Telugu Global
Arts & Literature

కొడవటిగంటి కుటుంబరావు గారి విలక్షణత - కప్పగంతు శివరామ ప్రసాద్

కొడవటిగంటి కుటుంబరావు గారి విలక్షణత - కప్పగంతు శివరామ ప్రసాద్
X

కుటుంబరావుగారు కల్పించిన పాత్రలలో కెల్లా వెంటపడి అనేకరోజులు గుర్తుండి, భయపెట్టేది "సీతప్ప" పాత్ర.

కుటుంబరావుగారు "బెదిరిన మనుషులు" మరియు "బ్రతుకు భయం" నవలలో ఈ సీతప్ప పాత్రను అద్భుతంగా చిత్రీకరించారు.

అసూయ, అనుమానం, కొత్త విషయాలపట్ల ఆసక్తి లేకపోవటంసాధ్యమైనంతవరకు అలా అలా ఏదో ఒకచోట నక్కి బతికెయ్యటం, గొప్పలు చెప్పుకోవటం, అర్థం పర్థంలేకుండా పూర్తిగా తనకు అనుకూలంగానే మాట్లాడుకోవటం, ఈ సీతప్ప ముఖ్య లక్షణాలు.

సీతప్పకు తగిన భార్యే దొరుకుతుంది, అతని కూతురు వీరి పెంపకంలో దేభ్యంలాగ తయారయ్యి తన కాపురాన్ని తానే చేజేతులా ధ్వంసం చేసుకొని, అటు భర్తను సుఖ పెట్టలేక, ఇటు తన తప్పు తెలుసుకోలేక అఘొరిస్తూ ఉంటుంది. పైగా, తానున్న స్థితే గొప్పగా ఉన్నదని కూడా తలపోస్తూ ఉంటుంది. ఇక సీతప్ప కొడుకు, చాలా కాలం సీతప్ప ప్రభావంలో పడి అదే జీవితం అని వానపాములాగ బ్రతికినా, తన అన్న (పెత్తండ్రి కొడుకు) ప్రకాశాన్ని చూసి కొంత మారుతాడు.

ఈ నవలల్లో ప్రకాశం ఒక మంచి పాత్ర. ప్రకాశం, సీతప్ప అన్న కొడుకు, వేరే ఊళ్ళొ ఉంటూ ఉంటాడు. ఓ సారి ప్రకాశం సీతప్ప ఇంటికి వస్తాడు. అతను రావటం, అతని మాటలు, ప్రవర్తన ఈ బావిలోని కప్పలవంటి సీతప్ప కుటుంబానికి చాలా ఎబ్బెట్టుగాను విచిత్రంగాను ఆ పైగా అఘాయిత్యంగాను కనపడతాయి. అతని రాక సీతప్ప ఇంట్లో ఒక తుఫాను వచ్చినట్టు అవుతుంది. ప్రకాశంతో తిరిగి కొంత, అతని మాటలు విని కొంత , సీతప్ప కొడుకు మారినట్టుగా కొంత సంఘటనాపూర్వకంగా రచయిత చక్కగా చెప్పారు.

కుటుంబరావుగారు, మనలో ఉండే స్వార్థపరత్వాన్ని, ఊకదంపుడు మాటల అలవాటును, భేషజాలను, వినోదాత్మకంగా ఎత్తి చూపారు. ఈ కథలు చదువుతున్నప్పుడు, మన్ని మనం ప్రకాశంగా ఊహించుకోవటం తప్పనిసరి, మనం సీతప్ప ఎంతమాత్రం కాదని సర్ది చెప్పుకుంటాం. కాని మనలో కూడ ఒక సీతప్ప ఉన్నాడని, మనకో ప్రకాశం తారసపడేవరకు మనకు తెలియదు.

