Telugu Global
Arts & Literature

ఐకమత్యమే మహాబలం

ఐకమత్యమే మహాబలం
X

ఆ రోజు శనివారం. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు లేవు. కనుక లాలిత్య హాయిగా ఇంకొంత సేపు పడుకుని, తీరికగా నిద్ర లేద్దామనుకుంది. కానీ గత ఐదు రోజులుగా చేయకుండా వదిలేసిన పనులు గుర్తుకొచ్చి, నీరసంగా, అనిష్టంగానే లేచి కూర్చుంది. అరిచేతులను రుద్దుకుని, ఒకసారి చూసుకుంది. భగవంతుడికి నమస్కరించి, పనిరంధిలో పడింది. గుట్టగా ఉన్న ఉతకవలసిన బట్టలను వాషింగ్మిషన్లో వేసింది. ఉతికి ఆరేసిన బట్టలను బల్లమీద పడేసింది మడవడానికి. ఎప్పటిలాగే త్వరగా లేచి, ఆటలలో మునిగిన పిల్లలను పాలు తాగడానికి పిలిచి, యెంతసేపటికీ రాని పిల్లలని గట్టిగా కేకేసింది. గోల చేసుకుంటూ వచ్చి, గబగబా పాలు తాగి, మూతులపైన ఉన్న పాలనురగని చొక్కాలతో తుడుచుకుంటూ, పాలగ్లాసులని సింక్ లో వేయడానికి కూడా బద్ధకించి, అలాగే అక్కడే పడేసి, మళ్ళీ ఆటలలో పడ్డారు పిల్లలు.

అది చూసిన లాలిత్యకి ఒళ్ళు మండింది. వాళ్ళని ఛడామడా తిట్టడం మొదలెట్టింది. ఆమె అరుపులకి అదిరిపడ్డ ఆమె భర్త కౌశిక్ తనున్న గది తలుపులు తెరిచి, ‘అబ్బా! లాలిత్యా! ప్రొద్దునే మొదలెట్టావా నీ దండకం? నాకు ఈవేళ కూడా పని ఉంది. కాస్త ప్రశాంతంగా ఉండనీయవోయ్” అంటూ మెల్లగా ” ఇంకొక పదినిమిషాలలో నేను తయరవుతాను ఆఫీసు కాల్స్ అందుకోడానికి. అంతలోపల ఉపాహారం తయారుచెయ్” అని ఆజ్ఞ వేసి, వైఫై ఆన్ చేసి, గది తలుపులు మూసుకున్నాడు. ఒళ్ళు మరింత వేడెక్కింది లాలిత్యకి. పనులు చేయడానికి ఒక మనిషి దొరికితే, అదీ ఊరికే దొరికితే చెప్పడానికి మనుషులు, చేయడానికి బోల్డు పనులు ఉంటాయి అని గొణుక్కుంది లాలిత్య.

లాక్డౌన్ ప్రకటించాక పనిమనిషి రావడం మానుకోవడంతో, అన్నిపనులు లాలిత్యే చేయాల్సివస్తోంది. 12 యేళ్ళ సుధర్మ, 10 యేళ్ళ సుహాస్, 4 యేళ్ళ శోభాకర్ కి ఇంకా అమ్మకి సహాయం చేయాలన్న ఆలోచన రాకపోవడంతో , లాలిత్య పనులతో సతమతమౌతోంది. ఈ విషయాన్నే క్రితం రాత్రి పక్క గ్రామంలో ఉన్న అమ్మకి ఫోన్లో చెప్పింది. ‘నీవు చిన్నప్పటినుంచే వారికి చిన్నచిన్నపనులను అలవాటు చేయమంటే, నామీద కేకలేశావు. ఇప్పుడు నేనేం చేయగలనే? అనుభవించు.” అన్న తల్లిపై కోపంతో ఫోన్ పెట్టేసింది లాలిత్య.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో పాటు “నాన్నలూ! తలుపు తెరవండి” అన్న తండ్రి ప్రణవానందయ్య గొంతు వినడంతో, ఉత్సాహంతో లేచి, సానిటైజర్ తో పాటు వెళ్ళి తెలుపు తెరిచింది లాలిత్య. ఇంతలోనే “ఆనంద్తాతయ్య, ఆనంద్తాతయ్య” అంటూ సంతోషంతో పిల్లలు తాతయ్యని చుట్టుముట్టారు. “ఉండడర్రా! మొదట కాళ్ళు, చేతులు కడుక్కోనీయండి. అమ్మాయ్! పిల్లలకని మీ అమ్మ కర్జీకాయలు, జంతికలు, మినపసున్ని చేసి పంపింది. వాటిని సానిటైస్ చేసి, పిల్లలకి పెట్టు.” అంటూ సంచీని లాలిత్యకి అందించారు తాతయ్య, ముఖానికున్న మాస్క్ ని తీస్తూ.

ఎంతో ప్రేమతో పలకరిస్తూ, తమలో ఒకడిగా ఆటలాడుతూ, అడిగే ప్రశ్నలన్నింటికీ చక్కగా, అర్థమయ్యేలా వివరిస్తూ, పద్యాలు, శ్లోకాలు నేర్పుతూ, చిన్న చిన్న కథలద్వారా నీతులను బోధించే తాతయ్య అంటే పిల్లలకు భలే గౌరవం, ప్రేమ. తమ భావాలను, అనుభవాలను వినడానికి తలిదండ్రులకి యెప్పుడూ ఆసక్తి, ఓపిక, తీరిక ఉండదు. తమ మాటలను ఓపికగా వినే తాతయ్య దగ్గరే వారికి వల్లమాలిన మాలిమి, చొఱవ.

