Telugu Global
Arts & Literature

అకాల వర్ష హరణం

అకాల వర్ష హరణం
X

అకాల మృత్యు హరణం

సర్వవ్యాధి నివారణం!

సమస్త పాపక్షయకరం

శ్రీ పరమేశ్వర

పాదోదకం పావనం శుభం!!

కాస్తా రూపాంతరం చెందింది

అకాల వర్ష హరణం

సర్వ దారి వికారణం

సమస్త రాస్త క్షయకరం

శ్రీ --- (మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి)

పాపోదకం ప్రాపకం ..

శుభమో అశుభమో

అరి వీరులకూ

అరిచే నోళ్ళకూ

అవకాశం మాత్రం

అందిపుచ్చుకునేటట్టు

అందించడం

ముమ్మాటికీ నిజం

రాచవీధిలో

నిరంతరం పరిభ్రమించే

రాజకీయ రంగుల రాట్నం

నడి మధ్యలో అమాంతం

ఆవులించిన తార్రోడ్డు

మృత్యు కుహరం లా

నోరు తెరిచింది

నవసహస్ర క్రోసుల

నగర మార్గంలో

చతుస్సహస్ర ఫణులు

పడగలు విప్పితే

ఊడలు దిగిన నిర్లిప్తతో

విశ్వకర్మలు విభ్రాంతులై

విచిత్ర వీక్షణం చేస్తున్నారు

రెక్కలు తెగిన రాజకీయ పక్షులు

గుఱ్ఱ్ం ఎగరావచ్చని

వంకలు వెదుకుతూ

చంకలు గుద్దుకుంటున్నారు

తాము సమర్ధించిన వారు

సమర్ధులో అసమర్ధులో

తలమర్దన చేసుకున్నా

తట్టక సందిగ్ధం లో

పడ్డారు సమర్ధకులూ

సమర్పకులూనూ

ఎదురు లేదన్నది

ఆత్మ విశ్వాసం కావాలిగానీ

అహంకార కారకం

కాకూడదు ...

తోడిచ్చినోళ్ళు తొండి కి

గురయ్యామనుకుంటే

తోడేళ్ళు తోకలు ముడవవ్

తోలు తీసేస్తాయ్

గొయ్యెవరూ తియ్యకపోయినా

మరీ తాటి చెట్టు కింద

పాలకుండలా పడింది ...

కళ్ళు తెరవాల్సిన టైం

దాటిపోతున్నట్టుంది

ఒళ్ళు విరిచి విమర్శకులు

ధాటిగా దాడీకి రెడీ అయిపోయారు

కార్యాచరణకి ఉపక్రమిస్తే

అభిమానం

అందలం

అన్నీ పదిలం ...

అపేక్షితులను ఉపేక్షిస్తే

గృహచ్చిద్రం

ఈ మహా రాజకీయ రంధ్రం

- సాయి శేఖ‌ర్‌

First Published:  21 Sep 2023 5:56 AM GMT
Next Story