనుమతి తీసుకొని ఆనవాయితీ తప్పించారు.

శాంతకు పుట్టిన బిడ్డ పదకొండవరోజు ఎందుకో ఏడిస్తే వాళ్ళ చనిపోయిన అమ్మాయి వచ్చిందనటం బాలింతను బెంబేలు ఎత్తించటమే. ఐదోనెల బిడ్డను ఎత్తుకొని వచ్చాక ఇంట్లో వాళ్ళ ప్రవర్తనకు, భర్త మాటలకు దుఃఖం వచ్చి ఏడిస్తే అది కూడా చచ్చిన కూతురి ఏడుపే అన్నది వాళ్ళ నమ్మకం. పంగనామాలాయన చెప్పాడు కొడుకే పుడతాడు అనుకొన్న వాళ్లకు ఆశాభంగం కలిగిస్తూ శాంతకు రెండవ కానుపుకు కూతురు పుట్టింది. మూడవ కానుపుకు కొడుకు పుట్టాలని శాంతను ఒక మహిళాస్వామి దగ్గరకు తీసుకువెళ్లడం అత్తవారింటి మూఢవిశ్వాసాలకు, మనుషులను దేవుళ్లుగా చేసి ఆరాధించే వికృతికి పరాకాష్ట రూపం. పరీక్షలలో ఉత్తీర్ణత, ఉద్యోగ లాభం, పుత్రలాభం అన్నీ స్వాముల ప్రసన్నత వల్ల లభిస్తాయనుకొనటం, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి దాసానుదాసులు కావటం, ఆడించినట్లల్లా ఆడటం ఇదీ పర్యవసానం. మతం పేరుమీద చలామణిలోకి వచ్చే విశ్వాసాలకు చదువు, హేతుబుద్ధి, ఆత్మగౌరవం అన్నీ తాకట్టు పెట్టబడటం అత్యంత భీభత్సంగా సుదీర్ఘంగా ఈ నవలలో కథనం చేయబడింది. ఈ మొత్తం క్రమంలో ఆధ్యాత్మిక అహం తృప్తికి ఎక్కడా అవకాశం లేదు. ఉన్నదంతా భౌతికలోక ప్రయోజానాపేక్షలే. అందుకోసం తనను తాను, తాను ఇతరులను ఎంతైనా హింసించగల స్థాయికి మనిషి పతనం కావటం చూస్తాం. అందువల్ల నమ్మకాలు ఆశనుండి ఇంకా చెప్పాలంటే అత్యాశ నుండి దురాశ నుండి పుట్టి బలబడి అత్యంత హేయమైన రూపంలో వ్యక్తం అవుతాయన్నది సత్యం. ఈ విషాద వాస్తవానికి వ్యాఖ్యాత ఈ నవలలో శాంత చినబావ సుధాకరం.

“ … కొన్నిరకాల మానసికరోగులు తమని తామే దేవుళ్లుగా భావించుకోడమూ ఉంది. అలాంటి రోగులనీ , వాళ్ళ మీద జనానికి ఏర్పడుతున్ననమ్మకాలనీ, ఆకర్షణనీ కొందరు సొమ్ము చేసుకోడమూ ఉంది. కనుక ఆవిడ దొంగయినా అయ్యుండాలి. లేదా రోగైనా అయ్యుండాలి. దొంగయితే తోడుదొంగలు ఉండివుండాలి. రోగైతే ఆవిడను ఉపయోగించుకొనే దొంగలు ఉండాలి.” సుధాకరం అన్న ఈ మాటలు స్వాములు తయారుకావటమైనా, స్వాములను తయారుచేయటమైనా మానవ బలహీనతలను సొమ్ముచేసుకొనే వ్యాపారమే అని స్పష్టం చేశాయి. అహేతుకత, అత్యాశ లేదా దురాశ వంటి బలహీనతల నుండి జాతి మేల్కొనటమే ఆ కుటిల వ్యాపార కుడ్యాలను కూలగొట్టటానికి అవసరం. అయితే అదే సమయంలో అటువంటి స్వాములకు రాజకీయ నాయకుల, ప్రభుత్వ పాలకవర్గాల మద్దతు సమకూడుతూ అది అనేక ఆర్ధిక నేరాలకు కారణం అవుతుండటాన్ని కూడా సుధాకరం చెప్పగలిగాడు. మొత్తం మీద అంతా కలిసి ‘తాము నమ్మని నమ్మకాలని సామాన్య జనానీకం కోసం ప్రదర్శిస్తుంటారు’ అని ఏదైతే సుధాకరం చెప్పాడో అది మతంపేరిట, దేవుడి పేరిట చలామణిలోకి వచ్చే మూఢవిశ్వాసాలు, భ్రష్టాచారాలు వ్యక్తుల అజ్ఞానానికి, మూర్ఖత్వానికి సంబంధించినవి అని పైకి కనిపించవచ్చు కానీ కావని వాటికి రాజకీయార్థిక స్వభావం ఉందని సూచిస్తుంది. తప్పుడు భావాల, నమ్మకాల మత్తులో మనుషులు ఎంతగా మునిగిపోతే అంతగా ప్రజల సంక్షేమం కోసం, గౌరవకరమైన జీవితం కోసం ప్రభుత్వాల బాధ్యతను ప్రశ్నించే ప్రజాస్వామిక చైతన్యం తగ్గుతుంది. అది చాలు అధికార ఆర్ధిక వర్గాల దోపిడీ కొనసాగింపుకు. వివినమూర్తి 90 లనాటికే గుర్తించిన ఈ ధోరణి ఈ మూడు దశాబ్దాలలో మరింత బలపడింది. సామాన్య మానవుల జీవితంలోకి చొచ్చుకువస్తున్న మత సంస్థలు, మతభావజాల ప్రచార కూటములు, పీఠాధిపతులు, ప్రవచనకారులు ఈ నాటి విషాద వాస్తవం.

