Telugu Global
Arts & Literature

డిసెంబర్ 14 జ్వాలాముఖి 15 వ వర్థంతి

జ్వాలాముఖి (ఏప్రిల్ 12, 1938 - డిసెంబర్ 14, 2008)

డిసెంబర్ 14 జ్వాలాముఖి 15 వ వర్థంతి
X

ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకరు. తరువాత విరసం సభ్యులు. జ్వాలాముఖి చక్కటి వక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు.శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించారు

మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. భార్య యామిని . హైదరాబాదు‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశారు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించారు. తరువాత హైదరాబాదు‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకునిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశారు.

మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపారు.. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవిగా కవితలు రాశారు..

స్వతహాగా తీవ్రంగా స్పందించే గుణదాముడు. కవి పండితుడిగా ఎదిగిన క్రమంలో దిగంబర కవుల్లో' దిట్ట. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో విశిష్టునిగా పేరు పొందారు. జీవనానికి తొలినాళ్ళలో స్టోర్స్ పర్చేజ్ అండ్ స్టేషనరీ డిపార్ట్ మెంటులో అతి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసారు. ఆ మీదట ఉపాధ్యాయునిగా, కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఉద్యోగ క్రాంతి అనే పత్రిక వ్యవస్థాపక సభ్యులకు సమకాలికంగా ఉద్యోగుల ఉద్యమాల్లో పాల్గొన్న ఐక్యవిప్లవోద్యమాభిలాషి. స్నేహశీలీ, ఆర్ద్ర హృదయులు, భోజన ప్రియులు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త.

"బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం" అని విశదీకరించేవారు.

కిటికీలు, తలుపులు, బార్లాగా తెరిచి వుంచిన ఇంట్లోకి చేరిన దుమ్ము, ధూళిని చీపురుతో చిమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంగా చైనా తియాన్‌మీన్ స్క్వేర్ ఘటనను అభివర్ణించారు.

ఒక నాస్తికుడిగా, మార్క్సిస్ట్ మేధావిగా, 'ప్రత్యామ్నాయ సంస్కృతి'ని అభివృద్ధి చేయడానికి గాను, హైదరాబాదు వంటి నగరంలో "ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం"ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి పలుమార్లు మిత్రులతో చెప్పుతుండేవారు.

ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నారు.1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు.

ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. వేలాడిన మందారం' నవల‚హైదరా'బాధ'లు‚'ఓటమి తిరుగుబాటు' కవితా సంకలనం‚'రాంగేయ రాఘవ' జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం వారి కొద్ది రచనలు .ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు‚దాశరథి రంగాచార్య పురస్కారం‚హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు పొందారు.

డిసెంబరు 14 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో జ్వాలాముఖి మరణించారు. ఇవాళ డిసెంబర్ 14 న వారి 15 వ వర్థంతి సందర్భంగా నివాళులు.

First Published:  14 Dec 2022 6:52 AM GMT
Next Story