Telugu Global
Arts & Literature

తడిక్షణం కోసం (కవిత)

తడిక్షణం కోసం (కవిత)
X

అక్షరం ఆయుధమై మనలను పొడుస్తూ ఉంటుంది

అదే అక్షరం పరిమళమై తాకుతుంటుంది

అక్షరానికి పదును పెట్టడమే కవిత్వం

భావచిత్రమై అక్షరం సంబరాన్నిస్తుంది

సామాజిక సందర్భాన్ని చిత్రించమంటుంది

అక్షరానికి పంచరంగుల వలవేయదు

చిత్రికపట్టని అక్షరం కవిత్వంకాదు

దుఃఖాన్ని అనువదించమని

పోరేదే కవిత్వం

అవసరమయితే

పోరుబాటలో నడవమంటుంది

కదిలించని అక్షరం ఘనీభవించిన జ్ఞాపకం

గాలి కదలికలా కవిత్వం

నీలో ఇంకాలి

అద్దం మీది నీటిచెమ్మలా

మసకబారిన క్షణాలను తుడిచేస్తుంది

కాస్త మనసును తడిచేస్తుంది

- సి.ఎస్.రాంబాబు

First Published:  30 July 2023 10:35 AM GMT
Next Story