3. విద్యారంగ రాజకీయ నవల

‘ఉద్యమం’ నవలకు వస్తువు విద్యారంగ విషయం. 1990 జనవరి చతుర నవలగా వచ్చింది. ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చిననాడు ఈ నవల లో కథ మొదలవుతుంది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు తండ్రి తిట్టాడని మనసు కష్ట పెట్టుకొని ఇల్లువదిలి వెళ్లిన కొడుకు వాసును వెతుక్కొంటూ సీతారాం ఆ రాత్రి అతని క్లాస్మేట్, స్నేహితుడు వేణును కలుస్తాడు. బాగా చదివే పిల్లలు చాలామంది ఫెయిల్ కావటంతో అసలు పేపర్లు దిద్దటంలోనే ఎక్కడో తప్పు జరిగిందని దానిమీద విచారణ కోసం ఉద్యమం నిర్మించటంకోసం ఆ రోజే ప్రయత్నాలు మొదలయ్యాయని వేణు వల్ల తెలుస్తుంది. వేణు మొదలుపెట్టిన విద్యార్థి ఉద్యమంతో కలిసి సీతారాం చేసిన ప్రయాణం ఈ నవల. వూళ్ళో ఉన్న ఇంటెర్మీడియట్ కళాశాలల విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను, కళాశాల అధ్యాపకులను, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ను, మేధావులను కలుపుకొని, ఉత్తీర్ణతా శాతం తగ్గటంపై , విద్యార్థులకు న్యాయం చేయటం పై ఉద్యమం నడిచిన మూడు నెలల కాలంలో ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు, రాజకీయ నాయకులు తమ తమ ప్రయోజనాల కోసం ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయటానికి చేసిన ప్రయత్నాలు, పరిణామాలు ఈ నవలకు ఇతివృత్తం సమకూర్చాయి.

ఉద్యమాలు వ్యక్తుల అహం ఫలితమా? సామూహిక అవసరాల ,ప్రయోజనాల పరితృప్తికి మార్గాలా? వాటిలో వ్యక్తుల పాత్ర ఏమిటి? వాళ్ళను నడిపించే భావజాలం ఏమిటి? దాని ఆచరణ రూపాన్ని వ్యక్తులు నిర్ణయిస్తారా? పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతుంటాయా? ఉద్యమామలోకి నలుగురిని కలుపుకొచ్చుకొనటం ముఖ్యమా ? అందుకోసం కొన్ని విలువలను వదులుకోవచ్చునా? ఉద్యమాలు ప్రభుత్వ అధికార పీఠాలనుకదిలించే ప్రమాదం ఉన్నప్పుడు అనివార్యమయ్యే అరెస్టులు, జైళ్లు, హింస, హత్యలు వ్యక్తులను వెనకకు నడిపిస్తాయా? ఉద్యమంలో భగస్వామ్యం అధికార వర్గానికి దగ్గర చేస్తే సంతోషమా? ఉద్యమాలలో మేధస్సుకు , హృదయానికి ఉండవలసిన సంబంధ ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలను చర్చలోకి తెచ్చింది ఈ నవల.

అయితే ఇంటర్ మీడియట్ విద్యార్థులు ఇంటర్ పరీక్షాఫలితాల గురించి పేపర్లు మళ్ళీ దిద్దించటం , ట్యాబ్లేషన్ చేయించి మళ్ళీ ఫలితాలు ప్రకటించటం అన్న విషయం మీద మూడు నెలలు ఉద్యమాన్ని నడపటం, వేణు , వాసు, రమ వంటి ఇంటర్ విద్యార్థుల వయసుకు మించిన మేధో పరిణత స్థాయి, ఇంటర్ మీడియేట్ మాత్రమే అయిన వేణుకుకూతురు రాధను ఇచ్చి పెళ్ళిచేయటానికి సీతారాం సిద్ధపడటం ఇవన్నీ వాస్తవంగా జరగటానికి వీలున్న అంశాలుగా కనబడవు. అలాగే ఇంటెర్మీడియేట్ పరీక్షలు, ఫలితాలు యూనివర్సిటీ తోను , వైస్ ఛాన్సలర్ల నిర్ణయాలతోనూ ముడిపడి ఉన్నవి కావు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే సంస్థ. కాగా ఈ నవలలో దానిని యూనివర్సిటీ పరిధిలోకి ప్రవేశపెట్టడం ఎలా జరిగిందో మరి.

4. పారిశ్రామిక రంగ సంబంధి నవలలు.

వివినమూర్తి నవలలో మిగిలిన రెండూ పారిశ్రామిక రంగం నేపధ్యంగా మానవ జీవన సంబంధాలను, సంఘర్షణలను చిత్రించినవి.

4.1. అలసినకన్నులు1993 మే నెలలలో రచన మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన చిన్న నవల. అందులో కథ ఒకరోజు తెల్లవారుఝామున మొదలై అదే రోజు అర్దరాత్రి ఒంటిగంటకు ముగుస్తుంది ఈ నవలలో కథ. బెంగుళూరులో ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే మధ్యతరగతి మహిళ జోగాంబ అనుభవకోణం నుండి ప్రవర్తించే ఈ కథలో మధ్యతరగతి మనస్తత్వాలు, అసంతృప్తులు , అహాలు, సర్దుబాట్లు వ్యాఖ్యానించబడ్డాయి. జోగాంబతో పాటు అనేకమంది ఉద్యోగ మహిళల జీవితాలలోని వెలుగు నీడలను కూడా `ఈ నవల చిత్రించింది. మగవాళ్లకు పని స్థలం ఒకటే. అది కుటుంబ ఆర్ధిక అవసరాలను తీర్చే సంపాదనను ఇచ్చే బయటి నిర్మాణం. వ్యవసాయం కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఆఫీసు కావచ్చు, బడి కావచ్చు, - ఇంకేదైనా కావచ్చు. ఈ నవలలో జోగాంబ భర్త సుందరానికి అలా ఒక ఆఫీసు ఉంది. ఆడవాళ్ళకు అలాకాదు. వాళ్ళ తొలి పనిస్థలం ఇల్లు. ఉద్యోగానికి బయటకు వెళితే అది మరొక పనిస్థలం. రెట్టింపు పనిభారం మోయవలసినవాళ్లు స్త్రీలు. ఆ రకంగా ఈ నవలలో ఇతివృత్తం రెండు పనిస్థలాలను ఆవరించుకొని ఉంటుంది.