కుటుంబరావుగారి సీతప్ప పాత్రను తరచి తరచి చూసుకుని, అర్థం చేసుకుంటే తప్ప, మనకు తారసపడే ప్రకాశాలను గుర్తించం.ఒహవేళ గుర్తించినా వారిని, సీతప్పలాగ, భయం భయంగానే చూస్తాం లేకపోతే ఏహ్యభావంతో దూరంగా ఉంచటానికి ప్రయత్నిస్తాము. ప్రతి మనిషిలోనూ ఉన్న వైరుధ్య వైఖరులు-తనకో మాట, ఇతరులకో మాట, తనకో న్యాయం, ఇతరులకు మరొకటి-కొట్టొచ్చినట్టుగా సీతప్ప పాత్ర ద్వారా, ఏకొద్దిపాటి తెలివితేటలు ఉన్నవారికైనా అర్ధమయ్యే రీతిలో అభివర్ణించారు కుటుంబరావుగారు.

ఆయనే అన్నట్టుగా చెప్ప తగనిది, కథ కాదు. కొడవటిగంటి కథలన్నీ ఈ మాటకే కట్టుబడి ఉన్నాయి. నేటి రచయితలు తప్పనిసరిగా తెలుసుకోవలిసిన విషయం ఇది. ఏదో ఒక సంఘటన చూసో, లేక ఫలానా వార పత్రిక వారు సెంటర్ స్ప్రెడ్ కోసం వ్రాసే కథలకు ఎక్కువ డబ్బులు ఇస్తారనో, గీకి పారెయ్యటం రచయిత బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తాయి.

ముందుగా చెప్పవలసిన విషయం రాసేవాడికి తెలిసి ఉండాలి, ఆ తరువాత చెప్పే పధ్ధతి తెలియాలి. ఈ రెండూ లేకుండా వ్రాస్తే అది రచన అవ్వటానికి అవకాశం లేదుకదా, సాహిత్యానికి ఆమడ దూరంగాకూడ నిలబడే అర్హత కూడా ఉండదు. లేనిపోని వర్ణనా పటాటోపం మచ్చుకైనా కనపడదు మన కొ కు కథలలో. కుటుంబరావుగారి కథల ఎత్తుగడ చదువరులను మురిపిస్తుంది, ముందుకు, మరింత ముందుకి చదివిస్తుంది.

సందర్భ ఔచిత్యం లేని వర్ణనలు పొరపాటునకూడ ఎక్కడా చెయ్యలేదు కుటుంబరావుగారు. వారు కల్పించే పాత్రల పేర్లు కూడ ఎంతో సామాన్యంగా మన చుట్టుపక్కల రోజూ కనపడే/వినపడేవే ఉంటాయి కాని, కథకోసం కల్పించిన అంతుచిక్కని (outlandish) పేర్లు ఉండవు. పాత్రల పేర్లు ఏ కులాన్ని సూచించవు . కథలోని భాష, ఎంతో సౌమ్యంగా, చిన్న చిన్న అచ్చ తెలుగు మాటలతో, సామాన్య జనం సంభాషణల్లో వాడే మాటలే చదవటానికి ఎంతో ఇంపుగా వ్రాయటం కుటుంబరావుగారికే చెల్లింది.

ఏదన్నా ఆంగ్ల పదం వ్రాయవలసి ఉన్నప్పుడు, వీలైతే నలుగురికీ అర్ధమయ్యే తెలుగు పదం వాడతారు, వీలుకానప్పుడు అదే ఆంగ్లపదాన్ని యధాతథంగా వాడారుగాని, అచ్చతెలుగు ఏమైనా సరే వ్రాయాలన్న దుగ్ధతో, ఎక్కడా వాడుకలో లేని, దాదాపు ఎవరికీ అంతుచిక్కని కంకర్రాయిలాంటి తెలుగు పదాల్ని సృష్టించలేదు. తన రచనల్లో చెప్పదల్చుకున్న విషయం ఎటువంటి ఆవేశం లేకుండా, పాఠకుడిని ఆలోచింపచేసేవిగా వ్రాశారు తప్ప, చదువరిని రెచ్చగొట్టె పద్ధతిలో ఎక్కడా వ్రాయలేదు. వారి అమ్మాయి శ్రీమతి ఆర్ శాంతకుమారిగారు అన్నట్టుగా, "నాకు తెలుసు నేను చెప్తున్నాను, మీరు వినండి" అనే ధోరణిలో ఆయన రచనలు ఉండవు, ఆయనా అలా ఉండేవారు కాదు.

