Telugu Global
Arts & Literature

ఏరిన ముత్యాలు: బుచ్చిబాబు స్ఫూర్తీ, కీర్తీ అజరామరం

ఏరిన ముత్యాలు: బుచ్చిబాబు స్ఫూర్తీ, కీర్తీ అజరామరం
X

ఏరిన ముత్యాలు: బుచ్చిబాబు స్ఫూర్తీ, కీర్తీ అజరామరం

తెలుగు కథా సాహిత్యంలో బుచ్చిబాబు అనగానే - ‘సౌందర్యాన్వేషి’ అనే ఒక విలక్షణమైన ‘ముద్ర’ వినిపిస్తుంది. అది ఆయనకే ప్రత్యేకమై వెలసి అనితర లభ్యంగా నిలిచి వెలుగుతోంది! ఇదీ ఆయన కీర్తికిరీటంలోని కలికితురాయి!

బుచ్చిబాబు కథానికా వస్తువుల్లో చాలామంది కావాలనుకునే సామాజిక స్పృహ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆయన కథాతత్వం కూడా ఆయన జీవన తత్త్వానికి సరిపడి వుంటుంది. అది కళ కళ కోసమే అనే తత్వం. అందువల్లనే ఆయన ‘కథానిక అనేది మళ్ళీ మళ్ళీ చదివించే ఖండకావ్యంగా ఉండాలి’ అన్నారు. అలాగే ‘నూతనమైన వస్తువు దొరకదు. ప్రతి విషయం గురించి పెద్దలిదివరకు రాస్తూనే ఉన్నారు. చెప్పే తీరులో, శిల్పంలో విశిష్టత కనబరచాలి’ అన్నారు.

ఈ కారణాలవల్లనే బుచ్చిబాబు మానవ మనస్తత్వం ఆధారమైన కథా వస్తువులతో అపూర్వమైన విస్తృతిని సాధించారు.

బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఏలూరు జన్మస్థలం. జననం 14-6-1916 ఎం.ఏ (ఆంగ్లసాహిత్యం) చేసి కొంతకాలం

లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణిలో చేరారు. 20-9-1967న దివంగతులయ్యేవరకూ అక్కడ కార్యక్రమ నిర్వహణాధికారిగా వున్నారు.

సుమారు 75 కథలు, 22 నాటికలు, నాటకాలు, 20 వరకూ వ్యాసాలూ, అంతరంగ కథనం (స్వీయచరిత్ర) అజ్ఞానం (వచన కావ్యం) ప్రచురించారు.

షేక్స్పియర్ సాహితీ పరామర్శ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.

బుచ్చిబాబు - తాను రాసిన ఏకైక నవల ‘చివరకు మిగిలేది’తో తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేసి ‘చైతన్య స్రవంతి’ పేరుతోనే ఒక నమూనా కథానికని కూడా రచించి యిచ్చారు.


బుచ్చిబాబు కథానికల్లో - నిరంతర త్రయం, మరమేకులు-చీరమడతలు, కొత్తొంతెన- పాతనీరు, పొగలేని నిప్పు, కలలో జారిన కన్నీరు, ఆశాప్రియ, నన్ను గురించి కథ వ్రాయవూ, మూడు కోతులు, యువపాశం, తడిమంటకు పొడినీళ్లు, ‘బీ’, దేశం నాకిచ్చిన సందేశం, అరకులోయలో కూలిన శిఖరం, నా గాజుమేడ... వంటి ఎన్నో కథానికలు పాఠకుల ఆదరణనీ, విమర్శకుల ప్రశంసల్నీ పొందినవి ఉన్నాయి.

‘జీవితాన్ని మరింత తీక్షణంగా సందర్శించాలి. కథ ద్వారా జీవిత రహస్యం శోధించడంలో నాలుగో పరిణామం సాహిత్యం’ అన్న బుచ్చిబాబు మాటలకు గల ప్రాణశక్తిని ఆయన ప్రతి కథా రుజువు చేస్తోంది!

అయితే, బుచ్చిబాబు కథల్లో నాకు నచ్చిన మరీ గొప్పకథ -‘కాగితం ముక్కలు - గాజు పెంకులు, పది పేజీల చిన్న కథ. వస్తువు చిన్నది. ‘చంద్రం-తన స్నేహితుడు, ఆర్మీ ఆఫీసరు అయిన ‘సింహం’కి రైల్వే స్టేషన్ లో వీడ్కోలిచ్చి, అతనిచ్చిన హంటర్ని బహుమతిగా తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు.