జోగాంబ బెంగుళూరులో ‘మణీ ప్రెజర్ గేజస్’ అనే చిన్న ఫ్యాక్టరీ లో ఉద్యోగి. కానీ అదొక్కటే కాదు, ఆమెకు ఇల్లు కూడా ఒక పనిస్థలమే. భర్తకు, ముగ్గురు పిల్లలకు అన్ని అమర్చిపెట్టవలసిన పని ప్రదేశం అది. పిల్లలను చదువులకు లేపటం దగ్గర ఉదయం నాలుగున్నరకు మొదలవుతుంది ఆమెరోజు. ఒక వైపు వాళ్ళ చదువులను పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయం చేస్తూ అదిలిస్తూ , తిడుతూ ఇంటికి కావలసినవి తెప్పించుకొంటూ టిఫిను తయారు చేసి భర్తకు పిల్లలకు పెట్టి , వంట పూర్తి చేసి అందరికీ కారీర్లూ సర్ది పంపించి తనకేమో కాఫీ తాగటానికి, టిఫిన్ తినటానికి సమయం దొరకక లంచ్ బాక్స్ తో పాటు టిఫిన్ పొట్లం కూడా బాగులో వేసుకొని ఎనిమిదింటికల్లా గడప దాటి బస్ స్టాండుకు పరిగెత్తటం తో మొదలవుతుంది ఆమె దిన చర్య. మళ్ళీ చీకటి పడేవేళకు ఇల్లుచేరి పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలు చూస్తూ ఇల్లు సర్ది , అన్నం వండి , పిల్లలకు పెట్టి, అంట్లు తోమి, ఆఫీసులో గొడవలకు మనసు పాడయిందని తాగటానికి బయటకు వెళ్లివచ్చిన మొగుడికి ఆమ్లెట్ వేసి వేడివేడిగా వడ్డించి, తాను చల్లటి అన్నం తిని , కంచాలు తీసి , వంటిల్లు సర్ది అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంటే, నిద్ర కళ్ళమీదకు ముంచుకువస్తుంటే కూడా భర్త కోరిక తీర్చి సంతోషపెట్టటానికి తనను తాను సంసిద్ధం చేసుకొనటం ఆ దినచర్యలో చివరి ఘట్టం. నిద్ర సరిపోని తప్పనిసరి మెలకువలతో నిత్యం అదే చిరాకులతో, విసుగులతో, తనను తాను తిట్టుకొంటూనో, పిల్లలను తిడుతూనో, కొడుతూనో ఆమె గానుగెద్దు జీవితం నిరంతరం అని ఆ ఒక్కరోజు జీవితాన్ని నమూనాగా చూపించి సూచించారు రచయిత.

బయట బస్సుల్లోనూ, బజార్లలోనూ , పనిచేసే చోట జోగాంబ ఎలా ఉంటుంది? తన లాంటి చిరుద్యోగులు, తనతో పాటే బస్సులో ప్రయాణించే ఆడవాళ్లను చూసి ఈర్ష్య పడుతుంది. గవర్నమెంటు ఆఫీసులో పనిచేస్తున్న గర్వం అని సుచిత్ర గురించి అనుకొంటుంది,రత్నతో ఆమె ప్రవర్తన గురించి తీర్పులు ఇస్తున్నట్లుగా అవమానకరంగా మాట్లాడటానికి వెనుకాడదు. నలుగురి కష్టసుఖాలు పట్టించుకొని స్నేహం గా మాట్లాడి సానుభూతిని చూపే రత్న చొరవను తెలివిని బతకనేర్చిన గడుసరితనంగా లోలోపలే నిర్ధారించుకొంటుంది. పెళ్లి కాక దుఃఖపడుతున్నదని ఆమె మీద జాలిని మరొక స్త్రీ దగ్గర ప్రదర్శిస్తుంది. పిల్లలను బడికి పంపి చదివించకుండా పనుల్లో పెట్టిన మరొక సహ ప్రయాణీకురాలి ముందు తన పిల్లల చదువు, బుద్ధిమంతనం గురించి గొప్పగా చెప్పుకొంటుంది. ఆవిడకన్నా తన జీతం ఎక్కువని చెప్పుకొంటూ యజమానికి తన మాట అంటే గురి అంటుంది. తన ఫ్యాక్టరీలో ఆమెకు ఉద్యోగం ఇప్పించేస్తానని కూడా వాగ్దానం చేస్తుంది.ఆవిడకు తనజీతం ఐదువందలని చెప్పిన జోగాంబ, ఫ్యాక్టరీ వర్క్ షాప్ లో పనిచేస్తున్నప్పుడు ఇన్స్పెక్షన్ కు వచ్చిన అతనితో ఎనిమిదివందలు ఇస్తారని చెప్పింది. తోటి కార్మికురాలు నంజుండమ్మను జాతి తక్కువ మనిషి అని తక్కువ చేస్తుంది. ఆమెను ఇతరులను అలాగాజనం , అలాగా బుద్ధులు అని ఈసడించుకొంటుంది. సూపర్ వైసర్ తివారీని తనలాగే జాతి మనిషి అని కలుపుకొనటానికి ప్రయత్నిస్తుంది. ఆడవాళ్లు నవ్వుతూ మాట్లాడితే , చెయ్యి తగిలిస్తే మగవాళ్ళు కరిగిపోయి ఏ పనైనా చేసేస్తారని తానే నమ్మి చెప్తుంది. ఆ పనే నువ్వు చేస్తున్నావా అని ఎవరైనా అంటే తన శీలానికి జరిగిన అపచారంగా దుఃఖపడుతుంది.

