Telugu Global
Arts & Literature

పెరటి చెట్టు (కథానిక)

పెరటి చెట్టు (కథానిక)
X

'ఈ రోజైనా టైముకి ఆఫీసుకు చేరుకుంటానో లేదో ' అనుకుంటూ బస్ స్టాప్ చేరుకున్నాడు సదానంద్. మెట్రోలో వెళదామంటే స్టాప్ దిగాక ఆఫీసుకు చాలా దూరం నడవాలి అందుకే సదానంద్ బస్సులో వెళ్లడానికే ఇష్టపడతాడు. చుట్టూ పరికించాడు..బస్ స్టాప్ లో జనం బాగా ఉన్నారు. అందులో కొన్ని పరిచితమైన ముఖాలే. అవునుమరి, రోజుబస్సుల కోసం అందరూ అక్కడే కదా పడిగాపులు పడేది. కొంతమందిని రోజు చూసినా మాటలు మాత్రం సాగవు. మరి కొంతమందితో అనుకోకుండా పలకరింపు మొదలై.. ఆపైన చిరునవ్వుల స్నేహం కొనసాగి.. మరి కొద్ది రోజులకు బస్సు దోస్తులుగా మారిపోతారు. గమ్యం చేరేదాకా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నుంచి కాశ్మీర్ ఫైల్స్ సినిమా దాకా సర్వం చర్చిస్తారు.

అంతలో బస్సొకటి వచ్చింది కానీ సీటు లేదు. అంత దూరం నిలబడడం కష్టమని ఎక్కలేదు. ఇంతలో లౌడ్ స్పీకర్ శబ్దం. అసంకల్పితంగానే సదానంద్ కళ్లు చుట్టూ అన్వేషించాయి. '

అరే..ఇందాకటి నుంచి నేను చూడనే లేదు ' అనుకున్నాడు. '. అక్కడ కొత్తగా ఓ చిన్న సైజు డేరా వెలిసింది. అందులో మధ్యలో కుర్చీలో తలపాగా, పెద్ద మీసాలున్న ఓ మనిషి. అతడి ముందర చిన్న బెంచీలు. వాటి మీద ఏవేవో ఫోటోలు..మందు సీసాలు, మూలికలు వగైరా..బ్యానర్ మీద తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాకుండా వేరే భాషలో ఏదో రాసుంది. అతడి ముందు క్యాసెట్ రికార్డర్. అందులోని మాటలే లౌడ్ స్పీకర్ లోంచి వినిపిస్తున్నాయి.

మనిషికి పైసల కంటే ముఖ్యమైంది ప్రాణం. అది బాగ లేకుంటే ఎన్ని పైసలున్నా మీకు సుకం మాత్రం ఉండదు. ఈ పొద్దు ఏ రోగం లేని మనిషే కనబడత లేడు. అంద్కనే మీ బాదల్ని తక్వ జేసెందుకు మేం మంచి మందును తయారు చేసినం.. కాళ్ల పీకుడు, నీరసం, అరికాళ్లల్ల మంటలు.. ఏ బాద ఆయిన సరే, అన్నింటికి మంచిగ పనిచేస్తది మా హనుమాన్ టానిక్. దగ్గు, ఆయాసం, తలనొప్పి, ఆకలేయకున్నా ఏ బాదున్నా మా హనుమాన్ టానిక్ తీసుకుంటే మంచిగవుతరు. పెద్ద సీసా వచ్చి కాలి యాభై రూపాయలు..చిన్న సీసా వచ్చి కాలి ఇరవై ఐదు రూపాయలు. అయిదేండ్లుగా రోగమున్నోల్లకు యాభై రూపాయిల సీసా, రెండేండ్లుగా రోగమున్నోల్లకు ఇరవై అయిదు రూపాయిల సీసా. రోజు రెండుసార్లు రెండు మూతులు నీల్లతోని కలిపి తాగండి...

ఆ వాక్ ప్రవాహం అక్కడితో ఆగలేదు..

పానం బాగలేకుంటే పైసల కోసం ఫికర్ చేస్తరా? కాలి ఇరవై ఐదు రూపాయిలు. అంటే.. ఒక్కరికీ అయితే ఒక్క సీసా..ఇద్దరు, ముగ్గురుంటే పెద్ద సీసా.. మీరు కొనుండ్రి, మీ పక్కోనితోని కూడ కొనిపించుండ్రి.

హనుమాన్ టానిక్ తీసుకోండి..మీరు సుకంగుంటరు, సంతోషంగుంటరు. చిన్నోల్లకయినా, పెద్దోల్లకయినా, ఆడోల్లకయినా, మగోల్లకయినా, ఎవ్వరికైన సక్కగ పనిచేస్తది. ఎంతోమంది పెద్దోల్లు, పయిల్వాన్లు హనుమాన్ టానిక్ వాడిన్రు, వాడుతున్నరు.

