Telugu Global
Arts & Literature

డిమ్కి ( కథ)

డిమ్కి ( కథ)
X

దైవాన దైవానందాన..

నేనెల్లిపోతా భాగమంతా...

దైవాన దైవానందాన

ధనముందీ భాగ్యముంది శంకరా...

దైవాన దైవానందాన..

కడుపూ.. లోపటా సంతూ బలమూ

లేదయ్యా.. దైవాన దైవానందాన

తెల్ల నిలువుటంగీ తొడుక్కొని, తలకు గులాబీరంగు తలపాగా చుట్టుకొని, భుజానికి జోలె,ఆనిగెపుకాయ బుర్ర (తంబూర) తగిలిచ్చుకొని,

ఎడమ చేతి వేళ్లకున్న అందెలను తంబూరకుతట్టుతూ, కుడి చేతి వేళ్లతోని తంబూర తీగలను

లయబద్ధంగా మీటుకుంటూ ఓ ఇంటి గేటుముందర నిలవడి పాడుతున్నడు శంకరయ్య,

అతని కండ్లు ఎంత తూడ్సుకున్నా తడి తడిగనే ఉంటున్నయ్. పాడుతుంటే నడువడుల గొంతు

బొంగురుపోతున్నది. గుండెలున్న బాధసముద్రపు అలల్లాగ ఉప్పొంగుకొస్తుంటే.. ఆ

బాధను దిగమింగుకుంట అట్లే పాడుతున్నడు.

కొద్దిసేపటికి ఒకాయన బయటికొచ్చి..

"మొన్న గుడ్క నీవే గదా వచ్చింది. మొన్న రెండ్రూపాలిస్తిగద!

మల్లొచ్చినవా? అందుకే

ఇయ్యగూడదు. ఒక్కసారిస్తే మల్ల మల్లొస్తరు.పో... పో... ఇప్పుడేం లేవు పో!" అని కసిరిండు.

"అయ్యా... సారూ ! కాల్మొక్త బాంచన్ ! ఎంతో

అంత ఇయ్యి సారూ ! పున్యముంటది!

దీనంగ బతిమ్లాడిండు శంకరయ్య,

""అరే.. పొయిరా పోయ్యా... ఇప్పుడేం లేవం

టున్న గద" చెప్పి ఎల్లిపోయిండతను.

తంబూరను మల్ల వాయించు

కుంట ఇంగో ఇంటి ముందుకు

పోయి పాడుతున్నడు శంకరయ్య,

"బిడ్డ బలమూ దీసుకోని

యెల్లిపోరాదా..

అయ్యో రామా.. దేవా రామా!

దేవా రామో... దైవ రామా...

యేమేవో బాల నాగు బిడ్డి

బలమూ నీవద్దకొస్తది...

బిడ్డ బలమూ ఇత్త నీకు....

తీసుకోని యెల్లిపోరాదా,

ఓ పోరగాడు గుమ్మం బయిటికొచ్చి రెండుచెవులల్లున్న ఇయర్ ఫోన్లు బయిటికి దీసి....

"పొద్దున్పొద్దున్నే యేమ్ లొల్లి పెట్టినవయ్యా....!పోయిరాపో.." అని గదిరిచ్చి, మల్ల చెవులల్లఇయర్ ఫోన్లు కుక్కుకొని ఇంట్లకు వోయిండు.

ఇలాంటి ఆగుమానాలు కొత్తేమి కాకున్నా,ఇయ్యాల ఆ మాటలకు గుండెల కలుక్కుమంటున్నది శంకరయ్యకు.చిన్నగ ముందుకు నడిచిండు. ఆ గల్లిపొంటి

వర్సగ ఒక్కో ఇంటి ముంగట నిలపడి పాడిండు.అదే ఆగుమానం మల్లమల్ల ఎదురయ్యింది.