ఈర్ష్య, అసూయ ఎదుటి వాళ్లకు ఉన్నవి తనకు లేవే అన్న అసంతృప్తి నుండి పుట్టే అవలక్షణాలు. అసంతృప్తి అవసరాలు పూర్తిగా తీరని మధ్యతరగతి లక్షణం. సుచిత్రకు తనకు లేని ఒంటి నాజూకు ఉంది. తనకున్న పిల్లల చాకిరీలేదు. తనకు లేని ప్రభుత్వ ఉద్యోగం భద్రతాయుతమైన జీవితం ఉన్నాయి. అవి చాలు జోగాంబ కు ఆమె పట్ల అసహనం కలగటానికి. బస్సులో కలిసి రోజూ ప్రయాణం తప్ప ఆమెతో తనకే సంబంధమూ లేకపోయినా ఆ అసహనాన్ని అలాగే పరిపోషించుకొంటూ ఎందుకు వచ్చింది? జీతం మీద భర్త పెత్తనం, అనుమానం ఆమెకు ఎంత హింసాకరంగా ఉన్నాయో తెలిసినా సానుభూతి చూపలేనంత అక్కసు ఎందుకు? తన జీవితంలోని గతానుగతికత్వం గురించిన నిస్పృహ వలన. తనజీవితాన్ని నూతనంగా తీర్చిదిద్దుకునే ఆర్ధిక వెసులుబాట్లు లేకపోవటం వలన. అందుకు కారణాలు తెలియక పడే నిస్సహాయ ఆవేదన వలన. అదేసమయంలో తన బతుకు స్థితికి తానే జాలిపడుతూ , తనబతుకు ఇతరుల జాలికి, సానుభూతికి వస్తువుగా ఉందన్న స్పృహ అవమానకరంగా అనిపించినప్పుడు ఆ వాస్తవాన్ని మరచిపోవటానికి , మభ్య పెట్టుకొనటానికి తెలియకుండానే ఆమెలో అభివృద్ధి చెందిన రక్షణ కవచం తాను ఇతరులకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాను అనే భ్రమా కల్పన. మోజాహిదా కు తను పనిచేస్తున్న ఫ్యాక్టరీ లో పని ఇప్పించగల పరపతి, తన ఫ్యాక్టరీ లోనే తోటి కార్మికులను పని నుండి తొలగించ కుండా అడ్డుపడగల పరపతి యాజమాన్యం దగ్గర తనకు ఉన్నాయని నమ్మకంగా చెప్పటం అటువంటిదే. ఇంట్లో వత్తుల స్టవ్వు , హ్యాండిల్స్ విరిగిన కుక్కర్ తప్ప లేని జోగాంబ గ్యాస్ స్టవ్ గురించి కలలు కనే జోగాంబ తనకు లేనివాషింగ్ మిషన్లు, మిక్సీలు ఆస్తులు, ఇల్లు, సౌకర్యాలు ఉన్నట్లు గొప్పలు చెప్పటమైనా,తన జీతాన్ని ఉన్నదానికన్నా ఎక్కువచేసి చెప్పటమైనా అసంతృప్త, అశాంత అహాన్ని చల్లబరచుకొనే మధ్యతరగతి లక్షణమే.

తనలో మసులుతున్నదేమిటో, తాను మాట్లాడుతున్నదేమిటో, రోజువారీ చిన్నచిన్న పనులు సాధించటానికి ఆడదాని గా తన మాటను చూపును వాడుకొంటూ తాను చేసుకొంటున్న ఆత్మవంచన ఎంతటిదో బుద్ధికో , హృదయానికో తట్టినప్పుడు మేల్కొన్న మనిషి తనం నిలవనీయని క్షణంలో జోగాంబ నీటికుండలా విచ్చిపోయింది. సూపర్ వైజర్ తివారీ తనకు దగ్గరవాడని చెప్పుకొనటంలో తన స్థాయి ఏదో పెరిగినట్లు ఎవరినైనా ఉద్యోగాలలో పెట్టించగల, ఉద్యోగాలనుండి తీసెయ్యకుండా అడ్డుపడగల సామర్ధ్యం సంపాదించినట్లు తృప్తి పడే ఆమె మీద మొదటి దెబ్బ ఆఫీసులో సాటి కార్మికురాలి నుండి పడింది. తివారీతో తనకేదో లైంగిక సంబంధం ఉన్నట్లు ఆమె మాట్లాడిన మాటలకు భోరున అక్కడే ఏడ్చేసింది. ఇంట్లో భర్త నుండి తగిన ఓదర్పూ లభించలేదు. తెల్లవారుఝాము నుండి చేస్తున్న చాకిరీతో శారీరకంగా, తాను జీవిస్తున్న పరిస్థితుల గురించిన స్పృహతో మానసికంగా అలిసిపోయిన జోగాంబ ‘మీవల్లే నా బతుకిలా కాలిపోయింది’ అంటూ భర్తను దోషిగా నిలబెట్టింది. మూడ్ బాగాలేకపోతే తాగటానికి, బూతు సినిమాలు చూడటానికి మగవాడికి అవకాశం ఉన్న సమాజంలో భర్తను అనుసరించి నడవాలని శిక్షణ పొందివచ్చి ఉన్న వనరులలో ప్రధమ భాగం భర్త సౌకర్యాలకు , సౌఖ్యాలకు అని నమ్మి ప్రవర్తించే ఆడదానికి మూడ్ బాగాలేకపోతే సరైన ఓదార్పు లభించకపోతే గుండె పగిలి ఏడవటమే మందు అవుతుంది. జోగాంబ ఏడుపు అదే.