“ఆ( పిల్లలూ! ఎలా ఉన్నారర్రా? బాగా అల్లరి చేస్తున్నారా? మంచిది. ఈరోజు మీకు క్లాసులు లేవని వచ్చాను.” అంటూ పిల్లలందరినీ పేరుపేరునా పిలిచి,దగ్గరికి తీసుకున్నారు. చుట్టూ చూసిన ఆయనకి ఇంటినిండా చిందరవందరగా ఉన్న వస్తువులు కనిపించాయి. “మొదట మనం ఇంటిని సర్దుకుందాం. ఆ తరువాత మన ఆటలు, పాటలు…సరేనా?” అన్నవెంటనే, ముగ్గురూ “సరే తాతయ్యా! మేమేం చేయాలో చెప్పు” అన్నారు ముక్తకంఠంతో. మొదట కింద పడిన వస్తువులన్నింటినీ వాటి వాటి స్థానాలలో ఉంచండి. పెద్దపిల్లలు కాస్త పెద్ద వస్తువులను, శోభాకర్ చిన్నవస్తువులను పెట్టాలి. సరేనా?” తాతయ్య చెప్పి, ముగించేలోగా పిల్లలందరూ చక చకా తమకు చేతనైన వాటినన్నింటినీ సర్దారు. తమకు చేతనైన రీతి ఉతికిన బట్టలను మడిచారు. పది నిమిషాలలో వసారాలో ఒక పెద్ద పెట్టె తప్ప అన్ని వస్తువులు సర్దబడ్డాయి.

సుధర్మ, సుహాస్ “తాతయ్యా! ఈ పెట్టె మా ఇద్దరివల్లా మోయడం కుదరదు. నీవే చేయాలి” అన్నారు. “మీరు విడి విడిగా ప్రయత్నించారా?అని అడిగిన తాతయ్యతో “అవును. తాతయ్యా!”- అన్నారు పిల్లలు. “ఒకసారి ఇద్దరూ కలిసి, ప్రయత్నించండి. మీ వల్ల కుదురుతుంది. “ అన్న తాతయ్య మాటలకి ఇద్దరూ బుద్ధిగా తలలూపుతూ, జాగ్రత్తగా ప్రయత్నించగా, సులభంగా ఆ పెట్టెను మోయగలిగారు. ఆ పెట్టెను యథాస్థానంలో పెట్టేసి, యేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు తలలు పైకెత్తి, బొటనవేళ్ళను విజయానికి సంకేతంగా చూపిస్తూ వచ్చిన పిల్లలని ప్రేమతో దగ్గరకి తీసుకున్నారు తాతయ్య. వసారా శుభ్రం కావడంతో అందరూ హాయిగా ఆడుకోడానికి స్థలం యేర్పడింది. శోభాకర్ “తాతయ్యా! ఐకమచ్చం అంటే యేంటి తాతయ్యా? అమ్మ యెప్పుడు మేం దెబ్బలాడుకుంటున్నాఆ మాట అంటుంది.” అంటూ ముద్దు ముద్దుగా అడిగాడు. “అది ఐకమత్యం రా.

అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నమాట. ఎవరికి చేతనైన పనులు వారు చేస్తే అన్ని పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కరుగా చేయలేని పనిని మిగిలినవారి సహాయంతో చేయాలి. ఇప్పుడు అక్క, అన్నలు కలిసి ఆ బరువైన పెట్టెను మోసినట్లు. అలాగే మన చేతిలో ఐదు వేళ్ళున్నా, యే పనినీ ఒక్క వేలితో చేయలేం. కానీ యే పనినైనా ఆ ఐదువేళ్ళతో కలిపి సులభంగా చేయగలం. అలాగే మనం అందరం ఈ ఇంట్లోని వాళ్ళమే కదా. తలా ఒక పని చేస్తే, యెవరికీ ఇబ్బంది ఉండదు.

పనుల భారం ఉండదన్నమాట. అప్పుడు అమ్మకి పని సుళువవుతుంది. అమ్మకి కోపమే రాదు. అందరికీ హాయిగా ఉంటుంది. అలాగే మనమందరం ఐకమత్యంతో శుభ్రంగా ఉంటూ, నోరు, ముక్కు మూసుకునేలాగా మాస్క్, సామాజిక దూరాన్ని పాటిస్తే, కోరోనా వ్యాధిని నివారించవచ్చు.” అన్నారు తాతయ్య తన బోసినోటితో నవ్వుతూ. “ఐతే ఇకమీదట మేమంతా ఐకమత్యంగా ఉంటూ తలా ఒక పని చేసి, అమ్మకి సాయం చేస్తాం తాతయ్య” అన్నారు పిల్లలు సంతోషంగా. వీరి సంభాషణ విన్న లాలిత్య, కౌశిక్ తాతగారి బోధనతో పిల్లల స్పందనకి మురిసిపోయారు.

-డా. తిరుమల ఆముక్తమాల్యద

( చెన్నై)

First Published:  6 Jan 2023 12:30 PM GMT
Next Story