Telugu Global
Arts & Literature

ఏరిన ముత్యాలు..‘చిత్ర’మైన బాలి

ఏరిన ముత్యాలు..‘చిత్ర’మైన బాలి
X

తెలుగు ప్రతికల్లో దేన్ని తిరగేసినా బాలి ( మేడిశెట్టి శంకరరావు) కార్టూనో, కథకు బొమ్మో కనిపిస్తుంది. వేల సంఖ్యలో వీటిని అందించి పాఠకుల్ని అలరించిన ఘనుడు బాలి. ‘బాలి కుంచె / కలం పేరుని సూచించనవారు పురాణం సుబ్రహ్మణ్యం శర్మగారు.

బాలి ముందు పి.డబ్ల్యు.డిలో గుమాస్తాగా, ఆ తర్వాత ఈనాడు, ఆపై విజయవాడ ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. అందులో మానేసి హైదరాబాద్ లో ఏనిమేషన్ కంపెనీలో ఉద్యోగించి, అందులో నుండి విరమణ తర్వాత ఫ్రీలాన్సర్ గానే కొనసాగారు.

బాలి వేసిన పుస్తక ముఖచిత్రాలూ, వివిధ కరపత్రాలకూ, పోస్టర్లకూ సమకూర్చిన లే అవుట్లూ, డిజైన్లూ, లోగోలూ, కామిక్స్ కోకొల్లలు. ఆయన గీతలూ, ఆ గీతలకు ఆయన ఇచ్చిన రాతలూ-సున్నితమైనవీ, లలితమైనవీ, రమణీయమైనవీనూ. కార్టూన్ కి కేప్షన్-నిజానికి-అసలైన జీవం. ఆయన బొమ్మల్లో ‘కళ’, భావ ప్రకటన, ఆహార్యం, భంగిమ, విన్యాసం ఎంత అద్భుతమో అంతకంత అద్భుతం ఈ ‘కేప్షన్’! అతని ‘శైలి’, ‘రేఖ’ - అతనిదే అయిన ముద్ర. ఇదే తెలుగు పాఠకులకు, ప్రచురణకర్తలకు, సంపాదకులకు, అంతకంటే మిన్నగా రచయితలకు అతన్ని దగ్గర చేసింది. ఆ దగ్గరితనంలో సహృదయత, స్నేహం అనుభవైకవేద్యం.

రచన శాయి గారి వంటి మరీ ముఖ్య మిత్రులకు ‘చిత్ర’కారుడు-బాలి ఆరాధనీయుడే. రచనలో కథలకు బాలి వేసిన మానవ ఆకారాల భంగిమల్లోని హావభావాలను పరీక్షించుకుంటూ చూస్తుంటే, భావుకుడైన ఏ రచయితకైనా-మనోయవనికమీద చెప్పలేనన్ని కొత్త ప్రపంచాలూ, కొత్త వెలుగులూ కనిపిస్తాయి. ఆ రేఖల లాలిత్యం, depth, ప్రపోర్షన్స్ మహిమ అది!!

బాలి నిరాడంబరుడు. చాలా మొహమాటస్తుడుగా కనపడేవాడు. మితభాషి. మాట్లాడేడంటే - ఆ మాటల్లో చల్లని ‘వెట్ట’తనం! బాలికి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. ఎన్నెన్నో జాతీయ వర్క్ షాపుల్లో, ఎగ్జిబిషన్ లలో ఆయన పాల్గొన్నారు. ఎందరెందరో ప్రసిద్ధులతో ప్రత్యక్ష పరోక్ష పరిచయాలూ, సాన్నిహిత్యాలూ ఉండేవాయనకు. ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా ఆయన వేసిన డైలీ పాకెట్ కార్టూన్స్ ఎంతో భావస్ఫోరకమైనవి; ప్రాచుర్యం వహించినవి. అంతకంటే ముఖ్యంగా అవన్నీ నార్ల అంతటివారి మెప్పు పొందినవి కూడా!

బాలి విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడే ఆయనతో నా మొదటి పరిచయం. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీక్లీ ఎడిటర్. మొగల్రాజపురంలో నిమ్మతోట దగ్గర ఎర్రమేడ కాంపౌండ్ వుంది. శర్మగారూ, ఈయనా అక్కడ పక్కపక్క పోర్షన్లలో ఉండేవారు. పురాణం వారితో తన అవస్థ చెప్పేవారు బాలి. (మందు వ్యవహారం! పురాణంగారు తాగితే కొంచెం హడావిడి చేయటం, ఆదివిష్ణుతో వెళ్ళినప్పుడు ఒకసారి నేనూ చూశాను).

పత్రికల్లో కథలకు బొమ్మలు వేసే అవస్థ గురించి తన అనుభవాల్ని సరదాగా అప్పుడప్పుడూ చెప్పేవారు బాలి. కొన్ని కథలు చదివించనని మొరాయించేవిట. కొన్ని పేరాలూ, సంభాషణలూ అన్ని కలగాపులగం. ఎందుకిలాంటివి సెలక్ట్ చేస్తారని అడిగితే - ఎడిటర్లు కొందరు నవ్వేసి ‘వాళ్ల చాపల్యం, మాకు ‘కిట్టింపు’ అనేవారట. (ఆ ఎడిటర్లెవరో చెప్పను)!