కుటుంబాన్ని పోషించగల సంపాదనలేక పోవటంవల్ల కలిగే అసంతృప్తి, అశాంతి, వాటి నుండి సహోద్యోగుల పట్ల కలిగే అక్కసు, వాటినుండి పారిపోవటానికి యథేచ్ఛగా లభిస్తున్న మద్యం మత్తుకు బానిసకావటం తన జబ్బులు అని సుందరమూ లోలోపల అనుకోని దుఃఖపడ్డాడు. ఆ రెండు దుఃఖాలను పక్కపక్కనే చూపిస్తూ రచయిత వ్యక్తి ప్రవర్తనకు కారణమైన సామూహిక పరిస్థితులు, వ్యక్తిగత ప్రత్యేకతలు వేరు చేసి చూసే మేధస్సు అవసరాన్ని గుర్తించి చెప్పారు. వ్యక్తులను సానుభూతితో అర్ధం చేసుకొనటానికి అది ఉపయోగపడుతుందని ఆయన భావన.

థర్డ్ ఫారం చదువుతో పెళ్లి చేసుకొని బెంగుళూరు కాపురానికి వచ్చిన జోగాంబ పిల్లలతో పెరిగిన సంసారానికి భర్త సంపాదన సరిపోని స్థితిలో అతని ప్రోద్బలం మీద ఫ్యాక్టరీ పనిలో చేరింది. మధ్యతరగతి అహం కార్మికవర్గంతో కలిసి పోయేలా చేయలేకపోయింది. వాళ్ళతో కలిసి పనిచేస్తూనే అలగా జాతి అంటూ తన ఆధిక్యతను ప్రదర్శించుకొనటానికి అనుక్షణం యాతన పడింది. పనిలో భాగస్వాములైన సాటి కార్మికులను ప్రేమించలేకపోయింది. వాళ్లకు వ్యతిరేకంగా సూపర్ వైసర్ కు చాడీలు చెప్పటమో, సూపర్ వైసర్ కు ఎదురు చెప్పకుండా లొంగిఉండాలని సాటివాళ్లకు చెప్పటమో చేసిన జోగమ్మ కార్మికవర్గ వ్యతిరేక వైఖరి , యాజమాన్యవర్గాల అనుకూల ధోరణి మధ్యతరగతి స్వార్ధంలో భాగమే. అదే క్రమంలో ఆమె తాను చేస్తున్న పనినీ ప్రేమించలేకపోయింది. ఫ్యాక్టరీలు నంజుడమ్మ వంటివాళ్లకు పని చూపించి పుణ్యం కట్టుకున్నాయి అంటూ తనలాంటివాళ్లకు అది కాలక్షేపం కోసమే అని చెప్పటంలో అదే కనబడుతుంది. ఈ విధమైన జోగాంబ ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఆ ఒక్క పని దినంలోనే ఫ్యాక్టరీ కార్మికుల జీవన సమస్యలను గురించిన అవగాహనను కలిగించటం ఈ నవల ఇతివృత్తంలోని ప్రత్యేకత.

అల్యూమినియం రేకులను కత్తిరించి ప్రెస్ చేసి కావలసిన మరలు కోసి ప్రెజర్ గేజ్ కప్పులు తయారుచేసే ఆ ఫ్యాక్టరీ వర్క్ షాప్ లో పనిచేసే నలభై మందిలో ఇరవై ముగ్గురు స్త్రీలు అని వాళ్ళందరూ విడిభాగాలను అసెంబుల్ చేసే పనిలో వున్నారని మొదట్లోనే సమాచారం ఇచ్చిన రచయిత ఆ తరువాత అంతా ఆడవాళ్లే ఎందుకు వున్నారు అన్న ప్రశ్నను ముందుకు తెచ్చి నంజుడమ్మ చేత సమాధానం చెప్పిస్తారు. ‘చవక గనక … నోరు మూసుకు పనిజేస్తారు గనక’ అన్నది నంజుడమ్మ సమాధానం. ఫ్యాక్టరీ పనికి తోడు ఉదయం ఆకు కూరలు, సాయంత్రం బజ్జీలు అమ్మి పిల్లలను పోషించుకొంటున్న ఒంటరి కార్మికవర్గ మహిళగా శ్రమ దోపిడీ గురించి పొందిన అనుభవం నుండి చెప్పిన మాట అది.. చిన్న కంపెనీలు ఆడవాళ్లను ఎక్కువగా తీసుకొనటానికి గల కారణాలు కార్మికుల మధ్య చర్చకు వస్తాయి. స్త్రీల జీతాలమీద కుటుంబాలు ఆధారపడి లేవు, పెళ్లికాని ఆడపిల్లలు పెళ్లిలోగా తమ చిన్నచిన్న అవసరాలు తీర్చుకొనే ఆదాయం కోసం ఈ ఉద్యోగాల్లోకి వస్తారు. కూలీకి వేళ్ళ లేక పెద్ద ఉద్యోగాలు రాక ఈ మార్గం పుట్టినవాళ్ళు. పెళ్లయి పిల్లలున్న వాళ్ళు ఎంత జీతం వస్తే అది భర్త చేతికి ఇచ్చేవాళ్ళు. అది తాగుతారా? పిల్లలకు పెడతారా అంటే అది ఆ భర్త ఎంపిక .. నిర్ణయం. ఇదీ వాళ్ళనాదరూ తేల్చింది.అందుకే యూనియన్లు, సమ్మెలు వాళ్లకు అవసరం లేనివే అవుతాయి. స్త్రీలను ఏకం కాకుండా చేసే మతాలు,కులాలు, భాష గురించి కూడా వాళ్ళు ప్రస్తావిస్తారు. స్త్రీలు సంఘటితం కాకుండా చేసే సంస్కృతి చాపకింద నీరులా విస్తరించిన వాస్తవం గురించిన అవగాహన ఇది.