ఆయన సాహిత్య ప్రకాండ మొత్తం ఒక ఎత్తు అయితే, తెలుగు పత్రికలకు ఆయన చేసిన సేవ అనితరం. వార పత్రికలు ప్రస్తుతం వస్తున్న సైజు ఆయన నిర్దేశిo చినదే.

తెలుగులో మొట్టమొదటి వారపత్రిక అయిన ఆంధ్ర సచిత్ర వారపత్రిక మొదట్లో సినిమా పత్రికల సైజులో ( రోజువారి పత్రిక సగంలోకి మడిస్తే వచ్చే సైజు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సైజు అంటే ఇప్పటివారెవరికీ తెలియదు మరి) వచ్చేదిట.

ఆంధ్ర పత్రిక దాదాపు మూతపడిబోయ్యే సమయంలో, కుటుంబరావుగారికి ఆ పత్రిక నడిపే బాధ్యత అప్పగించారు. ఆయన చేసిన మొట్టమొదటి పని, పత్రిక మనం ఇప్పుడు చూస్తున్న వార పత్రికల సైజుకు తగ్గించటం. ఆ తరువాత ఆయన, ఇతర

రచయితలు శ్రీ నండూరి రాంమోహనరావు, శ్రీ సూరంపూడి సీతారాంలతో కూడి త్రీ మస్కిటీర్సుగా పిలవబడి, అనేకానేక శీర్షికలను, చక్కటి ఆంగ్ల రచనలను (మార్క్ ట్వైన్ రచించిన టాం సాయర్, హకల్బెరిఫిన్ , విచిత్ర వ్యక్తి, ఆర్ ఎల్ స్టీవెన్సన్ రచించిన కాంచన ద్వీపం మొదలగునవి) తెలుగులోకి అనువదింపచేసి ధారావాహికలుగా పాఠకులకు అందచేశారు.

అప్పటివరకు ఆంగ్లం తెలిసినవారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ నవలలు , కుటుంబరావుగారి పుణ్యమా అని తెలుగు వారందరికి పరిచయమయ్యాయి. కుటుంబరావుగారు వారి స్నేహితులు కలసి చేసిన రకరకాల ప్రయోగాల వల్ల మూత పడుతుంది అనుకున్న పత్రిక అమ్మకాలు నాలుగింతలు ఐదు రెట్లుగా పెరిగిపోయి, పత్రిక మళ్ళీ నిలబడే అవకాశం వచ్చిందట.

చక్రపాణి-నాగిరెడ్డి గార్లచే 1947లో మొదలు పెట్టబడినప్పటికీ, 1952లో కుటుంబరావుగారు సంపాదకుడిగా ఆయన ఆధ్వర్యం లోకి చందమామ (ఒకొప్పటి ప్రముఖ మాస పత్రిక) వచ్చేవరకు, ఒక అనామక పత్రికగానే ఉన్నది. ఆయన పేరు చందమామ వారు సంపాదకుడిగా ఎప్పటికీ ఆ పత్రికలో ప్రచురించకపోయినా, కుటుంబరావుగారు తీసుకున్న శ్రధ్ధ (చక్రపాణి నాగిరెడ్డిగార్ల సహకారంతో) చందమామను తెలుగు పత్రికా లోకంలో తలమానికంగా నిలబెట్టింది.

ఆయన చందమామను నడిపిన కాలం 1952 నుండి 1980లో ఆయన మరణించేవరకు, ఆ పత్రికకు స్వర్ణయుగమే. చిన్న పిల్లల మనస్సులు ఎంతో సున్నితంగా ఉండి, విషయాలను ఎల్లకాలం గుర్తు పెట్టుకునే దశలో ఉంటాయి. ఆ విషయం బాగా తెలిసిన కొ .కు గారు, ఆ చిన్నారి పాఠకులకోసం అన్ని కథలను, తన శైలిలో చెక్కి, చిత్రిక పట్టి కథా శిల్పాలుగా చేసి వదిలేవారు.

