Telugu Global
Arts & Literature

దీపావళి అంటే …. నా .. బాల్యమే గుర్తుకొస్తుంది - డా.కె.ఎల్.వి. ప్రసాద్ (హన్మకొండ)

దీపావళి అంటే …. నా .. బాల్యమే గుర్తుకొస్తుంది - డా.కె.ఎల్.వి. ప్రసాద్ (హన్మకొండ)
X

బాల్యం అంటే అందరూ తాము అనుభవించిన ఆనంద క్షణాలను ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు . ఎందుకంటే అవన్నీ సంతోష సంఘటనలు కాబట్టి.

అలాగే కొన్ని సంతోషకర విషయాలు ధనికుల ఇళ్లల్లోనే చూస్తాం . కారణం అవసరమైనంత ధనం వారికి అందుబాటులో ఉండడం . దీనికితోడు ఇంకా అనేకవిషయాలు ఆ పిల్లలకు కలిసిరావడం వల్ల వాళ్ళ బాల్యం ఆనందంగా గడిచిపోతుంది .అది వాళ్ళ అదృష్టం .

నా పరిస్థితి వేరు . దిగువ మధ్యతరగతి కుటుంబం . కష్టాలతో కలసి పయనించవలసిన వాతావరణం . మా నాయన వామపక్ష భావాలున్న కమ్యూనిస్టు కార్యకర్త . అలా కుటుంబ నేపధ్యం నాస్తికత్వం . పేదరికంలో చిన్న చిన్న కనీస అవసరాలు తీర్చలేనిపరిస్థితిమాతల్లిదండ్రులది.

తిండి విషయంలోనూ ,ఇతర లక్సరీల విషయంలోనూ పెద్దగా తేడా వచ్చేది కాదుగాని ,పండుగలప్పుడు మాత్రం సమస్యలు వచ్చేవి . అలాంటి పండుగల్లో దీపావళి ఒకటి .

దీపావళిరోజున ఇతరపిల్లలు టపాకాయలు ,కాకరపువ్వొత్తులు , వగైరా కాల్చుకుంటూ ఆనందంగా ఎగిరి గంతులు వేస్తుంటే .మాకు లోపలినుండి దుఃఖం ఉబికి .. ఉబికి వచ్చేది . తల్లిదండ్రులను అడిగి టపాకాయలు కొనుక్కునే పరిస్థితి లేదు . ఆస్తికులు అంటే ఏమిటో ,నాస్తికులు అంటే ఏమిటో తెలియని రోజులు .

కానీ దీపావళి రోజున ఇతర పిల్లల మాదిరిగా ఆనందించలేక పోతున్నామన్న బాధ మాత్రం అధికంగా ఉండేది .

మా ఇంటి వెనుక వరుసలో మా బంధువు కారిపెల్లి భీమారావు అనేఆయన దీపావళికి స్వంతంగా తాటాకుటపాకాయలు ,చిచ్చుబుడ్లు ,మతాబులు ,సిసింద్రీలు చేసేవాడు . వాటిని చూస్తూ ఆనందించేవాడిని .

మా గ్రామంలో టపాకాయలు వగైరా కొనుక్కోలేనివాళ్ళు ',చిటికెల పొట్లం ' తయారు చేసుకునేవారు . ఇది వడిసెల మాదిరిగా తిప్పుతుంటే , మతాబులు ,చిచ్చుబుడ్లు కాలుస్తున్నప్పుడు ,రాలే నక్షత్రపు వెలుగుల్లా రాలేవి . అవి ఎవరైనా తయారు చేసుకునే వెసులుబాటు ఉండేది .

మా పెద్దన్నయ్య (మా పెద్దమ్మ దత్తత తీసుకుంది )దీపావళికి వూళ్ళో ఉంటే రాత్రిపడేసమయానికి ,తాటాకు టపాకాయలు తెచ్చి ఇచ్చేవాడు . వాటిని చూస్తే ఎంత ఆనందం అనిపించేదో !

ఉద్యోగస్తుడినయినాక టపాకాయలు ఎన్నైనా కొనుక్కునే స్థాయి వచ్చినప్పటికీ ,బాల్యం నాటి సరదా బక్కచిక్కి పోయింది . అలా అని పిల్లల విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు . నిజానికి పిల్లలకు దీపావళి వెనుక వున్నకథా -కమామీషు తెలియదు . ఆ వయసు అలాంటిది . కేవలం టపాకాయలు , చిచ్చుబుడ్లు ,మతాబులు ,కాకర— పువ్వొత్తులు ,సిసింద్రీల మీదే వారి దృష్టి . అదొక ఆట ,అదొక ఆనందం కాస్త దీపావళి వెనుక వున్నకథ అర్ధం చేసుకునే వయస్సు వచ్చిన తర్వాత క్రమంగా టపాకాయలమీద మోజు తగ్గిపోతుంది . ఏదో మొక్కుబడి వ్యవహారం నడుస్తుంది . ' కరెన్సీని వృధాగా కాల్చేస్తున్నామా ?' అన్న భావన వాళ్ళల్లో కలగడమే దానికి కారణం .

ఇప్పుడు నాకుమనవరాలు , మనవడు వున్నారు . మతప్రమేయంలేకుండా వాళ్ళు దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు .

నా చిన్ననాటి అనుభవాల ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూసు కుంటాను . ఇప్పుడు నా వయస్సు 69 సంవత్సరాలు . ఇప్పటికీ దీపావళి పండగ వచ్చిందంటే , నాకు .. నా బాల్యమే గుర్తుకు వస్తుంది .

First Published:  23 Oct 2022 6:55 AM GMT
Next Story