వర్క్స్ షాప్ లో పని వాళ్ళ మీద సూపర్ వైజర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని ధిక్కరించిన మెషిన్ మాన్ థామస్ కార్మికులకు ఒక యూనియన్ ఉండాలని ప్రతిపాదన పెట్టినప్పుడు రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. ఆడవాళ్ళ మీద బతికే ఇలాంటి కంపెనీలలో యూనియన్ పెట్టాలంటే వాళ్ళే అడ్డంకి అవుతారు… వాళ్ళతో మాట్లాడి చూడు అని ఒకళ్ళు సలహా ఇచ్చారు. మగాళ్లలా వాళ్లంతా ఒక దగ్గర కాక వేరువేరు గుంపులుగా కూర్చొనటం అతను గమనించాడు. పాతికేళ్ల వయసులోపు వాళ్ళు కూర్చున్న గుంపు దగ్గరకు పోయి యూనియన్ పెట్టుకొనటానికి సాయంత్రము ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం అంటే అమ్మ ఏమైనా అంటుంది అని ఒకళ్ళు , నాన్నను అడిగి చెప్తానని మరొకళ్ళు విముఖత వ్యక్తం చేసినవాళ్ళే. నంజుండమ్మ వాళ్ళు కూర్చున్న చోటికి వెళ్లి న్యాయమైన జీతాలు , జులుం లేని జీవితం కావాలంటే యూనియన్ పెట్టుకోవాలని చెప్తుంటే మనపనికి ఇంతకంటే జీతాలు ఎక్కువ ఎవరిస్తారని , మనకు ఆధారం చూపి పోషిస్తున్న వాళ్ళతో తగాదా పెట్టుకోకూడదని మనకి నచ్చకపోతే మనమే పని మానుకొని మరొకచోటికి వెళ్లిపోవాలని జోగాంబ మాట్లాడిన మాటలు కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైనవే.ఆమె అక్కడ ఇన్నేళ్ల నుండి పని చేస్తున్నదో కానీ తాను కార్మిక వర్గంతో మమేకం కాలేకపోయింది. అందుకు అవరోధంగా ఉన్న మధ్యతరగతి వర్గస్వభావం వదిలించుకొనవలసినది అని గ్రహించలేకపోయింది. శ్రమ విలువను గుర్తించ గలిగితేనే శ్రమ ఫలితం సరిగా పొందగలుగుతున్నామా లేదా అన్న వివేకం అభివృద్ధి చెందేది. అందుకు ఆమెకు అవకాశాలు ఇంకా తెరుచుకోలేదు.

నంజుండమ్మకు ఆ తెలివిడి ఉంది. మొగుడు చెప్పినట్లు వింటూ ఆదరిస్తే పొంగిపోతూ నిరాదరణకు ఏడుస్తూ గడిపే మధ్యతరగతి స్త్రీ అవసరమైనప్పుడు తమ హక్కులకోసం పోరాడలేని స్థితిలో మిగిలిపోవటాన్ని గురించి దిగులు పడుతుంది. జోగమ్మ కు ఆ విషయమై వివరించాలని ఆరాటపడుతుంది. ఆ ఆరాటం ఒక రూపం తీసుకొనలేదు. ఆమె ప్రదర్శిస్తున్న సహోదరీ తత్వాన్ని అర్ధం చేసుకొని స్వీకరించగల చైతన్య స్థాయికి జోగాంబ ఎప్పటికి ఎదుగుతుందో తెలియదు. మారవలసిన శక్తులను , కలిసినడవవలసిన మనుషులను దూరం నుండి చూపిస్తుంది ఈ నవల.

4.2. పాడుకాలం నవల 1995 అక్టోబర్ ఆహ్వానం పత్రికలో ప్రచురించబడింది. విశాఖ పట్నంలో మీనాంబికా ఇండస్ట్రీస్ లో పనివాళ్లమధ్య సంబంధ వైరుధ్యాలను, కంపెనీ అధికారులకు పనివాళ్లకు మధ్య సంబంధ వైరుధ్యాలను చుట్టుకొని ప్రవర్తిస్తుంది ఈ నవలలో ఇతివృత్తం. ‘పాడుకాలం’ ఎవరికి? పనివాళ్లకా కంపెనీ అధికారులకా? అంటే పనివాళ్లకే అన్నది స్పష్టం. అది నవల ప్రారంభం నుండి అంచలంచెలుగా స్థాపించబడుతూవచ్చింది. “పరుగులాంటి నడకతో మీనాంబికా ఇండస్ట్రీస్ పనివాళ్ళు సుడిగుండంలోకి దూసుకు పోతున్నట్లు పోతున్నారు”. అన్న వాక్యంతో పరిశ్రమలు తొలి భారత ప్రధాని నెహ్రు చెప్పినట్లు ఆధునిక దేవాలయాలుగా లేవని, కార్మికుల జీవితాలను మింగేసే సుడి గుండాలను దాచిన ప్రవాహాలుగా ఉన్నాయని చెప్పినట్లయింది.“బొయ్యమని ఫ్యాక్టరీ సైరన్ మొదలయింది. అది రమ్మని ఆహ్వానిస్తున్నట్లూ లేదు. బతిమాలుతున్నట్లూ లేదు. వస్తావా పీక తీసెయ్యనా - అని బెదిరిస్తున్నట్లున్నది.” అన్న వాక్యం తో ఫ్యాక్టరీల పని తీరు కార్మికులతో స్నేహపూరితమైనది కాదని సూచించినట్లయింది. ఈ పరిస్థితులలో జరిగేదేమిటి? కార్మికుల మధ్య శత్రు వైరుధ్యాలను పెంచిపోషించటం, బానిస సంకెళ్లు మరింత బిగుసుకొనటం. అది ఎలా జరిగిందో నిరూపించటం ఈ నవలలో అసలు కథ. ఇరవై మూడేళ్ళ తరువాత దాని పరిణామాన్ని సమీక్షించటంగా నవల ముగుస్తుంది. ఆ ముగింపులో ప్రైవేటైజేషన్ ప్రస్తావన ఉంది. నూతన ఆర్ధిక సంస్కరణలతో భారతదేశంలోకి ప్రపంచీకరణతో పాటు ప్రయివేటీకరణ ప్రవేశం జరిగింది 1990 లలో . అప్పటికి ప్రధానకథ జరిగి 23 ఏళ్ళు అయిందంటే అసలు కథ 1967, 1968 ప్రాంతాలది కావాలి.

