Telugu Global
Arts & Literature

అపరిచితుడు ..!! (కథ )

అపరిచితుడు ..!! (కథ )
X

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.

నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజు ఎందుకో పేషేంట్స్ తక్కువగ రావడం వల్ల కాస్త సమయం చిక్కింది. పత్రిక బయటకు తీసానో లేదో,అప్పుడే,ప్రక్క డిపార్ట్మెంట్ వైద్యమిత్రుడు ‘హలో ..సార్ !’అనుకుంటూరావడంతో ,పత్రిక తిరిగి లోపల పెట్టేసి ఇద్దరం పిచ్చాపాటి కబుర్లలో పడ్డాము.

ఆ కబుర్లు కాస్తా,ఆసుపత్రి రాజకీయాలను దాటి,అసలు దేశ- రాజకీయాల్లోకి మళ్ళీ,ఇద్దరి మధ్య వాదోపవాదాలు వేడెక్కుతున్న సమయంలో,పోస్ట్ మాన్ -సుభాని అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

సుభాని,వస్తే ముందు ఆఫీసుకు వెళ్లి, ఆ తర్వాత నా దగ్గరికే వస్తాడు.

సాధారణంగా ఆసుపత్రిలో నాకే ఉత్తరాలు ఎక్కువగా వస్తాయి, ఎందుచేతనంటే,నాకు అప్పట్లో ఉత్తరాలు రాసే అలవాటు బాగా వుండేది కాబట్టి!

ఇంకో విశేషం ఏమిటంటే,నాకు ఉత్తరాలు రాని రోజుకూడా,అలవాటు చొప్పున నా దగ్గరికి వచ్చి పలకరించి పోతుంటాడు. అంతేకాదు నేను రాసిన ఉత్తరాలు తీసుకెళ్లి పోస్ట్ చేసే పనికూడా అతనికే అప్పగించేవాడిని

పండుగలకు-పబ్బాలకు,పదో,పాతికో అతని జేబులో పెడుతుండడం వల్ల అతను ఒక బాధ్యతగా భావించి రోజూ కలుస్తుండేవాడు.

ఆ.. రోజుకూడా మామూలుగానే,సుభానీ వచ్చాడు కాబోలు అనుకున్నా !

కానీ,పత్రికలవాళ్ళు పారితోషికంగా పంపిన,రెండువందల యాభై,రూపా-యలు,మనియార్దరు,ఒక పోస్ట్ కార్డు ఇచ్చిపోయాడు సుభాని. ఈ సమయంలో తనకు చిన్న పని ఉందంటూ.

వైద్య మిత్రుడు తన డిపార్ట్మెంటుకు వెళ్లిపోవడంతో,డబ్బులు పర్సులో పెట్టుకుని,చదువుదామని , పోస్ట్ కార్డు,చేతిలోకి తీసుకున్నాను.

అది ,నాసహాధ్యాయిని,మిత్రురాలు, శ్రీమతి శోభ రాసిన పోస్ట్ కార్డు.

ఆమె నాకు ఎప్పుడూ ఉత్తరాలు రాయదు,పైగా పోస్ట్ కార్డు రాయడం ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి మనదేశం లోను,సాధారణ వ్యక్తుల చేతిలోనూ,మొబైల్ ఫోన్లు ఇంకా విజృంభించక పోవడం వల్ల,సమాచార నిమిత్తం కార్డులు ,కవర్లు,అత్యవసరం అనుకుంటే,ట్రంక్ కాల్ లు,టెలిగ్రామ్ లు వాడుకలో ఉండేవి. చిన్న చిన్న విషయాలకు పోస్ట్ కార్డులనే వాడేవారు!

శోభ,నేను ,అప్పుడప్పుడు ,ఏదో సందర్భంలో,స్వగ్రామంలో,కలుసుకోవడం తప్ప,ఇలా ఉత్తర -ప్రత్యుత్తర సాంప్రదాయాలు మా మధ్యన లేనే లేవు.

వృత్తి రీత్యా తాను ,తూర్పు గోదావరి జిల్లా,అమలాపురం లో పని చేస్తుంటే,నేను అప్పటి వరంగల్ జిల్లా మానుకోట లో పని చేస్తుండేవాడిని. మహబూబాబాద్ గా స్థిరపడ్డ ఈ ఒకనాటి తాలూకా ఇప్పుడు జిల్లా అయింది ,అది వేరే విషయం !