ప్రతి కథ (ఎవరు వ్రాసినా సరే) కుటుంబరావుగారి చేతిలో పడి ఆణిముత్యంగా మారిపొయ్యేది. పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ, ఆ పత్రిక, దశాబ్దాల నాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేసింది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును

అంతర్లీనంగా ప్రతి కథలోను, ఒక నీతి సూత్రం, సంభాషణల్లో తర్కం, మూఢనమ్మకాలను మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం వంటివి ఆ రోజులలో చందమామ చదువుతూ పెరిగిన పిల్లలకు (మూడు నాలుగు తరాలవరకు) దొరికిన పెన్నిధి, వారి జీవితాలను ప్రభావితం చేసి నలుగురూ కలసి జీవించే సరైన పద్ధతిలోకి మళ్ళించినాయి.

ప్రభుత్వం వారు పిల్లలకు ఇది మంచి, ఇది కూడదు అని నిర్దేశిo చిన పాఠ్య పుస్తకాలకంటే, భాషా పరంగాను, అలోచనా పరంగాను, చందమామ కథలు అప్పటి పిల్లలకు (అనేకమార్లు పెద్దలకు కూడ) చక్కటి "చదువు" నేర్పాయి.

చందమామ పత్రికకు ఆయన దిద్దిన మెరుగులలో అన్నిటికన్నాఎక్కువగా తళతళలాడేది బేతాళ కథల శీర్షిక , అసలులో కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు.

సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు (పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం, ఈ శీర్షిక ద్వారా కుటుంబరావుగారు నభూతో నభవిష్యతిగా రూపొందించారు

ఈ బేతాళ కథలు తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్నా ఎక్కువకాలం ప్రచురించబడిన శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ఉన్నది మన కుటుంబరావుగారే.

ఈ మొత్తం ప్రక్రియ తానేదో గొప్పపని చేస్తున్నాని అనుకుంటూ చెయ్యలేదు. తన ఉద్యోగ ధర్మంగానే చేశారు.

కుటుంబరావుగారి రచనల నుండి కొన్ని మంచి మాటలు:

"... మనిషి మూడువిధాలుగా వుంటున్నాడు. పశువుగా, మానవుడుగా, దేవతగా. పశుత్వంలోనూ మంచీ చెడూ వుంది, మానవత్వంలోనూ వుంది. దేవత్వంలోనూ వుంది. ........ ఇంతవరకూ అందరికీ తెలిసే వుండవచ్చును. అందరికీ తెలీని విషయమేమిటంటే, పశుత్వంలో చెడు చాలా కొద్ది, మానవత్వంలో మంచి చెడు చాలకొద్ది, మానవత్వంలో మంచి చెడూ చెరిసగంగా వుంది, దేవత్వంలో మంచి కన్న చెడు చాలా జాస్తి...." (సూరి సిద్ధాంతం 1)

".....చిరిగి రూపుమాసి పోయిన ఆచారాలు నీ కెలా పనికొస్తై. ఆచారమనేది కేవలం పనిముట్టు. మనిషి ఉపయోగం కోసం ఏర్పడ్డది ఆచారం. కాని మనిషి ఆచారం కోసం ఏర్పడ్డవాడు కాడు." (సూరి సిద్ధాంతం 1)

" ...బుద్ధంటే అర్థం కాలేదు. మనస్సనుకుంటున్నావు, మనసు వేరు, బుద్ధివేరు. వాళ్ళూ వాళ్ళూ అనేక విషయాలను గురించి అనుకుంటున్న మాటలన్నీ జ్ఞాపకం వుంచుకుని, వాటిని నిజం కింద అంగీకరించి, వాటి ప్రకారం ఆచరించటం బుద్ధిని ఉపయోగించటం కాదు. దేన్ని గురంచయినా నీ అభిప్రాయం ఒకటి ఏర్పరుచుకున్నవా? !" (సూరి

సిద్ధాంతం 1)

"...మనిషి జ్ఞానానికి అంతుంది కాని అజ్ఞానానికి లేదు" (సూరి సిద్ధాంతం 1)) (ఈ వాక్యం మరెక్కడిదైనా కో కు గారు ఇక్కడ వాడుకున్నారా, మరింకెక్కొడో చదివిన జ్ఞాపకం)

