Telugu Global
Arts & Literature

ఫారిన్

ఫారిన్
X

కళ్లకు

గ్లామర్ పొరలు కప్పినై గాని

అక్కడా ఇదే ఏడుపు.

విమానంలో వెళ్లటం వల్ల కాబోలు

విదేశాలకు విలువ పెరిగింది

ఎయిర్‌పోర్టులన్నీ ఒకటే

పరమ కవితాత్మకంగా వుంటాయి.

ఫ్లైట్ దిగి

ఊరి వైపు వెళ్తుంటే

అక్కడ కూడా మురికి పేటలు

కాకపోతే డిజైన్లు మారు తుంటాయి.

అమెరికా నిండా

అలవి గాని నిశ్శబ్దం,

పెద్ద రోడ్లన్నీ కార్ల కోసమే.

మన లాగ అవి

పాదాల మొగ్గల్ని పుయ్యవు.

అక్కడ మన పిల్లలు

ఉద్యోగాలకు వెళ్లినప్పుడు

సీనియర్ సిటిజన్స్‌కు

యాంత్రికత మొదలౌతుంది.

ఇండ్లలో అన్నీ వుంటాయి

కానీ అవేవీ

ఒంటరితనాన్ని పూరించవు.

కాన్పు కోసం వచ్చిన తల్లికి

దేశం వైపు గాలి మళ్లుతుంది

కారులోంచి

సూట్‌కేసులు దించేటప్పుడు

పరిచితమైన మాటలు విని

వాకిట్లో పువ్వులు

మరింత ఎరుపెక్కుతాయి.

ఇండియాకొచ్చిన తండ్రి

పిల్లల ఆస్తులకు

కేర్‌టేకర్ అవతార మెత్తుతాడు.

ఇప్పుడు బ్యాంకుల నియమాలన్నీ

కరతలామలకం

అమ్మకు బాగా లేదు

అప్పుడు రాలేక పోవచ్చు

అంతా స్పష్టం!

తండ్రి ముసలి వాకింగుల్లో

ఒకప్పుడు ఆదేశం గురించి

గర్వంగా చెప్పేవాడు

ఇప్పుడు ఎక్కువగా మౌనంగానే వుంటున్నాడు.

భవిష్యత్తు పొగమంచులా ఉండేది

సూర్య కిరణాలు మృదువుగా నిమిరేవి

ఇప్పుడు గుచ్చుకుంటున్నాయి.

- డా౹౹ ఎన్. గోపి

First Published:  5 Sep 2023 7:43 PM GMT
Next Story