Telugu Global
Arts & Literature

ఏరిన ముత్యాలు..బుద్ధిజీవీ, మేధావీ బహుప్రక్రియా రచయిత ద్వా.నా.శాస్త్రి

జూన్ '15 నేడు ద్వానా శాస్త్రి 75 వ జయంతి

ఏరిన ముత్యాలు..బుద్ధిజీవీ, మేధావీ బహుప్రక్రియా రచయిత ద్వా.నా.శాస్త్రి
X

కీ.శే. ద్వా.నా.శాస్త్రి (ద్వాదశి నాగేశ్వరశాస్త్రి) ఉపాధ్యాయుడు, విమర్శకుడు, గ్రంథసమీక్షకుడు, కవి, కథకుడు, పరిశోధకుడు, నూతన ప్రయోగదక్షుడు, మంచి వక్త.

ఉపాధ్యాయుడుగా, ఉపన్యాసకుడుగా - పాఠ్యబోధన పట్ల ఆయనకు బహుప్రీతి. పోటీపరీక్షలకు విద్యార్థులకు ఏమేమి కావాలో అవన్నీ కూర్చాడు ఆయన. వ్యాసాలు, తెలుగు సాహిత్యంపై వెయ్యి ప్రశ్నలు, క్విజ్ లు, మంచి పద్యాలు, మన తెలుగు తెలుసుకుందాం, మన తెలుగు వైభవం, మూడు వేల బిట్స్, వ్యాసలహరి.... ఇలా తన సర్వజ్ఞతనంతా ఆయా పరీక్షాభ్యర్థులకు పంచేడు.

ఇవి కాక, తెలుగు సాహిత్య చరిత్ర - 800 పేజీల బృహత్ గ్రంథాన్ని అ-పూర్వంగా ప్రచురించాడు. ఐదు ముద్రణలు పొందింది ఆ గ్రంథం.

విమర్శలో ద్వానా శైలి ద్వానాదే. అదొక ముద్ర. ‘నందిని నంది, పందిని పంది అనాల్సిందే’ బాపతు. అసలు వ్యాస శీర్షికలతోనే సాహితీపరులకు ఉలికిపాటు కలిగించాడు. ‘సొంత డబ్బా తక్కువేమీ కాదు’ ‘ఇదేమి కవిత్వంబాబూ?’ అంటూ ఇస్మాయిల్ హైకూనీ వదల్లేదు. రాజీలేని భావ వ్యక్తీకరణ.

గ్రంథ సమీక్షకుడుగా సుమారు 1500 సమీక్షలు చేసినట్లు తేలింది. ద్వానా సాహిత్యవ్యాసం ఏదో ఒక దానిలో రాని సోమవారం దినపత్రిక ఉండేది కాదు ఒకప్పుడు. ఆయన ఆంధ్రభూమిని గుత్తకు తీసుకున్నాడనీ మిత్రులు చెప్పుకునేవారు!

కవిగా ద్వానా ‘సాహిత్య నానీలు’ రాశాడు. ‘సినారె’ నానీలూ రాశాడు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ‘బుష్ కాకీ’ నానీలూ తెచ్చాడు. అతని కలానికి కవిత్వాభివ్యక్తిలో ఆర్ద్రత బాగా తెలుసు. 1996 నవంబర్ కోనసీమ ప్రమాదాన్ని ‘నీరు కాలుస్తుంది, గాలి మసిచేస్తుంది’ అని అద్భుతంగా వ్యక్తీకరించాడు.


ద్వానా భాషాసేవకుడు. ‘మాటలంటే మాటలా?’ ‘మన తెలుగు తెలుసుకుందాం’, ‘లేఖాసాహితి’, ‘మంచి పద్యాలు’ వంటి విలక్షణమైన, భావితరాలకు ప్రయోజనాత్మకమైన పుస్తకాలు రాశాడు. మోనాగ్రాఫ్స్ ‘కలంబొమ్మలు’ చాలా ప్రచురించాడు.

