Telugu Global
Arts & Literature

నిర్ణయం (చిన్నకథ)

నిర్ణయం (చిన్నకథ)
X

ఇన్ఫోటెక్ లో సాలీనా ఏడంకెల సాఫ్ట్వేరుని. వయసు పాతిక+ రెండు. ఐదేళ్ళుగా బెంగుళూరులో పి జి గా స్నాతకోత్తరుణ్ణి‌ . నచ్చింది తినడం...మెచ్చింది త్రాగడం జీవన సరళిగా కొనసాగుతున్న నాకు , బామ్మల పోరు లేదు కానీ అమ్మ తీరు భరించలేకపోతున్నాను. విశాఖ లో ఉంటున్న అమ్మని ఫోన్ చేస్తే, ఒక్కోసారి ముక్తసరిగా...మరోసారి నిష్టూరంగా మాట్లాడుతోంది.

ఓ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి " బెంగుళూరు లోనే జాబ్ చేస్తుందట.ఫోటోలో చూడ ముచ్చటగా ఉంది" అంటూ హింట్ ఇచ్చింది. ఫార్వర్డ్ అయిన వివరాలు చూసి ' ఫర్వాలేదు ' అనిపించడంతో గీతని ఒక హోటల్లో 'సాయంత్రపు తేనీరు' లో కలుసుకున్నాను. తన బిజీ లైఫ్ వివరించింది. ధారాళంగా స్విగ్గీ ,జొమాటోల ప్రాధాన్యత తెలియజేసింది గీత. ఆఫీసుకు వెళ్ళడానికి రేపిడో బైక్ సర్వీస్ ఎలా వాడుకుంటున్నదీ వివరించింది. వీకెండ్ రిలాక్స్ లూ , లాంగ్ డ్రైవ్ లు జీవితాన్ని ఎలా చైతన్యవంతం చేస్తాయో ఆసక్తిగా చెప్పింది. గీత చెప్పిన వన్నీ సహనంతో విని చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతూ " నైస్ టు మీట్ యు " అన్నాను. గీత వెళ్తున్న వైపు ఒక్కసారి చూసి " పెళ్ళంటే బ్రహ్మ పదార్థం... బ్రహ్మచారులకి అర్థం కాని యదార్థం " అనుకుంటూ గట్టిగా నిట్టూర్చాను.

ఉదయం నిద్ర లేవడం ఆలస్యమైంది. యధావిధిగా ఫోన్లో సందేశం... " శుభోదయం బావా "

సునీత...మేనత్త కూతురు. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతోంది. మావయ్య బిజినెస్ చేస్తూ ఆర్థికంగా దెబ్బ తిన్నారు. సహాయం చేసే స్థోమత ఉన్నా నాన్న స్పందించలేదు. ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచారు. ఏం సాధించారు?... ఓ రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యారు. ఇప్పుడు నేనూ అమ్మ మాత్రమే. వెన్నుతట్టి నాలో ధైర్యాన్ని నింపింది నాన్న లాంటి అమ్మ మాత్రమే...

ఏడంకెల జీతంతో నా ఉద్యోగం... బాధ్యత. టెన్షన్. అనియమిత పనిగంటలు. కర్ణుడి కవచకుండలాలు లా విడదీయలేని ల్యాప్ టాప్. కుటుంబం... సంసారం...ఒక ఇల్లు...ఇవన్నీ అందంగా ఒద్దికగా తీర్చిదిద్దుకోవాలంటే , నాకో తోడు కావాలి. నా పరిస్థితి ని అర్థం చేసుకునే జోడు కావాలి‌... " మనల్ని మనలా ప్రేమించేవారిని పొందే జీవితం చాలు...అదే పెద్ద అదృష్టం "

సునీత నా ఆశలకు అనుగుణంగా స్పందిస్తున్న నమ్మకం నాకు ఉంది. ఏడంకెల జీతగాణ్ణి అయిన నాతో ఏడడుగులు వేసి దైహికంగా వైవాహికంగా మమేకమయ్యే లక్షణాలు సునీతలో పుష్కలంగా ఉన్నాయని ఆమె ప్రతిరోజూ పెట్టే సందేశాలు చెప్పకనే చెబుతున్నాయి.

ఇన్నాళ్ళూ గంభీరంగా మౌనాన్ని వహించాను. ఇప్పుడు తప్పక స్పందించాలి. ముందుగా అమ్మ చెవిలో నా అభిమతాన్ని మలయమారుతంలా స్పర్శింపజేయాలి. వీడియో కాల్ చేస్తున్నాను...అమ్మ కళ్ళలో వెలుగుని దర్శించడానికి !

- గుండాన జోగారావు

First Published:  2 Nov 2023 11:59 AM GMT
Next Story