Telugu Global
Arts & Literature

తీరిక (కవిత)

తీరిక (కవిత)
X

‘ఏం చేస్తున్నారీ మధ్య

రిటైరైనారు కదా

ఎట్లా గడుస్తుంది’ అడిగాడతడు

చదువుకుంటున్నాను

రాసుకుంటున్నాను.’

‘అది కాదు

ఇంకేం చేస్తున్నారు’.

‘సభలకూ సమావేశాలకూ

వెళ్లొస్తున్నాను

పత్రికల్లో విహరిస్తున్నాను’

‘అది కాదు

వాకింగ్ నుంచి ఇంటికెళ్ళగానే

ఏం తోస్తుంది మీకు.’

బాల్కనీలో నిలబడి

అందరినీ పరిశీలిస్తాను

తమకోసం కాక

ఒక్కరైనా ఇతరుల కోసం

నడుస్తున్నారా అని ఆలోచిస్తాను.

రాత్రంతా వొంటి కంటిన

నిద్ర బూజును కిరణాల్తో దులుపుకుంటూ

స్వప్నాలను సాన బెట్టుకుంటాను.

‘తీరిక లేదంటారు

కాలక్షేపం కోసం వస్తానంటే వద్దంటారు

నిర్వ్యాపార పారాన్ని ముట్టిన

నిరంతర స్తబ్ద శబ్దంలా

ఏమిటో మాట్లాడుతున్నారు

ఇంతకూ ఏం చేస్తున్నారు’

మనుష్యుల్ని కలుస్తున్నాను

ప్రయోజకత్వంమంటే ఏమిటో

తరచి చూస్తున్నాను

గతంలో చేసిన

పనికిమాలిన పనుల్ని

సమీక్షిస్తున్నాను

మా ఆవిడను మరింత పరిచయం చేసుకుంటున్నాను

పిల్లల్ని ప్రేమగా విపులంగా గమనిస్తున్నాను.

గతం కంటే వర్తమానమే

విలువైందని అవగతం చేసుకుంటున్నాను

భవితవ్యానికి ఆహ్వానం పలుకుతున్నాను

గానుగెద్దు జీవితానికి స్వస్తి చెప్తూ

ఏనుగెక్కినంత సంబర పడి పోతున్నాను

నాకు కాదు

నా మనసుకు తీరిక లేదని విన్నవించుకుంటున్నాను.

డా౹౹ ఎన్. గోపి

First Published:  30 Jan 2023 6:46 AM GMT
Next Story