ఆఖరుకు ఆ గల్లీ చివరి ఇంట్లకెల్లి ఓ ముసలామెబయిటికొచ్చింది. ఆశగ ఆమె చేతుల దిక్కేజూసిండు. ఆమె చేతిలున్న గిన్నె జూసి ఆమె

తెచ్చేది పైసలు గాదు... సద్ది బువ్వనో, ఎండిన రొట్టి ముక్కలో, నూకలో

అయ్యుంటయని అర్ధ

మయ్యింది శంకరయ్యకు. నిరాశగ నిట్టూర్చిండు.జోలెల ఇన్ని నూకలు వోషి పోయిందామె.

ఆండ్ల అక్కడక్కడ నల్లరాళ్లతో పాటు పురుగులు

"నాయన! ఇయాలనన్న నూకలన్నం వొండుకుందమే, మూడ్రోజులకించి బిస్కోట్లే తింటున్నం. మొకం గొట్టినట్టయ్యింది. కడుప్పుల బాగ నొప్పి గుడంగ లేస్తు న్నది... ఇంటినుంచి వొచ్చేటప్పుడు

చిన్న బిడ్డన్న మాటలు యాదికొచ్చినయ్. జోలెను సర్దుకొని మల్ల ఇంకో గల్లీకివోయిండు. ఆడ కొన్ని ఇండ్లు తిరిగినాక

ఓ ఇంటామొచ్చి రెండు రూపాయి బిళ్లలిచ్చింది.గీరెండ్రూపాలకేమొస్తయమ్మ..!కాల్మొక్త తల్లి.. జర సూశియ్ తల్లి...." అన్నడు.

"అగనే ..! పాపం గదా అంటాని పాత సీరిస్తే,గోడ సాటుకుపోయి మూరేసుకొని పైట కొంగు

సాలదని పంచాయితీ కొచ్చిందంట ఎన్కటికి నీ అసాంటిదే! ఎంతనో అంత ఇస్తి గద.. పోయి రా పో ఇక " కసిరి లోపలికెళ్లిపోయిందామె

మొకమంత చిన్నగ జేస్కాని అక్కడి నుంచి కదిలిండు శంకరయ్య,

"భలె భలె రామన్న రాయుడా...

అయ్యో.. భలె భలె రామారాయుడు..

భలె భలె రామా రాయుడా... రాయుడా..

రాయుడు కొండలరాయుడే..

రాయుడు!

రాయుడు ఏడుకొండల రాయుడే..

రాయుడు.."

సందులల్ల గొందులల్ల ఇల్లిల్లు దిరిగిండు.ఊరంత దిరిగిండు. గొంతెండుకపోయినాపాడిండు. కానీ, అంతగలిపి వంద రూపాలు

గుడ్క పోగు గాలేదు.

'పొద్దట్సంది దిరుగుతుంటే ఇవిన్నే వొచ్చినయ్.గిప్పుడెట్ల! యేమ్ జేతు.. యాడికి వోదు..' తనలోతానే రంది వడ్డడు.

"థు.. నీయవ్వ! యేమ్ బత్కులో ఏమో. ఊర్లపొంటి దిరుగుడు, గుడిసెలేసుకొనుడు, కథలు

జెప్పుడు, పాటలు వాడుడు. అడుక్కదినుడు!గింతేనా మా బత్కులు! | ఉరుకులాట ఉత్తచాట

నేనా? యేమ్ రాత రాశినవయ్యా మాకు. గిదేం జీవితమిచ్చినవ్ మాకు! నీ అడుక్కునే పని మాకప్పజెప్తివి.. నీ గుడిల మన్నువొయ్య! రూపాయికి..

ఆతానకు.. శారడు గింజలకు యేమ్ దిరుగుళ్లివి"..

గుండెలున్న ఆవేదనంతా యెల్లగక్కిండు. లొట్టలువడ్డ చెంపల గుంతలకెల్లి కండ్ల నీళ్లు గారి కిందకు

జరజరా రాలిపడుతున్నయ్.