ఇంతకీ,శోభ ఉత్తరంలో ఏమి రాసిందో, ఎందుకు రాసిందో,అని ఆత్రంగా పోస్ట్ కార్డు చదవడం మొదలు పెట్టాను.

‘’డియర్ శశాంకగారూ నమస్తే.!నా నుండి ఉత్తరం రావడం,అదికూడా పోస్ట్ కార్డు రూపంలో రాయడం ,మీకు కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఎవరికైనా అది సహజం కూడా !అయితే విషయం చాలా చిన్నది కనుక,మీరు అన్యధా భావించరని నాకు బాగా తెలుసు కనుక ధైర్యంగా పోస్ట్ కార్డు రాయడానికి సాహసం చేసాను. మీరు ,మీ శ్రీమతి ,ఎలా వున్నారు ? ఆవిడను అడిగినట్లు చెప్పండి.

ఇంతకీ ,అసలు విషయం ఏమిటంటే,వారం రోజుల క్రితం మీ మిత్రుడు రాంచందర్ ,తన ఆఫీసు పనిమీద కాకినాడ నుండి ఇక్కడికి వచ్చాడు. అతను సాంఘీక సంక్షేమ విభాగంలో పని చేస్తాడట. అత్యవసరం వచ్చి,నేను ఇక్కడ వున్నవిషయం గుర్తుకు వచ్చి,మీ పేరు చెప్పి నా దగ్గర అయిదువందల రూపాయలు తీసుకువెళ్లాడు. మీ పేరు చెప్పగానే ఇక ఏమీ ఆలోచించకుండా,మారు మాట్లాడకుండా డబ్బు అతని చేతిలో పెట్టాను. కానీ,తర్వాత ఎందుకో అతనిమీద అనుమానం వచ్చింది.

ఆ.. అనుమానం నివృత్తి చేసుకోడానికే మీకు ఈ ఉత్తరం. మీ వీలునుబట్టి రిప్లై ఇవ్వండి ‘’ఇది ఉత్తరంలోని సారాంశం.

ఉత్తరం పూర్తి చేయగానే,నాకు వ ళ్ళంతా ,ముచ్చెమటలు పట్టాయి.కాస్తకుదుట పడ్డాక,ఆరు నెలల క్రితం జరిగిన ఒక వింత సంఘటన నా మదిలో మెదల సాగింది.

xxxxxxxx

అది జనవరి నెల. ఈ నెల నాకు రెండు రకాలుగా అతి ముఖ్యమైనది.

మొదటిది,నా పుట్టిన రోజు. రెండోది,నాగార్జున సాగర్ దక్షిణ విజయపురిలో,వంటరిగా ఉంటున్న పెద్దక్క,ప్రతి సంక్రాంతి పండగకి,నన్ను,

నా శ్రీమతిని ,ఆహ్వానించడం వల్ల, క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం,ఆ..

సమయంలో సాగర్ చేరుకోడం.

ఆ.. సంవత్సరం కూడా,సంక్రాంతి పండగకి,అక్క దగ్గరకు వెళ్లి,సంబరాలు బాగా జరుపుకుని,సెలవులు అయిపోయిన తర్వాత,తిరుగు ప్రయాణమై మహబూబాబాద్ చేరుకొని, హడావిడిగా,డ్యూటీ కి వెళ్లే క్రమంలో,ఆటోలో ఇంటికి చేరుకున్నాం.

లగేజి క్రింది పెట్టి,నేను తలుపు తాళం తీయడానికి,ఉపక్రమిస్తుండగా, తలుపు గొళ్ళెం నుండి మడత పెట్టిన చిన్న కాగితం ముక్క జారీ క్రిందపడింది. అది తీసి జేబులో పెట్టుకుని,తలుపుతీసి,లగేజి లోపల పెట్టి,కాగితం ముక్క మడతలు విప్పి,చూసాను. అక్షరాలు ముత్యాల్లా గుండ్రంగా వున్నాయి.

