Telugu Global
Arts & Literature

ఓ ముద్ద తినిపోమ్మా ! (కవిత)

ఓ ముద్ద తినిపోమ్మా ! (కవిత)
X

నీవు అమ్మగా మారాలనుకున్న

ఆనంద క్షణాల్లో నీ అమృత

గర్భ గుడి అండంలో పిండంగా

నేనంకురించింది మొదలు

నీ ఆహారంలో భాగం పంచావు

నా ఆరోహణ క్రమంలో

నీ నాజూకు నడుము నాభి

మచ్చలు పడి మడతలు పడి

అందవిహీనమవుతుందని

ముందే తెలిసినా ముచ్చటగా

తాకి తన్మయత్వం చెందావు

కాళ్లతో తంతున్నా కాస్త నొప్పన్న మాటనక నాన్నకు చూపుతూ ముద్దులిప్పించావు

నవ మాసాలు నిండి

నీ సున్నిత మర్మస్థానాన్ని

బద్దలు కట్టుకుని బయిటికి

వస్తున్న సమయంలో

దిక్కులు పిక్కటిల్లేలా

నువ్వు చేసిన రోదన వేదన

నన్ను చూసీ చూడగానే

మరిచి పోయి మురిసి పోతూ

నీ రక్తాన్ని రంగు మార్చి క్షీరంలా

చీర కొంగులో దాచి మరీ నా బొజ్జ నింపావు

నా ప్రతి పనినీ పరవశిoచి చేస్తూ పారితోషకం లేని

పరిచారిక వయ్యావు

అల్లరి అలకలు భరిస్తూ

పెంచి ప్రయోజితుని జేసి

ప్రశంసించ బడ్డావు

ప్రతిగా నేనేమో

పని వత్తిడంటూ ప్రవాసాలకేగి

పట్టెడన్నం తిన్నావో పస్తులున్నావో పట్టించుకోని రాయినై పరాయినై

నిను పోగొట్టుకున్న క్షణం నుంచి

నేను తుళ్ళి పడినా తూలి పడినా పటంలోనే కాదు

పరిసరాల్లోనూ నీవుండి

నాకై అల్లాడి పోతున్నట్లనిపిస్తుంది

అందుకే ఓముద్ద వరండాలో పెట్టి వాయసంలా వచ్చి తినిపొమ్మని వాపోతున్నాను

కన్నీటి తెర కమ్ముకోవటంతో

కంటి చూపు మసక బారి

నీవు వచ్చినా చూడలేక

నిరాశ పడి పోతున్నాను.

- దుద్దుంపూడి.అనసూయ

(రాజ మహేంద్రవరం)

First Published:  1 Aug 2023 9:43 AM GMT
Next Story