చంద్రం భార్య అరుణ, ఆ సింహం - అరుణకీ స్నేహితుడే. చంద్రం వచ్చేసరికి - సరిగ్గా పడక గది తలుపులు వేసుకుని మడత మంచం మీద కూర్చుని ఏదో కాగితం చదువుతూ వుంది అరుణ.

‘చేతిలో ఏముంది?’ తో మొదలైన చంద్రం ప్రశ్న ఒక్కొక్క మెట్టే పైపైకి ఎక్కింది. తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరికీ పట్టుదల పెరిగింది. ఆమె చెప్పదు. ఆ కాగితాన్ని ఇవ్వదు. ఆమెపై హంటర్ ప్రయోగంతో ఆ కాగితం చంద్రం చేతిలోకి వచ్చింది.

చంద్రం హాల్లోకి వచ్చాడు. పైభాగం చివరి అక్షరాలు సరిగా కనపడని ఆ ఆకుపచ్చ కాగితాన్ని చూసుకుని... చదివితే...?

అది అరుణకు తాను రాసిన ఉత్తరమే! వివాహం అయిన మరుసటి సంవత్సరం - ఉద్యోగం దొరగ్గానే రాశాడు. ఆ ఉత్తరం రాసిన చంద్రం వేరు. ఆ చంద్రం-ప్రియుడు, యవ్వనంలో స్వప్నాలల్లే మాంత్రికుడు. ఇప్పటి చంద్రం - భర్త, ఉద్యోగం, హోదా, డబ్బు, నౌకర్లు, స్నేహితులు, మర్యాదలు, ఆమె వండి పెడుతుంది. భార్య!

అన్నీ ఉన్నాయిప్పుడు కానీ, ఏదో లోపించింది. ఆ లోపించినది - ఆ ఉత్తరంలో ఉంది. అందుకే అంత రహస్యం. గతానికో అద్దం - ఆ ఉత్తరం. ఆ ఊహా జగత్తుని ధ్వంసం చేశాడు తాను. అందుకే ఆమె అతన్ని పరాయివాడుగా, విరోధిగా తూలనాడి, ఎదురు తిరిగి - ఆ స్వప్న జగత్తులో నిజ స్వరూపాన్ని ఒక్కసారి చూపెట్టింది. శరీరానికి నెప్పి తెలుసు. బాధ తెలుసు. కాని హృదయానికి తెలిసేది గాయం. అద్దాన్ని పగులకొడుతుంది శరీరం. పగిలిన ముక్కల్ని ఏరి అతుకు పెడుతుంది - హృదయం!

‘నిజానికి ఊహలో తప్ప మనుషులు స్వత్రంత్ర జీవులు కారు’- అంటాడు బుచ్చిబాబు వేరే కథలో. ఈ కథాంశమూ తద్భిన్నమైంది కాదు!

‘సమానత్వం అనేది మానవుడి, స్వప్నంగా ఉండాల్సిందే కానీ యథార్థం కాదేమో!’ అనే సత్యాన్నీ దర్శిస్తాం. ఈ కథలో, ప్రత్యేకించి - చంద్రంలోని పశువూ, పశువాంఛా, పురుషా హంకారం- ఒక్కక్షణం భార్యపై హూంకరించినపుడు, ఆమె గురించీ, సింహం గురించీ, అతని మురికి ఆలోచనల్ని చదువుతున్నపుడు - ప్రతి మగవాడు భుజాలు తడుముకుంటాడనిపిస్తుంది.

స్త్రీ విషయంగా చాలా కథల్లో ఆయన పురుషుడిలోని మానవబలహీనతల్ని నిశితంగా పరిశీలించి చూపారు. మానవ స్వభావాల్లోన్ని, నైచాన్నీ కూడా రసబంధురంగా భాసింపజేశారు.