".......స్వరాజ్యం, స్వేచ్ఛ అని గొంతు బొంగురు పొయ్యేదాకా అరుస్తారే! నా బుద్ధిని వాళ్ళ బుద్ధులకు దాస్యం చెయ్యమన్నావా? మతం హిస్టరీ అనుకున్నావా, జాగ్రఫీ అనుకున్నావా బోధ చెయ్యటానికి? బుద్ధుడి మతం తీసుకున్న వాళ్ళల్లో మరొక్క బుద్ధు డున్నాడా? నిజమయిన క్రైస్తవుడు క్రీస్తొకడేనా? ఇంకొకడున్నాడా? అర్జనుడి తరువాత జీవితంలో

భగవద్గీత అర్థం చేసుకున్నవాడి లక్షణా లేవైనా వున్నయా? పైగా ఈ మతాలు ప్రచారం కావటానికి ఎంత నెత్తురు ప్రవహించిందో తెలుసునా? ఇదంతా ఎందుచేత?" (సూరి సిద్ధాంతం 1)

........."లోకంలో అనేక రకాల పశువులున్నారు. వాళ్ళను గురించి కథల్లోనూ, నాటకాలలోనూ చదువుతూనే వున్నాం. కాని ఎదురుగా వచ్చినప్పుడు చూసీ చూడనట్టు ప్రవర్తిస్తున్నాం ఎందుకు! (సూరి సిద్ధాంతం 2)

(సూరి సిద్ధాంతం లో సూరి తానే అయ్యి ఉంటారని నా ఊహ)

"........ఆపేక్ష ఎంత ఉన్నా మగవాళ్ళు ఆడదాని మనస్సును సుకుమారంగా చూడరు. మనస్సుకు కష్టం కలిగినప్పుడు మగవాళ్ళకు తెలియనివ్వరాదు. దానివల్ల గాయం మరింత పెద్దది కావటమే కాని ఏమీ లాభం లేదు. అందుచేత, ఆడదాని కమిత ఓర్పూ, నిబ్బరం ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళకవిలేక, చప్పున కుండ మొహాన పగలగొడతారు-వెనకా ముందు చూడకుండా. ఇటువంటి సంఘటన కలిగినప్పుడల్లా ఓర్పు లేకపోవటం ఆడదాని తప్పా? లేక ఆడదాని మనసు కనిపెట్టలేక పోవటం మగవాని తప్పా?....." (పెద్ద దిక్కు కథలో)

".......బాగా అలోచించాక స్త్రీ పురుషుడికన్న శరీర బలాల్లో తక్కువైనట్టుగానే ,పురుషుడు స్త్రీ కన్న మనో నిగ్రహంలో హీనుడుగా కనిపిస్తాడు. ......పైగా ఆడది మనసులో పెట్టుకున్నట్టు మగవాడు పెట్టుకోడు........."(పెద్ద దిక్కు కథలో)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన తండ్రి గురించి అన్నట్లు "ఆయన వీలున్నంతవరకూ ఇరవయ్యో శతాబ్దపు మనిషిలా జీవించడానికి ప్రయత్నించారు. ఈ రోజుల్లో కూడా మానసికంగా పద్దెనిమిదో, పంతొమ్మిదో శతాబ్దంలో బతుకుతున్నవాళ్ళు తగులుతూ ఉంటారు. ఆధునికత అంటే లేటెస్ట్ రిస్ట్ వాచీలూ, సెల్‌ఫోన్లూ, టీవీలూ ఉపయోగించడమే కాదని చాలామందికి తెలిసినట్టులేదు. ఈ వెనకబాటుతనం చూస్తే అయిదు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తున్న ప్రగతివాదశక్తులన్నీ విఫలం అయాయనిపిస్తుంది. ఆలోచనలోనూ, భాషలోనూ కూడా స్పష్టత సాధించడం కొడవటిగంటి కుటుంబరావు గారి రచనల్లోని ఒక ముఖ్యలక్షణం."

First Published:  28 Oct 2022 4:42 AM GMT
Next Story