సూర్యుడు నడినెత్తి మీదికొచ్చిండు. చెమటవట్టిన మొకాన్ని తుండు గుడ్డతోని తూడ్సుకుంట

నడుస్తున్నడు. అతని పొట్ట ఎముకలకు అంటుకపోయింది. అయినా ఓపికదెచ్చుకొని

అడుగులేస్తున్నడు. ఎటు జూసినా కండ్ల ముంగట సుక్కమ్మనే

మెదులుతున్నది.

***

తెలంజామున.. కూచున్నచోటనే కునికిపాట్లుపడుతున్న శంకరయ్యకు సడన్ల ఎవరో వొచ్చిగట్టిగ నూకినట్టనిపిచ్చెటాలకు ఉలికిపడి కండ్లుదెరిసి జూసిండు. నిన్నటిసంది మూసిన కన్నుతెరవలేకుండున్న తన పెండ్లాం సుక్కమ్మ చేయిపట్టుకొని,

రాత్రంత ఆమె పక్కన్నే కూచున్నడు.

ఎప్పుడు నిద్రవోయిండో అతనికే తెల్వదు.రాత్రంత వెచ్చగనే ఉన్న సుక్కమ్మ చేయి.. పొద్దటికి సల్లగనిపిచ్చింది. బెదురుబెదురుగా ఆమెమొకంలకు తొంగి జూసిండు. ప్రశాంతంగ నిద్రవోతున్నది. కాదు.. నిద్రవోతున్నట్టు ఉంది.

చూస్తుండంగనే పొద్దు

పొడుచుకొచ్చింది.

సుక్కమ్మ నిద్రలనే అస్తమించిందని అర్థమయిన శంకరయ్యకు ఒక్కసారిగా గుండెలు లబలబమ

న్నయ్. మొదటిసారి ఆమె చేయి పట్టుకుంటేశంకరయ్యకు చెయ్యి వొణికింది. నెత్తి దిమ్మన్నది.

ఉలుకూపలుకూ లేకుండ అట్లే ఉండిపోయిండు.కొద్దిసేపటివరకు మైండు పన్డేయలేదు.

"నన్నిట్ల ఆగం జేసి పోతవనుకోలేదు

సుక్కమ్మ !"....తన కండ్ల నీళ్లు తన మాట వినలేదు.

పిల్లలు ఎక్కడ నిద్ర లేస్తరో, తల్లి ఊపిరిడిసిందని దెలుస్తే యాడ గుండెవల్గుతరోనని ఏడుపు బిగపట్టుకున్నడు.అంతలనే ఏదో మతికొచ్చినోడిలాగ తనఅంగి జేబుల చేయి పెట్టి జూస్కున్నడు. ఎంతదేవులాడినా ఓ పది రూపాల నోటు, నాలుగురూపాయి బిళ్లలు తప్ప ఇంకేం దొరికి లేవు.'సుక్కమ్మను సాగనంపేదెట్లా..! శిల్లర తప్పనాతాన ఇంగేం లేవు. కనీసం పాడెగట్టనీకె గుడంగ పైసల్ లేవు. థు !. బత్కుల మన్నువడా !'.

శంకరయ్య కండ్లపొంటి బిరబిరా నీళ్లు గారినయ్.పానమంత కశిబిశయ్యింది. యెక్కడ దోస్తలేదు.

"నాయిన.. ఏంటికే గంతగానం ఫికర్లేస్తున్నవ్ !ఏం గాదులే. అమ్మకు మంచిగయితది గాని".అప్పుడే నిద్ర లేసొచ్చిన తన పన్నెండేండ్ల

కొడుకు మొకం జూడంగనే ఇంగింత యేడ్పొచ్చింది శంకరయ్యకు.

చేతిలున్న చిల్లర పైసల దిక్కు

జూసిండు. సుక్కమ్మకు పానం బాగలేనప్పట్సంది ఎప్పుడన్నిట్ల

పదో పరకో ఉన్ననాడు పొద్దుగాల్నే ఇంత నీళ్లచాయ్ వెట్టి, పక్క గల్లీలున్న మల్లయ్య దుకునంకాడికి వొయి ఆమె కోసం డబల్ రొట్టి దెచ్చెటోడు.