‘’డియర్ సార్ ,

నమస్కారం. ఖమ్మంలో వున్న మీ అన్నయ్య రాజు గారు ,నేను క్లోజ్ ఫ్రెండ్స్ మి .ఇద్దరం కలిసి ఒకే డిపార్ట్ మెంట్ లో ఖమ్మంలో పని చేసాం. మీరు ప్రతి ఆదివారం క్లినిక్ నడపడానికి ఖమ్మం రావడం నాకు తెలుసు.

నేను ఇటువైపు పనిమీద వస్తుంటే, మీ అన్నయ్య రాజుగారు,మిమ్ములను , తప్పక కలిసి చూసి రమ్మన్నారు. అదే పనిమీద ఇక్కడకు వస్తే, ఇంటికి తాళం వేసి వుంది. మిమ్ములను కలవలేక పోవడం నిజంగా ,నా దురదృష్టం. వీలయితే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను

---కుమార్. ‘’

అని వుంది.

‘’అయ్యో .. కష్టపడి మనల్ని చూడ్డానికి వచ్చాడు ఆయన. సమయానికి మనం లేకుండా పోయాము కదా !’’అనుకున్నాం ,నేను మా ఆవిడానూ!

నేను హాస్పిటల్ కి,నా శ్రీమతి బ్యాంకు కు వెళ్ళడానికి,హడావిడిగా సన్నద్ధ మవుతున్న సమయంలో,మా హడావిడికి బ్రేక్ వేస్తూ కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూద్దును కదా ,ఒక అందమైన అపరిచితవ్యక్తి నవ్వుతు బయట నిలబడి వున్నాడు. నన్ను చూడగానే,రెండు - చేతులు జోడించి

‘’నమస్తే సార్ ‘’అన్నాడు.

‘’ఎవరు మీరు ?ఏమి కావాలి మీకు ?’’అన్నాను అతనికి ప్రతి నమస్కారం చేస్తూ.

‘’గంట క్రితం మీ ఇంటికి వచ్చాను సార్,ఇంటికి తాళం వేసి వుంది, అందుకే చిన్న ఉత్తరం రాసి పెట్టి వెళ్లాను. మీరు చూడ లేదా సార్ ?అందుకే , ఎందుకైనామంచిదని,వెళ్లిపోయేముందు మళ్ళీ ఓ సారి ఇలా వచ్చాను’’ అన్నాడు ,ఎంతో వినయంగా.

‘’ఓహో .. మీరేనా,ఆ ఉత్తరం రాసి పెట్టింది !మీరు కుమార్ గారు కదూ..

రండి లోపలి కి రండి’’అని,ఇంట్లోకి ఆహ్వానించి,సోఫాలో కూర్చోమన్నట్టుగా,కళ్ళతో సైగ చేసాను. అతను సోఫాలో కూర్చొని,ఉత్తరంలో రాసిన విషయాలే మళ్ళీ ప్రస్తావించాడు.

‘’సంతోషం కుమార్ గారూ !,మిమ్ములను ఇబ్బంది పెట్టాం సుమండీ !ఒక కప్పు కాఫీ తాగి వెల్దురు ‘’అని,నా శ్రీమతికి,కాఫీ పెట్టమని పురమాయించి, రాజు అన్నయ్యకి ఒక పేకెట్,కుమార్ అనే ఆ ఆగంతకుడి కి ,ఒక పేకెట్ ఫిజీషియన్ సాంపిల్స్ పేక్ చేసి,ఆయన చేతిలో పెట్టి,ఇద్దరం కలిసి కాఫీ తాగాం.

మా హడావిడి గమనించి,అతను కూడా లేచి థ్యాంక్స్ చెప్పి,వెళ్ళిపోయాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా,నేను హాస్పిటల్ కి,నా శ్రీమతి బ్యాంకు కు,బయలుదేరి వెళ్ళిపోయాము.

ఆసుపత్రిలో ,నా పనిలో నేను నిమగ్నమై,పని చేసుకుంటున్న సమయంలో,ఒక గంట వ్యవధిలో ఆ.. కుమార్ అనే వ్యక్తి అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అతనిని లోపలికి పిలిచి,కూర్చోమని చెప్పి,విషయం ఏమిటో చెప్పమన్నట్టు కళ్ళతో సైగ చేసాను. అతగాడు,ఎందుకో కాస్త సిగ్గు పడుతున్నట్టుగా,హావభావాలు చూపిస్తూ -

‘’ఎలా చెప్పాలోతెలీడం లేదు సార్ "‘అన్నాడు,కాస్త నసుగుతూ !

