Telugu Global
Arts & Literature

శ్లోక మాధురి : సత్యవాక్కు

శ్లోక మాధురి : సత్యవాక్కు
X

లౌకికానాం హి సాధూనా

మర్థం వాగనువర్తతే

ఋషీణాం పునరద్యానాం వాచమర్థోనుధావతి

సామాన్యలౌకికులైన సాధువుల మాటలు- చెప్పగోరిన దానిఅర్ధాన్ని అనుసరిస్తాయి, కానీ భూత , భవిష్యత్తు మరియు వర్తమానం ఎరిగిన పూర్వ ఋషుల పలుకులవెంబడి -అర్థం తానే పరిగెత్తుతుంది.

మానవ లోకవ్యవహారాలన్నీ మాటల కూర్పులతోనే ముడిపడివున్నాయి. లౌకికులైన సాధుసత్పురుషులు

అనగా - దంభములు పలుకడం ,

అబద్ధాలాడడం ,చెడుగా మాట్లాడం తెలియని వారు అని అర్థం.

వారి నడవడిక దోషరహితంగా చాలా ప్రీతిపాత్రంగానూ వుంటుంది. మాటలు అణకువతో మధురంగా వుంటాయి.నియమబద్ధత కలిగి వుంటాయి. బుద్ధి స్వాభావికంగానే మంగళకరంగా వుంటుంటుంది.ఎవరికీ కీడు కలిగించే విధంగా వుండదు.వారు తాము చెప్పాలనుకొన్న విషయానికి తగ్గట్టు మాటలు ఫ్రేమ్ చేసుకొని వాటిని ఉపయోగిస్తారు.అంటే లౌక్యులు ఏం మాట్లాడాలి ఏది సమాజానికి హితము అని తలుచుకొని ఆ భావానికి అనుకూలంగా మాట్లాడుతారు.

అందుచేత వారి మనసులోని అర్ధాన్ని బట్టి మాటలు అనుసరిస్తాయి,

కానీ పురాణులైన ,ఆద్యులైన వాల్మీకి వ్యాస వశిష్టాది మహర్షుల నోట వచ్చే మాటలన్నీ కూడా -సత్యములే అవుతాయి.

'ఋషయః సత్యవచసః 'అని శాస్త్రం. ఆ ఋషుల వాక్కులని అనుసరించే వారి భావాలు లోకానికి హితం చేస్తాయి.

ఋషుల నోటినుంచి వచ్చిన పలుకులను -అర్ధం అనుసరిస్తుంది. దానివల్ల తప్పనిసరిగా ఆ మాటలు నిజం అవుతాయి. ఋషులు సత్య వాక్కులు క్రాంతదర్శనులు కనుక వారాడిన మాటల వెంట అర్ధం తనంత తానుగా వెంటపరిగెత్తుకొని వస్తుంది.

పై శ్లోకం ఉత్తర రామచరితంలోని ప్రథమ అంకంల్లోనిది.ఇవి సీతాదేవిని ‘ వీరప్రసవవు కమ్ము’ అని ఆశీర్వదించిన అష్టావక్రుని మాటలు సత్యదూరములు కావని రాముడు పలికినవి. ఇటువంటి లోకోత్తరమైన సూక్తులు జ్ఞాననిష్ఠ కల కవియే చెప్పగలడు.

‘విందేమ దేవవాణి’ అని సరస్వతిని ప్రార్ధించుకుంటూ ‘వశ్య వాక్యః కవేర్వాచం’ అని ఆత్మవిశ్వాసముతో కూడిన భవభూతి మాటలు అప్పటి లోకం ఆదరించలేదు,అంగీకరించలేదు. సామాన్యంగా అంతేగా! అంతర్దృష్టికల కవుల మాటలను సమకాలీనులు విశ్వసించరు కదా.!

అందుకే ఆయనే అంటాడు మాలతి మాధవంలో-

‘ఉత్పత్స్యతే మమ తు కో2పి సమానధర్మా కాలొహ్యయం నిరవధి విపులాచ పృథ్వి” (అనంతమైన కాలంలో,అతివిశాలమైన ఆ భూమిపై నావంటి మనః ప్రవృత్తి కలవాడు ఎప్పుడో ఒకప్పుడు పుట్టకపోడు) అని.

అలా సూత్రధారుడి చేత తన మనసులోని మాటలే చెప్పించాడు. నిజమే! ఇప్పటికీ ప్రపంచపు రీతి ఇదే.

ఫలానా వాళ్ళు మాట్లాడిన మాట నిజమైంది, వారి నాలుకపై పుట్టుమచ్చ ఉంది అని, ఇలా అనుకుంటాం కానీ ,-వశ్యవాక్కులు,ఋషులుతుల్యులు అయినటువంటి అనగా కల్మషం లేని మనసులు కలిగిన వ్యక్తులు మాట్లాడినప్పుడు అది నిజం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటాం. ఎందుకంటే పసిపిల్లలకు ఎటువంటి ఉచ్చ నీచాలు .స్వపర భేదాలు లేవు ,ప్రపంచంలోని కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఆ మనసులను అంటివుండలేదు. కనుక వారు మాట్లాడింది అక్షరాలా జరిగి తీరుతుంది అని మనం విశ్వసిస్తాం .

అలాంటి నిష్కల్మషమైన మనసులను పెంపొందించుకోవడం మనకు,లోకానికి శ్రేయస్కరం కదా!

- భండారం వాణి

First Published:  2 Aug 2023 4:05 PM GMT
Next Story