సుక్కమ్మకు చాయ్ లో డబల్ రొట్టె అద్దుకొని తినడమంటే చానిష్టం. పోయిన వారం ఆమెకుమందులు కొనంగ మిగిలిన చిల్లరతోని తెచ్చిండు.డబల్ రొట్టె తెచ్చిన్నాడు తృప్తిగ తిని గోలీలేసుకునేది. లేకుంటే వట్టి చాయ్ తాగి ఏసుకునేది,

చాపత్త లేన్నాడు వట్టిగనే ఏసుకొని కడుపునిండనీళ్లు తాగేది. వందల

రూపాలు పెట్టి గోలీలు దెచ్చు

కునే సౌత్రం లేక ఈ మధ్య అయి గుడ్క లేకుండయినయ్. వట్టిళ్లే తాగుతున్నది.

'ఇగ గా దుకునం కాడికి వొయ్యే

పన్లేదు' మనసులనే అనుకొని, గుడ్లనిండ నీళ్లు పెట్టుకున్నడు.

"ఈ పై.. సలు కొండవోయి నీకు, తమ్ముడికి,చెల్లెల్లిద్దరికి బిస్కోట్లు దెచ్చుకొని తినుండి "

అన్నడు. గొంతులో ఎక్కడలేని తత్తరపాటు.

"వొద్దులే నాయిన! అమ్మకు డబల్ రొట్టంటేఇష్టం. ఇయి అమ్మ కోసమని తీష్పెట్నం గద.మేము సద్ది బువ్వ అడుక్కొచ్కుంటంలే! ఎవలన్న

వెడ్తె తెచ్చుకొని తింటంగాని. నీవేమ్ ఫికర్జేయకు.ఇయాలనన్న అమ్మ లేషి గింత ఎంగిలివడ్డే మంచి

గుండు".. అంటున్న కొడుకు కండ్లల్లోకి సూటిగ జూడలేక పోయిండు.

"ఇగ మీయమ్మ కోసం పైసలు దీష్వెట్టే

అవ్సరం లేదు బిడ్డా ... పైకి అనే ధైర్నం రాక,మనసులనే అనుకున్నడు.'తల్లి గురించి గిప్పుడే దెలుస్తే నేనొచ్చేటాలకుపిల్లలెంత బుగుల్వట్కుంటరో. గందికే గిప్పుడు

జెప్పకపోవుడే మంచిది'

అనుకున్నడు.

"ఇవి నీతాననే ఉంచు బిడ్డా! నేనట్ల ఊర్లక్వోయ్యొస్త !". కొడుకు చేతికి పైసలిచ్చి నెత్తికి తలపాగా చుట్టుకొని, ఎడమ భుజానికి జోలె తగిలి

చ్చుకున్నడు. గుడిసెకు మూలపక్కకు ఆనిచ్చున్నఆనిగెపుకాయ బుర్రను భుజమ్మీదికెత్తుకొని,ఎడమ చేతి వేళ్లకు అందెలు తొడుక్కున్నడు. అదే

మూలపక్కకున్న డిమ్కి దిక్కు జూషిండు.

అదిరెండు వారాలకేంచి ఆడ్నే ఉంది.

"దాన్ని మల్ల సుక్కమ్మ చేతిల ఎన్నడు జూస్తనా'అని ఎదురుజూడని దినం లేదు శంకరయ్యకు.ఇంకిప్పుడు ఆ అవ్సరం లేదని గుర్తుకొచ్చి లోపలో

పల్నే కుమిలిపోయిండు.