రచన ద్వారా జీవితంపై ఒక దృక్పథం కలుగజెయ్యాలనే నిబద్ధత వున్న కథకుడు బుచ్చిబాబు. నిజమైన కళ ప్రచారం చెయ్యదు.జీవితాన్ని చిత్రిస్తుంది. ఆ చిత్రణ ద్వారా ఒక రసానుభూతిని కలిగిస్తుంది. ఒక జీవిత సత్యాన్ని పాఠకుడిలో ఉద్దీపింపజేస్తుంది. ఆ చిత్రణా, రసానుభూతీ, ఆ జీవిత సత్యం - సమాజ శ్రేయస్సుకు, పరోక్షంగా ఉపకరిస్తాయి. ఇదీ సామాజిక ప్రయోజనం. ఇదీ బుచ్చిబాబు తత్త్వం. ఆయన కథల అంతస్సారం!


బుచ్చిబాబుతో నాకు గల కొద్దిపాటి పరిచయంతో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. ఒకసారి ప్రత్యేకంగా వారిని కలవటానికి నేనూ, శాలివాహన వారింటికి వెళ్లాం- అప్పుడు కొంత అస్వస్థతతో ఉన్నారు. అయినా, ఎంతో మర్యాదపూర్వకంగా, ఆదరణతో మాట్లాడారు. సుబ్బలక్ష్మిగారూ ఉన్నారు. కాఫీ తర్వాత, మేము వెళ్లిన పనిచెప్పాము. పూర్తిగా మనస్తాత్విక నవల, చైతన్యస్రవంతి శిల్పంతో రాసిన వ్రాతప్రతిని వారి చేతికిచ్చాము. మనస్సులో బెరుకు. చూస్తూ కూర్చున్నాం. వారు పేజీలు తిరగేసి, ఇతివృత్తాన్ని పట్టేశారు. ‘చాలా గడుసుకథ. పెద్ద సాహసం , ప్రయోగం’ అన్నారు.

నిదానంగా అడిగాము, ‘మీరు ముందుమాట రాయాలి’ అని. చిరునవ్వుతో ‘ తప్పకుండా’ అని, ‘ఏదైనా పత్రికలో వస్తే బాగుంటుంది. ఆ తర్వాత, అచ్చువేయవచ్చు. అప్పుడు పంపండి’ అన్నారు. వారి సలహాతో వచ్చాము.

ఆ నవలని అప్పట్లో మద్రాసు నుండి వస్తున్న ఒక మాసపత్రికకు పంపాము. కానీ పత్రిక ఆగి పోయింది! నవలా పోయింది. దాని కాపీ మా దగ్గరలేదు!‘ 'Still born child' అయింది ఆ నవల పుట్టుక, మరణం! ఇది జరిగిన స్వల్ప కాలానికే బుచ్చిబాబు దివంగతులైనారు. వారి మృతికి నివాళిగా మేము ‘భారతి’ మాసపత్రికలో ‘చైతన్య స్రవంతి’ అనే కవిత రాశాము. అందులో ‘మరో చైతన్య స్రవంతి నవలకు ముందుమాట రాయకుండానే’ దివికేగినారా? అనే ప్రసక్తి వుంది. దాని నేపథ్యం ఇదే!

చిత్రమైన విషయం ఏమంటే ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆ నవల ఇతివృత్తం కేంద్రంగా ఒక సినిమా వచ్చింది! (ఒక యువకుడు భార్యతో మాత్రం సంగమించలేడు. ఇతరుల్ని వాంఛిస్తూవుంటాడు).

అప్పట్లో బుచ్చిబాబు గారి పేరుమీద ఒక అవార్డుని ఇవ్వాలని బందరులో ఆదివిష్ణు అధ్యక్షతన ‘బృందావనం’ అని ఒక సాహిత్య సంస్థని ప్రారంభించాము. అనేక కారణాలవల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు.

హైదరాబాద్ లో విమల సాహితి సంస్థ వారు బుచ్చిబాబు అవార్డుని నెలకొల్పారు. ఒక సంవత్సరం అది నాకు లభించింది. వారు కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించటం లేదు.

బుచ్చిబాబు ఒక సాహిత్య గిరివృక్షం.

'The myriad minded man' అని షేక్స్పియర్ ని కోలెరిజ్ వర్ణించారు. అలాంటి సర్వతోముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆయన కథానికల్ని విశ్లేషణపూర్వకంగా చదవటం -- ఉత్తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవడానికి ఒక సాధనంగా భావిస్తాను నేను!

- విహారి

First Published:  14 Jun 2023 8:00 AM GMT
Next Story