Telugu Global
Arts & Literature

హారన్

హారన్
X

డాడీ కొనిచ్చిన ఖరీదైన కొత్త బైక్ మీద దూసుకుపోతున్నాడు ఆ కుర్రాడు.

పెద్దపెద్ద చక్రాలు, ముందూ వెనుకా అందమైన స్టయిలిష్ లైట్లు, కూర్చోవడానికి చిన్న సీటుతో ఎత్తుగా వున్న ఆ బైక్‌పై దూసుకుపోతుంటే మేఘాలలో తేలిపోతున్నట్టు ఉంది వాడికి.

అటూఇటూ ఊగిపోతూ విన్యాసాలు చేస్తూ సాగిపోతున్న ఆ కుర్రాడికి వెనక నుంచి పదేపదే వినిపిస్తున్న అంబులెన్స్ హారన్‌ నేలమీదకు.. అదే రోడ్డు మీదకు తీసుకొస్తోంది.

చిర్రెత్తుకొచ్చి ‘పో’ అన్నట్టు విసురుగా చేయి చూపిస్తూ, ఎడమ వైపుకు తప్పుకున్నాడు. కానీ, ఆ కాస్త ఖాళీలోంచి వెళ్లే వీలు లేక అంబులెన్స్ డ్రైవర్ మళ్లీ హారన్ కొట్టాడు. దాంతో రెచ్చిపోయిన ఆ కుర్రాడు బండిని అంబులెన్స్ కు అడ్డంగా ఆపి, డ్రైవర్‌తో గొడవకు దిగాడు. నలుగురూ పోగయ్యారు. కుర్రాడికి ఏదో సర్ది చెప్పి, ఎట్టకేలకు అంబులెన్స్ ను పక్క నుంచి పంపించారు.

‘తానేదో బైక్ రైడ్ ఎంజాయ్ చేద్దామనుకుంటే మధ్యలో వీడికేం కడుపు మంట’ అనే ఉక్రోషం కుర్రాడిది. దాంతో అంబులెన్స్ వెళ్లిపోయినా, అటువైపు చేతులు ఊపుతూ, అరుస్తూ కాసేపు అక్కసు వెళ్లగక్కాడు.

ఇంతలో మిగిలిన స్నేహితులు రావడంతో, పొగరుగా బైక్‌ను పెద్దగా సౌండ్ వచ్చేలా రైజ్ చేసుకుంటూ, హుషారుగా వాళ్లతో కలిసి గాలిలో దూసుకుపోయాడు.

రేస్ పూర్తి చేసుకుని డ్రింక్స్ తీసుకుంటూ ఫోన్ చూసుకుంటే, వాళ్ల మమ్మీ నుంచి చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి. చిరగ్గానే తల్లికి ఫోన్ చేశాడు. ఆమె చెప్పిన విషయం వాడిని పూర్తిగా నేల మీదకు దించింది.

‘‘నీకు బైక్ కొనిచ్చాక, అది తీసుకుని నువ్వెళ్లి పోయావ్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని మేం బయలుదేరుతుంటే నాన్నకు స్ట్రోక్ వచ్చింది. షోరూం వాళ్లు వెంటనే అంబులెన్స్ పిలిపించారు. కానీ, అది ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యం కావడంతో.. అంతా అయిపోయింది’’ అని తల్లి ఏడుస్తూ ఫోన్‌లో ఇంకా ఏదో చెబుతోంది.

కానీ, ఆ అబ్బాయికీ ఇంకేమీ వినిపించడం లేదు. చెవుల్లో ఇందాకటి అంబులెన్స్ హారన్ మళ్లీ రింగుమంటూ మోగడం మొదలైంది.

- దేశరాజు (హైదరాబాద్)

First Published:  3 Oct 2023 9:16 AM GMT
Next Story