ఆమెకొచ్చింది ఏ కాన్సర్ రోగమో, గుండెజబ్బో లేక ప్రపంచాన్నే వణికించిన కరోనానో కాదు. అంతకంటే పెద్దరోగం.. పేదోళ్ల

రోగం.. ఆకలి రోగం! అవును ఆకలి రోగం...ఈ భూమ్మీద అన్ని రోగాలకంటే భయంకరమైన రోగం.

శంకరయ్య, సుక్కమ్మ ఊరూరు తిరుక్కుంటబుర్ర కథలు, భాగవతం చెప్తుంటరు. వాళ్లకు నలుగురు పిల్లలు. వాళ్లకంటూ ఓ ఇల్లు లేదు,

జాగలేదు. ఊర్లపొంటి తిరగడం, ఎక్కడికి వోతే అక్కడపొయ్యి పెట్టుకోడం, గుడిసెలు ఏసుకోనుండటం,

ఇంటింటికి వోయి అడుక్కోడం.. ఇదే వాళ్ల బతుకు

చిత్రం. యాడాది క్రితమే ఇదివరకుంటున్న ఊరి

నుంచి మరో ఊరికొచ్చిన్రు ఈ సంచార జీవులు.ఊరి బయటనే మూడు వంకర్ల గుడిసేసుకొనిఉంటున్నరు. అప్పటికే ఒకసారి కరోనా మహమ్మారి వీళ్ల కడుపులు గొట్టింది. యెట్లనో ఇకమతులు వడి అప్పుడప్పుడే ఆ పరిస్థితుల నుంచిజెర కోలుకుంటున్నరనంగ మల్ల రెండోసారొచ్చివీళ్ల బతుకులను ఇంగింత ఆగం జేశింది.

కొత్త ఊరికొచ్చినాక కుటుంబమంతా కడుపునిండ తిని కొన్ని నెలలైతున్నది. ఆలుమగలిద్దరు

రోజంతా ఊర్ల ఇంటింటికి వోయి బుర్ర కథలు జెప్పుకొంట యాచన చేసొస్తేనే కశికిన్ని నూకలు,చిల్లర పైసలొచ్చేవి. ఎవలన్న సద్ది బువ్వనో,

ఎండిన రొట్టె ముక్కలో ఇస్తే.. ఇగ ఆ పూటకుఅయి తిని, ఆపత్కాలంల పనికొస్తయని నూకలు తీసిపెట్టేది సుక్కమ్మ.

బుర్ర కథలు చెప్పని టైంలతాటాకులు దెచ్చిఅవిటిని ఎండవెట్టి చాపలు, బుట్టలు అల్లి ఊర్లకువోయి అమ్ముకొచ్చేది. కుదార్థంగ ఓ తాన ఉండలేని బతుకులు గావట్టి,

పిల్లలను సదివియ్యనీకె

గుడంగ లేకయే. అంతేగాకుండా.. పెద్ద కొడుకును బడికి పంపుదమని చూస్తే ఓ తాన కులం సర్టిపికెట్ లేదని, ఇంకోతాన అంటరానోళ్లని బల్లెకురానియ్యలేదు. ఇగ అట్ల పెద్దాడికి సదువు లేకపాయే. గసొంటి అగుమానాలు వడలేక తక్కినపిల్లలను గూడ బళ్లెకు పంపే ధైర్నం జేయలేదు.

ఇగ బతుకుదెరువు కోసం, ఎట్లనో ఓలాగబతుకీడ్సాలె గావట్టి వాళ్లు గుడ్క తలా ఒక పనిజేస్కుంట అమ్మ నాయినకు ఆసరయ్యేది.

పెద్ద కొడుకు రబ్బరు బిందెలమ్ముతే, మిగతాముగ్గురు చుట్టుపక్కల పాత బట్టలు అమ్ముకొచ్చేటోళ్లు. దమ్మిడి ఆదాయం లేకున్నా గడియ తీరిక

లేకపోతుండే. కుటుంబమంత కష్టపడితే వొచ్చేపైసలతోని అట్లెట్ల

ఆ దినం గడిచిపోయేది.