మీనాంబికా ఇండస్ట్రీస్ కి కొత్తమానేజర్ గంగూలీ రావటంతో మొదలవుతుంది నవల. అంతకు ముందరి మేనేజర్ ను కొట్టి అక్కడ నుండి వెళ్లిపోవటానికి కారణమైన వాళ్ళు ఎవరో ఎవరూ నోరువిప్పి చెప్పని పరిస్థితులలో కొత్తగా వచ్చిన ఆ మేనేజర్ అలా అందరినీ నియంత్రించి నడిపేవాడెవడో తెలుసుకొనాలన్నలక్ష్యంతో పని మొదలు పెట్టాడు. ఫ్యాక్టరీ ఉద్యోగుల మధ్య ఐక్యతను పోగొట్టటం మొదటి కార్యక్రమం. ఓవర్ టైం పని కల్పన ద్వారా పై రాబడి అవకాశాలు - చూపించి ఆశకల్పించటం అందుకు ఎన్నుకొన్న మార్గం. అవసరాలు, అప్పులు జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్నవాళ్లకు అది జీవితాన్ని గెలుచుకొనటానికి ఒక మార్గం. దానికి అలవాటు పడిన తరువాత ఓవర్ టైం అందరికీ సమానంగా ఇయ్యటం కాదు, పని చేసే సామర్ధ్యం ఉన్నవాళ్లను గుర్తించి ఇయ్యటం అన్న సవరణ తెచ్చి ఒకళ్ళకు ఇచ్చి మరొకరికి ఇయ్యకుండా అభద్రతాభావంలోకి నెట్టటం, ఒకరినొకరు అనుమానించుకొంటూ దూరమయ్యే పరిస్థితులు కల్పించటం అంతిమ లక్ష్యం. పనివాళ్లకు ఓవర్ టైం అవకాశాలు కల్పిస్తున్నట్లు కనబడుతూనే మామూలు సమయంలో ఎక్కువపని చేయించుకొనటం, ఎక్కువసేపు ఫ్యాక్టరీ కి కట్టేసి ప్రపంచం తెలుసుకొనటానికి సమయం ఇయ్యకుండా మరమనుషులుగా తయారు చేయటం ఏకకాలంలో సాధించబడే రెండు ప్రయోజనాలు.

ఫ్యాక్టరీ పనివాళ్ళ మధ్య ఐక్యతను భగ్నం చేయటానికి ఎంచుకోబడిన రెండవ కార్యక్రమం ఎక్స్ పాన్షన్ స్కీమ్.అంటే పదోన్నతులు కల్పించటం. అర్హులందరికీ అందుతాయని అంటూనే సర్వీస్ సీనియారిటీని కాక అర్హత నిర్ధారణకు పరీక్షల పద్ధతి ప్రవేశ పెట్టి, పదోన్నతిని ఆశించే వాళ్ల మధ్య అనవసరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించి, అభద్రతను పెంచి ఒకళ్ళకొకళ్ళు కాకుండా చేయటం అందులో ఉద్దేశం. ఇలా స్వప్రయోజనాల వెంపర్లాటలో, స్వార్ధంలో సమష్టితత్వం కోల్పోవటం, ఒక్కడి కోసం అందరు నిలిచే వ్యక్తిత్వం విధ్వంసం కావటం ఆశించిన ఫలితం. దానిని రామ్మూర్తి విషయంలో మరీ స్పష్టంగా చూడవచ్చు. దాని పరాకాష్ట రూపం అతను “ అంబళ గన్ దొరకి షూటింగ్ ఏసింది మోహన్రావు వాడి మాటల్లో పది నేనూ పక్కనున్నాను. అందుకని వాడు నన్ను బెదిరిస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలి” అని గంగూలీకి ఉత్తరం రాయటం. నవల ప్రారంభంలో అది అందరికీ తెలిసిందే అయినా ఎవ్వరినోటా బయటకు రానిది రామ్మూర్తి ద్వారానే బయటపడటం కార్మికవర్గం బానిస సంకెళ్లు మరీమరీ బిగుస్తుండటాన్నే సూచిస్తుంది. మనలో వాడి గురించి మనం ఆలోచించకపోతే ఎలా అనే అచ్చమైన కార్మిక మనస్థత్వానికి , సమిష్టి తత్వానికి ప్రతినిధి వంటి మోహనరావు రామ్మూర్తి దిగజారిన లోతులకు విలవిల లాడిపోవటం చూస్తాం. ఆ బాధలోనే అతని తాగుడు ఎక్కువై అల్సర్ కు కారణమై ఉంటుంది. ఐదారేళ్లకే చనిపోవటం అందువల్లనే జరిగి ఉంటుంది.

