Telugu Global
Arts & Literature

మన లోపలి తోటల్లోకి (కవిత)

మన లోపలి తోటల్లోకి (కవిత)
X

మనిషి లోపల

తోటకొటుంటుంది

కాసేపు నరాల్లో రక్తానికి బదులు

నీళ్లు వెళ్తున్నాయ్ అనుకుంటే

అట్లా ఆ నది మీద

దుఃఖాన్ని దాటించే తెప్పలుంటాయ్

సూర్యుడ్ని చూపించే హృదయం ఉంటుంది

చంద్రుడు చిటికెన వేలి తో

చీకటిని తీసి, వెలుగై పూసే సమయమొస్తుంది

అప్పుడక్కడ

చెట్టు లాంటి మనిషి

నది లాంటి మనిషి

పువ్వు లాంటి మనిషి

పరిమళాలను మోసుకెళ్లే తోటమాలౌతాడు

అట్లా ఆ తోటని

చెవి వొగ్గి వినాలే గానీ

ఆదిమగానమొకటి

మనల్ని థింసా ఆడిస్తూంది

లోపల, బయట నిర్మించుకున్న పంజరాలు

పుటుక్కున వీగిపోయి,

తీగలు తీగలు గా

తోట విస్తరిస్తుంది

లోపల ఉత్సవం

పసిబిడ్డ లా నవ్వుతుంటే

నిన్ను కేంద్రకం చేసుకున్న భూమి

చెట్ల ఆకుల సవ్వడికి,

నీటి అలల చప్పుళ్ళకి

గిల్లరి చేయడం మొదలెడుతుంది

నీలో ఒక అంతర్వాహిని ఉందిరా

మహా ప్రభో!

సారవంతమైన మట్టి ఉంది

ఎగిరే సీతాకోక చిలకలున్నాయ్

చిరునవ్వు లాంటి

చల్లని గాలి వీస్తుంది

నాలుగు

చినుకులు కూడా రాల్తాయ్

సతత హరిత మానవత్వపు గింజలు నాటు

నీడలు నీడలుగా అల్లుకో

పోటెత్తే నీ రక్తమిప్పుడు

యుద్దాల్ని బహిష్కరిస్తుంది

అట్లా

నీ చేతుల్లో చూడు

శాఖలుంటాయ్

నువ్వు

గట్టిగా అనుకోవాలే గానీ

అక్కడి నుంచే

పూలు పూస్తాయ్

ఆ శాఖల మీద,

పక్షులు వాల్తాయ్

ఎగురుతున్న పక్షులు,

రెక్కల కుంచెలతో

ఆకాశానికి ,నేలకు మధ్య

కొత్త లిపి ని రాస్తాయ్

- గోపాల్ సుంకర

First Published:  4 Dec 2023 4:00 PM GMT
Next Story