కానీ, కరోన వొచ్చినంక వాళ్ల బతుకులు పూరఅద్వానమైనయ్. ఇల్లిల్లు దిరిగి అడుక్కుంటేనే

వాళ్లకు బతుకెల్లేది. కానీ, ఊర్లపొంటి తిరుగుతుంటరని వాళ్లను ఇండ్ల ముంగటికి గుడంగ రానిచ్చే

టోళ్లు గాదు. పూట గడువడం గూడ కష్టమైపోయింది. చేతికి పనిలేదు.. కడుపుకు ఆసర లేదన్నట్లయ్యింది.

అసలే ప్రతి ఒక్కరి చేతులల్ల సెల్ ఫోన్లుంటున్నఈ రోజుల్లో వీళ్లను పిలిసి కథలు చెప్పించుకునేటోళ్లే కరువయ్యిగ్రంటే.. ఇగ కరోనా వొచ్చేటాలకువాల్ల జీవనాధారమే ప్రశ్నార్థకమయ్యింది.

దినాము దొరికే సద్ది బువ్వ గుడ్క లేకపాయే.ఇదివరకు వాళ్లూ వీళ్లూ ఇచ్చిన నూకలను రోజుకొక్క పూటనే.. అదీ పిల్లల వరకే కొన్ని వోషి

వండేది సుక్కమ్మ. వండిన ఆ పిడికెడు నూకలన్నంతోని నలుగురు పిల్లల కడుపులు పూర్తిగ నింప

లేకపోయినా వాళ్ల ఆకలిని కొంతవరకు తీర్చగలిగేది. ఎప్పుడన్న అవి గుడంగ కరువైనప్పుడు చిల్లర

పైసలేమన్నుంటి బిస్కెట్లు తెచ్చుకొని నీళ్లల్లదుకొనితిని ఆకలి తీర్చుకునేది పిల్లలు.

కానీ.. కడుపుల పేగులుకుంటయా! అవిపెట్టే తిప్పలకు శంకరయ్య అట్టిట్ల తట్టుకోనుంటున్నడేమో గానీ సుక్కమ్మ కొన్ని రోజులకు తట్టుకో

లేకపోయింది. రాత్రిపూట కడుపుల నొప్పిలేషిగిలగిల కొట్టుకలాడేది. ఆమేనట్ల జూసినప్పుడల్ల

శంకరయ్య పానం తన్నుకలాడేది.

ఉన్న ఆయిన్నినూకలు వండుకుంటే రేపట్నాడు పిల్లలు ఆకలికి

నకనకలాడాల్పోస్తది. అందుకే ఇగ కడుపు నింపుకోమని గిలాపడు నీళ్లు తెచ్చియ్యడం తప్పఇంకేం చెయ్యలేని పరిస్థితి శంకరయ్యది.

ఓనాడిటే తాటాకులు దెచ్చుకోనీకి వోతుంటేనడులనే చెక్కరొచ్చి పడిపోయింది సుక్కమ్మ. వాళ్ల

కాళ్లూ వీళ్ల కాళ్లు పట్టుకొని శంకరయ్య ఎట్లనోఓలాగ ఆమెను దవాఖానకు దోల్కవోతే కడుపునిండ తినమన్నడు డాక్టర్ సాబ్..

తిన్నది.. కడుపునిండ ఆకలిని తిని గోలీలేసుకుంది.. నాలుగైదు రోజుల కింద అవి గుడ్క ఆయిపోయినయ్. అందుకే హాయిగ, శాశ్వతంగ నిద్ర

పోయిందియ్యాల

"తమ్ముడు, చెల్లెల్లు భద్రం! నేనొచ్చిందాంకమీయమ్మను లేపకుండ్రి. పాపం దినాము కడు

పుల నొప్పిలేషి తనాడుకుంట నిద్రవోకుంటుండే.ఇయ్యాల నొప్పి లేనట్టుంది. మంచిగ నిద్రపట్టిన

ట్టుందేమో పందుకుంది. నేను వొయ్యొస్త "-కొడుక్కు జెప్పి కండ్లల్లకెళ్లి దుంకుతున్న నీళ్లనుఅంగీతోని పొత్తుకొని, కొంచెం ముందరికి వొంగి

గుడిసె బయటికి నడిచిండు.