ఫ్యాక్టరీ ఉద్యోగవ్యవస్థ పిరమిడ్ నిర్మాణంలో అట్టడుగున ఉత్పత్తి దారులైన కార్మికులు ఉంటే అత్యున్నత స్థానంలో ఉండేది మానేజర్. ఎక్సిక్యూటివ్ లు, గుమాస్తాలు, సూపర్ వైజర్లు, ఫ్లోర్ మెన్ లు తదితరులు వరుసగా పైనుండి కింది స్థాయిలకు చెందినవాళ్లయితే అట్టడుగున ఉండేది ఉత్త్పత్తి శక్తులైన కార్మికులు. వాళ్ళ నుండి మిగిలిన ఉద్యోగులను తరతమ భేదాలతో వేరుచేసే నిర్మాణం అది. కిందివాళ్ళమీద పైవాళ్ళకి, వాళ్ళ మీద ఆ పై వాళ్లకు ఇలా పెత్తనం అమలయ్యే వ్యవస్థ. తద్వారా సమూహాన్ని, సమూహ బలాన్ని, నైతికతను నీరుకారేట్లు చేయటం రహస్య ఎజండాగా కార్మిక వర్గ శత్రువు అయిన పెట్టుబడి దారీ వర్గం, దానిని అమలు చేసి లాభాలలో కొంత జీతంగా పొందే ఉద్యోగవర్గం పని చేయటం వర్గ సమాజ వాస్తవం.ఇది పెట్టుబడి దారీ వర్గానికి, దాని కొమ్ము కాసే ఉన్నత ఉద్యోగ వ్యవస్థకు ఈ సమాజం ఈ రకంగా బాగా అర్థమైంది కనుక భవిష్యత్తు మీద వాళ్లకు నమ్మకం చెక్కు చెదరనిది. మీనాక్షి ఇండస్ట్రీస్ కు ఒకప్పుడు మే నేజర్ అయిన రామోస్ మోటార్స్ జనరల్ మేనేజర్ గంగూలీ టివి ఇంటర్వ్యూ విషయాలు పెట్టుబడి దారుకు, ప్రయివేట్ సంస్థలకు, ప్రయివేట్ పెట్టుబడికి “ఉందిలే మంచికాలం ముందూ ముందూనా” అన్న భరోసాను ఇస్తాయి. ప్రయివేటేజేషన్ ను ఆనాడు వ్యతిరేకిస్తూ సమ్మెలు చేస్తున్న శ్రామిక వర్గం గురించి “ప్రయివేటు పరిశ్రమల క్రింద మాత్రమే బ్రతక తప్పదని గ్రహిస్తారు, అలవాటు పడతారు.” అని అతను వెలిబుచ్చిన అభిప్రాయం ఈనాటి వాస్తవం. కలిగినదేశాలు, పేద దేశాలు, పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, సంఘటిత అసంఘటిత రంగాలు,- ఇలా అనేక పొరలలో వున్న వ్యత్యాసాలు కార్మికుల లో కూడా ప్రతిఫలిస్తాయి కనుక వెళ్ళేప్పటికీ కలవలేరని ఆ ఇంటర్వ్యూ లో గంగూలీ చెప్పాడు. కార్మికులది రివల్యూషనరీ క్యారెక్టర్ అన్నది సెంటిమెంట్ తప్ప మరేమీ కాదని కొట్టి పారేసాడు. కనుక భారతదేశ భవిష్యత్తు, ఆ మాటకొస్తే ప్రపంచ భవిష్యత్తు కూడా భద్రంగా ఉన్నాయని నమ్మకం చెబుతాడు. అతను చెప్పిన భారతదెశ భవిష్యత్తు అంటే , ప్రపంచ భవిష్యత్తు అంటే దేశీయ అంతర్జాతీయ పెట్టుబడుల భవిష్యత్తు అన్నదే తాత్పర్యం. ఆ విధమైన పెట్టుబడుల భద్ర భవిషత్తు ఇప్పుడు ‘వెలిగిపోతున్న భారత్’ చిత్రపటంలో చూడవలసిందే. ఆ రకంగా ఇది పెట్టుబడి దారీ దేశాలకు , వర్గాలకు మంచికాలం. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? రచయిత ఉండాలనుకొంటున్నారా ? అంటే లేదనే సమాధానం చెప్పుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోయిన రాంమూర్తి తమ్ముడు వీరభద్రం గురించి పోలీసులు ఆరా తీస్తున్న విషయం చెప్పి విప్లవోద్యమాలలో అతని చిరునామాను సూచించారు రచయిత. అంతే కాదు యువతరం “ నిజంగానే, నిజంగానే / నిఖిల లోకం హసిస్తుందా?/ దారుణ ద్వేషాగ్ని పెంచే / దానవత్వం నశిస్తుందా /బానిసలసంకెళ్లు బిగిసే / పాడు కాలం లయిస్తుందా? / సాధుతత్వపు సోదరత్వపు / స్వాదుతత్వం జయిస్తుందా? వంటి పాటలను పిల్లలకు నేర్పిస్తున్న ఒక దృశ్యాన్ని చూపి దానవత్వం నశించి , పాడుకాలం అంతరించి నిఖిల లోకం హసించే రోజును గురించిన ‘ఆశాదీపం’ వెలిగించారు.

కొడవటిగంటి కుటుంబరావు నవల గురించి వ్రాస్తూ కె. వి. రమణారెడ్డి ఒకే కుటుంబం మనుషులలో ఉండే పోలికలు(మొక్కట్లు) వంటివి ఆయన వ్రాసిన వేరువేరు నవలల్లోని భిన్న పాత్రల మధ్య ఉంటాయని అభిప్రాయపడ్డారు. వివినమూర్తి నవలలు చదువుతుంటే ఆ మాటలు పదేపదే గుర్తుకు వస్తాయి. ‘ఆ మనిషి’ నవలలోని ‘బావగారు’ ‘కొంతమంది కొన్ని చోట్ల’ నవలలో ‘బావగారు’ అలా బాగా దగ్గరపోలికలు ఉన్న వ్యక్తులు. ఒక నవలలోని ఒక పాత్ర కాస్త మార్పులతో మరొక నవలలో కొనసాగటం కూడా కనిపిస్తుంది. ఈ బావగారి పాత్రకు వాస్తవజీవిత నమూనా కాళీపట్నం రామారావు గారేమో అనిపిస్తుంది. మనిషి ప్రవర్తనకు ఉన్న సామాజిక కారణాలు, వ్యక్తి ప్రత్యేకతలు రెండూ ఆలోచించవలసినవే అన్న భావం అన్ని నవలల్లో ఎక్కడో ఒకచోట మెరుపులా మెరుస్తుంది. కమ్యూనిజం పట్ల కాస్తంత మొగ్గు చూపిస్తూనే గాఢంగా సందేహించటం కూడా సామాన్యాంశమే. ఈ సామాన్యాంశాలను గుర్తించి అధ్యయనం చేయటం మరెప్పుడైనా … మరెవరైనా… .

(వివిన మూర్తి 75వ జన్మదినం సందర్భంగా - ఎడిటర్)

First Published:  20 May 2023 6:30 PM GMT
Next Story