నిరంతర అధ్యయనశీలం గలిగిన ద్వానా- నడుస్తున్న జిజ్ఞాసువు. నిత్య చైతన్య విద్యార్థి; ప్రయోగశీలి. ‘పలకరిస్తే పద్యం’ వంటి 24 గంటల వక్తృత్వంతో రికార్డులు నెలకొల్పాడు.

ద్వానా పొందిన సత్కారాలూ.... పెద్దపట్టికే అయినా, అవి ఆయన ప్రతిభావ్యుత్పత్తులకూ, ప్రజ్ఞా ప్రాభవానికీ సరిపోయినవి కావు. ఆయనొక భాషా సాహిత్యగిరి శృంగం!

నాకు ద్వానాతో ఆయన అమలాపురం కాలేజ్ లో పనిచేస్తున్నప్పుడే మొదటిసారి పరిచయం. ఆ కాలేజీలో ఘనశ్యామల ప్రసాదరావుగారు ఉండేవారు. వాసమూర్తి కూడా ఉన్నట్టు గుర్తు. ఘనశ్యామలవారి అష్టావధానం బందరులో ఏర్పాటు చేశాము. నేను కడప చేరిన తర్వాత 1982లో ద్వానా కడప వచ్చారు. ఆయన మొదటి కవితా సంపుటి, మొదటి వ్యాస సంపుటి రెంటినీ - రచన సాహితీ సమాఖ్య ద్వారా అక్కడ ఆవిష్కరణ జరిపాము. ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన హాజరుకాని సాహిత్య కార్యక్రమం ఉండేది కాదు. ప్రతి సభకూ వచ్చి మిత్రుల్ని పలకరించి కొంతసేపు కూర్చుని వెళ్లేవాడు. ఆంధ్రజ్యోతిలో నా ఇంటర్వ్యూని ప్రచురించాడు (నలభై ఏళ్ల క్రితమే!).

‘సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు తాను క్లాసెస్ తీసుకునే ఒక ఇన్స్టిట్యూట్లో నా చేత - రావి శాస్త్రి ‘అల్పజీవి’ నవల మీద, గురజాడ ఐదు కథల మీద- రెండుసార్లు పాఠాలు చెప్పించాడు. ఆ తర్వాత వాటి నోట్స్ తీసుకుని, ‘నేనుచూసుకుంటానులే మిత్రమా’ అన్నాడు!

ఆయన షష్టిపూర్తి సందర్భంగా నేను ఆంధ్రప్రభ దినపత్రిక లో ‘పొద్దు చాలని సారస్వతీయుడు-ద్వానా శాస్త్రి’ అని అరపేజీ వ్యాసం రాస్తే చాలా సంతోషించి, ‘నా ఆత్మని పట్టేశావ్’ అని

మెచ్చుకున్నాడు.

ద్వానా అనారోగ్యంతో చెన్నైలో వుంటే మాట్లాడాను. ‘మళ్ళీ గానసభలో కలుద్దాం’ అన్నాడు. అలాగే, మళ్లీ తిరిగి వచ్చాడు. కొన్నాళ్లుండి, సాహితీలోకాన్ని విచారంలో ముంచి దివిజలోకానికి వెళ్లిపోయాడు!

ద్వానా తానుగా ఒక సాహిత్య పురస్కారాన్ని నెలకొల్పి ప్రతి ఏటా ఒక్కొక్క ప్రక్రియలోని రచనకు ఆ అవార్డుని ఇచ్చాడు. మంచి స్నేహశీలి. తనంటే అసూయ చెందే వారిని సైతం, గౌరవించగలిగిన సహృదయుడు. ఆధునిక కాలంలో అచ్చమైన ‘బహుముఖీన’ సాహితీమూర్తుల్లో ద్వానా తొలిపంక్తివాడు!!

- విహారి

First Published:  15 Jun 2023 10:15 AM GMT
Next Story