"దివాము పొట్టకూటి కోసం కథలు చెప్పినఇయ్యాల నీ కోస్రం జెప్త సుక్కమ్మ! పెండ్లినాడు నా ఎంబడేసిన ఏడడుగులతోని మొదలుపెట్టి, నాఎంబడి వంత పాడుకుంట, డిమ్కి వాయించు

కుంట ఊరూరు, ఇల్లిల్లు తిరిగి తిరిగి ఇయ్యాల అలిసి పోయి పండుకున్నవ్. యేనాడూ నీకోసం ఏమీ అడగని నీవు.. ఆ నాడు మొదట్బరి నోరు.చెరిషి "గీ గాజు లేపిచ్చుకొని రెండేండ్లయితుంది.

పండ్లకు కొత్త గాజు లేపిస్తవాయ్యా.." అంటానిఅడిగితివి. గాయింత ముచ్చట గుడ్క దీర్చలేకపోతి . కనీస్రం సావులనన్న యేమ్ లోటు లేకుండ నిన్ను సాగనంపనీకే వేత్త... సుక్కమ్మ యాదు

అన్ని ఒక్కోటి కండ్ల ముందుకొచ్చి కదలాడేటాలకుగుండి వాగయ్యింది శంకరయ్యకు, చిన్నగ ఊరిబాట పట్టిండు.వొచ్చిన ఆ కొన్ని పైసలను జేబులేస్కొనిబుగులు బుగులుగ నడుస్తున్నడు శంకరయ్య.

డే జంగమయ్యా! ఇగో నిన్నే ! " ఎన్కనుంచిఎవరో పిలిండ్రు. కండ్లు తూడ్సుకొని తిరిగిచూసిండు. దూరంకెల్లే ఒకాయన రమ్మని సైగ

చేస్తున్నరు. శంకరయ్యకు మనసుల ఏదో ఆశ చిగురించింది. ఇప్పజెప్ప నడ్సుకుంట పోయిండు.

"మా తాత సచ్చిపోయిండు. ఇయ్యాల దినాలున్నయ్. పొదటుంది ఎవలన్న కథ జెప్పేటోళ్లు

గనవడతరేమో అంటాని సూస్తుంటే నీవ్ గనవడితివి. వొస్తవా మాఇంటికి"

అతనన్న మాటలకు శంకరయ్యకు పానం లేసొచ్చినట్టయ్యింది.

శంకరా ! ఈ శంకరయ్య తిప్పలు సూడలేక ఆదుకోనీకొస్తివా... మన

సులనే శివయ్యకు దండం బెట్టుకొని, ఊపిరి పీల్చుకున్నడు. ఇంకేం ఆలో

చించకుండా వెంటనే..

"అట్లనే సారు!" అన్నడు.

"అవ్.. వంతెగాల్లెవ్వరు లేరా?

నీ వొక్కనివే పాడతవా?"

అడిగిండతను.

"మా ఇంటాయిమెకు జెర సుస్తయ్యి రాలేదు సారు. నేనే పాడుత

బాంచెన్!" అన్నడు శంకరయ్య.

**

"ఇంటో రాజుబాబు.. ఇంట రాజుబాబు.. బాల!

హయ్యో రామ రామా.. బాల!

నీ తాత రంగరాజే.. బాల!

నువు సిన్నగున్నాడు.. బాల!

సంకల్ల యెత్తుకోని.. బాల!"

ఓపక్క సుక్కమ్మను సాగనంపనీకె పైసలొస్తయన్న సంతోషం.. మరో

పక్క తన సుక్కమ్మ ఇంక లేదన్న దుఃఖం.. రెండూ కలిపి గుండెలను మెలితిప్పుతున్నా దిగమింగుకొని పాడుతున్నడు.