‘’ఫర్వా లేదు చెప్పండి,ఇక్కడ వేరే వాళ్ళు ఎవరూ వుండరు ,ఇబ్బంది - లేదు ‘’అన్నాను.

‘’ఏమో .. ఎలా చెప్పాలో తెలీడం లేదు,చచ్చెన్త సిగ్గుగా వుంది సార్ ‘’ అన్నాడు.

‘’ఫరవాలేదు చెప్పండి ‘’అన్నాను,కాస్త విసుగు ప్రదర్శిస్తూ.

‘’హా .. చెబుతాను సార్. నేను మా చెల్లాయికి పెళ్లి సంబంధాలు చూసే నిమిత్తం,రెండు రోజుల క్రితం కొత్తగూడెం వెళ్ళవలసి వచ్చింది. అనుకోని రీతిలో రెండురోజులు అక్కడ వుండవలసి వచ్చింది. తెచ్చిన డబ్బులు అయిపోయాయి. మీరు రెండు వందలు ఇవ్వగలిగితే ,నేను ఖమ్మం వెళ్లి మీకు వెంటనే మానియర్ధరు చేస్తాను. ‘’అన్నాడు దీనంగా.

నిజానికి నా పర్సులో ఎప్పుడూ వందకు మించి పెట్టుకునేవాడిని కాదు !

అందుచేత ,చిన్న ఉత్తరం రాసి ఇచ్చి,బ్యాంకుకు వెళ్లి నా శ్రీమతి దగ్గర తీసుకోమన్నాను.

అతని అడ్రసు నా డైరీ లో రాసాడు. లేండ్ లైన్ ఫోన్ నంబర్ ఇచ్చాడు.

తాను రంపచోడవరంలో పని చేస్తున్నట్టు,,అక్కడ అన్ని సదుపాయాలతో,గెస్ట్ హౌస్ లు ఉన్నట్టు ,మమ్ములను వచ్చి కనీసం అక్కడ ఒక వారం రోజులు వుండాలని ప్రాధేయపడ్డాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన నా శ్రీమతి ,తెలియని అలాంటి వ్యక్తికి డబ్బులు ఇవ్వడం తప్పు పట్టింది. అప్పటికి ఆమెకు యేవో కబుర్లు చెప్పి ప్రశాంతిపజేశాను. కుమార్ వెళ్లి వారం రోజులు దాటింది. బాగోదేమోనని,నెల రోజులు ఓపిక పడదామనుకున్నాను.

ఆనెలరోజులుకూడా అయిపోయాయి. ఒక శుభోదయాన నా డైరీ తెరచి,అతను ఇచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేసాను. అసలు రింగ్ అవుతున్న దాఖలాలు లేవు. ఓపిగ్గా నాలుగు రోజులు ప్రయత్నించాను ,ఫలితం దక్కలేదు.

ఎందుకైనా మంచిదని ,ఖమ్మం అన్నయ్య రాజు కి ఫోన్ చేసి విషయం వివరించాను. ఆయన చాలాసేపు నిశ్శబ్దంగా వుండి,తర్వాత పక .. పక, నవ్వుతూ ---

‘’ఒరేయ్ తమ్ముడూ !.. ఇంత తెలివైనవాడివి ,నువ్వు ఎలా మోసపోయావు రా ,తమ్ముడు,అసలు ఆ .. కుమార్ ఎవరో నాకు తెలీదు, ఇకనైనా జాగ్రత్తసుమీ"అన్నాడు.

xxxxxxxxxx

‘’ఏంటి డాక్టరుగారు,టైమ్ చాలా అయిపొయింది,ఏంటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు ‘’అంటూ ,అటువైపు వచ్చిన హెడ్ నర్స్ మాటలకు ఈ లోకంలోకి వచ్చి,నవ్వుతూ బయటికి వచ్చేసాను. అంతేకాదు, తెలిసినవాళ్లందరికి ఆ మోసగాడి బారిన పడకుండా ,ఉత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నాను.

--డా.కె.ఎల్ .వి.ప్రసాద్ .

First Published:  18 Nov 2023 1:04 PM GMT
Next Story