ఆ మాటల ప్రభావంతో కొందరి కాళ్లు అటు నడుస్తున్నాయి కూడా. ఇంతలో బస్సు రావడంతో సదానంద్ ఒక్క పరుగున ఎక్కేసాడు

ఆ మర్నాడు కూడా బస్ స్టాప్ లో సదానంద్, హనుమాన్ టానిక్ ప్రచారం కొనసాగాయి. ఆ డేరా వెనుకే వాళ్ల కుటుంబం కూడా నివాసం ఉందల్లే ఉంది. వారి వస్త్ర ధారణ కొంచెం వేరుగా ఉంది. లౌడ్ స్పీకర్ ధాటి ఎక్కువైంది..

' మీ వయసు యాబై. కానీ మీ బార్యను సుకపెట్టలేక పోతున్నరు. మీకెంతో కోరికుంటది. కాని ఎం లాబం..మీలో మీరే బాద పడ్తుంటరు. కానీ మా మందు తీసుకున్నరంటే మీరు పచ్చీస్ సాల్ నౌ జవాన్ లెక్కవుతరు'

' అమ్మా..మీకు పెండ్లయి నాలుగేండ్లు అయింది. మీకు పిల్లల్లేరు. అంద్కనే మీ ఆయన మీకు కాకుంట బోతున్నడు. మా మందు తీసుకుంటే మీకు పిల్లలవుతరు. మీ సంసారం పచ్చగుంటది. రండమ్మా రండి. మామందు తీస్కొని మచిగుండండి.. అక్కడున్న చాలా మంది చూపులు ఇబ్బందికరంగా మారాయి. 'ఇదివరకు పక్కనే పాన్ షాప్ నుంచి పాటలు వినిపించేవి. అవే కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండేవనుకుంటే ఇప్పుడు ఈ గోల మొదలైంది: తనలో తను అనుకున్నాడు.

అయినా అంత గొప్ప మందయితే అమ్మడానికి వీళ్లు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు కుటుంబాలతో వచ్చి అవస్థలెందుకు పడతారు ? మందుకు ' హనుమాన్ ' అని పేరు పెట్టాడు. అనుమానపడడం కూడదేమో..ఏమైనా జనాలను ఆకట్టుకునేలా ప్రచార సంభాషణ రాసిచ్చిన మహానుభావుడెవరో? ' అనుకున్నాడు సదానంద్. కొంతమంది డేరా దగ్గరకు వెళ్లి ఆ మీసాలతడిని అడిగి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు..కొందరు కొంటున్నారు. ఇంతలో బస్సు రావడం, సదానంద్ ఎక్కడం జరిగిపోయాయి.

*

ఇంటికి రాగానే చిరునవ్వుతో కాకపోయినా కాస్తంత ప్రసన్నంగానే ఎదురొచ్చే ఇల్లాలు కనబడలేదు.

' నాన్నా! అమ్మకు జ్వరం వచ్చింది ' బాబిగాడు చెప్పాడు.

హడావుడిగా ముందుకు నడిచాడు సదానంద్. ఇందిర పడుకుని ఉంది.. చిన్నగా మూలుగుతోంది. నుదుటి మీద చెయ్యి వేస్తే చురుక్కుమంది. ' నూట రెండుకు తక్కువుండదు ' అనుకుని, ' ఇందూ! ఎప్పటినుంచి జ్వరం? ' అడిగాడు.

' మధ్యాహ్నం నుంచి' నీరసంగా బదులిచ్చింది ఇందిర.

సదానంద్ గబగబా కాఫీ చేసి ఇందిరకు అందించి, దాంతో పాటు ఒక డోలో కూడా ఇచ్చాడు. తనూ కాఫీ తాగి, ' పద డాక్టర్ దగ్గరకు వెళ్దాం' అన్నాడు.

' టాబ్లెట్ ఇచ్చారుగా..రేపు చూద్దాం లెండి ' అంది ఇందిర.

' నీ ముఖం.. అది తాత్కాలిక ఉపశమనం కోసం.. ఉన్నాడుగా మన సుబ్బారావు డాక్టర్. ఇంకేం చెప్పక త్వరగా పద ' అన్నాడు సదానంద్.

పది నిముషాల్లో క్లినిక్ చేరారు. అక్కడ పేషంట్లు చాలా మందే డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. అది మామూలే. వైద్య విజ్ఞానం ఎంత పెరిగినా, జబ్బులూ అంతకంటే రెట్టింపుగా పెరుగుతున్నాయి ' అనుకుంటూ చుట్టూ పరిశీలనగా చూసాడు సదానంద్.

అతడి చూపు ఓ చోట నిలిచిపోయింది. అక్కడ ఓ మహిళ, చేతిలో పిల్లవాడు..వెంటనే మెదడులో మెరుపు మెరిసింది.. బస్ స్టాప్ దగ్గర డేరా.. హనుమాన్ టానిక్ ఫ్యామిలీ..పిల్లవాడికి బాగా లేకపోతే ఈ డాక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చినట్లు? ' పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదంటే ఇదే కాబోలు ' అనుకున్నాడు సదానంద్.

- జె.శ్యామల

First Published:  31 Oct 2022 10:32 AM GMT
Next Story