శంకరయ్య పాడుతుంటే

పెద్దాయనను తల్సుకొని ఆ ఇంటిల్లపాదికండ్లు తడయినయ్. అక్కడున్నవాళ్లల్ల మరో ఇద్దరు గూడ వాళ్ల ఇంట్లోవాళ్ల పేరు మీద కతలు

చెప్పించుకున్నరు.శంకరయ్య ఆపకుండ పాడుతూనే ఉన్నడు. మాపట్టాంక పాడ్తనే ఉన్నడు.

అందరు తలా కొన్ని పైసలిచ్చిన్రు . సద్ది బువ్వ పెట్టిన్రు . అప్పటివరకు

ఖాళీగున్న శంకరయ్య జేబు, జోలె రెండు ఒకేసారి నిండినయ్. ఇగ

సంతోషంగ ఇంటిబాట పట్టిండు. పోత పోత సంతల సుక్కమ్మ కోసం

గాజులు కొన్నడు.

**

గుడిసె బయట బిక్కుబిక్కుమంటూ కూచున్న పిల్లల మొకాలు జూస్తేనే

అర్థమయ్యింది.. తల్లి ఇగ నిద్రలేవదని వాళ్లకు గుడంగ తెలిసిపోయినటుందని. వాళ్ల చెంపల నిండా కన్నీటి చారలే కనపడుతున్నయ్.

"నాయిన! నాకు నూకలన్నమొద్దు. అమ్మ గావాలే" వెక్కి వెక్కి ఏడు

స్తున్న చిన్న బిడ్డను జూడంగనే

పొద్దట్సంది తన గుండెల్లోనే దాచుకున్నదుఃఖమంతా ఒక్కసారిగ బయిటికి తన్నుకొచ్చింది. పిల్లలను ఎదకుబిగ్గిత అదుముకొని బోరుమన్నడు. దాచుకున్న కన్నీళ్లన్నీ ఇంకిపోయేవరకు యేడ్సిండు.

తర్వాత గుడిసెలోపలికి పోయిండు.

తన భుజమ్మీదున్న తుండు

గుడ్డను దీసి సుక్కమ్మ సుట్టే తిరుగుతున్న ఈగలను తోలిండు. ఆమెపక్కన్నే కూసోని ఆమె కోసం తెచ్చిన మట్టి గాజులు ఆమె చేతులకు తొడిగిండు.

"నీ పాటంటే నాకు పానం. రేపట్నాడు ఒకాల నాకేమన్నయితే నీవేపాడా లే!" మూడ్రోజుల కింద సుక్కమ్మ అన్న మాట యాదికొచ్చింది.

తంబూరను అందుకున్నడు....

"నేనెళ్లిపోత కొడకా.. బాల!

నా యిల్లిడిసి నేనువోతా.. బాల!

జాగిడిసి నేనువోతా.. బాల!"

గొంతు పూడుకుపోతున్నా అక్షరం అక్షరం కూడబలుక్కొని పాడుతు

న్నడు. తంబూరతోపాటు మూలకున్న డిమ్కి సప్పుడు గూడ ఇనవడ్తుంది

శంకరయ్యకు. సుక్కమ్మ కొత్త గాజులు గలగలమంటున్నట్లే ఉంది.

"'చెట్టోలె రాలిపాయే.. బాల!

పాడెమీద వండవెట్టి.. బాల!

ఎత్తుకుందురు నలుగురేమో.. బాల!

కుమ్మరింటి కుండతోటి.. బాల!

మాయడప్పులతోటి.. బాల!

సాగనాంప పదిమంది.. బాల!...

పొద్దు పొడిచేవరకు.. అస్తమించిన తన సుక్కమ్మ కోసంపాడ్తానే ఉన్నడు.

- స్ఫూర్తి కందివనం

First Published:  30 Nov 2022 9:13 AM GMT
Next Story