విజయవాడలో చూసిన బాలిని మళ్లీ చాలా చాలా ఏళ్ల తర్వాత - హైదరాబాద్ లో వేదగిరి రాంబాబు ఇంట్లో చూశాను. ఆశ్చర్యం, ఆనందం. ఆ తర్వాత చాలాసార్లు కలుస్తూ వుండేవాళ్లం. ఆయన జీవితంలో అత్యంత విషాదాలు- తల్లి మరణం, 2010లో భార్య మరణం, 2022లో 45 ఏళ్ల కొడుకు పోవటం. ‘ఒంటరి’ దుఃఖం! అమీర్ పేట నుండి మారి సీతాఫల్ మండికి నివాసాన్ని మార్చారు. అక్కడికి ఒకటి రెండు సార్లు వెళ్లాను. 2009లో నా ‘కొత్తనీరు’ కథా సంపుటికి ముఖచిత్రాన్ని అడిగితే - ఎంతో సంతోషంగా - కథోచితమైన, భావస్ఫోరకమైన చిత్రాన్ని వేసి ఇచ్చారు! ( ఆ చిత్రాన్ని చూడండి).


పత్రికల్లో నా కథలు చాలావాటికి బాలి బొమ్మలు వేశారు. అవన్నీ భావస్ఫోరకమై కథాత్మను వెల్లడించేవే! విజయనగరం కథానికా సదస్సుకు హైదరాబాద్ నుండి వెళ్లిన సమూహంలో నేనూ, రాంబాబూ, పోరంకి దక్షిణామూర్తి, సుధామ, మునిపల్లె రాజు, రావూరి భరద్వాజ, పోతుకూచి సాంబశివరావు, కొలకలూరి ఇనాక్, బాలం వెంకట్రావు, జి.నర్సింహమూర్తి, వీరాజీ, పాలకోడేటి సత్యనారాయణ, వాసా ప్రభావతి, శిల్పా జగదీష్, కుడుపూడి భాస్కర్ రావు, వేదగిరి సంధ్య, వేదగిరి విజయ్ తో పాటు బాలి కూడా ఉన్నారు.

2015లో బాలి ఆత్మకథ ‘చిత్రమైన జీవితం’ పుస్తకాన్ని రాంబాబు ప్రచురించారు. తర్వాత చాలా కాలానికి 2018లో రాంబాబు చనిపోయిన తర్వాత, ఒకసారి బాలిగారి గురించిన ప్రసక్తి వస్తే, ఎవరో చెప్పారు ఆయన మకాం విశాఖపట్నం మార్చేరని. ఫోన్ చేసి మాట్లాడాను. చాలా నిరుత్సాహంగా ముక్తసరిగా వేదాంతం ధోరణిలో మాట్లాడేరు. బాలి కుమార్తె వైశాలి. అమెరికాలో వుంటున్నారు.

బాలి చిత్రకారుడే కాక చాలా మంచి రచయిత. ‘అమ్మే కావాలి’ పిల్లల నవలతో రచనా వ్యాసంగం మొదలు. 30 మంచి కథలు రాశారు. నవమల్లె తీగ - కలిమిశ్రీ ఈ కథల సంపుటిని ప్రచురించారు. దీనికి కారణం తాను బొమ్మ వేయటానికి ఎందరో రచయితల ఎన్నెన్నో కథల్ని పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చదివి ‘కథాత్మ’ని పట్టుకోగలగటమే అన్నారు నాతో. నవ్య ఎడిటర్ జగన్నాథ శర్మ గారి ప్రోత్సాహం కూడా ఒక ముఖ్యమైన కారణం. అలాగే, ఎంత ఎక్కువగా చదివి, అంత తక్కువగా రాస్తే అంతమంచిది అనేవారు. బాలి రాసిన అద్దం కథ, సై..కిల్ కథ, అప్పికట్ల వారి వీధి, సమాహారం, మేలు చేసిన కీడు, చిలకపచ్చ చీర కథ వంటి కథల్లోని వస్తురూపాల మేళవింపు కథకుడుగా ఆయన రచనా నైపుణ్యానికి అద్దంపడతాయి.

బాలి, ‘చందు’ అనే బాలసాహిత్య పత్రికకు సంపాదకత్వం కూడా నెరపారు. బాలి కథలకు చాలా బహుమతులూ వచ్చాయి. అనేక ఇతర సత్కారాలూ పురస్కారాలతో పాటు బాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి హంస పురస్కారాన్ని కూడా పొందారు.

దివంగతుడైన బాలి ఒక విలక్షణ జీవముద్ర కలిగిన చిత్రకారుడు .చిత్రకారునిగా ఆయన ‘చిత్ర’మైన జీవితం మాత్రం అజరామరమే! *


- విహారి

First Published:  24 Nov 2023 9:54 AM GMT
Next Story